మానస వీణ - 46 - అచ్చంగా తెలుగు

 మానస వీణ - 46

శ్రీధర్ బాబు అవ్వారు‍‍‍‍‍‍‍‍‍‍‍ 

      అటవీ ప్రాంతం ఇప్పుడిప్పుడే సూర్యుణ్ణి తోడు చేసుకొని కళ్ళు తెరుస్తోంది. పచ్చని ఆకుల మీద మంచుబిందువులు తళతళా మెరుస్తున్నాయి. సూర్య కిరణాలు ఆకులను దాటుకొని నేల మీద ప్రసరించడానికి తెగ ఆరాటపడుతున్నాయి. మొండివి కొన్ని ఆకుల్లోంచి దూసుకొచ్చి వింత వింత ఆకారాల ముగ్గులు వేస్తున్నాయి.
 
        చెట్ల కొమ్మల్లోని కోయిలలు ఉత్సాహంతో రాగాలు తీస్తుంటే... ఓపక్క ఏరు పారుతూ గలగల శబ్దపు తాళం వేస్తోంది. మరోపక్క ఆకులు ఆ రాగాలకు తగ్గట్టుగా నృత్యం చేస్తున్నట్లు ఊగుతున్నాయి.

ఆ దారి వెంట ఒక ముదుసలి అడుగులు బలంగా నేలను తాకుతూ కదులుతున్నాయి. ఆ అడుగుల తాలూకు వ్యక్తి... తన సునిశిత దృష్టితో మొక్కలను పరిశీలిస్తూ... ఆదారి వెంట పోతున్నాడు.  తనకు కావాల్సిన మొక్కలు కనపడగానే... అతని కళ్ళు చిత్రంగా నవ్వుతున్నాయి. ముడతలు పడిన పెదాలు విచ్చు కుంటున్నాయి.
  
       చెట్లనుండి ఆకులను... బెరడును... వాటి వేర్లను తీస్తున్నప్పుడు, చిత్రంగా అతని పెదాలు ఏదో మంత్రోచ్చారణ చేస్తున్నట్లు వేగంగా కదులుతున్నాయి. అవి అతని తండ్రి నేర్పిన మంత్రాలు.
        "సెట్లకు పాణం ఉంటుంది రా జగ్గా... అవి మన పాలిట దేవుళ్ళు... అవి బతికితేనే మనం బతుకుతాం. ఈ టౌనోళ్ళకు ఈ సెట్లమీద అంత అభిమానం ఏమీ లేదురా. ఎందుకో అకారనంగా ఆటిని కొట్టి పడేస్తుంటారు. ఈ సెట్ల వల్లే కదా వానలొచ్చేది... పంటలు పండేది... కరువు కాటకాలు పోయేది... వీటిని కాపాడకుంటే అవి మనల్నెలా కాపాడతాయ్. ఇప్పుడు కూడా చూడరా... ఈటిని నమ్ముకునే కదా మనం బతికేది...!
 
       మనం ఈటి సాయంతోనే మనకాడికి వచ్చే వాళ్ళ రోగాలు తగ్గిస్తాం. మనమిచ్చే మందుకు ఆళ్లిచ్చే తుణమో పణమో కంటే... రోగం తగ్గితే ఆళ్ళ కళ్ళల్లో ఆనందం సాలు కదరా జగ్గా... అందుకే మనం ఏమీ అడగకూడదు. ఆళ్ళు సంతోషంగా ఇచ్చేదే తీసుకోవాలా. అదికూడా నాలుగు మెతుకులు లోనికి వెళ్లడానికే. అయినా జగ్గా... మనమన్నా ఏదో ఆళ్ళిచ్చింది తీసుకుంటాము కానీ... ఈ అడవికి మనమేమిస్తున్నాం రా...! ఈసెట్లు మనఅమ్మలు... మనకు బువ్వ పెడుతున్నాయి. మన పాణాలను నిలబెడుతున్నాయి. తిరిగి ఏమీ అడగవు. ఈ మనుషులందరికీ ఈ గేనం అందాలి. నాది నాది అని కొట్టుకుసత్తారు గాని... మడిసి పేరు నిలబెట్టేదీ... ఈ నేలమీద ఆడిపేరు అలానే ఉండేలా సేసేది పరులకు సేసే మేలే కదరా...
        ఇదిగో చెట్లబెరడును కత్తితో వొలుస్తున్నాం... దాని పాణానికి ఎంత బాధ కదరా... అందుకు మీ తాత నేర్పిన మంత్రాన్ని నీకు చెబుతున్నాను. చెట్లను తాకినప్పుడు నీవు అనుకో", అంటూ నేర్పించాడు జగ్గయ్య నాయన. ఈ మాటలన్నీ పిల్లాడి మనసునేలలో చెట్లవేర్ల వలే నాటుకుపోయాయి.
 
         నాన్న భుజసింహాసనంపై కూచుని, విప్పారిన కళ్ళతో ప్రకృతి అందాలు చూస్తూ... ఆయన చెప్పే మాటలు బుర్రకెక్కింకునేవాడు. నాన్న శిష్యరికంలో ఏ మొక్క దేనికి పనికొస్తుంది... ఏ వేరు పదునెంత... ఏఆకు పసరు దేనికి కట్టుకుంటుంది....ఇలా యుక్త వయస్సు వచ్చేలోపలే మెళుకువలన్నీ ఇట్టే పట్టేశాడు జగ్గడు.
         ఈ అటవీ ప్రాంతంలో ఎక్కడ ఏముంటాయనేది జగ్గడికి కొట్టిన పిండే. పెరిగి పెద్దవాడై తండ్రి చూపిన త్రోవలోనే సాగుతూ...ఆయన చెప్పిన మాటలను, చేతలను తూచా తప్పకుండా పాటిస్తూ... తన దగ్గరకు వచ్చి వారిరోగాలకు సరైన మందులు ఇస్తూ... ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్లకు వైద్యం చేస్తూ... మంచి హస్తవాసి గలవాడు అని పేరు సంపాదించాడు.
 
         మొట్ట మొదట జ్వరం, తల నొప్పి, వాతం, అలాంటి చిన్న చిన్న వాటికి వచ్చేవారు. తను చెప్పిన విధానాన్ని పాటిస్తూ ఉంటే.... వారి కొచ్చిన జబ్బులు తగ్గిపోయేవి. ఆ విషయం ఈ నోట ఆ నోటా విని అక్కడికి అన్ని రకాల జబ్బులు నయం చేసుకోవటానకి జనాలు ఎక్కువగా వచ్చేవారు. దానితో చుట్టూ పక్కల ఉన్న హాస్పిటల్స్ వారికి రోగులు రావటం తగ్గి పోయింది. వారు ఇతని మీద గుర్రుగా ఉండేవాళ్ళు.
 
       అప్పటి జగ్గడే....ఇప్పటి జగ్గయ్య తాత.
         ఈ మధ్యకాలంలో వైద్యం చేస్తూనే, ఊరివాళ్ళ సాయంతో చిన్న ఆయుర్వేద దుకాణమొకటి ప్రారంభించాడు. తనఖర్చులు చూసుకుని, లాభాపేక్ష లేకుండా మందులు అమ్మేవాడు.
         అప్పుడప్పుడు వృద్ధాశ్రమాలకు, అనాథాశ్రమాలకు పోయి, ఉచితంగా వారికి అవసరమైన మందులు ఇచ్చి వస్తుండేవాడు. అలానే హేమలత ఆశ్రమానికి కూడా పోయి అక్కడ వారికి వైద్యం చేసి వచ్చేవాడు. అలా జగ్గయ్య తాత... మానస అభిమానాన్ని చూరగొన్నాడు.

 ***

        అప్పటికి సూర్యుడు నడినెత్తిన నిలబడి చూస్తున్నాడు.. జగ్గయ్య తాతకు ఈ అటవీ ప్రాంతం పుట్టినిల్లు లాంటిది. ఇక్కడికి వస్తే తన వయసు మర్చిపోతాడు. చిన్నపిల్లవాడిలా పరిగెత్తుతాడు. పల్లె పదం ఒకటి నోటినుంచి గెంతుతూ హుషారునిస్తుంది. అలా అలా తన బాల్యంలోకి జారిపోతాడు.
        ఊడను ఉయ్యాల చేసుకొని ఊగిన క్షణాలను గుర్తు రాగానే మనసు ఊగుతుంది. పక్కన ఉన్న ఏటిలో నాన్న నేర్పిన ఈతను తలుచుకుంటూ... ఆ ఏటిదగ్గరికి వెళ్తాడు. కాళ్ళని తడుపుతూ చిన్ననాటి ఈతను తలుస్తాడు. ఇప్పుడు ఆ ఏరు కేవలం చిన్న నీటిపాయలా మారిందని దుఃఖిస్తాడు.
        కాకిని గురువుగా చేసుకొని కట్టిన గూడును గుర్తు చేసుకొని మురుస్తాడు. అప్పటి వృక్షసంపద ఇప్పుడు ఏమైందని కోప్పడుతాడు. మరల వెంటనే ఉలిక్కిపడి తను వచ్చిన సంగతి గుర్తు చేసుకొని లేస్తాడు. ఈ అడవి‌ తనకి ఎంత ఆనందాన్ని ఇచ్చినా... అపుడపుడు ఒక విషయం గుర్తుకు వచ్చి మనసుని మల్లులా పొడుస్తుంది.
 
        తను తెచ్చుకున్న సంచిలో తనకు కావలసినవి వేసుకొని తిరిగి ఇంటి ముఖం పట్టాడు జగ్గయ్య తాత. అడివి దాటగానే తన శక్తినంతా లాగేసినట్టు అయిపోతుంది, అతనికి.
 
         తన కొడుకు రాజాను.. తన నాన్న తిప్పినట్లే అడవి అంతా తిప్పాడు. కానీ వాడిని అడవి మరోలా ఆకర్షించింది. చెట్టంత ఎదిగిన కొడుకు సమసమాజం, సామ్యవాదం అంటూ అన్నల్లో జేరిపోయాడు.
         ఆలోచిస్తున్నాడు...
         ‘నాకా వయస్సు అయిపోతుంది. వచ్చే జనాలు కూడా ఎక్కువ అయ్యారు. నమ్ముకొని వచ్చిన వారికి నయం చేసి పంపాలి. ఇప్పటి ఆయుర్వేద దుకాణాన్ని... ఇంకా పెంచాలంటే.... తనకు చేయూతనిచ్చే మనుషులు కొందరు కావాలి. వారి సాయంతో మరి కొంత మందులు తయారుచేసి, తన సేవలను విస్తృత పరచవచ్చు. దానికి మార్గం ఏంటి', అని ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు. తను వెతకబోయిన తీగ కాలికి తగులుతుందని ఆ సమయంలో జగ్గయ్య తాతకు తెలీదు..
  

No comments:

Post a Comment

Pages