శ్రీ శిరిడి సాయి దివ్య జ్ఞానామృతం - అచ్చంగా తెలుగు

శ్రీ శిరిడి సాయి దివ్య జ్ఞానామృతం

Share This

శ్రీ శిరిడి సాయి దివ్య జ్ఞానామృతం

రచన: సి.హెచ్.ప్రతాప్





శ్రీ సాయి పరిశుద్ధ , పరబ్రహ్మ, పరమేశ్వర అవతారం అన్న విషయం ఆయన భక్తులకు ప్రస్పుటం గా అవగతమయ్యేది. చాలా సందర్భాలలో  ఆయన ప్రదర్శించిన యోగ శక్తులు వారిని అబ్బుర పరచేవి. సామాన్య మానవులు ఎన్ని లక్షల జన్మలు ఎత్తి ఆ యోగ శక్తుల కోసం కృషి చేసినా అవి సాధ్యం కావు. అందుక్కారణం శ్రీ సాయి సమర్ధ సద్గురువు , త్రిమూర్తుల స్వరూపం , భక్త జన సంరక్షణార్ధం ఆ పరబ్రహ్మమే శ్రీ సాయి రూపం లో ఈ కలియుగం లో ఈ భువిపై అవతరించింది.

శ్రీ సాయి ఖండ యోగం చేసేవారు. శిరిడీలో అప్పాభిల్ అనే వాడు పహారా కాచే వాడు.అతను ఒక రోజు రాత్రి తన విధి నిర్వహణ లో ఊరాంతా కలియ తిరుగుతూ మశీదు చేరి అక్కడ శ్రీ సాయి శరీరం ముక్కలు ముక్కలు గా చెల్ల్లా చెదురుగా పడి వుండడం చూసి భయకంపితుడైనాడు.ఎవరో శ్రీ సాయిని హత్య చేసి , ఈ విధం గా ముక్కలుగా నరికేసి పారిపోయారని భావించాడు. వెంటనే ఈ విషయం గ్రామ పెద్దలతో చెబుదామనుకున్నాడు. కాని ఆ సంఘటనను మొదటగా చూసింది తానే కాబట్టి లేనిపోని సమస్యలు వస్తాయన్న భయంతో ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాడు.మర్నాడు ఉదయం చిత్రం గా ఆ గ్రామం లోని వారెవరూ ఈ విషయమై మాట్లాడడం లేదు. అసలు విషయం కనుక్కుందామని మశీదుకు వెళ్ళే సరికి బాబా హాయిగా తన ప్రదేశం లో కూర్చోని భక్తులతో ముచ్చటిస్తున్నారు. తనను దర్శించిన అప్పాభిల్ తో " రాత్రి నన్ను చూసి భయపడ్దావా ?" అని ప్రేమగా అడిగారు. అవునని తలూపారు అప్పాభిల్. శ్రీ సాయి అప్పుడప్పుడు ఖండ యోగం (శరీరాన్ని ముక్కలు గా విడదీసి వేరు వేరుగా పడవేసి, తిరిగి అతికించడం) చేసేవారని అందరికీ తెలిసింది. ఈ సృష్టికే గురువైన శ్రీ సాయికి ఇటువంటి యోగ క్రియలు ఒక లెక్కా ?

మామూలుగా మిగితా యోగులు తమ జీర్ణకోసం శుభ్రం చేసుకోవడానికి 22 అడుగులు పొడవు, మూడు అంగుళాలు వెదల్పు వున్న శుభ్రమైన గుడ్డను నెమ్మదిగా లోపలికి మింగి, ఒక అర గంట పాటు జీర్ణకోసం లో వుంచి తర్వాత నెమ్మదిగా బయతకు లాగేస్తారు. వీరి ఈ ప్రక్రియను సాధారణం గా 15 రోజుల కొక సారి చేసుకుంటారు. కానీ శ్రీ సాయినాధులు చేసే ధౌతి క్రియ అత్యద్భుతం, అసామాన్యం, అపూర్వం, సధారణ యోగివర్యులకు ఏ మాత్రం సాధ్యం కానిది. మూడు రోజుల కొక సారి ఆయన శిరిడీ లోని ఊరి చివర బావి వద్దకు వెళ్ళి ప్రేగులను బయటకు తీసి , నీటిలో కడిగి, చెట్టు కొమ్మ పై ఆర బెట్టి తిరిగి యధావిధిగా మింగి వేయడం ఆ గ్రామ ప్రజలు స్పష్టం గా చూసారు. అయోనిజ సంభవుడు , చావు పుట్టుకలు లేని ఆ మహారాజుకు సాధ్యం కాని యోగ ప్రక్రియ ఏముంది ?

శ్రీ సాయి తనను నమ్మిన వారిని ఎల్లవేళలా వెంట వుండి కాపాడుతారు. ఆయన మశీదులో ఒంటరిగా వున్నప్పుడు చుట్టూ అడ్డం గా ఒక తెర పెట్టుకొని ఒక సంచీ నుండి కొన్ని కాసులను బయటకు తీసి , ఒక్కొక్క కాసును చేతితో రుద్దుతూ తన భక్తుల పేర్లను చదివే వారు. ఆ విధం గా ప్రతీ భక్తునికీ దూర శక్తి పాతం ద్వారా తన అమూల్యమైన శక్తిని పంపించి వారి దుష్ట సంస్కారాలను దూరం చేయడం తో పాటు శారీరక అనారోగ్యాలను, మానసిక చింతనలను , భౌతిక ప్రపంచపు సమస్యలను అంతం చేసేవారు. ఎవరైనా వస్తే వెంటనే ఆ కాసులను సంచీలో దాచేసేవారు అని ఈ సంఘటనను ప్రత్యక్షం గా చూసిన దాసగణు మహారాజు తన గ్రంధం లో వ్రాయడం జరిగింది. చూసారా ! గురుదేవుల దయామయమైన హృదయం. తమను భక్తులు గుర్తుంచుకోకపోయినా కన్న తల్లి కంటే మిన్నగా తన భక్తులను, బిడ్దలను అనుక్షణం వెంట వుండి కాపాడే మన సాయినాధులకు మనం ఈ జన్మలో భక్తులము కావడం ఎంత అదృష్టమో ! ఆ గురుదేవుల పాదాల చెంత మన భారములన్నింటినీ పడ వేస్తే మనం నిశ్చింతగా వుండవచ్చని వేరే చెప్పాలా !

సర్వం శ్రీ శిరిడి సాయి పాదార్పణమస్తు
సర్వే జనా: స్సుఖినోభవంతు.

No comments:

Post a Comment

Pages