మానసవీణ 35 - అచ్చంగా తెలుగు

                                                  మానసవీణ 35

యలమర్తి చంద్ర కళ
పల్లెలంటే పచ్చని పొలాలతో, చిక్కని అను బంధాలతో ఆత్మీయతలకు నిలయంగా వుండేవి.  ఊరంతా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి వుండేవారు. అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా అన్న, అక్క, అమ్మ, అత్త అంటూ వరసలు కలిపి పిలుచుకుంటూ ఉమ్మడి కుటుంబంలా వుండే వారు.

 ఆ ఆప్యాయతలు, అనుబంధాలు ఏమయ్యాయి? మనుషులు రాక్షసుల్లా ఎప్పుడు మారిపోయారు?

"యాదేవి సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్మై, నమస్తస్మై" అంటూ నిత్యం ఆలయాలలో శక్తి పూజలు జరిగే వేద భూమిలో...

"యత్ర నార్య స్తు పూజ్యంతే తత్ర రమంతే దేవతాః " అని చెప్పబడ్డ రాముడేలిన రాజ్యంలో మళ్ళీ రాముడు పుట్టలేదు. కానీ రావణులు పుడుతూనే వున్నారు. కీచకులకు కొదవేలేదు. స్త్రీని శక్తి రూపిణిగా పూజించే దేశంలోఆమెను భోగవస్తువుగా ఎలా ఊహిస్తున్నారు?

కామం పొరలు కమ్మి ఎలా ఆమెను పరాభవించలనే పశువాంఛ వారిలో ఎలా కలుగుతోంది?” దినేష్ మనస్సులో ఆలోచనల తుఫాను చెలరేగుతోంది.

మానస విషయం తెలిసి ఆమెకు రక్షణగా వుండాలని ఆ గిరిజన గ్రామానికి మకాం మార్చాడు. కాని అక్కడ జరుగుతున్న దారుణాలు, అమానుషాలు తెలుసుకున్న అతని రక్తం మరిగి పోతోంది. “ఏదో చెయ్యాలి. అన్యాయాలను ఆపాలి. ఆడ పిల్లలను రక్షించాలి. మహిళలపై జరిగే ఎటువంటి అన్యాయాలనయనా తమ దృష్టికి తీసుకు రావాలని, అపుడు వారికి తగిన న్యాయం చేయ గలుగుతామని Dsp సరిత  చేసిన ప్రకటన ను పేపర్లో చూసాడు. ఆమెతో చర్చించి ఒక ప్రణాళిక రూపొందించాలని  నిర్ణయించు  కున్నాడు. షీ టీమ్స్ ని రప్పించి ప్లాన్ ప్రకారం ఆముసుగు మనుషుల్ని పట్టించాలి. అప్పలనాయుడి దౌర్జన్యాలు, దురాగతాలు అంతం చెయ్యాలి.”

ఆలోచిస్తూ పగలంతా నిముషం ఖాళీ లేకుండా తిరిగాడేమో, ఇలా నడుం వాల్చగానే అలా నిద్రలోకి జారుకున్నాడు.

 

***

మానస కు మర్నాడు 103 డిగ్రీల జ్వరం వచ్చింది. వళ్ళు కాలిపోతోంది. మంచం మీద నుండి లేవలేక పోయింది. బాగా బెదిరి పోవడం వల్ల రాత్రి నిద్రకూడా సరిగా పట్టలేదు.

టైం ఉదయం 8 గం అయినా ఇంకా నిద్రలేవ లేదని, "మానసా లేమ్మా" అంటూ లేప బోయిన శ్రావణికి మానస వళ్ళు వేడిగా తగిలింది.

ఆమె గాభరా పడిపోయింది. మానసను చంటి పాపను చూసుకున్నట్లు చూసుకుంది. మానసకు శ్రావణిని “అమ్మా!” అని పిలవాలని పించింది. అప్రయత్నంగా పిలిచింది.

"అమ్మా" అని పిలవగానే మానస మానసం‌ ఆనందంతో పొంగిపోయింది. శ్రావణి కళ్ళు శ్రావణ మేఘాలే అయ్యయి.

ఆ పిలుపులోని తియ్యదనం ఇద్దరినీ ఆనంద పారవశ్యంలో ముంచింది.

కాఫీ తనే కలిపి తాగించింది. టాబ్లెట్ వేసింది. వద్దన్నా రెండు ఇడ్లీలు తినిపించింది. మాతృత్వపు మధురిమ శ్రావణి కి అనుభవ మయ్యింది. మానస పరిస్థితీ అలాగేవుంది, తను తన తల్లి వడిచేరినట్లే అనుభూతి పొందింది.

శ్రావణి   మద్యాహ్నం  కూడా మానసకు అన్నం ముద్దలు చేసి తినిపించింది.వారిద్దరూ తల్లీ, కూతుళ్ళు అన్న విషయం తెలియక పోయినా, ఎన్నోఏళ్ళుగా కలిసి వున్నట్లే వున్నారు. మానస మంచం  ప్రక్కనే శ్రావణి కూర్చుని ఆమె పై చెయ్యి వేసి అలాగే కునికిపాట్లు పడింది.

 శ్రావణి ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా కనబడు తోంది. ఆమె ముఖంలో కొత్త కళ వచ్చింది.

వారిద్దరినీ అలా చూసిన రఘు రామ్ కూడా చాలా సంతోషించారు. భార్య ముఖంలో అలాంటి ఆనందం చూసి యుగాలు గడిచాయి అనుకున్నాడు. వాళ్ళిద్దరూ ఎప్పటికీ అలాగే వుండాలని కోరుకున్నాడు.

"దేవుడా వారిని విడతీయవద్దని" వేడుకున్నాడు. మొక్కులు మొక్కాడు..

సాయంత్రం శ్రావణిని చూడడానికి వచ్చిన అనిరుధ్ ని మానస, శ్రావణి గమనించనే లేదు. అనిరుధ్ వారిద్దరి ఆనందానికి అడ్డు కాకూడదని నిశ్శబ్ధంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తానెప్పుడూ చూడని పరవశాన్ని శ్రావణి, మానసల ముఖాలలో  చూసాడు.

*****

భుజంగ రావు గారికి  మనసంతా బాధగా వుంది. పశ్చాత్తాపంతో కన్నీళ్ళు కారుస్తూ ఆడపిల్ల అని ఎలా అలా వదిలేయగలిగానని మధన పడుతున్నాడు. తల్లీ బిడ్డలను వేరుచేసిన పాపం తనకు తప్పక తగులుతుందని విలపించసాగాడు.

"శ్రావణీ నన్ను క్షమించు" అంటూ “ ఆ బిడ్డ ఉండుంటే, మానస అంత అమ్మాయి వుండేది. ఇంట్లో ఆడపిల్ల తిరుగుతుంటే లక్ష్మీదేవి మన ఇంట వున్నట్లే కద. నాకే మయ్యింది అలా సొంత మనవరాలిని చేజేతులా దూరం చేసుకున్నాను. నా పాపానికి నిష్క్రుతి లేదు, ఉండకూడదు.” అనుకున్నారు.

కుడి కాలు, ‌కుడి చెయ్యి వంకర తిరగడం తెలుస్తోంది. తనకు తగిన శాస్తి జరగాలనే కోరుకుంటున్నారు. కాని, తప్పుదిద్దుకునే అవకాసం   ఇమ్మని దేవుడిని ప్రార్ధించాలని అనుకున్నా చెయ్యి కదపలేక పోయాడు. మాట కూడా ముద్దగా వస్తోంది. అది కూడా ఆగిపోతే ఇంక తనుఏమీ చెప్పలేడు. పశ్చాత్తాపంతోనే మరణించ కూడదు. నర్స్ ని పిలిచి, మొబైల్ ఆన్ చేయించి తను చెప్పాలను కున్నది రికార్డు చేసాడు. కొడుకు  కోసం ఎదురు చూస్తున్నాడు.

(ఇంకా ఉంది)

***

No comments:

Post a Comment

Pages