ఈస్ట్ ఇండియా కంపెనీ - అచ్చంగా తెలుగు

ఈస్ట్ ఇండియా కంపెనీ

అంబడిపూడి శ్యామసుందర రావు 




మన దేశ చరిత్ర చదివినవారికి ఈ పేరు పరిచితమే.భారతదేశము బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్ళటానికి కారణము ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వ్యాపార సంస్థ. ఈ కంపెనీ ని 1600,లో సర్ థామస్ స్మిత్ కొంతమంది లండన్ లోని వ్యాపారులతో స్థాపించి ఎలిజిబెత్ 1 రాణికి తూర్పు అర్ధగోళములో ఉన్న దేశాలతో వ్యాపారము చేసుకోవటానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ విధముగా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభమయింది అప్పట్లో ఈ కంపెనీ వ్యాపారము పేరుతొ భారతదేశములో ప్రవేశించి 300 ఏళ్ళు బ్రిటిష్ పాలనకు కారణము అవుతుంది అని బహుశా కొద్దీమంది కూడ ఊహించి ఉండరు.

వ్యాపారము పేరుతొ ఈ కంపెనీ భారత ఉప ఖండాన్నిబ్రిటిష్ పాలనలోకి తెచ్చింది. ఈ కంపెనీ ఆ విధముగా అధికారాన్ని చేజిచ్చుకుని లాభాలను సాధించింది.ఒకటవ ఎలిజిబెత్ రాణి ఇంగ్లాండ్ లో అధికారంలో ఉండి  ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి వ్యాపార నిమిత్తము అనుమతి పత్రము ఇచ్చిన రోజుల్లో భారత ఉపఖండము లో మొఘల్ చక్రవర్తుల పాలన ఉండేది. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఉత్తర ఆఫ్గనిస్తాన్ నుండి మధ్యభారతములో వింధ్య పర్వతాల వరకు,నార్త్ ఈస్ట్ లో ఆస్సామ్ ,వరకు  అంటే 750,000 చదరపు మైళ్ళ విస్తీర్ణములో ఈ మొఘలుల పాలన  ఉండేది.1600 నాటికి మొఘల్ సామ్రాజ్యము అన్ని రంగాలలో ఉన్నత స్థాయిలో ఉండేది అన్ని విధాలా మొఘలులు యూరోప్ కన్నా అధికముగా వుండేవారు.భారతదేశము లో  అన్ని సహజ వనురులు లభ్యము అవటం వల్ల అన్ని రంగాలలో పురోగతి సాధించేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు 17వ శతాబ్దములో మొఘల్ దర్బార్ కు వచ్చి అక్బర్ వారసుడైన జహంగీర్ చక్రవర్తితో వ్యాపార లావాదేవీలు ప్రారంభించటానికి ప్రయత్నించారు.


ఈ కంపెనీ మొదట సౌత్ ఈస్ట్ ఆసియా లోని సుగంధద్రవ్యాల మార్కెట్ లోకి ప్రవేశించాలని ప్రయత్నించింది అప్పటికే ఆ ప్రాంతములో  డచ్ వారు అక్కడ ప్రవేశించి డామినేట్ చేసేవారు ఈస్ట్  ఇండియా కంపెనీ వారి ప్రయత్నాలలో వారి వ్యాపారాలు చాలా మంది ప్రస్తుత ఇండోనేషియా ప్రాంతములో 1623లో వధింపబడ్డారు అప్పుడు గత్యంతరం లేక ఈస్ట్ ఇండియా కంపెనీ వారి దృష్టి భారతదేశము వైపు మళ్లింది.ఆ విధముగా భారతదేశములో ప్రవేశించిన ఈస్ట్ ఇండియా
కంపెనీ వారు చక్రవర్తి జహంగీర్ అనుమతితో వారి సామంత రాజు అయినా మొదటిసారిగా కలకత్తా నవాబు అనుమతితో  భారతదేశము లోని తూర్పు, పశ్చిమ ప్రాంతాలలో చిన్న చిన్న స్థావరాలను ఫ్యాక్టరీలను నిర్మించుకున్నారు. ఈ విధముగా నిర్మించుకున్న స్థావరాల ద్వార ఈస్ట్ ఇండియా కంపెనీ వారు సుగంధద్రవ్యాలు, జౌళి, విలాస వస్తువుల వ్యాపారములో లాభాలను గడించారు.


ఈస్ట్ ఇండియా కంపెనీ లాభాలను ఆర్జించటం వల్ల పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచుకొని ఎక్కువ పెట్టుబడుల వ్యాపారాన్ని విస్తరించింది. ఆ విధముగా కంపెనీ తన స్థితిని హోదాను పెంచుకొని 17,18 శతాబ్దాలలో బలమైన వ్యాపారసంస్థగా పేరు సంపాదించుకుంది. కంపెనీ లండన్ లోని శక్తి వంతమైన వ్యాపారసంస్థగా ఎదిగి బ్రిటిష్ ఆర్ధిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగింది.


18 వ శతాబ్దము నుండి మొఘల్ సామ్రాజ్యము వ్యాపార వ్యవహారాల్లో భాగస్వామ్యము అయి నెమ్మదిగా భారత ఉపఖండములోని రాజకీయాల్లో కీలక పాత్ర పోషించటం ప్రారంభించింది మొఘలుల ఆధిపత్యము క్రమముగా క్షీణిస్తూ సంస్థానాధీశుల ప్రాబల్యము పెరగటం, ఐరోపాలోని వ్యాపార పోటీదారుల నుండి (ఫ్రాన్స్)పోటీ పెరుగుతూ రావటము మొదలయింది దానితో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాబల్యము పెరిగింది.దేశము యొక్క కోస్తాతీరం ఆసియా ఆఫ్రికాలలో వ్యాపార విస్తరణకు కీలకమైంది.  దానితోడు ఈస్ట్ ఇండియా కంపెనీ సైనిక బలము ప్రాంతీయ రాజకీయాలలో ముఖ్య పాత్రవహించటము ప్రారంభించాయి.  స్థానిక వ్యాపారాలు కూడా వారి స్వలాభము కోసము ఈస్ట్  ఇండియా కంపెనీ ని బలపరిచేవారు ప్లాసీ, బాక్సర్ యుద్ధాలలో విజయాల అనంతరము ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ ప్రాంత పరిపాలన పన్నుల  వసూళ్లు స్థాయికి ఎదిగి దివాని ఆఫ్ బెంగాల్ గా మారింది.


ఈ కాలములోనే కంపెనీ దక్షిణాదిన కూడ విస్తరణ మొదలు పెట్టింది. ఆ విధముగా 1818 నాటికి  ఈస్ట్ ఇండియా కంపెనీ భారత దేశములో ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగింది.ప్రారంభములోని సంవత్సరాలలో కంపని ఉద్యోగులు అవినీతి విధానాల వల్ల ఆస్తులు భారీగా సంపాదించుకోగలిగారు. 18 వ శతాబ్దము చివరికి ఈస్ట్ ఇండియా కంపెనీ హోదా వ్యాపారి నుండి పరిపాలకులుగా ఎదిగి పరిపాలన సాగించే స్థాయికి వచ్చారు. స్థానికంగా ఉండే పరిస్తుతులు కూడా వారికి సహకరించాయి.మొదట్లో ఇండియాలో పనిచేసే కంపెనీ పనివారి జీతాల కోసము సహాయముగా ఉండే   సైన్యము జీతాలకోసము పన్నులు వసూలు చేయటము ప్రారంభించారు.ఈ విధముగా కంపెనీ ఇండియాలో రాజకీయ శక్తిగా ఎదగటం ఇంగ్లాండ్ లో చర్చకు దారీ తీసింది. 1757 ప్లాసీ యుద్ధము అనంతరము  కంపెనీ చర్యలు అనుమానాలకు దారీ తీసింది. విలియం కౌపర్ అనే ప్రముఖ కవి కంపెనీ గురించి రాస్తూ  ఆ కంపెనీ  రక్తముతో ఫాక్టరీలను నిర్మించి వ్యాపారము చేస్తుంది మెడ మీద కత్తి  పెట్టి వ్యాపారము చేస్తుంది అని కంపెనీ అరాచకాలను వివరిస్తాడు.ఆ విధముగా అప్పటికే జరిగిన అమెరికన్ కాలనీల నష్టము, యాంటీ స్లేవరీ ఉద్యమము,ఫ్రెంచ్ విప్లవం అన్ని తోడై భారత దేశము యొక్క రాజకీయ పరిస్థితి ఇంగ్లాండ్ లో ప్రాధాన్యత సంతరించుకుంది.


1770లో ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలను నియంత్రించే  ప్రయత్నాలు 1773లోని నార్త్స్ రెగ్యులటింగ్ యాక్ట్ మరియు 1784 లోని పిట్స్ ఇండియా యాక్ట్ ల ద్వారా  మొదలయినాయి.ఈ చట్టాల ద్వారా కంపెనీ కార్యకలాపాలను ఇంగ్లాండ్ పార్లమెంట్ పర్యవేక్షణలోకి తెచ్చారు. వీటికి తోడు 1780లో గవర్నర్ జనరల్ చార్లెస్ కార్న్ వాలిస్  అంతర్గత అవినీతిని తగ్గించటానికి ప్రవేశపెట్టిన సంస్కరణలు వలన ఈస్ట్ ఇండియా కంపెనీ 1780,1790 మధ్యకాలములో అనేక మార్పులను చూసింది.  ఆవిధముగా కార్న్ వాలిస్ సంస్కరణల వలన కంపెనీ తన గౌరవాన్ని కాపాడుకొనే ప్రయత్నాలు చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశములో తన ఉనికిని భారతదేశాన్ని నాగరిక ప్రపంచములోకి తీసుకురావటానికి అన్నట్లుగా ప్రచారము చేసుకుంది కానీ యదార్ధానికి స్థానిక ఆర్ధిక స్తితిగతులు కంపెనీ  చర్యలు దీనికి భిన్నముగా ఉండేవి 19 వ శతాబ్దము మొదటి అర్ధభాగములో భారతదేశము తీవ్రమైన ఆర్ధిక ఒడిదుడుకులకు లోనయింది. ఫలితముగా వ్యవసాయాభి వృద్ధి కుంటుపడింది.చేతి వృత్తులు స్థానికంగా ఉత్పత్తి వాయే వస్తువులు చౌకగా దిగుమతి చేసుకొనే వస్తువులతో పోటీకి నిలబడలేకపోయినాయి.భారతీయుల పట్ల బ్రిటిష్ వారి ధోరణులు భారతీయులలో తీవ్ర అసం తృప్తిని కలుగజేసాయి. ఆ విధముగా కంపెనీ యాక్టివిటీస్ భారతీయులకు బ్రిటిష్ వారికి మధ్య అంత్యరాలను కలుగజేసింది.


ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యాన్ని సహించని స్థితి ఏర్పడింది..అసంతృప్తి తో ఉన్నసంస్థానాధీశులు లండన్ కు అనేక బృందాలను పంపి వారి పట్ల ఈస్ట్ ఇండియా కంపెనీ అవలంబిస్తున్న విధానాలను ఏర్పర్చుకున్న  ఒప్పందాలను ఏ విధముగా అమలు చేయటము లేదో వివరించారు మొదటి స్వతంత్ర పోరాటంగా పరిగణించే 1857 సిపాయిల తిరుగుబాటును గమనించిన బ్రిటన్ కంపెనీ పొరపాట్లను గుర్తించి పరిపాలనను కంపెనీ నుండి బ్రిటన్ రాణీ క్రిందకు తెచ్చుకుంది  అప్పటి నుండి కంపెనీ ఆధిపత్యము పోయి భారత దేశము లో బ్రిటన్రాచరిక పాలన మొదలైయింది క్రమంగా భ్రాతదేశము బ్రిటన్ కు సామంత దేశము అయింది బ్రిటన్ పార్లమెంట్ అధికారములోకి వచ్చింది గవర్నర్ జనరల్ ల పాలన మొదలయింది. అంటే అంతటితోఈస్టు ఇండియా కంపెనీ చరిత్ర భారతదేశములో ముగిసింది.


1600 నుండి 1708 వరకు ఈ కంపెనీ వివిధ పేర్లతో మనుగడ సాగించింది. 1708 నుండి 1873 వరకు ఇది యునైటెడ్ కంపెనీ ఆఫ్ మర్చంట్స్ ఆఫ్ ఇంగ్లండ్ పేరుతొ ఈస్ట్ ఇండీస్ లో వ్యాపారము ప్రారంభించింది. ఈ రెండు శతాబ్దాల కాలములో ఈ కంపెనీ వ్యాపారము పేరుతొ 45 ట్రిలియన్ల డాలర్ల సొమ్మును భారత దేశము నుండి దోచుకున్నది అని ఆర్ధిక శాస్త్రవేత్తల అభిప్రాయము.1813లో ఈ కంపెనీ యొక్క మోనోపలీ తొలగి పోయింది. 1834 నుండి ఈ కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వ ఏజెంట్ గా పని చేసింది 1857 సిపాయిల తిరుగుబాటు తరువాత ఆ పాత్ర కూడా ముగిసింది ఆ
విధముగా జూన్ 1, 1874లో డిజాల్వ్ చేయబడిన కంపెనీ 1858లో బ్రిటిష్ సామ్రాజ్యములో కలిసిపోయింది. అంటే ఇప్పుడు ఆ కంపెనీ లేనట్లే కానీ ఆశ్చర్యకరమైన విషయము ఏమిటి అంటే 1874లో మూత బడ్డ ఆ కంపెనీని భారతీయ మూలాలు ఉన్నసంజయ్ మెహతా అనే  ఇండియన్ బార్న్ బ్రిటిష్ వ్యాపారవేత్త 2010 లో తిరిగి ప్రారంభించాడు ఆ విధముగా చారిత్రమకమైన ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకప్పుడు ఇండియాను పాలించిన కంపెనీకి ఒక భారతీయుడు యజమాని అయినాడు. ఇదండీ భారత దేశాన్నివ్యాపారము పేరుతొ ఏలి దోచుకున్నంత దోచుకొని ఇక మీ వంతు అని పాలన(దోపిడీ) బ్రిటన్ రాచరికానికి మన దేశాన్ని అప్పజెప్పిన ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్ర.

No comments:

Post a Comment

Pages