తెలుగు భాష ఔన్నత్యం - అచ్చంగా తెలుగు

 తెలుగు భాష ఔన్నత్యం 

సి.హెచ్.ప్రతాప్
 


చక్కని పలుకుబడులకు, నుడికారములకు తెలుగు బాషయే పుట్టినిల్లు . ప్రపంచ ఖ్యాతి పొందిన ఎన్నో కావ్యాలు మన తెలుగు భాషలో ఉండడం మన తెలుగువారికి ఎంతో గర్వకారణం. సంస్కృతము, తమిళము, పారసి మున్నగు బాషలు తెలిసిన రాయలు “దేశబాషలందు  తెలుగులెస్స” అని మన తెలుగు భాషను శ్లాఘించుట ఆశ్చర్యం ఎంతమాత్రం కాదు.గాదు.  ఈ మాట ప్రతి తెలుగు వారి గుండెలలో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. రాయల పైమాట తెలుగు వారి యెక్క మాతృబాషాభిమానానికి మేలుకొలుపు పాట అయ్యింది. బ్రౌనుదొర కూడాఈ బాషను గూర్చి వేనోళ్ల పొగుడుట మన తెలుగు వారి, తెలుగు బాష యెక్క గౌరవము.

అయితే శిఖర సమానమైన మన సుందర, ప్రేమమయమైన తెలుగు భాషా ఔన్నత్యం ప్రస్తుతం సుస్తా వస్థలో ఉంది. భావ దారిద్య్రంతో మనం మన మాతృభాష తెలుగుకు తెగులు అంటిస్తున్నాం. పరభాషా సైతం తలకెక్కి, తెలుగును స్మరిం పక, విస్మరించి, ఉపాధికి పనికి రాదని అనుమానించి, అవమా నించడం తెలుగు నేలపై తెలుగు పరాయి భాషగా పరిగణించబడడం మాతృభాషాభిమానులను ఆవేదనకు గురిచేసే అంశం అని చెప్పక తప్పదు.

శతాబ్దాల చరిత్ర గల ప్రాచీన భాష మన తెలుగు భాషను నిర్లక్ష్యం చేయడం మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కున్న చందంగా ఉంది.

ప్రపంచీకరణ ప్రభావం తెలుగు భాషకు శాపంలా మారింది. ఆంగ్లభాషా ప్రభావం ఎంతగా విస్తరించినా ఇతర రాష్ట్రాల ప్రజలు వారి మాతృభాషను విస్మరించలేదు. . అయితే మనం మాత్రం పరభాషా వ్యామోహంతో తెలుగు భాషకు తెగులు పుట్టించి, అధోగతిపాలు చేస్తున్నాం. బతుకుతెరువుకు ఆంగ్లభాష ఎంత అవసరమె ఎలా బతకాలో నేర్పే తెలుగుభాష కూడా అంతే అవసరం.

పుట్టిననాటి నుండి అలవాటు అయిన తెలుగులో ఏ పుస్తకం చదివినా అందులోని సారాంశం సులువుగా మన మనసులలోకి వెళుతుందని అంటారు. మాతృభాష తెలుగు భాషలో పుస్తకం చదవడం వలన, ఆయా పుస్తకాలలో నిక్షిప్తం అయిన జ్ఙానం మనకు త్వరగా అబ్బే అవకాశం ఉంటుంది.

తెలుగు భాష రాకపోవడం అంటే కొన్ని వందల ఏళ్లుగా తెలుగు సంస్కృతి ప్రోది చేసిన సారస్వతం వారికి అందకపోవడం లేదా దూరం కావడం. నన్నయ, తిక్కనల నుంచి శ్రీశ్రీ వరకు తమ జాతి సాహితీ ఔన్నత్యం తెలియకపోవడం. భాష గొప్పతనమే జాతి గొప్పదనం.

తెలుగు భాష ఔన్నత్యం గురించి కొందరు విదెశీ విద్యార్ధులు ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించారు. జంగం కథలు, కన్యాశుల్కం, చింతామణి నాటకాల్లోని హాస్యం ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంటోంది. ఫ్రెంచ్‌ సామాజిక పరిశోధకుడు డానియెల్‌ నెజర్స్‌  తెలుగు, ఫ్రెంచ్‌ సమాజాల నాగరికత వేరైనా, వాటిని ఫ్రెంచ్‌లోకి అనువదించే ప్రయత్నం చేస్తున్నారు. త్రిలింగ" పదము నుంచి "తెలుగు" పదం వెలువడిందని అంటారు. తేనె వంటిది కనుక "తెనుగు" అనాలని కొందరు అంటారు. క్రీస్తు పూర్వం 400 నాటి శిథిలాలలో తెలుగు భాష ఉండాన్ని బట్టి ఈ భాష ప్రాచీనత మనకి తెలుస్తుంది అని డానియల్ అంటున్నారు. తెలుగు సమాజ సంస్కృతి, కళలు, సంప్రదాయాలపై పరిశోధన చేయాలని కొంతమంది ప్యారిస్‌ విద్యార్థులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే ఒక ఫ్రెంచ్‌ విద్యార్థి తెలంగాణ జానపద పాటలపై తన పరిశోధనని మొదలుపెట్టాడు. తెలుగు భాష సంస్కృతి, సాహిత్యం, కళల్లోని మాధుర్యం ప్రపంచమంతటా తెలియాలి అన్నదే డాక్టర్ డానియెల్ యొక్క తాపత్రయం.

తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులో సంభాషించాలి.  గొప్పవాళ్లు రాసిన రచనలు పద్యాలు, గద్యాలు, గేయాలు, కథలు, కవితలు, పల్లెగీతాలు, కూనిరాగాలు, ఇంకా హాస్య రచనలు, విప్లవ రచనలు , విప్లవ గీతాలు చదవాలి.  అన్నిటిలోనూ వారు చేసే భావ ప్రకటన, కొత్త కొత్త పదాలు, ప్రాసలు, సంగీతాలంకారాలు, జ్ఞానం, చరిత్ర తెలుస్తాయి

తెలుగు భాషలో ఎన్నో గొప్ప భక్తి గీతాలు, మహాభారతం, రామాయణం ,  భాగవతం, దశావతారాలు, కావ్యాలు, ప్రబంధాలు, సాహిత్య పరిశోధనలు  ఇలా ఎన్నెన్నో ఉన్నాయి.  ఇవేవీ చదవకుండా పాశ్చాత్య సంస్కృతి పైనే ఎక్కువ మక్కువ చూపడం  న్యాయం కాదు, పద్ధతి కాదు.  అది మాతృ ద్రోహం చేయడమే అవుతుంది. ఇప్పటికైనా తెలుగువారందరూ మేల్కొనాలి.

***

No comments:

Post a Comment

Pages