పురాణ కధలు - బసవ పురాణం
సేకరణ పి.యస్.యమ్. లక్ష్మి
21. నరసింగ నైనారు కధ.
జంగం రూపంలో వున్న శివుడు నిమ్మవ్వ ఇంట్లో భోజనం చేస్తూ తన అహంకారానికి సిగ్గుపడ్డ భక్తుడు సిరియాలుడితో (పరమ శివుని ఆజ్ఞ మేరకు అతనూ శివునితోబాటు జంగం వేషంలో నిమ్మవ్వ ఇంటికి వస్తాడు) నువ్వెందుకు ఇలా చిన్నబోతున్నావు? పన్నగ భూషణుడి భక్తుల కధలు నువ్వు వినలేదా? అంటూ ఇంకొక కధ చెప్పటం మొదలు పెడతాడు.
శివుడి భక్తులలో ఒకరు నరసింగ నాయనారు అనే పేరు కలవాడు.
ద్రవిడ దేశానికి రాజు.  ఒకసారి ఆయన
రాణివాసంతో ఉద్యానవనానికి వెళ్ళి అక్కడ వున్న ఆలయంలో శివునికి పూజ చేయటానికి
పువ్వులు తెమ్మని భటునికి ఆజ్ఞాపించాడు.  ఆ
భటుడు కూడా వెళ్ళి వాడని అందమైన పువ్వులని కోసి ఒక పళ్ళెంలో  తేగా, అందులోని ఒక పువ్వును తీసుకుని రాణి వాసన
చూసింది.  వెంటనే ఆ భటుడు ఆ రాణీగారి
ముక్కు కోసేశాడు.  అది విని తోటి భటులు
ఏడుస్తూ దగ్గరలోనే వున్న రాజుగారి దగ్గరకు వెళ్ళి వార్త వినిపించారు.  
రాజు వెంటనే ఆ పువ్వులు కోసుకు వచ్చిన భటుని పిలిచి,  “మూర్ఖుడా, నీకు శివ పూజా విధానం గురించి ఏమీ తెలియదు.  శివ పూజకోసం తెచ్చిన పూలలో ఒక దానిని తీసిన
చేతిని ముందు నరకక ముక్కును కోశావు.  ఛీ ఫో” అని కేకలేసి పంపాడు.   రాణీని
పిలిపించి మంచి మాటలతో, “నీవా పూవుని ఎట్లాగు చెయ్యి చాపి
తీశావు? 
చూద్దాం.  ఒకసారి చాపు”  అనగా ఆమె అమాయకంగా చేయి
జాపింది.  రాజు వెంటనే తన కరవాలంతో ఆ
చేతిని ఖండించాడు.  
(ఆ కాలంలో శివ భక్తుల అమిత భక్తి అది.)  అప్పుడు మేము ప్రత్యక్షమై తెగిన ముక్కును,
చేతిని అతికించి మామూలుగా చేసి ఆ రాజుకు నచ్చజెప్పాము.  ఆమెకు అలాటి ఆలోచన పుట్టించింది మేము కనుక ఆమె
దోషం ఏమీ లేదని, అమాయకురాలైన ఆమెను మన్నించము రాజుకి అప్పజెప్తే రాజు మామాట
మన్నించాడు.  
ఇంకా ఇలా కొనసాగించాడు సదా శివుడు. 
“నువ్వు నీ కొడుకుని చంపుతానని నా యనుజ్ఞ పొంది చంపావు గనుక నా ఆనతితో నీ
భార్య నీకొడుకుని పిలవ గానే వచ్చాడు. 
నిమ్మవ్వ తన కొడుకు తప్పు చేశాడని మనకి తెలియకుండానే  చంపింది. 
మనకి తెలియకుండా చేసింది గనుక నాకా విషయం తెలియదు అనుకుని  మనం పిలవమన్నా కొడుకుని పిలవలేదు.  అన్నీ తెలిశాక వరం కోరుకొమ్మంటే తప్పు చేశాడు
గనుక దండననుభవించాడందే గానీ, బతికించమని అడగలేదు. 
ఇలాంటి భక్తులు నాకెందరో వున్నారు.”  అని శివుడు చెప్పగా వింటున్న సిరియాలుడు
సిగ్గుతో తల వంచుకుని అటు ఇటూ చూడసాగాడు. 
శివుడు అతని అహంభావాన్ని అణచి అతన్ని ఓదార్చి, నిమ్మవ్వ కుమారుడిని
బతికించి, తల్లీ బిడ్డలని కలిపి కైలాసానికి రమ్మనగా నిమ్మవ్వ తనకి కైలాసం వలదని,
శివ భక్తుల సేవ చేస్తూ భూమి మీదే వుంటాననగా, ఆమె కోరిక మేరక శివుడు వారిని
చిరంజీవులను గా దీవిస్తాడు.  ఆమె, కుమారుడు
మంచి పనులు చేయుచు, తమ చరిత్రను లోకులనేక విధముల గొనియాడుతుండ నిండు జీవనం
జీవించుచున్నారు.
అలా శివుడు చెప్పిన కధ విని సిరియాలుడు కైలాసానికి వెళ్ళబోవగా శివుడాతనిని
పోనీయక అతని చెయ్యి పట్టుకుని రమ్మని ఇంకా భక్తులను చూడాలని హలాయుధపురానికి
తీసుకెళ్ళాడు.  ఆ కధ ఇంకోసారి.
***
 

 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment