తినదగు నెయ్యది తట్టిన - అచ్చంగా తెలుగు

తినదగు నెయ్యది తట్టిన

Share This
తినదగు నెయ్యది తట్టిన
(మా నర్సాపురం కథలు)
-భావరాజు పద్మిని"ఏవేవ్ కల్యాణీ! ఇవాళ టిఫినేంటి?" ఉదయాన్నే లోటాడు కాఫీ చప్పరిస్తూ, వసారాలోంచి కేకేసింది మండోదరి. 

"గార్లత్తయ్యా, ఇగో పిండి నలుగుతోంది!" బదులిచ్చి, మనసులో "మొదలు, కడుపనే రుబ్బురోట్లో వాయలు వెయ్యడం!" అనుకుంది కల్యాణి.

"ఆహా! ఆ గారెల్లోకి కాస్త అల్లప్పచ్చడీ, సాంబారు పెట్టవే! అలాగే ఓ అరడజను పాకంగారెలు, ఓ డజను ఆవళ్లూ వేసుంచవే! రాత్రికిక చపాతీలు అక్కర్లేదు!" అంటూ వెళ్తున్న అత్తగారిని చూసి, మనసులోనే "గారెల్లో ఉన్న వెరైటీలన్నీ ఇవాళే కబళిస్తావా మాతా! పైగా పచ్చడీ, సాంబారు కూడానట! అయినా 'వాముల్దినే సాములోరికి గడ్డిపరక నైవేజ్జమనీ' మానెడు పిండి నీకేమూలకిలే తల్లీ!" అనుకుంటూ, నిస్సహాయంగా ఓ చూపు చూసింది కల్యాణి.

ఆ నిస్సహాయమైన చూపు వయసు పాతికేళ్లు!రుస్తుంబాదాలోని శివాలయం వీధిలో ఉండే మండోదరి, వరుసకు కల్యాణికి అత్త. పట్నంలో పుట్టి పెరిగినా, బావ మురళి అంటే ఉన్న అమితమైన ఇష్టంతో, అతన్నే చేసుకుని, మా నర్సాపురం కాపురానికొచ్చేసింది కళ్యాణి. భర్త బంగారం, పిల్లలు రత్నాలు, కానీ అత్తగారితోనే ఆమెకు వచ్చిన చిక్కల్లా.! ఉదయం లేచిన దగ్గరనుంచి, సమస్త ఆహార పదార్థాలు ఆవిడ బుర్రలో సినిమా రీళ్లల్లా తిరుగుతాయి. ఏరోజు ఏది తడితే, అది కావాలంటుంది. మూడ్ ని బట్టి వండుకు తింటుంది, లేదా వండి పెట్టమంటుంది.‌ "ఒక్కరోజే ఇన్ని రకాలెందుకు?" అని అడగబోతే, వెక్కి వెక్కి ఏడుస్తుందని, ఆవిడ తిండి జోలికి వెళ్లద్దనీ, మురళి ముందే వార్నింగిచ్చాడు. అందుకే ఆవిడ దార్న ఆవిణ్నొదిలేసి, ఆవిడకోసం వండీ వండీ, తిండంటే విరక్తి పుట్టేసింది కల్యాణికి. పైకి మర్యాదకోసం అత్తగార్ని ఏమీ అనలేక, ఇదిగో, మనసులోనే ఇలా వీరంగాలు వేసుకుంటూ ఉంటుంది. 

అత్తగారిలో కల్యాణి గమనించిన మరొక విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఎంత తిన్నా ఆవిడ అరకిలో బరువు కూడా పెరగదు! అందుకే ఆవిడ కడుపులో రుబ్బురోలుందని కల్యాణి ఇదివర్లోనే తీర్మానించుకుంది. మూడేళ్ల క్రితం అత్తగారికి కిడ్నీలో వచ్చిన రాళ్లు, ఈ ఏడాదికి కరిగిపోయాయని స్కాన్ లో తెలీగానే, అదే విషయం ఖాయం చేసుకుంది!

తొమ్మిదింటికి ఓ డజనున్నర గార్లు తిన్నాకా ఆరోజు పప్పూ దప్పళం పెడతానని వంటింట్లో దూరింది మండోదరి! 

"స్వాహా! ఇవాళ వంటింట్లో ఉన్న కూరలూ, పదార్థాలన్నీ గుటకాయస్వాహా! తయారయ్యి మార్కెట్ కు పోయిరావాలి!" అనకుంటూ, స్నానానికి బయల్దేరింది కల్యాణి. మురళికి పాలకొల్లు స్టేట్ బ్యాంకులో ఉజ్జోగం. ఇంకా రెండేళ్ల సర్వీసుంది. రానూపోనూ ప్రయాణం, ఉద్యోగ వత్తిడీ ఉండడంతో, ఇంటికి కావల్సినవన్నీ కల్యాణే అమరుస్తుంది.

"ఏమేవ్, తలుపులమ్మా! రా, కూరలు తరిగిద్దూగానీ!" పనిమనిషిని కేకేసి, వరండాలో కూచోబెట్టింది మండోదరి. 

"అయిపాయె, ఇయ్యాల నన్ను పచ్చడికింద కొట్టేద్దీ ముసలమ్మ! ఇక మిగతా ఇళ్లలో పన్లయినట్టే!" అనుకుంటూ, "వత్తన్నానమ్మ!" అంది తలుపులుమ్మ.

మండోదరి వంటకి "జీవహింస" వంటని ముద్దుగా పేరెట్టుకుంది కల్యాణి. ఓ జీవి నలిగి, విసిగి, వేసారిపోయి హింసకు గురైతే గానీ ఆవిడకి వండినట్టుండదు, తిన్నట్టుండదు! అరడజను రకాల కూరలిచ్చి, గంట కూచోబెట్టి అన్నీ తరిగించాకా, హమ్మయ్య... అనుకుంటూ, చీర దులుపుకుని, తలుపులమ్మ లేచే సమయానికి, "ఆగవే, నీ తొందరా నువ్వూనూ! ఇగో ఇవొక్కటీ ఒల్చిద్దూ!" అంటూ పావుకిలో సాంబారుల్లిపాయలో, రెండు వెల్లుల్లిపాయలో ముందు పడేసేది! ఈసురోమంటూ అవన్నీ ఒల్చిచ్చేసరికి బారెడు పొద్దెక్కిపోయేది. పెద్దావిడ మాట తియ్యలేక, అవతల ఇళ్లలో కసుర్లు విన్లేకా, సతమతమయ్యేది తలుపులమ్మ.

పదకొండున్నరకి వంకాయ కారం పెట్టిన కూర, కొబ్బరికాయ పచ్చడి, ముద్దపప్పు, దప్పళం, బీరకాయ ఉల్లికారం, నువ్వులపొడి... ఇవన్నీ చేసి టేబుల్ మీద సర్దింది మండోదరి. ఈలోగా ఎందుకో ఆవిడకి మనసులో మొన్నెక్కడో మధ్వుల పెళ్లిభోజనంలో తిన్న "కోసాంబరి" తట్టింది. వెంటనే గిద్దెడు పెసరపప్పు నానేసి, అప్పుడే మార్కెట్ నుంచి కూరలూ, సరుకుల సంచీతో ఎండనబడి వచ్చిన కల్యాణితో, 

"ఏమే కొబ్బరికాయ, బజ్జీమిర్చి తెచ్చావేంటి? ఆ కాయ కొట్టి, కాస్త తురువుదూ! అలాగే మిర్చి, కొత్తిమీర సన్నగా తరిగుంచు, కోసాంబరి చెయ్యాలి!" ఉత్సాహంగా అంది మండోదరి.

'అందరికీ అన్ని రోగాలు, అడ్డెడు తపాళాకి ఏ రోగం లేదు!' అనీ, మాకు నీరసాలు పట్టుకున్నా ఈవిడకి వాయనాలు తప్పదు! - అనుకుంటూ మొహమూ, కాళ్లూ కడుక్కుని వంటింట్లో దూరింది కల్యాణి. 

పన్నెండింటికి కోసాంబరి సహిత భోజనం సుష్టుగా తిని, వేసంకాలం వడగాలుల లాగా మజ్జానం వచ్చే సీరియళ్లు చూడ్డానికి వెళ్లింది మండోదరి. 

"హమ్మయ్య!" అనుకుని, పిల్లల్తో మాట్టాడ్డానికి వెళ్లింది. రోజుకోసారి పలకరిస్తే వాళ్లకీ తృప్తి. మాట్లాడి పెట్టేసరికి, ఆవేళ శనివారం కావడంతో, ఒంటిపూట ఆఫీస్ పని ముగించుకుని, ఇంటికొచ్చాడు మురళి. భార్యాభర్తలిద్దరూ భోజనాలు ముగించి, నడుం వాల్చారు.

రెండింటికి వంటింట్లో గిన్నెల చప్పుడుతో మెలకువొచ్చింది కల్యాణికి! చూస్తే, మండోదరి పకోడీలకు పిండి కలుపుతోంది. కల్యాణిని చూసి, ఓ వెర్రినవ్వు నవ్వి ఊరుకుంది. మౌనంగా వచ్చి "గంపెడంత భోజనం అప్పుడే అరిగిపోయిందా, నీ కడుపులో రుబ్బురోలు కాదమ్మా, వెట్ గ్రైండరుంది!" అనుకుంది కల్యాణి. 

మూడింటికి కొడుకు లేచాకా కాఫీ పెట్టిచ్చి, దాన్తోపాటిచ్చిన పకోడీల ప్లేటు, అందులో అప్పుడే చేసిన మైసూర్ పాక్ చూడగానే గుండె గుభేల్మంది కల్యాణికి! 

"అంటే, ఇవాళ మార్కెట్లో తెచ్చిన అరకిలో నెయ్యి, పంచదార, శనగపిండి, ఆంఫట్ అన్నమాట! అయినా ఇది నాకు కొత్తేంటి? ఏదీ శాశ్వతం కాదు, లౌకికమైన అంశాల కొరకు వ్యాకులపడ తగదు!" ఏదో తెల్సిన వేదాంతం ముక్కలతో తనకు తాను సర్ది చెప్పుకుంది.

సాయంకాలం ఫలహారం, బూందీ, పక్కింటి పేరంటంలో ఇచ్చిన సంతాళించిన శనగలు, రాత్రి ఆవడలు, పాకంగారెలతో పాటు మురళి కోసం చేసిన పూరీకూర కూడా భుజించి, విశ్రమించింది మండోదరి. "తల్లీ! 82 ఏళ్ల వయసులో నీ క్షుత్తుకు నా జోహార్లు! నీ కడుపులో వెట్ గ్రైండర్ కాదు, ఇళ్లకి స్లాబ్ వేసేప్పుడు రాళ్లు రుబ్బే మిషనుంది" అని మనసులో దణ్ణం పెట్టుకుంది కల్యాణి. 

పోనీ ఏదైనా నలత చేసినప్పుడు ఏమైనా ఆహారం తగ్గుతుందా అంటే, ఓసారి జ్వరమొచ్చినప్పుడు ఆ ముచ్చటా తీరింది కల్యాణికి. 'ఏమేవ్, కాస్త సగ్గుబియ్యం జావ కాచి పోద్దూ!' అని ఓసారి, 'జీలకర్ర, వాము వేయించి, పొడికొట్టి, వేడన్నంలో నెయ్యేసి ఇద్దూ!' అని ఓసారి, 'గిన్నెరొట్టె తినాలనుంది, నోరు చేదుగా ఉంది, చేసి, కాస్త చెరుకుపానకం వేసిద్దూ!' అని ఓసారి, 'ఇదిగో, మిరియాల చారు కాచి, ఇంత చింతకాయ పచ్చడి పోపేద్దూ!' అని ఓసారి, మధ్యలో వేణ్ణీళ్లు, కషాయాలు, జావలు... చివరికి పథ్యాల్లో ఇన్ని రకాలుంటాయని, పథ్యానికే తెలీనన్ని చేయించుకు తింది! అందుకే ఆవిడకి నలతచేసి, తాను నలిగిపోయే బదులు... ఆవిడ బాగుంటేనే మంచిదని అనుకుంటూ ఉంటుంది కల్యాణి.

దరిమిలా ఈ మధ్యన వాట్సాప్ లు, యు ట్యూబ్ వీడియోలు చూడసాగింది మండోదరి. ఇక ఇంట్లోకి ఇంకా కొత్తకొత్త రకాలు ప్రవేశించాయి. మట్టిపాత్రలు, కట్టెల పొయ్యిమీద వంటలూ, నానా ప్రయోగాలూ చెయ్యసాగింది మండోదరి. ఆఫ్రికా కొండజాతి వారు తినే వంటకాల్లా, ఆ చిత్ర విచిత్రమైన వంటలు తిన్లేక, నీరసపడింది కల్యాణి. 'బొంగులో బొబ్బట్టు, చెంబులో చేమదుంప గోంగూర, ముంతలో మునగాకాకర, రాచిప్పలో రాగిపొడి దప్పళం' వంటి కొత్త కొత్త ప్రయోగాలు చేసి, ఉత్సాహం పెరిగి ఉబ్బి తబ్బిబ్బవసాగింది మండోదరి. "మెతుకు మెతుకు మీదా తినేవాడి పేరుంటుందట, ఎన్ని తింటే ఈవిడ కోటా మెతుకులౌతాయో! అయినా కాటన్ దొర గోదారి మీద వంతెనేసింది ఈవిడ కోసం పంటలు పండించడానికే కదా!" అని సర్దిచెప్పుకుంది కల్యాణి.

ఈమధ్య ఒంటికి మంచిదని గోధుమగడ్డి కషాయం, కిడ్నీలకు మంచిదని కొత్తిమీర రసం, క్రిములు చస్తాయని వేపాకు ఉండలు... ఇలా విధవిధాల ప్రయోగాల వీడియోలు చూసి, చేసి, కొడుకూ కోడలుతో దగ్గరుండి తాగించేది. "అన్నీ బాగుంటే మనకు జీవితం మీద వైరాగ్యం రాదని, భగవంతుడిలాటివి పెడతాడేమో!" అనుకుంటూ, పూజలు, భక్తి పెంచి, ప్రవచనాలకు వెళ్తూ కాలం గడపసాగింది కల్యాణి.

ఓ శుభోదయాన, పెరట్లో పూజకోసం పూలు కోయసాగింది కల్యాణి. "ఏమేవ్, ఇది విన్నావా? శంఖుపూలు తిన్నా, నీళ్లలో వేసుకు తాగినా, ఒంటికి చాలా మంచిదట! దేఁవుడికేం పెడతావు కానీ, ఏదీ, అవిలాగివ్వు చెప్తా!" అంటూ చేతిలో ఉన్న పూలు లాక్కున్న మండోదరిని చూస్తా...

"ఏమ్మా! ఇక పువ్వుల్ని కూడా బతకనీయవా? నాదే పొరపాటు, ఈవిడ కడుపులో రాళ్లు రుబ్బే మిషను కాదు, రోడ్డు రోలరుంది!" అనుకుంటా కళ్లుతిరిగి పడిపోయింది కల్యాణి.

(మండోదరి లాంటి అత్తగార్లున్న కోడళ్లకు ఈ కథ అంకితం.)

No comments:

Post a Comment

Pages