అనసూయ ఆరాటం -19 - అచ్చంగా తెలుగు

అనసూయ ఆరాటం -19 

చెన్నూరి సుదర్శన్  


అనసూయ వారాసి గూడకచ్చి ఆర్నెల్లైంది.


           అప్పుడప్పుడు సురేందర్ వచ్చి బాగోగులు తెల్సుకొని పోయేటోడు.


అవ్వాల సురేందర్ వచ్చి ఆదిరెడ్డి ఇల్లు సూసి అప్సోసైండు. అనసూయ బుడ్డ టీ.వి ముందల ఫ్యాను కింద కూకోని సూత్తాంది. నాలుగు కుర్సీలున్నై. టీ పాయ్ ఉన్నది. డైనింగ్ టేబుల్ ఉన్నది. వంటింట్ల గ్యాసు పొయ్యి ఉన్నది.


“అక్కా పట్నంల ఎట్లున్నది” అని అడిగిండు సురేందర్. ఇవ్వాల ఐతారమే కదా.. అయినా ఆదిరెడ్డి పనికి పోయిండా”


“వానికి ఐతారం లేదు.. సోమారం లేదు తమ్ముడూ. గడియ రికాం లేకుంట పనికి పోతాండు కొడుకు. గింత తెలివిమంతుడు.. బుద్ధిమంతుడైతడని కలల సుత అనుకోలె. అంతా నీ చేతి సలువనే తమ్మీ..” అన్నది.


“అక్కా ఇందుల నేను సేసిందేమీ లేదు. ఎవ్వలైనా ఓ దారి సూయించుతరు. దానెంబడి నీయతిగ నడిత్తెనే ఎవ్వలైనా బాగుపడుతరు. తాడి చెట్టు ఎక్కియ్యాలంటే అందెదాకనే.. మీదికి తోత్తం. ఆతరువాత వాల్లు సంతంగా ఎక్కాల్సిందే కదా..”


ఇంతల జయమ్మ మంచినీల్లు చాయె తీస్కచ్చిచ్చింది. సురేందర్ చాయె తాక్కుంట.. “రవీందరన్న పని సూయించుడు.. ఆదిరెడ్డి పనిమంతుడు.. నీతిమంతుడవుడు.. నీ కట్టాలు గట్టెక్కుతానై. ఇదంతా లింగారెడ్డి బావ ఆశీర్వాద బలం” అన్నడు సురేందర్.


“అక్కా.. రవీందరన్న ఎప్పుడన్నా వచ్చిండా”


“లేదు తమ్ముడూ.. గంత పెద్దింటోల్లు మా గరీబోల్ల ఇంటికి వత్తరా.. నన్నే ఓ పాలి ఆదిరెడ్డి వాల్లింటికి తీస్కపోయిండు. రవీందర్ తమ్ముడు మంచిగనే మాట్లాడిండు గాని రజిత మరదలు పిల్లనే ముక్కిటు.. మూతటు పెట్టుకున్నది. వాల్ల ముల్లెంత ఏమో..! తిన్నట్టు.” అని కండ్ల నీళ్ళు తీసుకున్నది అనసూయ.


“అక్కా ఆమె గుణమే అంత.. నువ్వు బాధ పడకు” అంటాంటే  అనిమిరెడ్డి చేతిల చేసంచితోని ఇంట్లకచ్చుకుంట “మామయ్యా.. ఎంతసేపాయె వచ్చి” అని సంబురపడ్డడు. ఇప్పుడే వచ్చిన అన్నట్టు సురేందర్ తల్కాయె ఊపిండు.


అనిమిరెడ్డి చేతిల చేసంచితీస్కోని జయమ్మ వంటింట్లకు  పోయింది.


“జయమ్మకు వంట సుత నేర్పినవా.. అక్కా” అడిగిండు సురేందర్.


“తప్పుతదా తమ్ముడూ.. ఎప్పటికైనా పరాయి ఇంటికి పోయే పిల్ల. నేర్సుకోకపోతే.. నన్ను తిట్టుకోరా” అన్నది అనసూయ సిన్నంగ నవ్వుకుంట.


సురేందర్ సుత నవ్విండు.


“బువ్వ తిని పోవాలె తమ్ముడు..” అన్కుంట అనసూయ వంటింట్లకు పోయిది బిడ్డకు ఆసరైతామని.


“కాలేజీ ఎట్లున్నది.. చెల్లె పదోది కదా..”


“ఔను మామయ్యా.. మా కాలేజీ కేంది.. ఆడింది ఆట. పాడింది పాట” అన్నడు అనిమిరెడ్డి నవ్వుకుంట. “గవర్నమెంటు కాలేజీలల్ల సెలవులెక్కువత్తయన్నట్టే గాని సదువు మంచిగ చెప్తరు మామయ్యా..”


టీ.వీల ‘దర్పణ్’ కార్యక్రమంల మంచి కథ వత్తాంది. ఇద్దరు కలిసి మాట్లాడుకుంట కథల మునిగి పోయిండ్లు.


ఆ పూట అనసూయ చేతి వంట తిని సాయంత్రం నాలుగింటికి కూకట్‌పల్లికి బైలెల్లిండు. అక్కా వచ్చే ఐతారం మాయింటికి రాండ్లని బతిలాడిండు.


“పోయిన వారమే వచ్చినం కాదు తమ్మీ.. వత్తంలే.. ఇక్కడ్నే ఉంటాంటిమి” అని మూతి మురిపెంగ తిప్పింది.


*** 


మల్లో యాడాది పోయెటాల్లకు ఆదిరెడ్డికి హైద్రాబాదుల పెద్ద, పెద్ద దుకాణాల సేట్లు.. బడ, బడా రాజకీయ నాయకులు ములాఖతైండ్లు.


కొన్ని ఆఫీసులల్ల ఏ.సీ. లు పెట్టినప్పుడు వాల్ల ఇంజనీర్లు బాగున్నయని సర్తిఫికెట్ ఇత్తెనే పైసలత్తై. ఆదిరెడ్డి పనితనం సూసి ఇంజనీర్లు మెచ్చుకునేటోల్లు. ఒక ఇంజనీరు మెచ్చుకునుడే కాదు.. ఆదిరెడ్డికి ఇంకో మంచి రాస్తాల పడెయ్యాలనుకున్నడు ఆయన పేరు శ్రీనివాసరావు. ఆదిరెడ్డి మాటతీరు.. మర్యాద తీరు సూసి శాన దగ్గరయ్యిండు. ఇంటి సంగతులన్ని తెల్సుకున్నడు. ఆయనకు వేరే ఏ.సీ. కంపెనీల మేనేజర్లు దోస్తులున్నరు.


ఒకరోజు ఆదిరెడ్డితోటి ఇదే మాట తీసిండు హోటల్ల భోజనం చేసుకుంట..


“ఆదిరెడ్డీ.. నువ్వు కాంతయ్య దగ్గర కట్టబడుతానవ్.. అదే కాంతయ్య జాగల నువ్వున్నవనుకో.. కొంచెం కట్టం తగ్గుతది.. నిగరాని పెరుగుతది. నువ్వే నలుగురికి పని ఇచ్చినట్టయితది. ఆదాయం సుత పెరుగుతది.


కొన్ని రోజులు పోతే.. మీ ఇంట్లకు ఇద్దరు కొత్త  మనుషులు వత్తరు. ఖర్సులు పెరుగుతై. నిజమా.. కాదా..” అని అడిగిండు శ్రీనివాసరావు.


మొదలు ఇద్దరు కొత్త మనుషులు అంటే ఆదిరెడ్డికి అర్థం కాలేదు కాని అర్థం కాంగనే నవ్విండు. తనకు తమ్ముకనికి పెండ్లాలు వత్తరు కదా..


“సార్.. కాంతయ్య సారు జాగల అంటే మాటలా..! నావల్ల ఏమైతది” అన్నడు ఆదిరెడ్డి.


“నాకు తెలిసిన జిగ్రీ దోస్తు ‘ఓ - జెనెరల్’ ఏ.సీ. కంపెనీల ఉన్నడు. కొంచెం తక్కువ డిపాజిట్ తోని నీకు డీలర్ షిప్ ఇప్పిత్త. ఒక అఫీసు పెట్టుకో.. ఏ.సీ.లు తెచ్చుకొని అమ్ముకో.. నీకు హైద్రాబాదుల నీకు మంచి పేరున్నది. ఆ పేరు వాడుకో..” అని సలహా ఇచ్చిండు శ్రీనివాసరావు. 


“డిపాజిట్ అందాజ ఏమాత్రముంటది సార్”


“పది లక్షల దాకా దాకా ఉంటది గాని.. తోడం తగ్గియ్యమని  ఒప్పిత్త” అని భరోస ఇచ్చిండు శ్రీనివాసరావు. “కావాలంటే నేను జమానత్ పడ్త”


ఇద్దరు వాష్ బేసిన్ల చేతులు కడుక్కున్నరు. ఆదిరెడ్డిని బిల్లు కట్టనియ్య లేదు. శ్రీనివాసరావే కట్టి బయటకు వచ్చుకుంట ఏమంటవ్ అన్నట్టు ఆదిరెడ్డిని సూసిండు.


“సార్.. నేను మా మామయ్యనడిగి ఏ సంగతి చెబుతా..” అన్నడు ఆదిరెడ్డి.


“సరే.. తొందరగా నిర్ణయం తీసుకో.. మల్ల సీజన్ వత్తాంది” అని ఆదిరెడ్డి ఈపు తట్టి కార్ల ఎల్లిపోయిండు శ్రీనివాసరావు.


ఆదిరెడ్డి బండి తీసుకొని సక్కంగ సురేందర్ ఇంటికి పోయిండు. ప్రమీల చాయె తెచ్చిచ్చింది.


“సదువు ఎందాక వచ్చింది అత్తమ్మా..” చాయె తాక్కుట అడిగిండు ఆదిరెడ్డి.


“బాగానే సదువుతాన. తప్పకుండా పాసైత.. ప్రైవేటు బల్లె సదువుసుత చెప్తాన..” అన్నది ప్రమీల నవ్వుకుంట.


ఆదిరెడ్డి నోరు తెర్సిండు. ప్రమీల కట్టపడుడు సంబురపడ్డడు.

No comments:

Post a Comment

Pages