తల్లియాపె కృష్ణునికి దండ్రి యీతడు - అచ్చంగా తెలుగు

తల్లియాపె కృష్ణునికి దండ్రి యీతడు

Share This
తల్లియాపె కృష్ణునికి దండ్రి యీతడు
(అన్నమయ్య కీర్తనకు వివరణ)

డా.తాడేపల్లి పతంజలి 


రేకు: 0352-02  సం: 04-304

పల్లవి:

తల్లియాపె కృష్ణునికి దండ్రి యీతడు

చల్లగా లోకములెల్లా సంతోసమందెను

చ.1: అరుదై శ్రావణబహుళాష్టమినాటిరాత్రి

తిరువవతారమందెను  కృష్ణు డు

యిరవై దేవకిదేవి యెత్తుకొని వసుదేవు -

కరములందు బెట్టితే కడుసంతోసించెను

చ.2: తక్కక యమునానది దాటతడు రేపల్లెలో

పక్కన యశోదాదేవిపక్క బెట్టెను

యెక్కువనాపె  కృష్ణు  నినెత్తుక నందగోపుని

గక్కన వినిపంచితే కడుసంతోసించెను

చ.3: మరిగి పెద్దై  కృష్ణుడు మధురలో గంసుజంపి

బెరసి యలమేల్మంగ బెండ్లాడి

తిరమై శ్రీవేంకటాద్రిని దేవకీదేవియు

ఇరవైతే వసుదేవుడేచి సంతోసించెను

భావం

పల్లవి:

కృష్ణునికి  తల్లి ఆమెయే.(దేవకీదేవియే) తండ్రి ఇతడే( వసుదేవుడు)

వీరివలన చల్లగా లోకములన్నీ  సంతోషపడ్డాయి.

చ.1:

అరుదైన  శ్రావణ బహుళాష్టమి నాటి రాత్రి పవిత్రమైన  శ్రీప్రదమైన   కృష్ణుని అవతారము కలిగింది.

దేవకిదేవి  కృష్ణుని ఎత్తుకొని,  వసుదేవుని చేతులందు ఆ బాల  కృష్ణుని పెడితే అతడు చాలా సంతోషించాడు.

చ.2:

యమునానదిని దాటి వసుదేవుడు  రేపల్లెలో  యశోదాదేవి పక్కన బాల  కృష్ణుని పడుకొనబెట్టెను.

యోగమాయతో వసుదేవుడు నిష్క్రమించిన తరువాత యశోదకు స్పృహ వచ్చి ఆ  కృష్ణుని ఎత్తుకొంది. నందగోపుని ఇంట్లో శిశువు పుట్టాడని అందరికి తెలిసి గోకులమంతా సంతోషించింది.

చ.3:

పెద్దవాడయిన తరువాత  కృష్ణు డు మధురలో కంసుని చంపాడు. ఆ  కృష్ణుడే వేంకటేశుడై అలమేల్మంగను పెండ్లాడాడు. శ్రీవేంకటాద్రిలో ఆత్మ రూపులుగా ఉన్న  దేవకీదేవియు  వసుదేవుడు స్వామి వారి నిత్య కల్యాణములను చూస్తూ సంతోషిస్తున్నారు. 

ధన్యవాదములు.

No comments:

Post a Comment

Pages