పాపము బుణ్యము పరగ నొకట నదె - అచ్చంగా తెలుగు

పాపము బుణ్యము పరగ నొకట నదె

Share This

పాపము బుణ్యము పరగ నొకట నదె

(అన్నమయ్య కీర్తనకు వివరణ)

డా. తాడేపల్లి పతంజలి 

రేకు: 0337-05 సం: 04-218


పల్లవి:

 పాపము బుణ్యము పరగ నొకట నదె

వోపినవారలు వొడిగట్టెడిది


చ.1: 


నాలుకతుదనే నానారుచులును

నాలుకదే హరినామమును

పోలింప నొక్కటి భోగమూలము

మూల నొకటది మోక్షమూలము


చ.2: 


మనసున నదివో మగువలమోహము

అనుగుమనసుననె హరిచింత

పనివడి యొక్కటె ప్రపంచమార్గము

కొననొకటే వైకుంఠమార్గము


చ.3:

వెలుగుజీకటియు వెస నొకనాడే

కలిగెనట్ల నివి కలిగినవి

యిలలో శ్రీవేంకటేశు మాయొకటి

తలప నొక టతనిదాసులసుగతి


భావం


పల్లవి:

పాపము పుణ్యము ఒకటే.

ఓర్చుకొనే వారు అంగీకరించటానికి సిద్ధపడేది ఈ పాప పుణ్య సిద్ధాంతం.


చ.1:


నా నాలుక చివర  నానారుచులు ఉన్నాయి.

నా నాలుక మొత్తం  హరినామముతో నిండి ఉన్నది.

పోల్చగా మొదటిది(నానారుచులు)  భోగమూలము.

రెండవది (హరినామము)మోక్షమూలము.


చ.2:


అదిగో ! నా మనసున మగువలపై వ్యామోహమున్నది.

ఆ మనసులోనే  శ్రీ హరి గురించి ధ్యానము ప్రియముగా ఉన్నది.

అందులో మొదటిది(మగువలపై వ్యామోహము)  ప్రపంచమార్గము వైపు నడిపిస్తుంది.

 చివరిది (శ్రీ హరి గురించి ధ్యానము ) వైకుంఠమార్గము వైపు నడిపిస్తుంది.



చ.3:


వెలుగు చీకటి-ఈరెండూ - వెంట వెంట  కలిగినట్లే ,( వచ్చినట్లు) ఈ ప్రపంచంలో శ్రీవేంకటేశుని కి సంబంధించిన మాయ, అతని దాసుల సుగతి (మోక్షం) రెండూ వెంట వెంట కలుగుతాయి.(వస్తాయి)

 (భక్తులు గమనించుకోవాలని శరణాగతికోరి మాయా విముక్తులు కావాలని భావం) 

***

No comments:

Post a Comment

Pages