శివం - 86 - అచ్చంగా తెలుగు

శివం - 86

రాజ కార్తీక్  
(రాజు దర్బార్లో విచారణ కొనసాగుతోంది.. ఓపిక లేని హర సిద్ధుని మీద ఆరోపణలు జరుగుతున్నాయి.. ఇంతలో తన తల్లి కూడా వచ్చింది. )


హ సి " దేవుడా  ఏ కన్న తల్లి.. తన కొడుకు  ఇలాంటి అవమానానికి ఎదురవుతుంటే తట్టుకోలేదు.. దయవుంచి ఈ గండం నుంచి గట్టెక్కేందుకు సాయం చేయి. కుంభన్న ఇంక జన్మలో నిన్ను ఏమీ అడగను,"


హర సిద్ధుడి మనసు అవమానభారంతో.. గతి తప్పి పోతుంది.. తను ఎంతో గొప్ప వాడిని అవుతానని, తన జీవితం మారబోతుందని, తన తల్లికి చెప్పాడు.. పౌర్ణమి తర్వాత జరగబోయే సంఘటనలు తన తల్లికి. ఆశ్చర్యంతో కూడిన బహుమతి లాగా ఇద్దామని తాను చెప్పలేదు..


జరుగుతున్న వాదోపవాదాలు వింటుంది ఆ తల్లి.. హర సిద్ధుడు మాత్రం తాను దొంగతనం చేశానని ఎట్లాగయినా సరే ఒప్పుకోవట్లేదు.. క్షమాభిక్ష పెట్టి దేశ బహిష్కరణ చేస్తాము అని ఒక షరతు విధించినా.. తాను ఒప్పుకోవట్లేదు తాను ఎటువంటి తప్పు చేయలేదని మాత్రమే కుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నాడు..


మనం అనుకున్నాం కదా ధనము లేని వారి ఆత్మాభిమానం కూడా పొగరుగా పరిగణింపబడుతుంది అని... ఇంత మంది అధికారులు ఇంత మంది న్యాయాధికారులు ఎంత వాదించినా  మాత్రం తన తప్పు ఒప్పుకోవట్లేదు.. ఎందుకంటే అతను చేయలేదు కాబట్టి!


హర సిద్ధుడు... నిజాయితీ పరుడని అక్కడ ఉన్న అందరికీ తెలుసు.. కానీ ఒక్కరు కూడా ఆ విషయం చెప్పట్లేదు.. అక్కడ అ హర సిద్ధుని చేత సహాయం పొందిన ఇద్దరు కూడా.. అతనికి అనుకూలంగా మాట్లాడితే మనకు ఏమైనా జరుగుతుందా అని భయంతో మౌనం వహించారు..


అయ్యన్న రాజు "తల్లి మీరు భయపడకండి.. మీకు ప్రభుత్వం తరఫున రద్దు చేసిన శిస్తూ మళ్లీ కట్టమని మేము చెబుతాము. ఎందుకంటే మీ కుమారుడు చేసిన ఆలయ పనికి అది చెల్లు. మీరు నిశ్చలంగా ధైర్యంగా ఏం జరుగుతుందో చెప్పండి." 


బరువెక్కిన హృదయంతో కట్టేసి ఉన్న తన కొడుకు దగ్గరికి వెళ్లి మాట్లాడాలని ఆ తల్లి అనుమతి అడిగింది. దానికి అందరూ అంగీకరించారు.


హ సి తల్లి " మహారాజా ఏ తల్లి అయినా తన బిడ్డల గురించి ఇంతే  చెబుతుంది.  నా బిడ్డ మాత్రం నిజాయితీపరుడు, జీవితంలో ఎవరి మాట వినక పోవచ్చు. అందరితో వాదన పెట్టవచ్చు.. తన ప్రయత్నాలు తాను చేసుకున్నాడు కానీ తాను ఎప్పుడూ ధర్మానికి నిలబడ్డాడు. కానీ ఏ రోజు తప్పుడు పనులు చేయలేదు. ఇంత వయసు వచ్చినా, నాకు తెలిసి  ఇది మాత్రం సత్యమయ్య."


తల్లి హృదయం కదా హర సిద్ధుడు.. ఆకలితో ఉన్నాడు అని గమనించింది..


తల్లి తన దగ్గరకు వెళ్ళింది ..."అయ్యా బిడ్డకి గొంతెండి పోయింది నా దగ్గర ఉన్న ద్రవం అతనికి ఇవ్వచ్చు కదా?" అని చెప్పేసి మరచెంబు లాంటి దానితో.. సిరి ధాన్యాలతో చేసిన ద్రవం తాగించింది.. ఎండలో దాహం వేసి పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్లు తాగే బాలుడు ఎలా గుట గుట తాగాడో ఆకలితో ఉన్న సిద్ధుడు అవి అలా తాగాడు.. హర సిద్ధుడి క్షుద్బాధ కొంచెం శాంతించింది..


భక్తులారా! తల్లి ఉన్నంతకాలం ఆకలి తెలియదు. తండ్రి ఉన్నంతకాలం బాధ్యత తెలియదు. కానీ చాలామందికి వీళ్లిద్దరి విలువ తెలియదు.. గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు అంటే సాక్షాత్తు నేనే..


తల్లి కొంగుతో మూతి తుడిచి మంచినీళ్లు తాగించి.."మొన్న నువ్వు ఎక్కడికి వెళ్లావు? ధనం తీసుకొచ్చే నాకు ఇచ్చావు.. ఇక నా జీవితానికి ఇబ్బంది లేదని చెప్పావు రాజు గారి గౌరవం.. అని అన్నావు." 


ఇక హర సిద్దు తప్పక చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.


"అమ్మ... నీ కడుపున పుట్టిన నేను ఎప్పుడు ఏ పాపం చేయలేదు అమ్మ.. నన్ను మెచ్చి ఆ శివుడే కుంభన్న రూపంలో.. నా దగ్గరికి వచ్చి నా చేత ఆయనకు కావాల్సిన విధంగా.. శివలింగాన్ని చెక్కించాడు అమ్మా.. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు.. నా స్నేహితుడిగా వచ్చి నాతో ఆడి పాడి కొన్ని రోజులు కలిసి ఉండి.. నాకు మార్గనిర్దేశనం చేసి.. ఆ రాజ్యానికి తీసుకువెళ్ళాడు అమ్మ.. అక్కడ నాకు గొప్ప ఆదరణ లభించింది.. వారు ఇచ్చిన దక్షిణ డబ్బులే నీకు ఇచ్చాను అమ్మ.. ఇంకా నాకు రావాల్సి ఉంది.. నాకు ఏమైనా నీవు ఆ రాజ్యం లోకి వెళ్లి ధర్మయ్య బాబాయ్ ని కలిసి.. నాకు దక్కవలసిన వన్నీ నువ్వు తెచ్చుకో అమ్మ.. నీ పట్ల తెలిసి.. తెలియక తప్పులు చేశా... వాడు అలా చేసి ఉండకూడదు.. తమ్ముడికి కూడా క్షమాపణలు చెప్పమ్మా. నాకు ఏమైనా అయితే.. ఇక నువ్వు కష్టపడకుండా డబ్బు తెచ్చుకొని హాయిగా బతుకమ్మ.. అందరూ మనవాళ్ళే అనుకోని నోరు జారి మాట్లాడవాకు అమ్మ.. నీ కర్మ కొద్ది నీ కడుపున పుట్టాను అమ్మ.."


అందరూ ఆశ్చర్యపోయారు..


ఇదే జరిగి ఉంటుందని దర్బార్ లో ఉన్న మన హర సిద్దు ని మోసం చేసిన ఆచార్యుడు కూడా నమ్మాడు..


హర సిద్ధుని సాయం పొందిన వారు "శివుడు వచ్చే ఉంటాడు. అంతమాత్రం వాడే ఈ హర సిద్దు" అని ఒక  అమాయక స్థితిలో బయటికి అన్నారు..


హర సిద్దు ను ఇందాక తిట్టినా బంధువు.."దీనికి సాక్ష్యం ఎవరు ఉన్నారు రా?" అని ఎట్లాగైనా తన ను విడుదల చేయించాలని తలంపుతో అడిగాడు.


హర సిద్ధుడు చెప్పిన మాటలు ప్రకారం.. తన తాత కు మాత్రమే ఇది తెలుసు అని, వెంటనే  తాత దగ్గరికి విచారణ కి ఇద్దరు వెళ్లగా, విషజ్వరంతో తాత స్పృహ తప్పి పడిపోయి చికిత్స లో ఉన్నాడు..

"ఏమిటి వీడికి దేవుడు కనపడ్డాడు.. వేల ఏళ్ళు తపస్సు చేస్తే కాని కనపడని దేవుడు.. వీడి కి కనపడ్డాడు. వచ్చి వీడి తో ఆడిపాడారు. వీడిని ఆ రాజ్యం దగ్గరికి తీసుకు వెళ్ళాడా.. బాగుంది ఈ కట్టుకథ.. ఇప్పటిదాకా నోరు విప్పని వీడికి, వాడికి తగిన వాళ్ళను చూడగానే ప్రాణం మీద తీపి  పుట్టింది. అందుకే దేవుడి మీద తోశాడు.. ఒకవేళ మీరు చెప్పేది నిజమే అయినా కూడా మీరు వెళ్లిన రాజ్యం మన వేగులు ప్రకారం గా.. మన శత్రు రాజ్యంతో .. మంతనాలు చేస్తుంది.. ఒకవేళ ఆ రాజ్యము కి వెళ్లి మనం వాకబు చేసినా.. వీడు వాళ్ళకు తోడుదొంగ అయి ఉంటాడు.. అంతా నిజమే అని వీడినొక అబద్ధపు ప్రవక్త చేస్తారు.."


వీళ్ళు చెప్పేది నిజమే అయితే వీడికి సాక్ష్యం చెప్పటానికి సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే రావాలి తప్ప, ఆ రాజ్యం వారు చెప్పినా.. విషజ్వరంతో పడి ఉన్న తాత చెప్పినా వృధా.. ఎందుకంటే ఆ తాత శివుని చూడలేదు కదా! ఇతను పెట్టిన మరో నటుడి ని చూశాడు .." అంటూ అందరు కలిసి ఇలా  తీర్మానించారు..


మంత్రి గారు మాత్రం హర సిద్దు మాటల్లోని నిజాయితీ గమనించాడు..


"మహారాజా! వందమంది నిర్దోషమైన వ్యక్తులని కూడా శిక్షించవచ్చు.. క్షమింప బడుతుంది.. కానీ ఒక మహాత్ముని శిక్షించినా అనవసరంగా అభాండాలు మోపి దూషించినా.. అతని రక్తం నేల తలిగినా.. ప్రకృతి కన్నెర్ర చేస్తుంది.."


చూడబోతే మంత్రిగారికి కూడా హర సిద్ధుని.. వ్యవహారంలో భాగంగా ఉందేమో అని గుంపు పొడిగా.. వెక్కిరించి మంత్రిగారిని మౌనం వహించే విధంగా చేశారు..


తన తన తల్లి హర సిద్ధు చెప్పేది.. నిజమే అని అనుకుంటుంది. కానీ పూజలు చేసి ఆలయాలు సందర్శించే తన చిన్న కుమారుడు కి భగవంతుడు  కనపడతాడు ఏమో కానీ... హర సిద్దు కి ఎలా కనబడతాడనే  ఒక సందిగ్ధం లో ఉంది.. కానీ హర సిద్ధుని వ్యతిరేకులకు మాత్రం తమ మనస్సు చెబుతూనే ఉంది.. అందులో నిజం ఉండొచ్చు తేడా వస్తే పరమేశ్వరుడు  అంతం చేస్తాడేమో అని..


ఎన్ని చెప్పినా.. హర సిద్దు నేరస్తుడు అని తీర్మానించి చివరిగా తప్పు ఒప్పుకుంటే  రాజ్య బహిష్కరణ కి అవకాశం ఇచ్చారు..


కానీ హర సిద్దు తప్పు ఒప్పుకోలేదు..


హర సిద్దు తల్లి మాత్రం " మొండికి పోకు రా! తప్పుకొని తప్పు ఒప్పుకోని  బతుకు రా..రాజ్యం బహిష్కరణ చేసినా ఎక్కడోచోట నీకు చేతనైన పని చేసుకుంటూ ఆనందంగా బతుకు రా.."


హర సిద్దు "నేను తప్పు చేయలేదు అమ్మ.. తప్పుంటే నేను దొంగతనం చేసినట్టు.. నేను తప్పు చేయలేదని నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు.. ఇదే నా కర్మ ఇంతే.. నేను మాత్రం తప్పు ఒప్పుకోను.. నా గురించి తప్పుగా మాట్లాడిన వారి సంగతి భగవంతుడే చూసుకుంటాడు.. మహారాజు గారికి తీర్పు చెప్పే జ్ఞానం లేకపోతే నేను మాత్రం ఏం చేస్తాను?" అని న్యాయం కోసం పోరాడే వాడి గొంతుతో అన్నాడు..


మహారాజు కి కోపం చిర్రెత్తుకొచ్చింది..


"వారు అందరూ అక్కడే ఉన్నారు. నేను అక్కడే ఉన్నాను. ఆ దొంగతనం నేను ఎలా చేస్తాను కొన్ని నిమిషాల్లో.. ఆహారాన్ని ఎలా దాటి వేస్తానని చిన్న కనీస పరిజ్ఞానం ఉన్న చాలు" ఈ తప్పు నేను చేయలేదని చెప్పటానికి నిర్ధారించటానికి..


"ఆవేశంలో ఆలోచన చచ్చిపోతుంది. ఆలోచనలు సరిగ్గా లేకపోతే ఆంతర్యం చచ్చిపోతుంది. ఆంతర్యం బాగా లేకపోతే బుద్ధి చచ్చిపోతుంది. బుద్ధి  బాగు లేకపోతే మనం ఏ పని చేస్తున్నా.. పని  తీరు మొద్దుబారిపోతుంది" అంటూ తన తప్పు ఏమీ లేదని సింహ నాదం చేశాడు.


"శభాష్ హర సిద్ధ!" అని నేను మెచ్చుకున్నాను...


అక్కడి వారందరూ "చూశారా మహారాజా! ధర్మ పరిపాలన చేసే మిమ్మల్ని కూడా ఇలా మాట్లాడుతున్నాడు" అని రెచ్చగొట్టారు..


"తప్పు ఒప్పుకుని క్షమాపణ అడుగరా! కనీసం బతుకుతావు" అని చెప్పి తన తల్లి హర సిద్ధుని గుండెల మీద రెండు చేతులతో బలంగా మోదింది.. పాపo ఆ దెబ్బకి  .. హార సిద్దు గట్టిగా దగ్గాడు.


అయ్యన్న "నీకు ఇక  శిక్ష తప్పదు. నీ చివరి కోరిక ఏంటో చెప్పు.." అన్నాడు.


హర సిద్దు తల్లి గుండెలు బాదుకుంది..


నేను అంతా చూస్తున్నా...


 (ఇంకా ఉంది)


No comments:

Post a Comment

Pages