మాయ జూద నిపుణుడు "శకుని" - అచ్చంగా తెలుగు

మాయ జూద నిపుణుడు "శకుని"

అంబడిపూడి శ్యామసుందరరావు 


గాంధారికి తమ్ముడైన శకుని అసలు పేరు సుభలోత్తముడు. శకుని మహాభారతములో చాలా కీలకమైన పాత్ర.  దుర్యోధనుడు దుశ్శాసనుడు , కర్ణుడు,శకుని ఈ నలుగురిని కలిపి భారతములో దుష్ట చతుష్టయము అంటారు. అంటే భారతములో జరిగే అన్ని అరిష్టాలకు వీరే కారణము అవుతారు. 

అపారమైన తెలివితేటలు కల్గిన శకుని పుట్టుకతోనే కుంటివాడు కాదు. మన సినిమాలలో చూపించినట్లు బలహీనుడు కాదు. మన సినిమాలు చూసి శకుని అంటే పాత తరము నటుడు సీఎస్ ఆర్ గుర్తుకు వస్తాడు. తండ్రి సుబల చేసిన గాయం.వల్ల శకుని కుంటి  వాడు అవుతాడు. పుట్టుకతోనే అంధుడైన ధ్రుతరాష్ట్రుడికి గాంధార రాజు సుబలుని కుమార్తె గాంధారిని భార్యగా చేయాలని భీష్ముడు భావించాడు.ఈ లోపాన్ని మాత్రం భీష్ముడు తెలియనీయకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ లోపం వల్ల అతడితో వివాహానికి ఏ స్త్రీ అంగీకరించదని భీష్ముడు అసలు నిజాన్ని దాచిపెట్టాడు. 

తన సోదరి గాంధారి అంటే శకునికి చాలా అభిమానం. ధ్రుతరాష్ట్రుడి లోపాన్ని భీష్ముడు దాచిపెట్టడంతో సుబలుడు ఆగ్రహించాడు. అందుచేతనే శకునికి చివరిదాకా భీష్ముడు అంటే కోపము. ఈ విపత్తు నుంచి తప్పించాలంటే గాంధారికి మేకతో వివాహం జరిపించాలని జ్యోతిషులు సూచించారు. వివాహం తర్వాత ఆ మేకను బలిస్తే ఆమె వితంతవుగా మారుతుంది. అప్పుడు ధ్రుతరాష్ట్రుడిని వివాహం చేసుకుంటే ఆయన గాంధారికి రెండో భర్త అవుతాడని సలహా ఇచ్చారు. జ్యోతిషుల చెప్పిన విధంగా గాంధారికి ముందు మేకతో పెళ్లి జరిపించి దాన్ని బలిచ్చారు.

తాను వితంతువైన గాంధారిని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకున్న ధ్రుతరాష్ట్రుడు తీవ్ర ఆగ్రహం చెందాడు. ఆ కుటుంబాన్ని చెరసాలలో బంధించి మరణించేవరకు చిత్రహింసలకు గురిచేయాలని ఆదేశించాడు. ఈ సంఘటన జరిగేనాటికి శకుని చాలా చిన్నవాడు. కౌరవులపై ప్రతీకారాన్ని నిరంతరం గుర్తుచేయడానికి

సబలుడు శకుని కాలి ఎముకను విరిచి అవిటివాడిగా మార్చాడు శకునిని అతని అన్నలనూ కౌరవులు ఒక చెరసాలలో బంధించి, వారికి రోజూ ఒక్క మనిషికి సరిపోయే ఆహారం మాత్రం ఇస్తారు. కౌరవుల మీద ఎలా ఐనా ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్న శకుని సోదరులు తమ భాగం ఆహారాన్ని కూడా శకునికి ఇచ్చి, తమ పగ తీర్చమని ప్రమాణం చేయించుకుంటారు. తదుపరి ఒక్కొక్కరుగా మరణిస్తారు.

శిక్ష అనంతరం బయటపడిన శకుని దుర్యోధనుని పొగుడుతూ, అతనికి అండగా మంత్రి స్థాయిలో ఉంటూ అతడి దురాలోచనలకు ఇతడు సహాయం చేస్తుండేవాడు. ఇతడే ధర్మరాజుని మాయా జూదంలో ఓడించింది. వనవాసము చేయుచున్న పాండవులను ఏదో విధంగా చంపమని దుర్యోధనునుకి బోధించినది కూడా ఇతడే. శకుని పాచికల ఆట లేదా చౌసర్ అని పిలిచే ఆటలో నిపుణుడు.శకుని చేతిలోని పాచికలు అతని తండ్రి సుబలుని తొడ ఎముకలనుండి తయారు చేయబడినవి అని చెపుతారు శకుని ఈ పాచికలతోనే ఒక పాచిక ఆటను ఏర్పాటు చేసి అందులో యుధిష్ఠిరుని రాజ్యాన్ని, అతని సోదరులు-భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు, యుధిష్ఠిర కూడా గెలిచారు.

తరువాత ద్రౌపదిని కూడా గెలిపించాడు. దుర్యోధనుని ఆజ్ఞలపై దుశ్శాసనుడు ద్రౌపదిని బట్టలు విప్పడానికి ప్రయత్నించాడు కానీ కృష్ణుడు ఆమెను రక్షించాడు. ఈ మాయ జూదమే యుద్ధానికి దారితీసింది శకుని జూదములో మాత్రమే గాకుండా యుద్దములో కూడా ప్రావీణ్యుడు. అందుచేత యుద్దములో కూడా ఇతని పాత్ర ఉంది.  కురుక్షేత్ర సంగ్రామములో 18వ రోజు వరకు యుద్దములో ఉన్న కౌరవ యోధులలో శకుని ఒకడు  చివరగా సహదేవుని చేతిలో హతుడవుతాడు.  శకుని 100 రకాల మాయ యుద్ధ కళల లో ప్రవీణుడు శకుని తన మాయను యుద్దములో అర్జునిడి పైన ప్రయోగిస్తాడు. అప్పుడు అర్జునిని పై అన్ని వైపులా నుండి అనేక రకాల ఆయుధాలు బాణాలు ఒకే సారిగా పడతాయి తన మాయతో ఒకసారి యుద్దములో అర్జునుడి రధము చుట్టూ చీకటిని కలుగేటట్లుగా భ్రాంతిని కలుగజేస్తాడు. 

అప్పుడు అర్జునుడు తన జ్యోతిష్క అనే అస్త్రముతో చీకటిని మాయము చేస్తాడు. అలాగే రకరకాల భ్రాంతులను కలుగజేసి అర్జునిడిని నిరోధించాలని చూస్తాడు. కానీ అర్జునుడు శకుని మాటలను పటాపంచలు చూసేటప్పటికి శకుని పారిపోతాడు. ఒకసారి యుద్దములో శకుని సాత్యకి రధాన్ని నాశనము చేస్తాడు.ఇంకొకసారి శకుని పాండవుల అశ్వ దళాన్ని నాశనము చేస్తాడు.

మరోసారి కర్ణుడిని భీముడి బారి నుండి రక్షిస్తాడు. శకునితో పాటు శకుని కుమారులు ఉలుక మరియు వృకాసురులు కూడా కురుక్షేత్ర యుద్దములో పాల్గొని శకునికన్నా ముందే పాండవుల చేతిలో హతులవుతారు.కేరళలోని కొల్లాం జిల్లాలోని పవిత్రేశ్వరం వద్ద శకునికి ఆలయం ఉంది అక్కడి కురవార్ జాతికి చెందిన ప్రజలు శకునిలో సుగుణాలున్నాయని నమ్మి కొలుస్తారు.

No comments:

Post a Comment

Pages