చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 21 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 21

Share This

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 21

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)

ఆంగ్ల మూలం : The moonstone castle mistery

నవలా రచయిత : Carolyn Keene 


(మిస్టర్ వీలర్ కిడ్నాపైన విషయాన్ని విని నాన్సీ స్నేహితురాళ్ళు విస్తుపోయారు. ఎవరో యిద్దరు వ్యక్తులు ఆసుపత్రి సిబ్బంది వేషంలో వచ్చి కిందకు తీసుకెళ్ళారని, అలా వారు అతన్ని కారులో తీసుకుపోయి ఉండొచ్చని విధుల్లో ఉన్న నర్స్ చెబుతుంది. ఆ సమయంలో మిస్టర్ వీలర్ మగతలో ఉండటం వల్ల ప్రతిఘటించలేదు. అతను మగతలో ఉన్నప్పుడు పీటర్ జుడ్ అన్న పేరును పలవరించేవాడని నాన్సీకి తెలుస్తుంది. మిసెస్ హేంస్టెడ్ కి రహస్య వ్యక్తి నుంచి వచ్చిన ఉత్తరం వల్ల నాన్సీ మారుపేరుతో తనతో మాట్లాడుతోందని తెలుస్తుంది. ఈ ఉత్తరాన్ని స్టీమనే వ్రాసి ఉండొచ్చని నాన్సీ అనుమానిస్తుంది. తరువాత. . .)

@@@@@@@@@@@


"మిసెస్ హేంస్టెడ్ కి హెచ్చరిక చీటీని అతనే వ్రాసాడా? అని నాన్సీ చకితురాలైంది.


వృద్ధురాలు చెప్పసాగింది, "మిస్టర్ సీమన్ ఒక రోజు లోపలకు వచ్చినప్పుడు, ఈ పట్టణానికి వస్తున్న నాన్సీ డ్రూ అనే అమ్మాయి కోసం చూస్తున్నానని చెప్పాడు. ఆమె ఎక్కడ ఉందో తెలుసుకోవాలని అతను కోరుకొంటున్నాడు."


"కానీ ఎందుకు?" జార్జ్ ప్రశ్నించింది. "నాన్సీకి అతనితో పరిచయం లేదు."


మిసెస్ హేంస్టెడ్ భుజాలెగరేసింది. "నాకు తెలియదు. మిస్టర్ సీమన్ నీతో డేటింగ్ చేయాలనుకొంటున్నట్లు నటించాడు నాన్సీ! నీ పేరు ఐరిన్ అని నువ్వు నాతో చెప్పినప్పుడు, నువ్వు తప్పకుండా అతనికి మరొక స్నేహితురాలివని నేను ఊహించాను" ముసలామె ఉల్లాసంతో ముసిముసినవ్వులు నవ్వింది. 'ఇదేదో జటిలంగా ఉందే!' అని నాలో అనుకొన్నాను. ఏమైనప్పటికీ, యిదంతా ఏమిటి?"


"మీ ఉద్దేశం ఏమిటి?" నాన్సీ కోపంగా అడిగింది.


మరో కొన్ని సెకన్ల పాటు కోపంతో కుర్చీలో ఊగాక, మిసెస్ హేంస్టెడ్ "నా ఉద్దేశం, నువ్వు యిక్కడే ఉన్నావు, గూఢచారివి, మారు పేరును పెట్టుకొన్నావు, మిస్టర్ సీమన్ నీ గురించి అడుగుతున్నాడు. . . ."


నాన్సీ నవ్వింది. "అదేదో మిస్టర్ సీమన్నే అడగమని నేను సూచిస్తున్నాను. ఏమైనా, అతనే కదా మొదట నా గురించి అడిగినది!"


శ్రీమతి హేంస్టెడ్ ఇంకా తవ్వటానికి ముందే, "అమ్మాయిలూ! నాకు బాగా ఆకలిగా ఉంది. తినటానికి వెళ్దాం" అంది యువ గూఢచారి.


స్నేహితురాళ్ళతో ఆమె భోజనాల గదిలోకి తప్పుకొని, విశ్రాంతి గదికి, తలుపుకి దూరంగా ఒక బల్ల కనిపించటంతో, అటెళ్ళారు. వాళ్ళు తమ చేతి గుడ్డ మడతలు విప్పుతుండగా, "చిక్కుల గురించి మాట్లాడాలంటే, నిమిష నిమిషానికి యీ మిస్టరీ మరింత క్లిష్టమవుతోంది" అని జార్జ్ వ్యాఖ్యానించింది.


"ఆ ఆకాశరామన్న చీటి అన్న ఆలోచనే నాకు నచ్చలేదు నాన్సీ!" అంది బెస్. "నీకేదో ప్రమాదకరమని దీని అర్ధం కావచ్చు."


నాన్సీ నామమాత్రానికి నవ్వింది. "నువ్వు, జార్జ్ నా అంగరక్షకులు. మీరు చెడ్డవైన ఆ పెద్ద తోడేళ్ళ నుంచి నన్ను కాపాడలేరా? మిస్టర్ సీమనే ఆ చీటీని పంపి ఉంటాడని మీకు తెలుసు."


జ్ఞాతులిద్దరూ విచారంగా తలూపారు. ముగ్గురు కొద్దిగానే తిన్నారు. అప్పుడు నాన్సీ, "మనం బ్రాస్ కెటిల్ కి రాగానే, మొదట మిసెస్ హేంస్టెడ్ వద్దకు పీటర్ జుడ్ గురించి తెలుసుకొందామని వెళ్ళినట్లు మీకు తెలుసు. ఈ క్షణం వరకూ దాని సంగతే పూర్తిగా మరిచిపోయాను" అంది.


అమ్మాయిలు తమ భోజనం బిల్లులు చెల్లించాక, తిరిగి విశ్రాంతి గదిలోకి వెళ్ళారు. మిసెస్ హేంస్టెడ్ అక్కడ లేదు. ఆమె మధ్యాహ్న భోజనం ముగించి మేడమీద గదిలో విశ్రాంతి తీసుకుంటోందని వృద్ధురాలి కూతురి ద్వారా జార్జ్ తెలుసుకొంది.


"కానీ కొద్దిసేపట్లోనే ఆమె కిందకొస్తుంది" చెప్పిందామె. "మీరు వేచి ఉంటారా?"


నాన్సీ ఆగుతామని చెప్పింది. అమ్మాయిలు కొన్ని నిమిషాలు కూర్చున్నాక, లేచి పాత ఫాషను గదిలోకెళ్ళి వివిధ రకాల వస్తువులను చూడటం మొదలెట్టారు. నాన్సీ గోడకు వేలాడుతున్న పురాతన పటాన్ని చూడసాగింది. దానిలో స్థానిక ప్రాంతాన్ని చంద్రమణి లోయగా పిలవబడింది. కొద్దిపాటి యిళ్ళు మరియు దుకాణాలు ఉన్న ప్రాంతంగా డీప్ రివర్ చూపబడింది. రెండు వైపులా వీధులు ఉన్న ఆ ప్రాంతంలో మొదటి వీధి చివర, నది వద్ద ఒక పెద్ద మిల్లు ఉంది.


"ఎంత సుందరమైన పట్టణంగా ఉండేది!" అని నాన్సీ అనుకొంది.


ఆ సమయంలోనే మిసెస్ హేంస్టెడ్ తన గదికి తిరిగి వచ్చి, తన పాత ఊగుడు కుర్చీలో కూర్చుంది.


" భోజనం బాగుందా?" అని ఆమె అడిగింది.


"బాగుంది" బెస్ బదులిచ్చింది. "తరచుగా నేనిక్కడే తింటే, పౌండ్ల కొద్దీ బరువు పెరుగుతాను!"


"నా కూతురు యిక్కడ మంచి పేరు తెచ్చుకొంది" వృద్ధ మహిళ గర్వంగా చెప్పింది. "ఎన్నో మైళ్ళ దూరం నుంచి ప్రజలు యిక్కడ కొస్తారు."


"మీరు ఎప్పుడైనా మిస్టర్ పీటర్ జుడ్ అన్న వ్యక్తి గురించి విన్నారా?" నాన్సీ అడిగింది.


"బాగా విన్నాను" మిసెస్ హేంస్టెడ్ వెంటనే బదులిచ్చింది. "చిత్రమైన మనిషి, వయసు మళ్ళిన వాడు."


"చిత్రమా?" నాన్సీ పునరుద్ఘాటించింది.


"ప్రజలు చెప్పుకొనేదదే! పీటర్ జుడ్ రైలు కండక్టరుగా ఉండేవాడు. ఇప్పుడు పదవీ విరమణ చేసి నదికి అవతల చిన్న కుటీరంలో నివసిస్తున్నాడు. కనీసం ఒక ఆత్మ కూడా అతనికి సాయం చేయదు.. . .తన వంట పని, లాండ్రీ పని అతనే చేసుకొంటాడు. అతను నివసించే ప్రాంతమంతా రైలుపట్టాల పోస్టర్లతో నిండి ఉంటుంది.. అతను వాడుతున్న వంటగిన్నెలు, కంచాలు మొదలైనవన్నీ రైల్వే పాంట్రీ కార్లనుంచి తెచ్చేసినవే!"


అమ్మాయిలు ముసిముసి నవ్వులు నవ్వారు. వారి ఆసక్తిని చూసి మిసెస్ హేంస్టెడ్ యింకా చెప్పసాగింది. "మీరు పొరపాటున కూడా అతని యింటిని తప్పిపోలేరు. ఇంటి ముందున్న పచ్చికలో పాతకాలపు రైలుబండి నుంచి తెచ్చేసిన పెద్ద గంట ఉంది. అప్పుడప్పుడు అబ్బాయిలు రహస్యంగా ఆ ప్రాంతంలో ప్రవేశించి దాన్ని మోగిస్తారు. నదికి యివతల ఉన్న మీరు కూడా ఆ శబ్దాన్ని వినవచ్చు!"


"నేను చూడాలనుకొంటున్నాను" అంది నాన్సీ. "అతని యిల్లు ఎక్కడుందో కొంచెం చెబుతారా?"


మిసెస్ హేంస్టెడ్ వాళ్ళను తిన్నగా వెళ్ళి నదిని దాటమని చెప్పింది. అక్కడ పక్కకు తిరిగి, నదీప్రవాహపు దిగువ ప్రాంతం వైపు ఒక మైలు నడిస్తే, వాళ్ళొక రేవుకి చేరుకొంటారు.


అక్కడ గీసిన గూడ్సుబళ్ళ బొమ్మలు ఒక తాడుకి వేలాడుతూ ఉంటాయి.


"అదే అతను నివసించే ప్రాంతం."


అమ్మాయిలు కృతజ్ఞతలతో పాటు గుడ్ బై కూడా చెప్పారు. తక్షణం వారు పడవలు అద్దెకు యిచ్చే చోటికెళ్ళి, వాళ్ళొక చిన్న మోటారుబోటుని అద్దెకు తీసుకొన్నారు. నాన్సీ పడవ స్టీరింగుని అందుకోగా, ఆ చిన్నపడవ నీటిపై దూసుకెళ్ళింది. రేవు నుంచి రెండు వందల అడుగులు వెళ్ళాక, నదీప్రవాహం పోయే దిక్కుగా, మిస్టర్ జుడ్ ఉన్న రేవు ప్రాంతం దిగువకు పడవను పోనిచ్చింది.


వెళ్ళే దారిలో జార్జ్ నీటిలో సగం ములిగిన వీలర్ మోటారుబోటును బెస్ కి చూపించింది.


అది చూసి బెస్ భయంతో వణికింది. "మీరు కొద్దిలో ప్రమాదాన్ని తప్పించుకొన్నారు" అందామె.


"అధికారులు ఈ పడవను ఎప్పుడు బయటకు తీస్తారో అని ఆశ్చర్యంగా ఉంది" జార్జ్ పరాకుగా అంది. "ఇది యితర పడవలకు అడ్డంకి అని నేను అనుకొంటున్నాను."


నాన్సీ కిలకిలా నవ్వింది. "మనం గుద్దుకున్న ఆ రాయంత కాదులే!"


"నాన్సీ! వీలర్ని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు?" బెస్ అడిగింది.


యువ గూఢచారి దగ్గర సమాధానం సిద్ధంగా ఉంది. "జోనీ హోర్టన్ని కిడ్నాప్ చేసిన వ్యక్తుల్లే. వీలర్ ఈ కేసుని తిరిగి తెరిచి, జరిగిన మోసాన్ని వెలుగులోకి తెస్తారని భయపడినట్లు నేను భావిస్తున్నాను.. వాస్తవానికి, మిస్టర్ వీలర్ రిటైరు అయిపోయినా, నాన్న అతని సాయం అడుగుతాడేమోనని వాళ్ళు అనుకొని ఉండవచ్చు."


వాళ్ళు పీటర్ జుడ్ యొక్క రేవుని కనుగొని, పడవను అక్కడ నిలిపారు. వాళ్ళు అతని చిన్న తెల్లని కుటీరం వెళ్ళే బాట మలుపు దగ్గరకి వచ్చిన వేళకి, రిటైరైన రైల్వే గార్డు భారీ యింజను గంటకి సమీపంలోని తోటలో పని చేస్తున్నాడు. గంటను, అతని తోటలోని అందమైన గులాబీపూలను మెచ్చుకొంటూ నాన్సీ అతనితో మాట్లాడింది.


జుడ్ మర్యాదపూర్వకంగా అమ్మాయిలను తన యింటిలోకి ఆహ్వానించాడు. మిసెస్ హేంస్టెడ్ వ్యాఖ్యలకు భిన్నంగా ఆ యిల్లు వాళ్ళకు ఆసక్తికరంగా కనిపించింది. ఖచ్చితంగా చెప్పాలంటే, పీటర్ జుడ్ కూడా విచిత్రమైన వ్యక్తిలా అనిపించలేదు!


మీరు నా గురించి ఎలా తెలుసుకున్నారు?" అని అతను అడిగాడు.


వెంటనే నాన్సీ వీలర్ గురించి, జరిగిన ప్రమాదం, అతని కిడ్నాప్ విషయం అతనితో చెప్పింది.


"ఎంత నీచమైన కుట్ర!" జుడ్ పట్టలేని ఆగ్రహంతో అరిచాడు. "దానికి కారణం ఏమిటని మీరు అనుకొంటున్నారు?"


"అది మేము కేవలం ఊహించగలం" అంది నాన్సీ. "బహుశా మీరు ఈ చిక్కును పరిష్కరించటంలో సాయం చేయగలరు. మిస్టర్ వీలర్ నన్ను, నా స్నేహితురాలైన జార్జ్ ని యిక్కడకు ఎందుకు తీసుకొచ్చాడో మీకు తెలుసా? చాలా సంవత్సరాల క్రితం పరిష్కారమైన మిసెస్ హోర్టన్ ఎస్టేట్ విషయంలో చేయవలసినది ఏదో ఉందని ఆయన సూచించాడు."


తనకు తెలిసిన విషయాన్ని అపరిచితులైన ఈ అమ్మాయిలకు చెప్పటానికి తటపటాయిస్తూ, కొద్ది సెకన్ల పాటు జుడ్ ఆలోచనలో ములిగిపోయాడు.


చివరకు అతను యిలా అన్నాడు : "నేను నమ్మిందే చేస్తాను. జోన్ హోర్టన్ అనే ఆ యువతి తన అమ్మమ్మ డబ్బుల్ని తీసుకొన్నాక వెళ్ళిపోయింది.. . . ఎక్కడకు వెళ్ళిందో ఎవరికీ తెలియదు. మిసెస్ హోర్టన్ చనిపోవటానికి ఆరు నెలల ముందు నా రైల్లో జరిగిన ఏదో విషయం అకస్మాత్తుగా నాకు గుర్తుకొచ్చింది. నేను మిస్టర్ వీలర్ వద్దకెళ్ళి, అతనితో దాని గురించి చెప్పాను. కానీ అతను నన్ను చూసి నవ్వాడు. కానీ యిప్పుడు దానికి, దీనికి ఏదో సంబంధం ఉందని అతను భావించి ఉంటాడు.."


"ఏమిటా కథ?" నాన్సీ ఆసక్తిగా అడిగింది.


***


మిస్టర్ పీటర్ జుడ్ కి దగ్గరగా నాన్సీ, బెస్, జార్జ్ కుర్చీలను లాక్కొని కూర్చున్నారు. కాబట్టి అతను చెప్పబోయే కథలో ఒక్క పదాన్ని కూడా తప్పిపోయే అవకాశం ఉండదు.


అకస్మాత్తుగా నాన్సీ కుర్చీలోంచి దూకి, "ఆగండి!" అని శాసిస్తున్నట్లుగా అని, పక్కకు తిరిగి ముందు తలుపు వైపు పరుగుతీసింది. "అమ్మాయిలూ! మీరు వెనుక ద్వారం గుండా వచ్చి ఆ వ్యక్తిని ఆపండి!" అంటూ తన స్నేహితురాళ్ళకు అరుస్తూ చెప్పింది.


మిస్టర్ జుడ్ ఆశ్చర్యపోయాడు. నాన్సీ చేస్తున్నదేమిటో అతనికి అర్థం కాలేదు, కానీ అతను కిటికీ దగ్గరకు పరుగెత్తాడు. సరిగ్గా అతను చూసే సమయానికి, గట్టు దిగి రేవు వైపు వేగంగా పరుగెడుతున్న ఒక వ్యక్తి వెంట పడ్డ నాన్సీ, తన పరుగు వేగాన్ని పెంచింది.


(సశేషం)

No comments:

Post a Comment

Pages