"బంగారు" ద్వీపం (అనువాద నవల) - 5 - అచ్చంగా తెలుగు

"బంగారు" ద్వీపం (అనువాద నవల) - 5

Share This
"బంగారు" ద్వీపం (అనువాద నవల) -5
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Wrier : Enid Blyton
 


(తెల్లవారి నిద్ర లేచిన అన్నెకు తనను ఆడపిల్ల పేరుతో పిలవవద్దని, జార్జి అని మాత్రమే పిలవాలని జార్జినా చెబుతుంది. పిల్లలను సముద్ర తీరానికి తీసుకెళ్ళమని జార్జితో ఆమె తల్లి చెబుతుంది. సముద్రంలో ఉన్న కిర్రిన్ ద్వీపం, అక్కడ ఉన్న కోట తనకు చెందినవని జార్జి చెప్పటంతో, పిల్లలు విస్తుపోతారు. తరువాత . . .)
@@@@@@@@@@@@@@@@
అతను బుర్ర గోక్కుంటూ జార్జి వైపు చూసాడు. ఆమె చెప్పేది నిజమెలా అవుతుంది?
"సరె! నువ్వు మాకు నిజం చెప్పావనే నమ్ముతున్నాం" అన్నాడతను. "కానీ యిది కొంచెం అసాధారణంగా కనిపిస్తోందని నీకు తెలుసా? ఇది నిజం. చిన్న పిల్లలెప్పుడూ, అది వినోదాన్ని కలిగించే ద్వీపమైనా, సాధారణంగా ద్వీపాలకు యజమానులు కాలేరు."
"అదేం సరదాగా ఉండే చిన్న ద్వీపం కాదు" జార్జి తీవ్రస్వరంతో అంది. "అక్కడ చాలా అందంగా ఉంటుంది. అక్కడ మచ్చిక చేసుకొనేంత దగ్గరగా మసిలే కుందేళ్ళు ఉన్నాయి. వాటి పక్కనే డేగల్లాంటి పెద్ద పక్షులు కూర్చుంటాయి. అన్ని రకాల సముద్ర పక్షులు అక్కడకు వెళ్తాయి. అక్కడ కోట కూడా, శిధిలావస్థలో ఉన్నప్పటికీ, చాలా అద్భుతంగా ఉంటుంది."
"ఇదేదో బాగానే ఉందే!" అన్నాడు డిక్. "జార్జినా! అది నీకెలా చెందుతుంది?"
జార్జి అతని వైపు కోపంగా చూసింది కానీ బదులీయలేదు.
"క్షమించు" డిక్ వెంటనే స్పందించాడు. "నేను నిన్ను జార్జినా అని పిలవాలని అనుకోలేదు. నిన్ను జార్జి అని పిలవాలనే అనుకొన్నాను."
"కానీ జార్జి! ఆ ద్వీపం నీకెలా చెందుతుందో మాకు చెప్పు" అంటూ జూలియన్ మూతి ముడుచుకొన్న బంధువైన ఆ చిన్నపిల్ల చేతిని పట్టుకొన్నాడు. వెంటనే ఆమె తన చేతిని వెనక్కి లాక్కొని దూరంగా జరిగింది.
"అలా చేయకు" అందామె. "నేనింకా మీతో స్నేహం చేయాలో, వద్దో నిర్ణయించుకోలేదు."
"సరె, సరె!" సహనాన్ని కోల్పోతూ అన్నాడు జూలియన్. "శత్రువులమో, మరేదో నీ యిష్టం. మేము ఖాతరు చెయ్యం. కానీ మేము మీ అమ్మను బాగా యిష్టపడతాం. మేము నీతో స్నేహం చేయలేకపోయామని ఆమె అనుకోవటం మాకిష్టం లేదు."
"మా అమ్మంటే మీకిష్టమా?" అడుగుతున్న జార్జి మెరిసే నీలి కళ్ళలో కోమలత్వం కనిపించింది. "అవును. . . ఆమె చాలా మంచిది, కాదా?. . . .సరె. . .మంచిది. . .కిర్రిన్ కోట నాకెలా చెందుతుందో మీకు చెబుతాను. రండి. ఎవరికీ వినిపించని ఆ మూలకు వెళ్ళి కూర్చుందాం."
సముద్రతీరంలో మూలగా ఉన్న యిసుకనేలపై వాళ్ళంతా కూర్చున్నారు. 'బే' మధ్యలో ఉన్న ద్వీపం వైపు తిరిగి చూడసాగింది జార్జి.
"అదిలా జరిగింది" అందామె. "చాలా ఏళ్ళ క్రితం ఈ చుట్టుపక్కల భూమి అంతా మా అమ్మ బంధువుల అధీనంలో ఉండేది. తరువాత పేదరికం వల్ల దానిలో చాలా ప్రాంతాన్ని అమ్మాల్సి వచ్చింది. కానీ ఆ చిన్న ద్వీపాన్ని మాత్రం అమ్మలేకపోయారు. ఎందుకంటే, ఆ కోట ఏళ్ళ తరబడి శిధిలావస్థలో ఉన్నందున అది విలువైనదని ఎవరూ అనుకోలేదు."
"ఇంత అందమైన చిన్న ద్వీపాన్ని ఎవరూ కొనటానికి యిష్టపడలేదంటే నమ్మశక్యం కాకుండా ఉంది" అన్నాడు డిక్. "నా దగ్గర డబ్బులుంటేనా, తక్షణం కొనేద్దును."
"ఆస్తులన్నీ పోగా, మా అమ్మ కుటుంబానికి యిక మిగిలినదేమిటయ్యా అంటే మేము నివసిస్తున్న మా స్వంత యిల్లు, కొంచెం దూరంలో పొలం, ఈ కిర్రిన్ ద్వీపం" అంది జార్జి. "నేను పెద్దదాన్ని అయ్యాక అది నాకే చెందుతుందని అమ్మ చెబుతూంటుంది. ఇప్పుడు దాన్ని ఆమె కోరుకోవటం లేదని చెప్పింది. అంటే ఒక రకంగా అది నాకు యిచ్చినట్లేగా! అది నాకు చెందినది. అది నా సొంత ఆస్తి. నా అనుమతి లేకుండా ఎవరినీ అక్కడకు వెళ్ళనివ్వను."
ముగ్గురు పిల్లలు ఆమెను సూటిగా చూసారు. జార్జి చెప్పిన ప్రతి మాటను వారు నమ్మారు. ఎందుకంటే ఆ అమ్మాయి నిజం చెబుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. స్వంతంగా ఒక ద్వీపాన్ని కలిగి ఉండటం కల్పనే! ఆమె చాలా అదృష్టవంతురాలని వాళ్ళు భావించారు.
"ఓ జార్జినా! అదే జార్జి!" అన్నాడు డిక్. "నువ్వు అదృష్టవంతురాలివని నేను భావిస్తున్నాను. అది చాలా అందమైన ద్వీపంగా కనిపిస్తోంది. నువ్వు మాతో స్నేహం చేస్తావని, త్వరలోనే ఒక రోజు మమ్మల్ని అక్కడకు తీసుకెళ్తావని నేను నమ్ముతున్నాను. మేము నిన్నెంత ప్రేమిస్తున్నామో నువ్వు ఊహించలేవు."
"సరె! నేను చేయొచ్చు" అంది జార్జి. ఆమెలో కూడా ఆసక్తి చిగురించింది. "చూస్తాను. ఈ చుట్టుపక్కల కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు నన్నెంత వేడుకొన్నా, ఎవరినీ అక్కడకు తీసుకెళ్ళలేదు. వాళ్ళంటే నాకు యిష్టం లేదు. అందుకే ఆ పని చేయలేదు."
నలుగురు పిల్లలు ఆ సముద్రంలో దూరంగా ఉన్న ద్వీపాన్ని మౌనంగా చూస్తున్నారు. సముద్రపు అలలు చాలా వరకు శాంతించినట్లు కనిపించింది. ప్రశాంతంగా ఉన్న ఆ నీళ్ళలో నడిచి ఆ ద్వీపానికి వెళ్ళిపోవచ్చునని అనిపించింది. అది సాధ్యమేనా అని డిక్ అడిగాడు.
"లేదు. అక్కడకు పడవలో మాత్రమే వెళ్ళగలమని నేను మీకు చెబుతున్నాను. అది కనిపించే దాని కంటే చాలా దూరం. అంతేగాక నీళ్ళు చాలా లోతుగా ఉంటాయి. దారిలో చిన్న చిన్న కొండలు కూడా ఉంటాయి. పడవను ఏ దారిలో పోనివ్వాలో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. లేదంటే వాటిని ఢీకొట్టే ప్రమాదం ఉంది. అది ఇక్కడ ప్రమాదకరమైన తీరం. అక్కడ చాలా ఓడలు పగిలి ముక్కలయ్యాయి."
"పడవ ప్రమాదాలా?" అరిచిన జూలియన్ కళ్ళు మెరిసాయి. "నేను పడవ శకలాలను ఎప్పుడూ చూడలేదు. చూడటానికి ఏమైనా ఉన్నాయా?"
"ఇప్పుడు కాదు" జార్జి చెప్పింది, "అవన్నీ తొలగించారు ఒక్కటి తప్ప. అది కూడా ద్వీపానికి మరొక పక్కన ఉంది. అది నీటిలో లోతుగా ములిగిపోయింది. నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పడవలో వెళ్ళి నీటిలోకి చూస్తే, విరిగిపోయిన తెరచాప స్తంభం కనిపిస్తుంది. అది కూడా నాకు చెందినదే!"
ఈసారి పిల్లలు జార్జి ని నిజంగా నమ్మలేదు. కానీ ఆమె తన తలను దృఢంగా ఆడిస్తోంది.
"అవును" అందామె. "అది నా ముత్తాత ముత్తాతల్లో ఒకరికి చెందిన ఓడ. అతను తన ఓడలో బంగారపు కడ్డీలను వేసుకొని తిరిగి వస్తున్నాడు. అది కిర్రిన్ ద్వీపాన్ని గుద్దుకొని పగిలిపోయింది."
"ఓ! ఆ బంగారానికి ఏమైంది?" అన్నె తన కళ్ళను పెద్దవి చేసి చక్రాల్లా తిప్పింది.
"ఎవరికీ తెలియదు" అంది జార్జి. "దాన్ని ఓడలోంచి ఎత్తుకుపోయారని నేను భావిస్తున్నాను. గజ ఈతగాళ్ళు నీటి లోపలకు ములిగి చూసారు. కానీ వారికి బంగారం దొరకలేదు."
"అలాగా! ఇదేదో ఉత్తేజకరంగా ధ్వనిస్తోంది" అన్నాడు జూలియన్. "నేను ఆ శిధిలాలను చూడాలని కోరుకొంటున్నాను."
"సరె! నీటిలో ఆటుపోట్లు బాగా తగ్గినప్పుడు, ఈ మధ్యాహ్నం వెళ్ళవచ్చు" అంది జార్జి. ఈ రోజు నీరు చాలా ప్రశాంతంగా మరియు స్పష్టంగా ఉంది. మనం కొద్దిగా దాన్ని చూడగలం."
"ఓ! ఎంత అద్భుతం!" అంది అన్నె. "నేను నిజంగా దెబ్బ తిన్న ఓడని ప్రత్యక్షంగా చూడాలనుకొంటున్నాను."
ఆమె మాటలకు యితరులు నవ్వారు. "బాగుంది. అదేం యింకా సజీవంగా ఉండదు. అది సరె! స్నానం గురించి ఏమంటావు జార్జి?"
"ముందు నేను వెళ్ళి తిమోతీని తీసుకు రావాలి" అంటూ జార్జి లేచింది.
"తిమోతీ ఎవరు?" డిక్ అడిగాడు.
"మీరు రహస్యంగా ఉంచుతారా?" జార్జి అడిగింది. "ఇంటి దగ్గర ఎవరికీ తెలియకూడదు."
"సరె! చెప్పు. ఏమిటా రహస్యం?" జూలియన్ అడిగాడు. "నువ్వు మాకు చెప్పొచ్చు. మేము నీచులం కాదు."
"తిమోతి నాకున్న గొప్ప స్నేహితుడు" జార్జి చెప్పింది. "వాడు లేకుండా నేనేమీ చేయలేను. కానీ వాడంటే అమ్మా నాన్నలకు యిష్టం లేదు. అందుకే నేను అతన్ని రహస్యంగా ఉంచాలి. నేను వెళ్ళి అతన్ని పిలుచుకొస్తాను."
ఆమె పైకెళ్ళే కొండ బాటలో పరుగుతీసింది. ఆమె వెళ్ళటాన్ని వాళ్ళు గమనించారు. తమకు తెలిసిన వాళ్ళందరి కన్నా ఆమె విచిత్రమైన అమ్మాయి అని వాళ్ళు భావించారు.
"ఈ ప్రపంచంలో తిమోతీ ఎవరై ఉంటాడు?" జూలియన్ ఆశ్చర్యంగా అన్నాడు.
(ఇంకా ఉంది)


No comments:

Post a Comment

Pages