కర్మ ఫలితం - అచ్చంగా తెలుగు
కర్మఫలితం
G.S.S. కళ్యాణి


అది కాలిఫోర్నియాలోని ఒక సముద్రతీరం. మధ్యాహ్నవేళ నులివెచ్చటి ఇసుకలో కూర్చుని ఆ సముద్రపు కెరటాలవంక తదేకంగా చూస్తూ, దీర్ఘాలోచనలో ఉన్నాడు కేశవ.
'ఎంతటివారైనా కర్మఫలితం అనుభవించక తప్పదురా!', అని తనతో గంగవ్వ అన్న మాటలు కేశవకు పదే పదే గుర్తుకొస్తున్నాయి. కేశవ గంగవ్వను వదిలిపెట్టి అమెరికాకు వెళ్లి పాతికేళ్లపైనే అయ్యింది. కానీ ఆమె జ్ఞాపకాలు ఇప్పుడు కేశవను చుట్టుముడుతున్నాయి!
గంగవ్వకు కేశవ అంటే చెప్పలేనంత ప్రాణం. సుమారుగా నలభైయేళ్ల క్రితం, భారతదేశంలోని ఒక మారుమూల పల్లెటూరిలో, తల్లిదండ్రులులేని చిన్నారి కేశవను గంగవ్వ దగ్గరకు తీసి, అతడు ఉండడానికి తన పాకలో చోటిచ్చింది. తను ఎన్నడూ బడికి వెళ్లి చదువుకోకపోయినా కేశవను మంచి బడికి పంపి చదివించింది. కేశవ కోసం ఎన్నో త్యాగాలను చేస్తూ, కష్టాలను ఓర్పుతో సహిస్తూ, తను కడు బీదరికాన్ని అనుభవిస్తూ కూడా కేశవ ఇబ్బంది పడకుండా ఉండటానికి కావలసినవి అతడికి సమకూరుస్తూ, కేశవను ఎంతో గారాబంగా పెంచింది గంగవ్వ. 
‘నువ్వు నాలాగా చదువురాకుండా అయిపోకూడదు. బాగా చదువుకుని గొప్పవాడివి కావాలి!’, అని గంగవ్వ కేశవను నిండు మనసుతో ఎప్పుడూ దీవిస్తూ ఉండేది. కేశవ బడికి వెళ్లే రోజుల్లో, చదువురానివాళ్ళు వ్యర్థమని ఎవరో అంటూ ఉండగా విన్నాడు. ఆ మాటలు కేశవకు చదువుపట్ల అమితమైన శ్రద్ధానూ, ఇష్టాన్నీ కలిగించాయి. కానీ అవే మాటలు గంగవ్వ పట్ల కేశవకు ఒకలాంటి చులకన భావన ఏర్పడేలా చేశాయి. దాంతో గంగవ్వ తనపై చూపుతున్న ప్రేమను ఏనాడూ అర్ధం చేసుకోలేకపోయాడు కేశవ!  
పల్లెటూరిలో చదువు పూర్తయ్యాక పట్నంలో కొంతవరకూ చదివి, ఆ తర్వాత పై చదువులకోసం అమెరికాకు వెళ్ళాడు కేశవ. అమెరికా బాగా నచ్చడంతో కేశవ అక్కడే ఒక ఉద్యోగం చూసుకుని, కొంతకాలం తర్వాత తనే స్వయంగా ఒక సంస్థను అమెరికాలో నెలకొల్పి, దానిని అభివృద్ధి చేస్తూ డబ్బులు బాగా సంపాదించాడు. ఎంత డబ్బు సంపాదించినా ఇంకా ఏదో సాధించాలన్న తపనలో పడిన కేశవ, తన సొంత ఊరిని మర్చిపోవడమే కాకుండా, గంగవ్వను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు!
“అరేయ్ కేశవా! గంగవ్వకు ఒంట్లో అస్సలు బాగాలేదురా! నిన్నే కలవరిస్తోంది! ఒక్కసారి ఇండియాకు వచ్చి ఆమెను చూసి పోరా!”, అంటూ కేశవకు అతని చిన్ననాటి స్నేహితుడు రఘుపతి ఎన్నోమార్లు ఫోన్ చేశాడు. కానీ కేశవ పట్టించుకోలేదు. కేశవను కలవరిస్తూ గంగవ్వ కన్నుమూసింది. అప్పుడు కూడా కేశవ బాధ పడలేదు!
'నేనిక్కడ ఒక పెద్ద బిజినెస్-మాగ్నెట్ ని! నా పనులు నాకున్నాయి! చాదస్తంగా గంగవ్వ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే విలువైన సమయాన్ని వృధా చేసుకున్నవాడినవుతాను!', అనుకున్న కేశవ అమెరికాలోనే ఉండిపోయాడు.
కేశవకిప్పుడు యాభై ఏళ్ళు! తన సంస్థకు సంబంధించిన కార్యకలాపాలు చూసుకోవడానికి అడ్డం వస్తుందని పెళ్లి చేసుకోలేదు కేశవ. ఆరునెలల క్రితం కేశవ సంస్థపై ఎవరో దుష్ప్రచారం చెయ్యడంతో ఆ సంస్థకున్న మంచిపేరు పోయి, వినియోగదారుల సంఖ్య  ఉన్నట్లుండి బాగా తగ్గిపోయింది. సంస్థకు వచ్చే రాబడి సంస్థ నిర్వహణకు సరిపోక ఆర్ధికకష్టాలు తలెత్తాయి. దాంతో వేరే దారి లేక సంస్థను మూసేశాడు కేశవ! బాగా బతికిన చోట ఉద్యోగం వెతుక్కుంటూ పరుల సంస్థలో పని చెయ్యడం ఇష్టం లేని కేశవ, తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ సముద్రతీరంలో కూర్చున్నాడు. ఎటూపాలుపోని పరిస్థితులలో రఘుపతినుండీ కేశవకు ఫోను వచ్చింది. కేశవ రఘుపతితో తన కష్టాలన్నీ గుక్కతిప్పుకోకుండా చెప్పేశాడు. 
“రఘుపతీ! నన్ను ఎంతో ఇష్టంగా పెంచిన గంగవ్వను నేను పట్టించుకోలేదు. నేను చేసినది చెడ్డపనిరా. ఆ కర్మఫలితమే నన్నిప్పుడు బాధిస్తోంది!!”, అంటూ కేశవ కన్నీటిపర్యంతమై పశ్చాత్తాపపడ్డాడు.
అంతా విన్న రఘుపతి, "కేశవా! నువ్వు వింటానంటే ఒక్క మాట చెబుతా! వెంటనే నువ్వు బయలుదేరి ఇండియాకొచ్చేయరా! అక్కడ సంపాదించిన డబ్బుతో ఇక్కడ నువ్వు రాజాలా బతకచ్చు!”, అన్నాడు.
రఘుపతి ఇచ్చిన సలహా కేశవకు నచ్చింది. వెంటనే అమెరికాలోని తన సొంత ఇంటినీ, ఆస్తులనూ అమ్మేసి ఇండియా చేరుకున్నాడు కేశవ. అయితే, తను పెరిగిన ఊరికి వెడితే గంగవ్వ జ్ఞాపకాలు తనను వెంటాడతాయనీ, తన చుట్టూ ఉన్నవారు తనను చీదరించుకునే అవకాశం ఉందనీ అనుమానం కలిగింది కేశవకు. అందుకే ఆ ఊరి దరిదాపులకు వెళ్లకూడదని నిశ్చయించుకున్న కేశవ, నగరంలో వేరే ఇల్లు కొనుక్కుని కాలక్షేపం కోసం అక్కడ ఒక చిన్న కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఒకరోజు ఆఫీసునుండీ ఇంటికెడుతున్న కేశవకు రోడ్డు పక్కన ఒక వృద్ధురాలు కనపడింది. ఆ వృద్ధురాలు చిరిగిన దుస్తులతో, నెరిసిపోయిన జుట్టుతో ఉంది. ఆ వృద్ధురాలిని చూడగానే కేశవకు గంగవ్వ గుర్తుకొచ్చింది! యాచన చేస్తున్న ఆ వృద్ధురాలిని తన కారులోకి ఎక్కమని అన్నాడు కేశవ. ఆశ్చర్యంగా చూసిన వృద్ధురాలు కారు ఎక్కి కూర్చుంది. 
"నీ పేరేంటవ్వా?", అడిగాడు కేశవ.
"లక్ష్మమ్మ!", చెప్పింది వృద్ధురాలు.
కేశవ లక్ష్మమ్మను తన ఇంటికి తీసుకెళ్లి కడుపునిండా ఆమెకు భోజనం పెట్టాడు.  
లక్ష్మమ్మ చాలా సంతోషించి, “ఇక వెడతాను బాబూ!”, అంది.
“ఈ రాత్రివేళ ఎక్కడికెడతావవ్వా?”, అడిగాడు కేశవ.
“ఏముంది బాబూ? సీత కష్టాలటు! నా కష్టాలిటు! నేను కన్నవాళ్ళు నన్ను బస్టాండులో దింపి ఎటో వెళ్లిపోయార. ఇవాళకాకపోతే రేపు వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తారని నా ఆశ! ఆ బస్టాండులోనే పడుకుంటా!”, అంది లక్ష్మమ్మ.
“ఎన్నాళ్ళయిందవ్వా వాళ్ళు నిన్ను బస్టాండులో దింపి?", అడిగాడు కేశవ.
"ఏడాది కావస్తూందనుకుంటా!', చెప్పింది లక్ష్మమ్మ.
"ఇన్నాళ్లూ రాని నీ పిల్లలు ఇక ఇప్పుడు మాత్రం ఎందుకొస్తారవ్వా? నిన్ను చూస్తూ ఉంటే నాకు నన్ను పెంచిన గంగవ్వ గుర్తుకొస్తోంది. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు నాతోనే ఉండిపో! నాకెలాగో ఎవ్వరూ లేరు. నిన్ను నా సొంత అమ్మలా చూసుకుంటాను!', అన్నాడు కేశవ.
లక్ష్మమ్మ కేశవ అడిగినదానికి ఒప్పుకుంది. కేశవ లక్ష్మమ్మలో గంగవ్వను చూసుకుంటూ ఆమెకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తూ, ఏ సపర్యలు కావాలన్నా విసుగు లేకుండా చేస్తూ, ఆమెపై ప్రేమను పెంచుకున్నాడు. లక్ష్మమ్మ కూడా ఎవరూ లేని కేశవను అర్ధం చేసుకుని అభిమానంగా ఉండేది. కనీసం ఈ విధంగానైనా గంగవ్వకు తను చేసిన అన్యాయానికి కొంత పరిహారం చెల్లించినట్లవుతోందని తృప్తి పడ్డాడు కేశవ. ఒక ఆదివారం సాయంత్రం కేశవ వాకిట్లో కూర్చుని లక్ష్మమ్మతో ఏవో ముచ్చట్లు చెప్తూ ఉండగా ఇద్దరు యువకులు ఇంటి గేటు తెరుచుకుని లోపలికి వచ్చారు. 
వాళ్ళు లక్ష్మమ్మను చూస్తూనే, “అమ్మా! నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం మేము ఊరంతా తెగ వెతికేశాం తెలుసా? ఎలా ఉన్నావమ్మా? ఇది ఎవరి ఇల్లు?", అంటూ లక్ష్మమ్మను వాటేసుకుని ప్రశ్నల వర్షం కురిపించారు. 
కేశవకు ఆ వచ్చిన ఇద్దరూ రాజూ, సిద్ధూలనీ, వాళ్ళు లక్ష్మమ్మ కొడుకులనీ తెలిసింది. 
వాళ్ళు లక్ష్మమ్మను తమతో ఎక్కడ తీసుకెళ్ళిపోతారోనన్న భయంతో, "చూడండీ! మీరు చేసినది చాలా పెద్ద తప్పు! ఆవిడను అలా బస్టాండులో వదిలిపెట్టి వెళ్లిపోవడం అమానుషం! ఆవిడపై మీరిప్పుడు చూపిస్తున్న ప్రేమ అప్పుడేమయ్యిందీ? ఆవిడ మీతో రాదు! ఇక ఎప్పటికీ అవ్వ నాతోనే ఉంటానంది!!", అన్నాడు కేశవ.
దానికి వాళ్ళు, "అయ్యో! మా అమ్మను మేము వదిలెయ్యడమేమిటీ? ఆవిడను మేము మాతోపాటూ వేరే ఊరికి తీసుకెడదామని బస్టాండుకు తెచ్చాము. వయసువల్ల మా అమ్మకు అప్పుడప్పుడూ మతిమరుపు వస్తూ ఉంటుంది. దాంతో ఆవిడను మేము కూర్చోబెట్టిన చోట ఉండకుండా ఎటో వెళ్ళిపోయింది. మేము ఎంత వెతికినా ఆవిడ మాకు దొరక్కపోయేసరికి మా ఇళ్లకు మేము వెళ్లిపోయాం. తెలిసిన వారి ద్వారా ఆవిడ ఇక్కడ ఉందని సమాచారం అందటంతో ఇక్కడకు వచ్చాం!",అన్నారు.
లక్ష్మమ్మ తన సంచీ తీసుకుని తన కొడుకులతో బయలుదేరింది. ఆమె పై విపరీతమైన ప్రేమాభిమానాలు పెంచేసుకుని, లక్ష్మమ్మలో గంగవ్వను చూసుకుంటున్న కేశవకు దుఃఖం పొంగుకొచ్చింది. 
వెళ్లిపోతున్న లక్ష్మమ్మను చెయ్యి పట్టుకుని ఆపి," అవ్వా! వెళ్ళిపోతున్నావా? నువ్వు నాతో ఎప్పటికీ ఉండిపోతావని అనుకున్నాను!", అన్నాడు కేశవ.
అందుకు లక్ష్మమ్మ, "నువ్వలా ఏడుస్తూ ఉంటే నేను చూడలేను నాయనా! నన్ను నీతో ఉండిపొమ్మంటే ఉండిపోతాను. కానీ ఒక షరతు. నా కొడుకులు నాతో ఉండాలి! ఈ వయసులో నేను వారిని చూడకుండా ఉండలేను!", అంది లక్ష్మమ్మ.
"ఓ! అలాగే అవ్వా! నా దగ్గర ఏ లోటూ లేకుండా పదిమందిని పోషించగలిగేటంత ధనం ఉంది. నాకు లేనిదల్లా 'నా' అన్నవాళ్ళే! మీరందరూ నాతో ఉంటే రోజులన్నీ చాలా  సరదాగా సందడిగా గడిచిపోతాయి!", అంటూ  లక్ష్మమ్మ అడిగినదానికి  అమితానందంతో ఒప్పుకున్నాడు కేశవ.
లక్ష్మమ్మ తన ఇద్దరు కొడుకులతో కేశవ ఇంట్లో ఉండసాగింది. ఆమె కొడుకులకు ఉద్యోగం లేకపోవడంతో రోజంతా ఏవేవో ఆటలాడుతూ, కావలిసినవి వంటమనిషి చేత వండించుకుని తింటూ, జల్సాగా గడపటం ప్రారంభించారు. కొన్ని వారాలు గడిచాయి. ఒకరోజు ఇద్దరు మహిళలు పిల్లలను ఎత్తుకుని కేశవ ఇంటికి వచ్చారు.
"వీళ్ళు నా కోడళ్ళు, మనవళ్లు, మనవరాళ్ళూనూ! వీళ్ళు కూడా మనతోటే ఉంటారు. నీకేమైనా అభ్యంతరమా?", అని కేశవను అడిగింది లక్ష్మమ్మ. 
"అబ్బే! ఇబ్బందేమీ లేదు. పసివాళ్ళు తిరుగాడే లోగిళ్ళు కళకళలాడుతూ ఉంటాయి. ఉండనివ్వు అవ్వా!", అన్నాడు కేశవ.
లక్ష్మమ్మ కుటుంబీకులు కేశవ సంపాదించిన ఆస్తిని ఆనందంగా అనుభవించడం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాలు గడిచాక లక్ష్మమ్మకు పక్షవాతం వచ్చి మంచం పట్టింది. ఆమెను తన కొడుకులు పట్టించుకోలేదు. కేశవ మాత్రం లక్ష్మమ్మ పక్కనుండి రేయింబవళ్ళూ ఆమెకు సేవలు చేశాడు.
ఒకనాటి రాత్రి లక్ష్మమ్మ కేశవను దగ్గరకు తీసుకుని, "కేశవా! నీకు నిజంగా నేనంటే ప్రేమ ఉన్నట్లయితే నువ్వు నాకోసం ఒక పని చెయ్యాలి. అవునని మాట తప్పితే నేను పోయాక నా ఆత్మకు శాంతి కలగదు!", అంది.
"అవ్వా! నీకోసం ఏమైనా చేస్తాను. చెప్పవ్వా..", అన్నాడు కేశవ.
"రాజూ, సిద్ధూలకు సరైన చదువు అబ్బలేదు. వాళ్ళు ఉద్యోగాలు సంపాదించడం అసాధ్యం! నువ్వు వాళ్లకి నీ ఆస్తిని ఇవ్వగలవా? మళ్ళీ ఆస్తి సంపాదించుకునే తెలివితేటలూ, చదువూ, సామర్ధ్యం అన్నీ నీకున్నాయి కాబట్టి ఇలా అడుగుతున్నా!", అంది లక్ష్మమ్మ.
కేశవకు ఏమని సమాధానం ఇవ్వాలో అర్ధం కాలేదు. అంతలో లక్ష్మమ్మ కొడుకులిద్దరూ కేశవను కిందికి పడదోసి, తమ చేతిలో ఉన్న ఆస్తి కాగితాలలో అతడిని సంతకం పెట్టమని బలవంతం చేశారు. గత్యంతరం లేక కేశవ తన ఆస్తి మొత్తాన్ని వారి పేర రాసేసి అక్కడి నుండీ వెళ్ళిపోయాడు. తీవ్ర మనోవేదనకు గురైన కేశవకు పెద్ద ఉద్యోగం దొరక్క పోవడంతో తనకొచ్చే కొద్దిపాటి జీతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 
పదిహేనేళ్ళు గడిచిపోయాయి. కేశవ వృద్ధుడైపోవడంతో ఇక ఉద్యోగం చెయ్యలేక దాన్ని వదిలిపెట్టేశాడు. గడిచిన పదిహేనేళ్లల్లో అరకొర జీతంతో ఆస్తిపాస్తులేవీ సంపాదించలేకపోయిన కేశవ, ఒకరోజు ఉద్యానవనంలో కూర్చుని ఉండగా అతడికి రఘుపతినుండీ ఫోన్ వచ్చింది.
"హలో!", అంటూ ఫోన్ ఎత్తాడు కేశవ.
"ఒరేయ్ కేశవా! ఎలా ఉన్నావురా?", ఆప్యాయంగా అడిగాడు రఘుపతి.
"నన్ను ప్రేమగా పెంచిన గంగవ్వకు చివరి రోజుల్లో ‘నా’ అన్నవాళ్ళు లేకుండా చేసేశాను! ఇప్పుడు నావాళ్లంటూ ఎవ్వరూ మిగలక బాధపడుతున్నాను! నా కర్మఫలితాన్ని అనుభవిస్తున్నానురా!!", నిరాశగా చెప్పాడు కేశవ.
"కేశవా! నేనిప్పుడు చెప్పబోయే వార్త నీకు ఆనందం, ఆశ్చర్యం కలిగిస్తుంది విను! నా చిన్ననాటి స్నేహితుడివైన నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తిని పోగొట్టుకుని బాధపడుతున్నావని తెలిసి నాకు బాధ కలిగింది. ఒక న్యాయవాదినైన నేను, నీకు ఏదైనా సహాయం చెయ్యగలనేమోనని మార్గంకోసం వెదకటం ప్రారంభించాను! అలా వెతుకుతూ గంగవ్వ ఉన్న పాకలోకి వెళ్లాను. అది ఇన్నేళ్లూ ఖాళీగా ఉండటంవల్ల పాడుబడింది. గంగవ్వ వాడుకున్న ఇనప పెట్టె మాత్రం చెక్కుచెదరకుండా శిధిలాల కింద కనపడింది. నేను ఆ పెట్టె తెరచి చూస్తే అందులో నీ చిన్నప్పటి ఫోటో, ఒక ఉత్తరం ఉన్నాయి. మనం గంగవ్వ చదువుకోలేదు అని అనుకున్నాము కదా! కానీ గంగవ్వకు చదవడం, రాయడం కూడా వచ్చురా! ఆ ఉత్తరంలో గంగవ్వ తనకున్న పాక, దాని వెనకున్న రెండెకరాల పొలం నీకే చెందుతాయని రాసింది! ఇప్పుడు గంగవ్వ పాక ఉన్న ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. దాంతో ఆ స్థలం విలువ వందరెట్లు పెరిగింది!", అన్నాడు రఘుపతి.
కేశవకు నోటమాట రాలేదు. అతని కళ్ళవెంట నీళ్లు జలజలా కారాయి.
"రఘుపతీ! గంగవ్వ చెప్పినట్లు ఇదంతా నా కర్మఫలితమే! గంగవ్వకు నేను చేసిన అన్యాయానికి నాకు భగవంతుడిచ్చిన శిక్షను ఇన్నాళ్లూ అనుభవించాను. ఎవరో ముక్కూమొహం తెలియని వృద్ధురాలిని ఇంటికి తెచ్చి నిస్వార్ధంగా సేవ చేసినందుకు కాబోలు, ఇవాళ ఆ ఆస్తి నాకు లభించింది! నాకు నీవంటివాడు స్నేహితుడిగా దొరకడం నేను ఏనాడో చేసిన పుణ్యఫలితం. నా కోసం ఇంత ఆలోచించినందుకు కృతజ్ఞతలురా!", అన్నాడు కేశవ.
"సరేలేరా! ముందు నువ్వు ఎక్కడున్నా వెంటనే నా దగ్గరకొచ్చెయ్! మనం తర్వాతి కార్యక్రమాలేంటో చూద్దాం!", అన్నాడు రఘుపతి.
"ఇదుగో..! నీ దగ్గరకు ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నారా రఘుపతీ!!", అంటూ తన బట్టలూ, వస్తువులూ తీసుకోవడానికి తనుంటున్న వృద్ధాశ్రమంలోకి పరుగులాంటి నడకతో వెళ్ళాడు కేశవ!

*****

No comments:

Post a Comment

Pages