పంచతంత్రం - అచ్చంగా తెలుగు

 పంచతంత్రం 

- కర్లపాలెం హనుమంతరావు 




భారతీయ భాషలలో బహుళ ప్రచారమే కాకుండా విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సాహిత్యంలో బైబిల్ తరువాత  చెప్పుకోదగ్గ కథ 'పంచతంత్రం' . మాతృక సంస్కృతం నుంచి నేరుగా అనుసృజించబడిన కథనాలు కొన్ని ఉన్నా దేశ కాలాలను బట్టి రూపం మార్చుకున్న సందర్భాలు సుమారు 200 దాకా ఉంటాయి. క్రీస్తు పుట్టుకకు  16 శతాబ్దాల కిందటే మధ్య ప్రాచ్యం లోకి పాకిన ఈ కథ కొన్ని  సార్లు అనువాదం నుంచి కూడా అనువాదంగా రావటం విశేషం. సంస్కృతంలోని పంచతంత్రం పహ్లవీ, అరబిక్, హిబ్రూ, లాటిన్, ఇటాలియన్ భాషల గుండా ఇంగ్లీషులో అవతరించడం ఇందుకు ఉదాహరణ. ఈ గ్రంథం లోని   కొన్ని కథలు కొద్ది  మార్పులతో ఈసఫ్ కథాసంపుటిలోనూ ప్రవేశించాయి. ఫ్రెంచి రచయిత ' లా ఫాంతే ' రాసిన  పిట్ట కథలు చాలా వాటికి మాతృకలు పంచతంత్రం కథలు. విశ్వ వ్యాపితమైన ఈ విధానాన్ని ' బెన్ఫే ' అనే జర్మన్ పండితుడు విపులంగా విశదీకరిస్తే  , భారతదేశానికి సంబంధించిన సమాచారం ' హెరెల్ ' అనే మరో జర్మన్ పరిశోధకుడు  సాకల్యంగా వివరించాడు .  ' హితోప దేశం' పంచతంత్రానికి పూర్తిగా అనుకరణ అనీ, పంచతంత్రంలో లేని కథలు హితోపదేశంలో  పదిహేను వరకు  అదనంగా వున్నాయని చెప్పుకొచ్చింది ఈ హెరెల్ పండితుడే. 

ఏదేమైనా పంచతంత్రం రచనా కాలం, మూల రూపాల గురించి నిర్దిష్టమైన సమాచారం ఇప్పటి దాకా లభ్యం కాలేదు . ప్రస్తుతం కనిపించే రూపాలకు అసమగ్రత, అనేకత్వం దోషాలుగా ఉన్న మాట  నిజం . కశ్మీరంలో కనిపించే 'తంత్రాఖ్యాయి' కి భిన్నమైన పాఠం నేపాల్లో ఉన్నట్లూ,  జైన, బౌద్ధాల హీనదశలో పుంజుకున్న వైదిక సంప్రదాయానికి అనుగుణంగా  పంచతంత్రం తిరగరాయబడినట్లూ వాల్ట్ విట్జ్ అనే భాషాశాస్త్రవేత్త చేసే వాదనకు సాక్ష్యా ధారాలూ ఉన్నాయి. 

 ఆకర్షణీయంగా ఉండే ఇందులోని చిన్ని చిన్ని కథలు చెవినబడని  పిల్లలు సాధారణంగా ఉండరు. తాతయ్యా అమ్మమ్మా చెప్పే  ఈ కథలనే తరువాత తరగతి పుస్తకాలలోనూ పిల్లలు ఆసక్తిగా చదువుకుంటారు.  తెలుగులో చిన్నయసూరిగారు , కందుకూరి వీరేశలింగంగారు  రాసిన కథనాలు బాగా ప్రాచుర్యం పొందాయి.  

( సంప్రదించిన గ్రంథం : కీ.శే . నార్ల వెంకటేశ్వరరావుగారి సంకలనంలో వెలువడిన ' త్రివేణి ' - శ్రీ పాములపాటి బుచ్చి నాయుడుగారి స్మారక సంచిక) 


No comments:

Post a Comment

Pages