నూజివీటి శ్రీవేంకటేశ్వర శతకము - ఆయంచ వీరబ్రహ్మాచార్యులు - అచ్చంగా తెలుగు

నూజివీటి శ్రీవేంకటేశ్వర శతకము - ఆయంచ వీరబ్రహ్మాచార్యులు

Share This

నూజివీటి శ్రీవేంకటేశ్వర శతకము - ఆయంచ వీరబ్రహ్మాచార్యులు

పరిచయం:దేవరకొండ సుబ్రహ్మణ్యం 




కవి పరిచయం:
ఆయంచ వీరబ్రహ్మాచార్యులు నూజివీడు పట్టణ నివాసి. ఈశతకమునందు కవి తనను గురించి ఈట్లు చెప్పికొనినాడు.

ఆ. పరమభక్తినాదు గురువరు మునగంటి
కులశశాంకుఁడనఁగ వెలయుఘనుని
వేడుకొందునెపుడు వేంకటరత్నమున్
వేంకటేశ! నూజివీట్పురీశ!

ఆ. వినుతిఁజేతునాదు జననీ జనకుల నా
యంచకులుల వేంకమాంబ శేష
యాభిధానులనుహృదాంబుజముననిల్పి
వేంకటేశ! నూజివీట్పురీశ!

పైపద్యములనుండి ఈకవి మునగంటి వేంకటారత్నం గారి శిశ్యుడని, వేంకమాంబ మరియు  శేషయా వీరి జననీ జనకులని తెలుస్తున్నది.

ఈకవి ఇతర రచనలు కానీ, జీవిత విశేషములు కానీ లభించలేదు.

శతక పరిచయము:

"వేంకటేశ! నూజివీట్పురీశ!"అనే మకుటంతో 100 ఆటవెలదులలో రచింపబడిన ఈశతకం నీతి భక్తి రస ప్రధానమైనది. ఈశతకం నూజివీడు పట్టణంలో వెలసిన శ్రీవేంకటేశ్వరుని సంభోదిస్తు వ్రాసినది.

శతక ప్రారభమున గజాననుని, సర్స్వతినీ ప్రార్థించి ఆపై గురువు తరువాత తల్లితండ్రులను స్మరించి శతకముని ప్రారంభించినాడు.
ఇందు 7 వ పద్యము నుండి 16వ పద్యము వరకు దశావతార వర్ణనము చేసినాడు. కొన్ని పద్యాలను చూద్దాము.

ఆ. కూర్మరూపుదాల్చి కుధరము బైకెత్తి
ప్రోవలేదెమున్ను దేవతలను
దేవ! మమ్మునట్లె ప్రోవంగరాదకో
వేంకటేశ! నూజివీట్పురీశ!

ఆ. పరమభక్తుఁడైన ప్రహ్లాదునేలవే
కఠినచిత్తుఁడైన కనక కశిపు
నాశనంబొనర్చి నరహరివై మున్ను
వేంకటేశ! నూజివీట్పురీశ!

ఆ. ఇరువదొక్కమార్లు నరనాథశిరములు
నఱికిమెట్లగట్టి నాకమునకు
గురునుబంపలేదె పరశురాముడవై
వేంకటేశ! నూజివీట్పురీశ!

శతకమునందు భారత భాగవతాది పురాణములనుండి భగవంటుని లీలలను కీర్తిస్తు చెప్పిన పద్యములు కడు హృద్యముగా ఉన్నవి

ఆ. చక్రి! దంతిరాజు నక్రంబుచే జిక్కి
నీవెదిక్కటంచు నిన్ను వేడ
మకరిఁ బిల్కుమార్చి మనిచితివాతని
వేంకటేశ! నూజివీట్పురీశ!

ఆ. చేరెడడుకులను గుచేలుండు నీకీయ
నతనిలేమిఁ బాపి కుతుకమునను
సకలభాగ్యములు నొసంగిరక్షింపవే
వేంకటేశ! నూజివీట్పురీశ!

ఆ. మానభంగమొదవ గానున్న ద్రౌపది
యన్న! నిన్నువేడుకొన్న సభను
నక్షయముగఁజీర లందించితివిగదా
వేంకటేశ! నూజివీట్పురీశ!

ఈశతకమునందు అనేక నీతిపద్యములను కవి పొందుపరచినాడు.

ఆ. పండితులనుజూచి పరిహసింపఁగరాదు
సాధుజనులకెగ్గు సలుపరాదు
బీదవారినెపుడుఁ బీడింపగారాదు
వేంకటేశ! నూజివీట్పురీశ!

ఆ. తనదు తప్పుఁదాను మనమునందెంచక
పరులతప్పులెన్న నరయువాడు
కారుదున్నపోతు గాక మనుష్యుఁడే
వేంకటేశ! నూజివీట్పురీశ!

ఆ. పరులకెన్ని ధర్మపన్నాగములనైనఁ
జెప్పవచ్చుఁదాను సేయలేడు
నుడివినట్లు నడువఁ గడుఁగష్టమగుఁగాదె
వేంకటేశ! నూజివీట్పురీశ!

ఆ.ఐనవారికాకులందున వడ్డించి
కానివారలకును గంచములను
బెట్టుచుందురెపుడుఁ బ్రియమొప్పఁజెనటులు
వేంకటేశ! నూజివీట్పురీశ!

ఆ. తేలుకొండెకొనకుఁ దేనెరాచిన విస
మెటులపోదొ యటులె కుటిలునకును
నీతిఁగఱపుటెల్ల నిష్ప్రయోజనమౌను
వేంకటేశ! నూజివీట్పురీశ!

ఇటువంటి చక్కని భక్తి, నీతి శతకాన్ని మీరు చదవండి. మీ మిత్రులచే చదివించండి. 

***

No comments:

Post a Comment

Pages