పురాణ కధలు- బసవ పురాణం
                                                                                                           పి.యస్.యమ్. లక్ష్మి
23  మరుదుండుని
కధ
(అనారోగ్య కారణంవల్ల బసవ పురాణంలో
అంతరాయం వచ్చింది.  క్షమించండి.  తిరిగి కొనసాగిద్దాం.)
భగవంతుడంటే భక్తులకెంత విశ్వాసమో, భక్తో, అంతకంటే ఎక్కువ భగవంతుడికి భక్తులంటే
ప్రేమ వుంటుందనీ, వారు తన మీద అలిగితే తాను వారిని సముదాయించ అసమర్ధడననీ శివుడే
తెలియజేశాడీ కధలో.  మరి ఆ కధేమిటో
తెలుసుకుందాము. 
పూర్వం జెంగొండ అనే పట్టణంలో మరుదుండుడనే
గొప్ప శివ భక్తుడుండేవాడు.  ఆయన క్రమం
తప్పకుండా శివ పూజలూ, వగైరాలు చేసేవాడు. 
ఆయన తన ఊళ్ళోనే 12 సంవత్సరాలు విడువకుండా శివరాత్రి దీక్ష నిశ్చలభక్తితో
చేసి 13 వ సంవత్సరం తిరువారూరు అనే గ్రామంలో వల్మీకేశ్వరాలయంలో కొలువై వున్న
వల్మీకేశ్వరుని దర్శించి, అక్కడవున్న శివ భక్తులతో కాలక్షేపం చెయ్యాలనుకుని
వెళ్ళాడు.
ఆ ఊళ్ళోనే నంబ అనే ఒక ధనికుడు
వున్నాడు.  ఆయన గొప్ప శివ భక్తుడేగానీ
వేశ్యాలోలుడు.  మరుదుండుడు
వల్మీకేశ్వరాలయంలో శివ భక్తులతో 
ఇష్టాగోష్టి జరుపుతున్న సమయంలో నంబ తన పటాటోపంతో, అనుచరులతో చాలా వైభవంగా ఆలయానికి
వచ్చి, అక్కడ వున్న శివ భక్తులను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా గర్భగుడిలోకి వెళ్ళి
తనకి ముందు శివ దర్శనం కావాలని అడుగుచుండగా మరుదుండుడు చూశాడు. ఆయనకి నంబ ప్రవర్తన
నచ్చలేదు.  ఎంతో ప్రసిధ్ధిగాంచిన శివ
భక్తులు అంతమంది అక్కడవుండగా వారిని పలకరించకుండా, కనీసం వారివైపు చూడనుగూడా
చూడకుండా .. వారిని అనాదర భావంతో పరిహసించి, సరాసరి గర్భగుడిలోకి వెళ్ళి  శివ దర్శనం తనకే ముందు కావాలని అడగటం ఎంత సాహసం! 
ఇలాంటివారి గర్వాన్ని భగవంతుడు కూడా ఎలా సహిస్తున్నాడు!? 
శివుడలిగిన భక్తుడు కాయగలడు కానీ భక్తుడు అలిగిన శివుడు కాయగలడా?  ఈతని ప్రవర్తనకి ఇక్కడ వున్న భక్తులు అవమానింపబడితే
శివునికే అవమానం కదా! ఈతని సాహసమేమిటో అర్ధంకాకుండా వున్నది.  ముందితనిని బయటకి గెంటండి అని ఇంకొందరితో కలిసి
నంబను బయటకి నెట్టివేయబోయాడు.  
అప్పుడు ఆలయ పూజారి పరిగెత్తుకొచ్చి,
అయ్యా, ఈయననేమీ చేయవద్దు. 
ఈయనెవరనుకుంటున్నారు?  ఈయన ఈ వల్మీకేశ్వరుని
ముద్దుబిడ్డ.  ఈయనతో ప్రతి దినము ఆ దేవుడు
మాట్లాడుతూ వుంటాడు.  అంతేకాదు ఈయనకి
ఈశ్వరుడు ప్రతి రోజూ వెయ్యి నిష్కమములు ఆయన ఇష్టం వచ్చినట్లు ఖర్చు
పెట్టుకోవటానికి ఇస్తాడు.  ఈయనకీ, ఈయన
వేశ్యకీ జగడమయితే ఈశ్వరుడు ఇరువురి మధ్య సామరస్యాన్ని కూరుస్తాడు.  (నాకైతే ఇది నమ్మదగ్గదిగా అనిపించలేదు) అని మరుదండునికి
నచ్చజెప్తాడు.
మరుదుండుడికి ఇది నచ్చలేదు.  భగవంతుడేమిటి భక్తుల నీచకృత్యాలకు
పైకమివ్వటమేమిటి!?  వాటిని
ప్రోత్సహించినట్లుకాదా??  పైగా వారి మధ్య
సంధి చెయ్యటానికి ఆయనే రావాలా!!  ఇలాంటివారిని ప్రోత్సహించిన
భగవంతుడు అసలు భగవంతుడేనా?  ఆయనకి మనము మొక్కాలా? 
ఇలాంటి భగవంతుడు మనకక్కరలేదు. 
ఈయనకి పూజలు చేయనక్కరలేదు.  అందరూ
బయటకి రండి అని మరుదండుడు తన తోటివారినందరినీ గుడి బయటకి తీసుకువచ్చే ప్రయత్నం
చేశాడు. 
ఈ మాటలు విని శివుడు సిగ్గుతో, భక్తుల
ఎదుట వుండటానికి ముఖం చెల్లక, వారిని తప్పించుకుని ఎటు పారిపోవాలో తెలియక చివరికి
సోమసూత్రంనుంచి బయట పడతాడు.  ఆయన వెంట
నంది.  ఎటు వెళ్ళాలో తెలియక అనేక చోట్ల
తిరిగి చివరికి ఒక వనంలో ఒక వృక్షం కింద సేద తీరుతాడు.  అప్పుడు నంది  
స్వామిని అడుగుతాడు  .. “అయ్యా, నీకే ఇంత భయం వుంటే నా గతేమిటి?” అని.  దానికి శివుడు సమాధానం చెప్తాడు. “ ఏం చెప్పను నాయనా, భక్తులు నా
రూపము.  నేను వారి రూపాన్ని.  భక్తులు జంగమ లింగాన్నీ (లింగ ధారులైన శివ
భక్తులు), స్ధావర లింగాన్నీ (ఆలయంలో) పూజించాలి. 
అలాంటి భక్తులు నాకత్యంత ప్రియులు. 
నువ్వు జంగమ లింగానికి విముఖుడవు. 
కానీ నేను భక్తాధీనుడను.  నేను
అలిగితే భక్తులు నన్ను అనునయించగలరుగానీ భక్తులు అలిగితే నేనేమీ చేయలేను.  నేను భక్తాధీనుడను”. 
అని చెప్తాడు.  
భక్తుల చెడు కోరికలను ప్రోత్సహించే
బదులు, వారిని మంచి మార్గంలో పెట్టవచ్చు కదా భగవంతుడు.  ఆయన కారణాలేమిటో మనకి తెలియదు.  భక్తులకి భగవంతుడెంతో, భగవంతుడికి భక్తులంతే
అని చెప్పటానికి ఈ కధలో కొంత కల్పించారేమో అనుకున్నాను ..  ఇప్పటి పరిస్ధితుల దృష్ట్యా.  అప్పటి పరిస్ధితులు మనకి తెలియవు కదా.  ఇది బసవ పురాణంలో మరుదుండుని కధ.
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment