చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 26 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 26

Share This

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 26

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
ఆంగ్ల మూలం : The moonstone castle mistery
నవలా రచయిత : Carolyn Keene
 

(కర్సన్ డ్రూ పేరు వినగానే పడవ దొంగతనం నేరంపై అరెస్టు అయిన నాన్సీ బృందం వదిలివేయబడతారు. అక్కడ నుంచి వారు చంద్రమణి కోటలోకి వెడతారు. అక్కడ మూసి ఉన్న ఒక గది తలుపు తెరవగానే, గబ్బిలాలు వారిపై దాడి చేస్తాయి. వాటిని తప్పించుకోవడానికి ఆ బృందం కకావికలై పరుగెడుతుండగా, నాన్సీ ఆ చీకటి గదిలోనుంచి ఒక వ్యక్తి బయటకు రావడం గమనిస్తుంది. అతన్ని పట్టుకోవడానికి నెడ్, నాన్సీ తలొక దిక్కుకు పరుగెడతారు. తరువాత .....)
@@@@@@@@@@@

ఇద్దరూ తలోదిక్కుకు పరుగెత్తారు. కొన్ని క్షణాల్లో నాన్సీ ఒక తెరిచి ఉన్న తలుపు దగ్గరకొచ్చింది. ఆమె ముందు భూతలాని(సెల్లారు)కి వెళ్ళే ఒక వృత్తాకారపు మెట్లమార్గం ఉంది. అవి రాతి మెట్లు కాగా, దాని గోడలు మాత్రం సింధూర ఫలకాలతో చేయబడ్డాయి.

"ఆ మనిషి ఖచ్చితంగా సెల్లార్ లోకే దిగి ఉంటాడు" నాన్సీ నిర్ణయించుకొంది. "మొదటిసారి ఈ అంతస్తుని పరిశీలించినప్పుడు ఈ తలుపు తెరుచుకోలేదు" అంటూ ఆమె తలుపు వైపు చూసింది. హాల్లో ఉన్న తలుపు పలకలతో యిది సరిగ్గా సరిపోలింది. ఈ విషయాన్ని మొదటి చూపులో గమనించకపోయి ఉండొచ్చు. ఖచ్చితంగా శోధకులు దీన్ని తప్పిపోయారు.

నాన్సీ ఆలకించటానికి ప్రయత్నించగా, కిందనుంచి క్రీక్ మన్న శబ్దం ఆమెకు వినిపించింది. ఆ బుగ్గ మీసాలవాడు యిప్పుడే సెల్లార్ కి చేరుకొని ఉంటాడా, లేక అతను ఏదో చోట దాక్కోవటం వల్ల ఈ తలుపు శబ్దం వచ్చిందా?

ఆ క్షణంలో నెడ్ ఆమెను కలిసాడు. అతనికి ఆమె కిందకు చూపించింది. "అతను కింద ఉన్నాడనుకొంటున్నాను. పద వెళ్దాం!" నాన్సీ గుసగుసలాడింది.

నెడ్ ఆమె భుజంపై చేతినుంచి ఆపాడు. "నువ్వు కాదు, నేను వెళ్తాను."

అప్పుడే నాన్సీ క్రింద ఎంత చీకటిగా ఉందో గ్రహించింది. "నీకు దారి కనిపించదు" అందామె.

నెడ్ యికిలిస్తూ ఫాంటు జేబునుంచి ఫ్లాష్ లైటుని బయటకు లాగాడు. "గూఢచర్యంలో ఈ మాత్రమే నువ్వు నాకు నేర్పించావు. చేతిలో దీపం లేకుండా వెతకటానికి వెళ్ళొద్దు. నేను ముందు వెళ్తాను. అంతా సవ్యంగా ఉంటే, నువ్వు అనుసరించు" చెప్పాడతను.

వంపులు తిరిగిన మెట్లదారిని నెడ్ మెల్లిగా కిందకు దిగుతున్నాడు. ప్రస్తుతం అతను కనుమరుగయ్యాడు. నాన్సీ ఆత్రుతగా ఎదురుచూస్తోంది. బుంగమీసాల వాడు గానీ, యితర వ్యక్తులు గానీ నెడ్ పై దాడి చేయకూడదని ఆశ పడుతోంది.

"ఒకే!" ఒక్క క్షణం తరువాత అతను పిలిచాడు. "ముందుకు రా!"

నాన్సీ కిందకు దిగటం ప్రారంభించగానే, నెడ్ ఆ వ్యక్తి కోసం వెతకటం మొదలెట్టాడు. అకస్మాత్తుగా నాన్సీ మెట్లు దిగటానికి చాలా సమయం తీసుకుంటోందని గ్రహించాడు.

"నాన్సీ!" పిలిచాడతను. "ఏమైంది?"

సమాధానం లేదు. భయపడి, కంగారుగా మెట్ల దగ్గరకు వచ్చాడు. నాన్సీ మెట్ల మీద కనిపించలేదు. కానీ అతను మొదటి అంతస్తు చేరుకొన్నప్పుడు, ఆమె అక్కడ ఎక్కడా లేదని కనుగొన్నాడు.

బెస్, జార్జ్, మిగిలిన కుర్రాళ్ళు కంగారుగా అతని దగ్గరకొచ్చారు. "నాన్సీ ఎక్కడ?" వాళ్ళంతా ఊపిరి ఒక్కటిగా అడిగారు.

"నాకు తెలియదు" నెడ్ భయంగా చెప్పాడు. తరువాత తను ఆమెను ఎక్కడ వదిలిపెట్టాడో చెప్పాడు.

"అది జరిగి ఎంతసేపైంది?" బెస్ వెంటనే అడిగింది.

"ఎందుకు, కేవలం అయిదు నిమిషాలే!"

"అప్పుడామె మెట్లపైకి రాలేదు, లేదా ఆమె దానికి దగ్గరలో ఎక్కడా లేదు" బెస్ చెప్పింది. "లేకపోతే, మేము ఆమెను చూసేవాళ్ళంగా!"

యువజనులు అయిదుగురు ఒకరినొకరు చూసుకొన్నారు. భయం వారిని గుప్పిట్లో పెట్టుకొంది. నాన్సీకి ఏమి జరిగింది?
@@@@@@@@@@@@@@@

"నేను నాన్సీని ఒంటరిగా వదిలిపెట్టకుండా ఉండాల్సింది" ఆమె అదృశ్యానికి తనను తాను నిందించుకొంటూ అన్నాడు నెడ్.

"దీని గురించి స్పష్టంగా మాట్లాడుకొందాం" అంది జార్జ్.

ఈ బృందం ఆ పరిస్థితి గురించి అనేక నిమిషాలపాటు చర్చించి, నాన్సీ కోటను విడిచిపెట్టి ఉండదని తీర్మానించారు.

"ఆమె మేడ మీదకు వెళ్ళలేదు కాబట్టి," జార్జ్ చెప్పింది, "యిక మిగిలిన ఒకే ఒక స్థలం సెల్లార్లో ఆమె ఉండి ఉండాలి."

“అయితే నేను ఆమెను ఎందుకు చూడలేదు?” నెడ్ వాదించాడు. "అమ్మాయిలంతా యిక్కడే వేచి ఉండమని నేను సూచిస్తున్నాను. బర్ట్, డేవ్, నేను ఫ్లాష్ లైటుతో కిందకు వెళ్ళి, మేము ఏమి కనుక్కోగలమో చూస్తాం."

నెడ్ తన స్వరంలో ప్రశాంతత కోసం ప్రయత్నిస్తున్నాడు కానీ మిగిలినవారికి అతనెంత కలత చెందాడో తెలుస్తోంది. అతను ముందు దారి తీయగా, కోట నేలమాళిగలోని చీకట్లో అబ్బాయిలు అదృశ్యమయ్యారు.

బెస్, జార్జ్ మెట్ల మీద నిలబడి, నాన్సీ మళ్ళీ కనిపిస్తుందన్న ఆశతో, పొడవైన వరండా ఆ చివరనుంచి ఈ చివర వరకూ చూస్తున్నారు. భయంతో జార్జ్ ముందుకి, వెనక్కి పెద్ద పెద్ద అడుగులతో తిరుగుతోంది. బెస్ రుమాలుతో నీళ్ళు నిండిన కళ్ళను తుడుచుకొంటున్నది. చివరకు జార్జ్ ఆగింది. "నేను దీన్ని ఎక్కువసేపు తట్టుకోలేను. అబ్బాయిలు ఈపాటికే వెనక్కి వచ్చి ఉండాలి. బహుశా వాళ్ళకి కూడా ఏదో జరిగి ఉండాలి!"

ఆమె మెట్లదారిని సెల్లార్లోకి దిగబోయింది. బెస్ వెనుకే వెళ్ళి ఆమె చేతిని పట్టుకొని ఆపింది. "మనమంతా పట్టుబడితే, సాయం అడగటానికి వెళ్ళేది ఎవరు?" అని అడిగింది.

"నువ్వన్నది నిజమే!" జార్జ్ అంగీకరించింది. "కానీ నాన్సీకి ఏమి జరిగిందో? ఆమె ఈ సన్నని గాలిలో అదృశ్యమై పోయినట్లు అనిపిస్తోంది."

బెస్ పెద్దగా నిట్టూర్చింది. "ఎవడో ఆమెకు పంపిన చంద్రమణి నాన్సీకి ఖచ్చితంగా సాయపడటం లేదు. ఇది ఆమెకు దురదృష్టాన్ని తెచ్చిపెట్టిందని నేను చెబుతున్నాను."

బెస్ మాట్లాడటం ఆపగానే, అమ్మాయిలిద్దరూ ఎవరో గొణుగుతున్నట్లు వినిపించి ఉలికిపడ్డారు. అది అక్కడ గోడలోంచి బయటకు వస్తున్నట్లు అనిపించింది!

కజిన్లిద్దరూ ఒకరినొకరు పట్టుకొన్నారు. ఎక్కడిదీ ధ్వని? ఇద్దరు అమ్మాయిలు తమ వెనక్కి తిరిగి చెక్క పలకలు బిగించినట్లున్న గోడను తదేకంగా చూసారు. చెక్క గోడ వెనుక ఎవరైన దాక్కోవటం సాధ్యమేనా? అక్కడ ఎవరో ఉన్నారని జార్జ్ తీర్మానించింది. ఆ వ్యక్తి నాన్సీ కాదు కదా!. . . .చిక్కుకొని, గాయపడి, ఒక బందీగా? ఆమెతో ఎవరో ఉండి, తను అరవకుండా ఆపుతున్నారా? దానికి జవాబు అమ్మాయిలు తప్పకుండా కనుక్కోవాలి!

తన చేతులను కదిలిస్తూ జార్జ్ ఒక ఉపాయాన్ని సూచించగానే, బెస్ తలూపింది. జార్జ్ సెల్లార్లోకి వెళ్ళి అబ్బాయిలను కనుక్కోవటానికి ప్రయత్నించాలి. వాళ్ళ సాయంతో ఈ గోడను బద్దలుకొట్టాలి.

ఒంటరిగా ఉండటానికి బెస్ కి భయం వేస్తున్నా, ఆమె అంగీకరించింది. ఆమె గుండె విపరీతమైన వేగంతో కొట్టుకోసాగింది.

జార్జ్ కాలి మునివేళ్ళపై నడుస్తూ మిగిలిన మెట్లు దిగి కిందకు వెళ్ళింది. తన కళ్ళు చీకటికి అలవాటు పడ్డాక, ఆమె ముందుకు నడవటం ప్రారంభించింది. ముగ్గురు అబ్బాయిలు తిరిగి రావటం చూసి, ఆమె ఉపశమనాన్ని పొందింది. వారికి ఎలాంటి హాని జరుగలేదు.

"నువ్విలా కిందకు రావటం ప్రమాదం. నువ్వు పైన ఎందుకు ఉండలేదు?" తిడుతున్న ధోరణిలో మాట్లాడాడు బర్ట్.

జార్జ్ అతని ప్రశ్నను పట్టించుకోలేదు. కానీ వెంటనే బెస్, తను విన్నది ఏమిటో వాళ్ళ వద్ద మెల్లిగా గొణిగింది. "మనమంతా పైకి మునివేళ్ళపై వెళ్ళాలని సూచిస్తున్నాను. మీ అబ్బాయిలంతా సణుగుడు వినిపిస్తున్న చోట గోడను పరీక్షించాలి. అక్కడ లోపలేదో ఘర్షణ జరుగుతోంది."

జాగ్రత్తగా నలుగురు మెట్లెక్కారు. నెడ్ ఫ్లాష్ లైటు వెలుతురిని చెక్క పలకల గోడ మీద ప్రసరించాడు.

అకస్మాత్తుగా రెండు పలకల మధ్య రహస్య కవాటం, ఎవరికీ కనిపించకుండా ఉన్న దాని గొళ్ళెం కనిపించాయి. బెస్, జార్జ్ లను మెట్ల వద్దకు వెళ్ళమని అతను దారి చూపించాడు. తరువాత ఫ్లాష్ లైటుని ఎత్తి పట్టుకొని, కాంతిని తలుపు మీద కేంద్రీకరించగా, బర్ట్, డేవ్ చప్పుడు కాకుండా గొళ్ళాన్ని తీసి తలుపుని బలంగా లాగారు.

(సశేషం)

No comments:

Post a Comment

Pages