నెత్తుటి పువ్వు - 40
మహీధర శేషారత్నం
సరోజకు నొప్పులు వచ్చాయి. సరోజ అంత బాధలోనూ పార్వతిని పిలిచింది.
“వదినా! నేను ఆలోచించాను. ఆడైనా, మగైనా నా బిడ్డ నీ బిడ్డగానే పెరగనీ. నా జీవితంలా కాకూడదు. పార్వతీ పరమేశ్వరులు నాకు మీరు. అన్నయ్యను తండ్రిగా సంతకం పెట్టమను.”
పక్కనే ఉన్న శంకరం కూడా తల ఊపాడు. “నీ బిడ్డకాదు, మా బిడ్డే, మీరిద్దరూ మా దగ్గరే ఉంటారు.” అనునయంగా అన్నాడు.
అదృష్టవశాత్తు సరోజకి నార్మల్ డెలివరి అయింది, ఆడపిల్ల.. ఆడపిల్ల అనగానే సరోజ ముఖం మౌనమైంది. మళ్ళీ తన జీవితంలా అవకూడదు, ఇది మళ్ళీ మూడోతరం కాకూడదు. కళ్ళల్లోంచి చెంపలపైకి నీళ్ళు జాలువారాయి. శంకరం, పార్వతి బాగా కావలసిన వాళ్ళని నలుగురినీ పిలిచి పాపకి బారసాలచేసి పేరుపెట్టారు. నాగరాజు కూడా వాళ్ళతో పాటు వచ్చాడు. సరోజ తన గది గుమ్మంలోనే ఒక పదినిమిషాలు చూసి లోపలికి వెళ్ళిపోయింది. నాగరాజు నలుగురితోపాటు వచ్చి అక్షింతలువేసి పాపవేలుకి బంగారు ఉంగరం పెట్టాడు. ఒక గొలుసు ఇచ్చాడు వెయ్యమని.
పార్వతి కార్యక్రమమయ్యాక తలుపులువేసి సరోజకి పాపనిచ్చేసింది పాలిచ్చి పడుకోపెట్టమంటూ, ఉప్పుతెచ్చిసరోజకీ పాపకీ దిష్టి తీసింది. బెంబేలుపడకు, సరోజా! మేం మోసగాళ్ళం కాము. నీ పాపకాదు, నా పాపే నువ్వు కన్న తల్లివైతే, నేను పెంచే తల్లిని. నీ బాధనే నర్ధం చేసుకోగలను. అసలే బాలెంతరాలివి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ పాపకి ఇబ్బంది అంటూ తలుపు చేరవేసి వెళ్ళిపోయింది.
నేను గట్టిగా ఉండాలి, పాప జీవితం నాకు ముఖ్యం. అంటూ కళ్ళు తుడుచుకొని పాపకి పాలిచ్చి డైపరు మార్చి పక్కలో పడుకోబెట్టుకొంది. సరోజకు గాఢంగా నిద్రపట్టింది.
పాపకి తల్లిపాలు సమృద్ధిగా ఉండటంతో మూడో నెలకి చక్కగా ఒళ్ళుచేసి బంతిలా తయారయింది. పార్వతీ శంకరాలయితే పాపను వదలడమే లేదు. ఇన్నాళ్లకు ఇంటికి కళ వచ్చింది అంటూ సంతోష పడుతున్నారు. పాలకి, పడకకీ మాత్రమే సరోజ పరిమితమైంది. లక్ష్మికి మళ్ళీ మగపిల్లాడు పుట్టాడు. నాగరాజు బారసాలకు వెళ్ళివచ్చాడు.
నాగరాజు పాపను చూడడానికి రాసాగాడు. ఆ మమకారం చూసి పార్వతికూడా ఏమనలేకపోతోంది. శంకరం మళ్ళీ చెప్పాడు. ఒరేయ్! మళ్ళీ మళ్ళీ తప్పు చేయకు.
సరోజ నాగరాజు వచ్చినప్పుడు సాధారణంగా అటు వెళ్ళదు. నాగరాజే ఒకసారి గుమ్మంలోంచి తొంగిచూసి పలకరించి పోతాడు.
కాలం సాగి పోతోంది. సరోజ, నాగరాజు బంధం తెంచుకున్నా సత్యం విషయ సేకరణ మానలేదు. మొత్తం పసికట్టాడు. శంకరం ఇల్లు తెలుసుకున్నాడు.
ఆరోజు, రోజూలానే తెల్లారింది. పాపకి అన్న ప్రాశన చేసారు. పార్వతి, శంకరం పాపని తీసుకు గుడికి వెళ్ళారు. నువ్వుకూడా రామ్మా! అన్నాడు శంకరం.
వద్దులే అన్నయ్యా! మీరు వెళ్ళిరండి, కాసేపు పడుకుంటాను అంది సరోజ.
ఒక గంట గడిచింది, ఎవరో ఇద్దరు మనుషులు సరోజ గది తలుపులు దబదబా కొట్టారు. గాఢ నిద్రలో ఉన్న సరోజ ఉలికి పడింది. లేచి అనాలోచితంగా తలుపు తీసింది లోపలికి చొరబడ్డారు.
“ఎవరు మీరు?” భయం భయంగా అడిగింది సరోజ. “నీ అమ్మమొగుళ్ళం! కర్కశంగా అన్నాడొకడు, ఇదేరా అది. వేసెయ్! అన్నాడు మళ్ళీ అతను పక్కవాడు కత్తితీశాడు. సరోజకి ఏం జరగబోతోందో అర్థం అయింది.
“అన్నా! మీరెవరో నాకు తెలియదు, మీ చెల్లెలు లాంటిదాన్ని వదిలెయ్యండి.” కాళ్ళు పట్టుకుంది. “థూ! నీ యవ్వ! నువ్వు నా చెల్లెలేంటే? తొందరగా ముగించరా! విదిలించి కొట్టాడు. “నాకెవరూ లేరన్నా! వదిలెయ్!” బతిమిలాడింది. ఈ నాటకాలు, డైలాగులు నా దగ్గర కాదు. నీ రాజుబాబు దగ్గర చెప్పు. ఆణే ఏసేద్దును, నా చెల్లెలు పసుపు కుంకాలు గురించి ఆలోచించాల్సి వచ్చింది.
మీరు, మీ నాటకాలు.... వాడో చిత్తకార్తి కుక్క నువ్వోలం... వి. సరోజకు అర్థమైంది. “మాకు ఇప్పుడే సంబంధం లేదన్నా, విడిపోయాం నాబిడ్డమీద ఒట్టన్నా!” ఓహో! అదికూడా ఉందా! ఒరేయ్ దీన్ని తప్పకుండా వేసెయ్రా! గదిమాడు.
రెండవ వ్యక్తి చేతిలోని కత్తి సరోజ గుండెల్లో దిగబడింది. సెలవంటూ కళ్ళల్లోంచి ప్రాణం సెలవు తీసుకుంది. గులాబీరంగు ఒళ్ళూ, బాదం కాయల లాంటి కళ్ళు మొగలి పువ్వు నంటిపెట్టుకున్న మొదటి రేకులా మెత్తటి ఒళ్ళు నెత్తురులో మునిగాయి.
రెండో అతనికి జాలివేసి రెండు కన్నీటి చుక్కలు ఆ తెరచి ఉన్న కళ్ళల్లో జారిపడ్డాయి. సరోజ చీరకొంగులోనే కత్తి తుడిచి లోపల పెట్టుకున్నాడతను.
నవ్వుకుంటూ పాపతో లోపలికి వచ్చిన పార్వతీ, శంకరం లోపలి దృశ్యం చూసి కెవ్వుమన్నారు. శంకరానికి ఇది ఎవరి పనో అర్ధమై పోయింది. నాగరాజుకి ఫోన్ చేసాడు. విషయం చెప్పకుండా ఒకసారి అర్జెంటుగా రా! అన్నాడు.
నాగరాజు సరోజ నలాచూసి దిమ్మెరపోయాడు. స్పృహతప్పి పడిపోయాడు. నాగరాజు ముఖం మీద నీళ్ళు చల్లి స్పృహవచ్చాక నువ్వు ఇక్కడ ఉండక ఇంటికి వెళ్ళిపో! నేను చూస్తాను.” అంటూ బలవంతంగా రిక్షా ఎక్కించి పంపించేసాడు.
తన ఇంట్లో అద్దెకుంటున్న ఒక ఒంటరి స్త్రీని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసారని కంప్లైంటు చేసాడు. పద్దతిగా అన్నీ ముగించి పోస్టుమార్టం పూర్తిచేసి డెడ్ బాడీ ఎవరికివ్వాలని అడిగాడు. నేను తోడబుట్టిన వాడిలా చూసుకున్నాను. శంకరం సంతకం పెట్టి డెడ్ బాడీ తీసుకువచ్చాడు. ఏడ్చి ఏడ్చి పార్వతి కళ్ళు వాచిపోయాయి.
పార్వతి దగ్గర మాలిమి ఎక్కువవడంతో పాపకంత బెంగ తెలియలేదు, అదృష్టవశాత్తూ. లక్ష్మి భర్తకు ఇబ్బందని మూడో నెలలోనే వచ్చి ఉంది. శవాన్ని తగలేసి వచ్చిన వాడిలా ఉన్న నాగరాజుని చూసి ఆమె భయపడింది.
ఏమయింది? అంటూ ఆదుర్గాపడింది. నాగరాజు గదిలోకి వెళ్ళి తలుపు గడియపెట్టుకున్నాడు. లక్ష్మి భయపడి ఏయ్! తలుపు తియ్యి అని బతిమిలాడింది. తియ్యలేదు. తలుపుకు తలవేసి కొట్టుకుని పిల్లలమీద ఒట్టు తలుపుతీయ్” అంది.
తలుపు తీసి “భయపడకు నాకు చిన్న పనుంది.” అని మళ్ళీ తలుపు వేసేసుకున్నాడు.
ఒరేయ్ లం..... కొడకా! అని బండబూతులు తిడుతూ ఒక ఆడపిల్ల ప్రాణం తీసిన నీకు పనిష్మెంట్ లేకుండా వదల్తానా!.... పెద్దలేఖ రాసి కవరులో పెట్టి అతికించి జేబులో పెట్టుకున్నాడు.
ఆ రాత్రి నాకు ఆకలిగా లేదు కాని లక్ష్మి నువ్వు అన్నం తినిరా! అన్నాడు.
లక్ష్మికి, ఎందుకో కంగారుగా అనిపించింది కాని ఏమీ తినకపోతే పసివాడికి పాలు తగ్గుతాయని ఏదో తిని పాలు తాగి పడక గదిలోకి వచ్చింది.
కూర్చో! లక్ష్మీ! కాసేపు నీ ఒళ్ళో తలపెట్టి పడుకుంటాను, అంటూ పడుకున్నాడు. “ఉండండి టాబ్లెట్ ఇస్తాను.” అంది లక్ష్మి,
“వద్దు లక్ష్మి! ఊరికే పడుకుంటాను కాసేపు, పిల్లలు జాగ్రత్త. నీకేం చెయ్యలేకపోయాను లక్ష్మి! నేను ఏమి చేతకాని వెధవని కదూ!” అన్నాడు లక్ష్మి ముఖంలోకి చూస్తూ..
"ఛా! అలా అనకు, నువ్వు నాకు బంగారం లాంటి ఇద్దరు మగ పిల్లల్ని ఇచ్చావు. అంది అతని నోరుమూస్తూ, సున్నితంగా చెయ్యివేస్తూ వాళ్ళని మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేట్టు పెంచు. మీ అన్న నీడ పడనీయకు.
లక్ష్మి ఆలోచనలో పడింది. ఎందుకిలా మాట్లాడుతున్నాడు. “సర్లే! నిద్రపో!” అంది. “పడుక్కుంటాను నువ్వు కూడా పడుక్కో” ఒళ్ళోంచి పక్కకు జారాడు. లక్ష్మిని గట్టిగా కౌగిలించుకొని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. “పోలీసోడికి మదమేకాని మనసుండదనుకున్నాను.” “నువ్వు నల్ల నోడివేకాని నీ మనసు వెన్నలా తెల్లనిది, మెత్తనిది.”
పదే పదే చెవుల్లో సరోజ మాటలు వినబడుతున్నాయి. సరోజ నవ్వుతున్న ముఖం, రక్తంలో ములిగిన దేహం కనపడుతున్నాయి.
(సశేషం)
No comments:
Post a Comment