మరిడయ్యగారి ముటముటలు - అచ్చంగా తెలుగు

మరిడయ్యగారి ముటముటలు

Share This

మరిడయ్యగారి ముటముటలు

భావరాజు పద్మిని

 తిన్నగా నోట్టోంచి మాటేరాదు మరిడయ్యకు. మా నర్సాపురం ఊళ్లో పుట్టి, గోదారి నీళ్లు తాగనోడున్నాడేమో గానీ, మా మరిడయ్య వెటకారాల దెబ్బ తగల్నోడు లేడని అంతా అంటా ఉంటారు.

 

నర్సాపురం సెంటర్లో చిన్న ఆయుర్వాదం కొట్టు మరిడయ్యది. అడపా దడపా ఊరందరికీ అవసరాలుండడంతో ఆయన కొట్టుకు రాక తప్పదు. కానీ సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు, సన్నటి పురికోస తాడును తాపీగా తిప్పుతా పొట్లాలు కట్టే అతని నెమ్మది, ఎవరన్నా కంగారెడితే చేతిలో ఉన్నది కిందామీదా పడేసుకునే అతని హడావిడి, ముందూ ఎనకా చూడకండా ఎటకారాలాడే అతని వాలకం చూసి, విసుగొచ్చేది మా నర్సాపురం వోళ్లకు. దాంతోపాటు ఆ కంగారు మనిషి చేసే కంగాలి పనులకు నవ్వు కూడా వొచ్చీది.

 

నల్లగా ఐదున్నరడుగులుండే మరిడయ్యకు ముక్కుమీద కోపం, దానికితోడు కంగారు, ఆ కంగారు అవతలోడికి కనబడకుండా చేసేందుకాడే ఎటకారాలు, ఈ పప్పులేం ఉడకని వేళలో గాభరా పన్లు... పరిపాటి. వీటన్నిటి వల్లా  తనను చూసి అందరూ పగలబడి నవ్వుతున్నా ఏమీ చెయ్యలేని అసహాయతతో, లోలోపల అగ్గగ్గలాడిపోతా ఉండేవాడు మరిడయ్య.

 

ఆరోజెందుకో జనాలతో కిటకిటలాడి పోతాంది మరిడయ్య కొట్టు. దొరికిందే సందని‌ వచ్చినోళ్లని వచ్చినట్టాడుకుంటన్నాడు మరిడయ్య.

 

'బాబా! సున్నిపిండి కాస్త గమ్మున ఇవ్వండి, నర్సాపురం ఎక్స్ప్రెస్ అందుకోవాల!' బతిమాలతాంది చంకన బిడ్డనేసుకు నిల్చున్న బేబి!

 

'దానికేవుందండి, పన్లోపని మీ చంటాడికి నీళ్లొయ్యమంటారా, ముక్కుచీవిడి తుడవమంటారా? కంగారెడితే ఎలాగండి? టైం పడద్దండి, నిప్పుల్తొక్కిన నిప్పుకోళ్లలా ఎవల్లూ ఒక్క నిమిసం ఆగలేరండి, అయ్యబాబోయ్... ' అంటా చేతిలో కడుతున్న పొట్లాం కోపంగా ఒత్తేసరికి,  చిట్లి, పిండంతా ఎగిరి ఎకాఎకి మరిడయ్య మొహం మీద పడింది.

 

అక్కడున్నవాళ్లంతా ఒక్కపెట్టున నవ్వసాగారు. బేబి చంకనున్న పిల్లాడు మరిడయ్యను చూసి 'అమ్మా! బూచాడే!' అంటూ గుక్కపెట్టి ఏడవసాగాడు.

 

'మరిడయ్యగారూ! త్వరగా ఓ పావుకిలో సీమకరక్కాయలు కట్టివ్వండి,' ఇదేంపట్టనట్టుగా అంది జోస్యుల వారి వీధిలో ఉండే రమాదేవి!

 

అప్పుడే పిండి దులుపుకునొచ్చి, కోపం‌ తగ్గకపోడంతో ఊ, ఆ అనకండా గమ్మునుండిపోయాడు మరిడయ్య.

 

'యాండీ! డావరడంగి ఆకులున్నయ్యా? అర్జంటుగా ఓ వంద గ్రాములిప్పించండీ!' అన్నాడు అప్పటిదాకా నిల్చున్న వేంకటేశు.

 

'పొద్దుటే ఆకలేసి ఉన్నవన్నీ తినేసా. వాటితోపాటు తోకమిరియాలు, ఫిరంగి చెక్కా కూడా ఇమ్మంటారా? వాట్సాపులవీ చూసి అడ్డవైన మందులూ నూరి, ఆళ్లు చెప్పినట్టు చింతగింజంత రోజూ తింటే, వేపకాయంత ఎర్రి కూడా ఎక్కుద్దండి, ఆయ్! ఆనక మీ ఇష్టం!' చేతులు గాల్లో తిప్పుతా, సూరేకాంతంలా మాటాడతాన్న మరిడయ్య హావభావాలకు అంతా పగలబడి నవ్వసాగారు.

 

'మరేం పర్లేదులే మరిడయ్యా! అట్టికెళ్లీది మా అత్తగారికి! ఇప్పటికే ఆవిడకి ఆనపకాయంత తిక్కుంది.‌ మామూలుగా ఉన్నోళ్లకి ఎర్రెక్కుద్దేవో గానీ సగం పిచ్చున్నోళ్లకి కాదుగా! ఇచ్చెయ్యండి చెప్తాను!' అంటున్న వేంకటేశు మాటలకి నవ్వులు మిన్నంటాయి.

 

'ఆ చేత్తోటే నాకు ఓ యాభై రూపాయలు లవంగాలు, ఏలక్కాయలు కట్టివ్వండి మరిడయ్యాగోరూ! అయ్యన్నీ జేబుల్లో ఏసుకుంటే డబ్బులొత్తాయని, ఆయమ్మెవరో ఈడియోలో చెప్పింది!' అడిగాడు రాయ్ పేటలో ఇస్త్రీబండున్న హరనాథ్.

 

'ఈటితోపాటు కాస్త పందార కూడా ఇస్తా, జేబులో ఏస్కోండి! నాలుగు చీవలెక్కినయ్యంటేడబ్బులేవోగానీ, కాసేపటికి ఇహలోకంలో మోక్షం ఖాయం! ఏటీ, ఇమ్మంటారా?' హరనాథ్ మొహంలో మొహంపెట్టి చూస్తా అడిగాడు మరిడయ్య.

 

మరిడయ్య మాటలకు నవ్వాపుకోలేక, అందరి ముందూ నవ్వితే బాగోదని, చేతిలో ఉన్న పుస్తకం మొహానికడ్డం పెట్టుకుని మరీ నవ్వసాగింది మిషనాస్పత్రి నర్సు సూసాన్.

 

ఎవరెంత నవ్వుతాన్నా, మరిడయ్య మాత్రం గంభీరంగా మొహం పెట్టుకుని, ఎటకారాలాడతా తన ధోరణిలో తాను పనిజేసుకుంటా పోతన్నాడు గానీ, కనీసం చిరునవ్వు కూడా నవ్వట్లేదు!

 

రమాదేవి ఓ పావుగంట ఎదురుచూసి, సీమకరక్కాయల కోసం మళ్ళీ తొందరపెట్టింది.

 

'తవరు వంటొండుతాంటే, మజ్జలోనే వడ్డించెయ్ మంటే, ఎలాగుంటదండి? వేగని కూర, కాగని పులుసూ, ఉడకన్నం, తోడుకోని పెరుగుతో బెట్టీది భోజనమవ్వుద్దా? చేసేపని చెయ్యనీకుండా కంగారెడతారేంటి? ఇత్తాను కదా, గమ్మునుండండి!' విసుగుతో వెటకారం కలిపి విసిరుతూ పొట్లాం చేతిలో పెట్టాడు మరిడయ్య.

 

అవతలావిడేవీ తక్కువావిడగాదు‌. "మరిడయ్యని పేరెట్టినందుకు మరిడమ్మలా శివాలెత్తిపోకలాగ! పన్జేసేది తక్కువా ఎటకారాలెక్కువానూ... ఆయ్! నువ్వు మందులమ్మడం మానేసి, కబుర్లమ్ముకో, సరిపోద్ది" టక్కుననేసి మరిడయ్య తేరుకునేలోగా వెళ్లిపోయిందావిడ.

 

'ఇప్పుడేవన్నానని అంత కోప్పడతన్నాదావిడీ?' వెడతన్న ఆవిడనే, నోరుతెరుచుకు చూస్తా, వెనకడుగేసి, వంటాముదం పాకెట్టు మీద కాలేసి, జారిపడ్డాడు మరిడయ్య. జారడం జారడం వెళ్లి అతిమధురం పొడున్న కవరుమీదడి తుమ్ములు మొదలెట్టాడు.

 

'తవుడు మేస్తూ తుమ్మే ఆంబోతులా ఎంతబ్బరంగా ఉన్నావురా అబ్బీ!' పరాచికాలాడారు గాంధీనగర్లో ఉండే గోపాలం గారు.‌ ముక్కుపొడం కొనుక్కోడానికి వస్తుంటారాయన.

 

'ముక్కుపొడుం పీలిస్తే వాతం కమ్ముద్దాండీ? ఇదే సూట్టం.‌ మూలిగే నక్కమీద తాటిపండడ్డట్టు ఎకసెక్కాలు మీరూనూ!' బాధగా మూలుగుతూ అనేసాడు మరిడయ్య.

 

'పొద్దున్నే లేచి అద్దంలో‌ నా మొహం నేనే చూసుకునప్పుడే అనుకున్నా, ఇలాటిదేదో జరుగుద్దని!' తిట్టుకుంటా, లేచి ఇంటికెల్దామని బయల్దేరాడు మరిడయ్య.

 

ఈలోగా పరుగులెడతా వచ్చి, 'బాబ్బాబూ! మా చెల్లెలికి పచ్చకామెర్ల రోగవొచ్చి మూడ్రోజులుగా సలిపేస్తాంది. కాస్తొచ్చి మందెయ్యవా? నీ చేత్తో మందిస్తే రోగం ఎగిరిపోద్ది, ఒక్కసారొద్దూ, చచ్చి నీ కడుపున పుడతాను' అంటా బతిమాలసాగాడు క్రిస్టియన్ పేటలో ఉండే పాస్టర్ ఏసుపాదం.

 

మరిడయ్య కుటుంబం తరతరాలుగా పచ్చకామెర్లకు నాటు మందేస్తుంది. 'ఈ మందు వేసినందుకు రూపాయి తీసుకోకూడదు, మీ వంశపోళ్లకి తప్ప ఎవళ్లకీ ఆ మందు ఎలా కలపాలో చెప్పకూడదు, చెబితే పనిచెయ్యదు' అని మరిడయ్య తాతకు ఆ మంత్రం జెప్పినాయన ఒట్టేయించుకున్నాడంట!

 

ఎంత కంగారెడతన్నా, మెల్లకండా బిక్కమొహవేసుకుని, బిగుసుకునున్న మరిడయ్యను చూసి, విషయమేమిటో అడిగాడు ఏసుపాదం. ఆ రోజు జరిగిన గందరగోళమంతా విని, 'ఓస్, ఇంతేనా? నీకోసం ప్రార్థన చేస్తానుండు', అని మెళ్లో ఉన్న సిలువ పట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు.

 

'పరిశుద్ధుడైన ఓ పెబువా! ఈ మరిడయ్య జారిపడ్డ క్రమంలో మరణించిన క్రిమికీటకాదుల ఆత్మలకు శాంతి కలుగుగాక, ఈ పాపిని క్షమింపుము, ఆమెన్!' అంటూ ప్రార్థన ముగించి, చెయ్యెత్తి దీవించాడు.

 

నడ్డివిరిగి తానేడుస్తుంటే, తన‌కింద పడి చచ్చిన క్రిమికీటకాల ఆత్మలకు శాంతికలగాలని ప్రార్థిస్తున్న ఏసుపాదాన్ని చూసి, అరికాలిమంట నసాళానికంటింది మరిడయ్యకు.

 

'ఇల్లుకాలి ఒకడేడస్తా ఉంటే, చుట్టకి నిప్పడిగాడంట నీలాటోడే! రోజుకి అరకిలో చికెనో, మటనో తింటావుగా! వాటి ఆత్మలకు, వాటి పొట్టలో గడ్డితో పాటే జారి చక్కా పోయే పురుగుల ఆత్మలకు, వాటి గిట్టల కింద నలిగే చీవాదోవా ఆత్మలకు శాంతి కలగాలని ఏనాడైనా ప్రార్థించావా? ఇగో, ఇలా తలతిక్క ప్రార్థనలు చేసావంటే, పంటెక్కించి గోదాట్లో తోసేస్తా, అప్పుడెంచక్కా గోదాట్లో చచ్చిన జలచరాల ఆత్మల కోసం కూడా ప్రార్థన చేసుకోవచ్చు!' కసిరాడు మరిడయ్య.

 

అవసరం తనది కనుక కాళ్లావేళ్లా పడి, బతిమాలి, బట్టలు మార్చుకొచ్చిన మరిడయ్యను తన ఎల్ బోర్డు అంటించిన పాతకాలం లూనా మీదెక్కించుకుని బయల్దేరాడు ఏసుపాదం.

 

'ఎప్పుడో భూమి పుట్టినప్పట్నుంచీ నీ బండికి ఎల్‌ బోర్డు అంటించే ఉంచావు. ఇంకా అత్తెసరు డ్రైవింగేనా ఏసుపాదం?' వెటకారాలాడాడు మరిడయ్య.

 

'ఏటో ఈ బోర్డు దీస్తే కల్సిరాదు నాకు. ఓసారి తీసేస్తే, కోడిపిల్ల బండికిందడింది. ఇంకోసారి నల్లపిల్లి అడ్డవొచ్చింది. మరోసారి ఏకంగా ట్రాఫిక్ పోలీసునే గుద్దాల్సొచ్చింది.‌ ఈ కేసుల నుండి బయటపడి, ఈ ఆత్మలన్నీ నన్ను క్షమించాలని ప్రార్థన జేసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. పురజనుల క్షేమం కోసం జీవితంలోఎప్పటికీ ఎల్‌ బోర్డుగానే మిగిలిపోవాలని నిర్ణయించుకున్నానండి, ఆయ్' తల ఎనక్కి తిప్పి మాట్లాడతా, మలుపులో ముందడ్డంగా ఉన్న గాడిదను చూసుకోకుండా దూసుకుపోతున్న ఏసుపాదం‌ బండి, సరాసరి ఆ గాడిదను గుద్దేసింది. బాధతో ఓండ్ర పెడుతున్న ఆ గాడిద ఏసుపాదం బండెనక కూర్చున్న మరిడయ్యను ఎనక్కాళ్లతో తన్నేసరికి, ఎగిరి మురుక్కాలవలో పడ్డాడు మరిడయ్య.

 

బురదలో పొర్లిన పందిలా లేచి నడిచొస్తాన్న మరిడయ్యను చూస్తా, అంతా నవ్వుతాంటే, ఆ కుదుపుకి జారిపడిన ఎల్ బోర్డు టేపు, కాలికంటుకోగా, కుంటుకుంటా ఎల్లిపోతన్న గాడిదనే కళ్లప్పగించి చూస్తా, ఆ టేపు కోసం ఎమ్మట బడసాగాడు ఏసుపాదం!

 

గాడిద వెంటే పరిగెడతాన్న ఏసుపాదాన్ని చూస్తా ఉంటే, ఎప్పుడూ ముటముట లాడిపోయే మరిడయ్య ముఖంలో కూడా, చీకట్లో నెలవంకలా, ఎందుకో ఆవేళ చిరునవ్వు పూసింది.

 

(మీ నవ్వుల కోసమే... కల్పితం)

No comments:

Post a Comment

Pages