శివం - 85 - అచ్చంగా తెలుగు

 శివం - 85

- రాజ కార్తీక్ 



( రాజముద్ర అపహరణ అభియోగంతో హరసిద్ధుడు ఇప్పుడు ముద్దాయిలా విచారణకు రాజదర్బార్ లో నుంచొని దీనస్థితిలో ఉన్నాడు)

విచారణ మొదలైంది నీరసమైన స్థితిలో ఉన్నాడు హార సిద్ధు..

హర సిద్దు మాత్రం ఎప్పుడూ నన్నే తలుచుకుంటున్నాడు, తనని ఈ స్థితి నుండి బయటపడెయ్యమని.. ఆ తప్పు తాను చేయలేదని.. ఎన్నో అవమానాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎప్పుడూ ఇటువంటి విపత్కర పరిస్థితులకు రాలేదని.. తనకి ధనము లేకపోయినప్పటికీ కూడా తన గుణము చేత సంస్కారం చేత హుందాగా ఉండేవాడు. ఇప్పుడు ఈ యొక్క దానితో వెయ్యి జన్మలకు సరిపడా అపవాదు మూటగట్టుకు ఉంటున్నాడని..
కళ్ళ వెంట నీళ్లతో వేడుకుంటున్నాడు...

"నేను కనపడమని అడగకపోయినా వచ్చి కనబడ్డావు.. ఈ నిముషంలో నన్ను వచ్చి కాపాడు స్వామీ.."అని రెండు చేతులు పైకి కట్టినా కూడా, నిండు మనసుతో ప్రాధేయపడ్డాడు..

అనుక్షణము హర సిద్ధుని గమనిస్తూనే ఉన్నాను.. చూడండి ఏం జరగబోతుందో...

విచారణ బిర్రుగా మొదలయ్యింది..

అయ్యన్న రాజు "చాలించు కపటి.. మర్యాదగా రాజముద్ర తిరిగి ఇచ్చినచో నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టి దేశ బహిష్కరణతో వదిలేస్తాను. అది ఇవ్వనిచో.. రాజ్య శాస్త్ర ప్రకారం.. మరొక వారంలో నువ్వు కోరుకున్న రోజు ఉరిశిక్ష. నీ చివరి కోరిక నెరవేర్చబడుతుంది.."

హర సిద్దు "మహారాజా! ఎన్నిసార్లు చెప్పను నేను ఎటువంటి తప్పు చేయలేదు.. మీతో పాటు నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను ఎక్కడికి పోగలను? మీతో పాటు మీ పరివారంతో పాటే నేను అక్కడ ఉన్నాను, మీకు తెలియకుండా నేను ఏమి చేయగలను.. మహారాజా మితిమీరిన కోపంతో మీరు చిన్న విషయాన్ని మరిచిపోతున్నారు." 

అయ్యన్న రాజకీ కోపం పరాకాష్టకు చేరింది..
"ఏమిటి ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు హార సిద్దా!"

హర సిద్ధుడు తన వాక్పటిమను ఉపయోగించి చల్లగా సమాధానం చెబుతున్నాడు.. సమాధానం లేక రాజుకి మరింత చిర్రెత్తుకొస్తుంది..

మంత్రి "హర సిద్ధ నీవు అన్నీ బాగానే చెబుతున్నావు.. మరి హారం ఏమయింది.. ఆరోజు ఆంతరంగిక మందిరంలో ఉన్నది మన ముగ్గురం మాత్రమే.. దాని విలువ నీకే తెలిసి ఉండాలి.. దాని యొక్క గొప్పతనం కూడా నీకే తెలిసి ఉండాలి కాబట్టి ఆ కుట్రలో నీవు, నేను, రాజు గారు పాత్రులై ఉండాలి. రాజు గారికి చేయవలసిన అవసరం లేదు. నేను అక్కడ లేను. ఉన్నది నీవు కొత్తగా వచ్చిన వాడివి కాబట్టి అది నీకే సంబంధించినది అయి ఉంటుంది... అసలు ఆ గుడిలో ఏమి జరిగినది?"

హర సిద్ద "ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైంది, నల్లని మేఘాలు కమ్ముకున్నాయి.. పగటిపూట చీకటిగా అయ్యింది.. భూమి కూడా కొంత కంపించింది.. ఆ తర్వాత రాణి గారు స్పృహ తప్పి పడిపోయారు." 

మంత్రి అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులైన భటుల్ని పిలిచి.. అది జరిగింది నిజమేనా అని నిర్ధారణ చేసుకున్నారు.. వారు అక్కడి వరకు నిజమే అని విన్నవించారు..

మంత్రి "భూమి కంపించింది అన్నారు కదా మరి ఎక్కడైనా ఏమన్నా రంధ్రము.. లేక భూకంపం వల్ల ఏర్పడిన సందుల గొయ్యిలో ఏమైనా పడిందా చూసుకున్నారా?" 

అక్కడ భటులు హర సిద్దు సైతం అంతా వెతికి, ఎక్కడా ఒక చిన్న చిల్లు కానీ రంధ్రం కానీ కనపడలేదని.. ఆ సమయంలో ఉన్న ప్రాణ ప్రతిష్ట కానీ, గర్భగుడిలో రాజుగారు, రాణి గారు మరియు హర సిద్ధుడు మాత్రమే ఉన్నారు అని.. విచారణలో తేలింది..

రాజుగారు ఒక వర్తమానం మీద బయటికి రావడంతో ఈలోపు ఇదంతా జరిగిందని తేల్చారు..

అక్కడ ఉన్నది సృహ తప్పిన రాణి గారు మరియు స్పృహలో ఉన్న హర సిద్దు..

"హరసిద్దు దాచేసి ఉంటాడు, ఇతడికి బాగా డబ్బు సంపాదించాలి అని కల.. ఆ రాజముద్ర పోవటం వల్ల ఈ రాజ్యం మొత్తం అంతరించిపోతుంది.. అలాగా శత్రుదేశాల దగ్గర పైకం తీసుకొని ఉంటాడు.. ఆ పైకం కోసం ఎంతకైనా ఒడి కడతాడు దుర్మార్గుడు" అని లేనిపోని అభాండాలు వేశాడు, హార సిద్ధుని మీద కోపం ఉన్న భటుడు..

విచారణలో భాగంగా హర సిద్ధుని.. అనేక మాటలతో ముక్కలుముక్కలుగా తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఉన్నారు, అతను  ఏ తప్పు చేయలేదు కాబట్టి దీటుగా సమాధానం చెబుతున్నాడు..

ఇప్పుడు కూడా  చెబుతున్న సమాధానం భరించలేక హర సిద్దు వ్యతిరేకులు తల్లడిల్లిపోతున్నారు..

అక్కడ జనాల మాటల ప్రకారం హార సి ద్ధుడు ఏనాడు దొంగతనం చేయలేదు. కానీ ఏదో ఒక దొంగతనం చేసి ఆ వచ్చిన డబ్బుతో జీవితాంతం హాయిగా బతకొచ్చు అనుకుంటున్నాడు అనే ఒక మాట కూడా వ్యాపించింది...

భటుడు "మహారాజా! మీ కళ్ళ ముందే మీ సేవలో తరిస్తున్న మమ్మల్ని కొడుతున్నా, ఇంతసేపు ఇతన్ని మీరు ఏం చేయలేక పోతే.. ఇక రేపు దారిన పోయే ప్రతి దానయ్య రాజభటులని కొట్టి ఆనంద పడుతూ ఉంటాడు,"

హర సిద్ధుని ఎంతో వంచించిన తన ఆచార్యుడు కూడా ఆ ప్రాంగణం లోనే ఉన్నారు..

ఆచార్యుడు "హర సిద్ధ నీ మొండితనం ఆపు.. నీ ఎదురు వాదన ఆపు.. నీవు నాతో మాట్లాడక పోయినా నాకు పర్లేదు. నీవు నాతో పలకక పోయినా నాకు పరవాలదు. ఎంతోకొంత నీమీద పుత్రవాత్సల్యం నాకు ఇంకా ఉంది.. కాబట్టి చెబుతున్నాను విను దొంగతనాన్ని నువ్వు ఒప్పుకొని, ఆ హారం తిరిగి ఇవ్వు.. రాజు గారు చెప్పే విధంగా నీ క్షమాభిక్ష పెట్టి.. ప్రాణాలతో వదిలేస్తారు. కనీసం ఎక్కడైనా నువ్వు ఆనందంగా మరణించేవరకు జీవించవచ్చు."

హర సిద్ద "తమరు తమ నోటిని అదుపులో పెట్టుకోండి.. నేను ఎటువంటి తప్పు చేయలేదు. మీ లాంటి స్వార్థపరులను నమ్మడమే  నేను చేసిన తప్పు, మీలాంటి నవ్వుతూ తేనెపూసిన కత్తితో పొడిచే వారిని గురువుగా భావించటమే నేను చేసిన తప్పు. మీలాంటి వారిని గౌరవిస్తూ మాట్లాడటం కూడా నేను చేస్తున్న ఒక తప్పు.. మీరు ఎంత మోసకారో నాకు తెలుసు. అన్యాయంగా నా సమయాన్ని తిన్నారు. నాకు ఎటువంటి సహాయం చేయకపోగా.. కథనాన్ని నాకు రాకుండా ఆపారు. మీరు చేసిన పనికిమాలిన వాగ్దానాలు వల్లే నేను ఎంతో కొంత సమయాన్ని, కాలాన్ని, డబ్బుని నష్టపోయాను.. మీలాంటి వారికి ఆ దేవుడు శిక్ష వేస్తాడు అని నమ్మి మీ నుంచి దూరంగా వచ్చాను. అప్పటి నుంచి ప్రశాంతంగా బతకడం తెలుసుకున్నాను. కపట ప్రేమ ఆపండి. మరొకసారి గుర్తు పెట్టుకోండి, మీరు మీ కన్నా బలహీనులను కొడితే భగవంతుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో తర్వాత తెలుసుకుంటారు." 

హర సిద్దు వ్యతిరేకులు ఒకరా ఇద్దరా దాదాపుగా ఆ సభ అంతా .

"చూశారా మహారాజా! ఆ పెద్దమనిషి ఏదో పాత పరిచయం కొద్దీ మంచి మాటలు చెప్తే ఎట్లా మాట్లాడాడో. వీడికి అసలు నోరే కుదురులేదు.." ఇప్పుడు మాట్లాడిన వాడు హార సిద్దు చేతిలో లో ఒక అమ్మాయిని తక్కువగా మాట్లాడినందుకు దెబ్బలు తిన్న వాడు..

"వినండి మహారాజా.. రాజన్నా, రాజ్యం, చట్టాలు అన్నా వీరికి ఎటువంటి గౌరవమూ లేదు.." అంటున్నాడు హర సిద్దు  చేతిలో తన ఇంటి తగాదాలో.. గూబ గుయ్ మనిపించిన తన కుటుంబాన్ని తూలనాడిన వ్యక్తి.

హర సిద్దు కి ఓపిక క్షీణిస్తోంది.. పాపం మాట్లాడలేకపోతున్నాడు..

హరసిద్ధుని వ్యతిరేకులు అందరూ ఒక్కటై రాజుగారు శిక్షకు గురి చేద్దామని ఉక్కిరిబిక్కిరి చేసి అడుగుతున్నా, తనకు తోచిన ప్రతి వారికి సమాధానం చెప్పుకుంటూనే వచ్చాడు..

కనీసం ఒక్కరు కూడా హార సిద్దు మంచివాడు అని చెప్పలేదు..

కలల్లో ముందు తను ఉన్నతంగా ఊహించుకున్న జీవితం మబ్బుల్లాగా కరిగిపోతుంది..

ఒక్క మనిషి కూడా తన కోసం మాట్లాడే వాడు లేడు.. నిజంగా తను బతికింది ఒక బతుకేనా, సాక్షాత్తు దేవుడే వచ్చాడని అనుకున్నాడు నిజంగా అతడి దేవుడేనా..

ఎవరో ఇద్దరు భటులు... ఒక సాక్ష్యం తీసుకువచ్చారు..

అతడు బల్లగుద్ది నట్టు "ప్రభు! ఇతగాడు బందిపోట్లతో కలిసి  కుంభ రాజ్యంలో.. అల్లకల్లోలం చేశాడు. అక్కడ కూడా ఏం దోచుకున్నాడు? దోచుకోలేదు. నాకు సరిగ్గా తెలియదు, ఇతను మాత్రం కుంభరాజ్య సైన్యాన్ని ఎదుర్కోవడం నేను చూశాను.."

ఇప్పుడు లీలగా గుర్తు వస్తుంది... ఆనాడు కుంభ రాజ్యంలోని వృద్ధ రాజు మీద హత్యకు బందిపోట్లు ఎత్తేస్తే, అతడు దాన్ని తెలివిగా అపటమే కాకుండా ఆ పోరాటంలో ఒకడు తప్పించుకుని పారిపోయాడు, వాడే వీడు..

హర సిద్దు "రేయ్ ద్రోహి! ఆ బందిపోట్లలో నువ్వు ఒకడివి కదా! నాకు తెలుసు ఆ రోజు తప్పించుకున్నా రాజు గారి కోసం వెంటబడి పట్టలేకపోయాను. నువ్వు మర్యాదగా ఇప్పుడు లొంగిపోతే నీకు ప్రాణభిక్ష నేను పెట్టిస్తాను కుంభన్న రాజ్యంలో!"

"చూశారా మహారాజా! ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో మానవాళి పుట్టిన తర్వాత, శ్రీరామచంద్రుడు తప్ప, హర సిద్దు తప్ప, సరైన లోకోత్తములు లేరు.. ఎవరు ఏమి చెప్పినా తిరిగి వారికి వారి తప్పుడు మాట చెప్పి, ఒక అబద్ధం అందంగా వేసి చెబుతున్నాడు. ఇది ఒక రకమైన తెలివిగల మూర్ఖత్వం."

అతడు "ఇతగాడు అక్కడ మహారాజు హత్యా ప్రయత్నం జరిగితే నేనే కాపాడాను అని కూడా పచ్చి అబద్ధం చెబుతాడు " అన్నాడు తెలివిగా మరొక మాట మాట్లాడే అవకాశం లేకుండా.. మన సిద్ధూ ఆ మాట చెప్పినా అక్కడ పట్టించుకునే నాధుడే లేడు.

ఇప్పుడు విచారణ సభలోకి.. హర సిద్ధుని బంధుగణం అంతా వచ్చారు.. వారంతా "హర సిద్దు మంచివాడే కానీ ఆవేశపడే వాడే కానీ ఎటువంటి తప్పులు చేసి ఎరుగడు" అని చెప్పారు.. "నీకు తగ్గ ఏదో చిన్న పని చూసుకొని బతుకు అని మేము చెప్పినా సరే ఏదో గొప్పగా సాధిద్దామని తిరుగుతూ ఇలా తన జీవితాన్ని చేసుకున్నాడు" అని ఒక నిట్టూర్పు విడిచాడు.. ఆ బంధు గణాల్లో హర సిద్ధుని అవమానించిన వారు కూడా ఉన్నారు..

అక్కడ విచారణలో బంధువుల సాక్ష్యం చెల్లదు అనే లోపు.. బంధువుల్లో ఒకడు మాత్రం." వీడు మితిమీరిన మనస్తత్వం కలిగిన వాడు.. తన సొంత సోదరుడి రక్తం కళ్ల చూశాడు.. అందుకే ఈ కుటుంబంలో ఎవరు వీడీతో సఖ్యతగా ఉండరు, ఎంత ఉత్తముడైన తన సోదరుని రక్తం కళ్ళ చూశాడు. ఆ రోజు అనుకున్నా, అలాంటి ఉత్తముడు.. రక్తం చూసిన వీడు.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోకి దిగజారడం తప్పదని..".. అతని మాటల్లో బాధ తప్ప ఇటువంటి ద్వేషము లేదు..

సభలో "అతను అన్నది నిజమేనా"అని అడిగారు హార సిద్ధుని..

హర సిద్దు "అవును నిజమే. అనుకోకుండా తప్పు జరిగిపోయింది. దానికెంతో బాధపడి క్షమాపణ కూడా వేడుకున్నాను. కానీ నా క్షమాపణ ఎవరూ పట్టించుకోలేదు, చాలా తప్పు చేశాను.. ఆ తప్పు వలన ఎంతో మారాను. ఆ తర్వాత నుంచే నా కోపాన్ని అణచుకొని ఉన్నాను.."

పాపం హరిశ్చంద్రుడు..అదే మన హర సిద్ధుడు.. తప్పు ఒప్పుకున్నాడు.

బంధువు "ఎన్నో దేవాలయాలు తిరిగి ఎన్నో మంచి పనులు చేసే మీ సోదరుడి రక్తాన్ని కళ్ల చూసావు రా నువ్వు.. నీకు కుక్క చావు తప్పదు రా.. దేవుడు నిన్ను భలే శిక్షిస్తాడు రా.. నీ మొహం చూడాలన్న అసహ్యంతో నీ సోదరుడు రాను కూడా రాలేదు.. నీలాంటి వాడి తోడబుట్టిన పాపానికి ఆ పాపం వదిలించుకోవడానికి కాశీ ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. దరిద్రుడా.. ఎప్పుడన్నా ఎవరి మాట విన్నావా రా.. నీ అర్థంపర్థంలేని తర్కంతో ఇక్కడదాకా తెచ్చుకున్నావ్" అని చివరి మాటగా చెప్పాడు.

పాపం కళ్ళవెంట నీళ్ళు తుడుచుకోవడానికి.. కనీసం చేతులు కూడా రాలేదు.. కట్టడంవల్ల..

హర సిద్ధుని చేతిలో దెబ్బలు తిన్న వారు, మాటకు ఎదురు చెప్పలేని వారు, చర్యలకు సమాధానం ఇవ్వలేని వారు.. అందరూ హర సిద్ధులు మీద మౌఖికంగా పగ తీర్చుకున్నారు ఒక్కడిని చేసి..

బిగ పట్టుకున్న ఊపిరి ఒక్కసారి గట్టిగా తీసుకొని "నన్ను రక్షించు స్వామి" అని మనస్ఫూర్తిగా పాపం ప్రార్థన చేశాడు..

హర సిద్ధుని తల్లి కూడా కొంగు వెంట కన్నీరుతో సభా మండపం లోకి అడుగుపెట్టింది..

తన పని అయిపోవచ్చింది అని హార సిద్దు కి అర్థమవుతుంది..

శుష్కించ బోతున్న కళ్లతో తన తల్లిని చూశాడు హర సిద్ధుడు...

ముందు ఏమి జరుగుతుందో వేచి చూడండి.

***

No comments:

Post a Comment

Pages