తెలుగు స్థితి పూర్వము -ప్రస్తుతము - అచ్చంగా తెలుగు

తెలుగు స్థితి పూర్వము -ప్రస్తుతము

Share This

 తెలుగు స్థితి పూర్వము -ప్రస్తుతము

అంబడిపూడి శ్యామసుందర రావు


 

    ఇటాలియన్ అఫ్ ద ఈస్ట్ అని పాశ్చాత్యుల చేత కొనియాడబడినది, మన తెలుగు భాష. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద గ్రంధాన్ని తెలుగులో రచించి 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని కీర్తించి తెలుగును తన విజయనగర సామ్రాజ్యములో అధికార భాషగా చేసి అష్టదిగ్గజాలనబడే ప్రముఖ తెలుగు భాష కవులను పోషించాడు. 

 బ్రిటిష్ వారి పాలనలో కూడా హిందీ తరువాత తెలుగుకు ప్రాధాన్యత ఉండేది. తెలుగును 'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్' అనటానికి కారణము, ఇటాలియన్ భాషలో లాగనే తెలుగు భాషలో కూడ పదాలు హల్లు శబ్దముతో అంతమౌతాయని 16 వ శతాబ్దాన్లోనే ఇటాలియన్ భాషావేత్త నికోలో డీ చెప్పటమే. ఈ విధముగా ప్రపంచ ఉత్తర ప్రాంతాలలోని భాషలో తెలుగు మాత్రమే ప్రతి పదము హల్లు శబ్దముతో పూర్తి అవుతుంది. భారత దేశములో తెలుగు మాట్లాడే వారు సుమారు 75 మిలియన్లు. అంటే మనదేశములో మూడన స్థానము, ప్రపంచ భాషలలో 15 వ స్థానము తెలుగుది. భారతీయ భాషలలో తెలుగు అంత తీయ్యనైన భాష మరొకటి లేదని విశ్వకవి రవీంద్ర నాధ్ టాగోర్ అన్నాడు. 

ప్రపంచములోని ఇతర ప్రాంతాలలో కూడా తెలుగు మాట్లాడే వారు ఉన్నారు. ప్రస్తుత మారిషస్ ప్రధాని తెలుగు సంతతి వాడే! శ్రీలంక లోని జిప్సి తెగ (సంచార జాతి)వారు, మైన్మార్ లోని చాలా మంది ప్రజలు తెలుగు మాట్లాడతారు. ఈ మధ్య ఆస్ట్రేలియాలో స్కూళ్లలో తెలుగును అప్షనల్ భాషగా చేశారు. ఆ విధముగా విభిన్న సంస్కృతులకు, సాంప్రదాయాలకు నిలయమైన ఆస్ట్రేలియాలో తెలుగు భాషకు అరుదైన గౌరవము వచ్చింది.

ఏకాక్షరి పద్యాలు గల భాష తెలుగు మాత్రమే! ఆంధ్రీకరించిన రామాయణ మహాభారతాలలో దాదాపు 40 శ్లోకాలు కచిక పదాలతో కూడిన పద్యాలు ఉన్నాయి. కచిక పదాలు అంటే ఎటునుండి చదివినా ఒకే రకముగా పలికేవి. ఉదాహరణకు వికట కవి, కిటికీ, మడమ లాంటివి. ఆ విధముగా తెలుగు భాష ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకతను అందిస్తుంది. తెలుగు భాషలో ఉన్నన్ని సామెతలు, నుడికారాలు మరే భాషలో లేవు. తెలుగు భాషను పూర్వము తెనుంగు, తెలుంగు అనేవారు. 

తెలుగు అనే పదము త్రిలింగ అనే పదము నుండి వచ్చినట్లుగా చరిత్రే కారులు చెపుతున్నారు. హిందూ పురాణాల ప్రకారము త్రిలింగ క్షేత్రాలైన కాళేశ్వరం, శ్రీశైలము, భీమేశ్వరముల మధ్య గల ప్రదేశము త్రిలింగ దేశము. ఈ ప్రదేశములోని జనాభా మాట్లాడే భాషే తెలుగు. తెలుగు భాష మాట్లాడటం  వల్ల మన శరీరములో గల 72,000 నాడులు ఉత్తేజితమవుతాయని పండితులు చెపుతున్నారు. 

తెలుగు లిపి ప్రపంచములోని గొప్ప లిపిగా 2012 లో ఇంటర్ నేషనల్ ఆల్ఫాబెట్ అసోషియేషన్ ద్వార ఎన్నుకోబడింది. మొదటిది స్థానము కొరియన్ భాషది.

ఇదంతా తెలుగు పూర్వ వైభవము. ప్రస్తుత స్థితి దీనికి భిన్నముగా ఉంది. దీనికి ప్రధాన కారణము ఏ ప్రాంతము వారైనా, ఎంత ఇంగ్లిష్ చదువుకున్నా వారి మాతృ భాషలో మాట్లాడుతారు. మన తెలుగు వారి దౌర్భాగ్యము ఏమిటి అంటే ఇంగ్లిష్ నేర్చుకుంటే ఇంగ్లిష్ లోనే మాట్లాడటానికి ఇష్టపడతారు. ఇద్దరు తెలుగు వాళ్ళు ఎదురైనా ఇదే పరిస్థితి! 

చెన్నైలాంటి నగరాల్లో తెలుగు వారి ఇల్లు కనుక్కోవడం చాలా సులువు. ఎందుకంటే వారి ఇంటికి ఉండే నేమ్ ప్లేట్ ఇంగ్లిష్ లో ఉంటుంది ఇతరుల నేమ్ ప్లేట్లు వారి మాతృభాషలో ఉంటాయి. ఇళ్లలో కూడా అమ్మ, నాన్న లాంటి తియ్యనైన తెలుగు పదాలకు బదులుగా మమ్మి డాడీ సంస్కృతీ అలవాటు అయ్యింది. ఇదే అలవాటు పెరిగితే చాలా తెలుగు పదాలు కనుమరుగవుతాయి. ఇప్పటికే కొన్ని గ్రామీణ పదాలకు అర్ధాలు తెలియటం లేదు. ఎందుకంటే వాటి వాడకం లేకుండా పోయింది కాబట్టి/ తెలుగు చదువుకొని (వ్యాకరణముతో సహా) మాట్లాడుతూ తెలుగును బ్రతికించండి. 

మాతృ భాష దినోత్సవము సందర్భముగా ఉపన్యాసాలతో సరిపెట్టకుండా ప్రతి తెలుగు వాడు తెలుగు భాష ఉన్నతికి తమ వంతు కృషి చేయాలి. ఇతర భాషలు నేర్చుకోకూడదు అని ఎవరు అనరు. మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు 14 భాషలు నేర్చుకున్నా, తెలుగులో కవిత్వము చెప్పేవారు. ఇతర భాషలు నేర్చుకొనే క్రమములో తెలుగును నిర్లక్ష్యము చేయకండి. చివరికి తెలుగు పరిస్థితి ఎలా అయింది అంటే ఒక్క రెండు నిముషాలు ఇంగ్లిష్ పదము రాకుండా మాట్లాడాలి అని పోటీలు పెడుతున్నారు. అంటే మాతృ భాషలో మాట్లాడటం ఎంత కష్టమో అని అర్ధము అవుతుంది.

ప్రస్తుతము తెలుగు భాష ఉచ్ఛారణలో చాలా మంది చేసే తప్పులను తెలుసుకుందాము. దీనికి ముఖ్య కారణము టీవీలలో యాంకర్లుగా పనిచేసే వాళ్ళు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా వాళ్ళు వాడే తెలుగు, అదే నిజమైన తెలుగు అనుకోని ఇతరులు వారిని అనుకరించటం! అలాగే పరాయి భాష గాయకులతో సినిమాలలో పాటలు పాడించటము. ఆ గాయకుడు వత్తులు పలకటం చాతకాక తప్పులతో పాడితే జనము ఆనందిస్తున్నారు. ఎక్కువగా చదువుకోకపోయినా స్వల్పంగా యైన వ్యాకరణము నేర్చుకోవాలి. ఎందుకంటే భాషకు ప్రాణము వ్యాకరణము. తప్పుగా ఉచ్ఛరించే లేదా వ్రాసే కొన్ని పదాలలో దొర్లే తప్పులు, ఉదాహరణకు స్వజన అనేమాటకు అర్ధము మనవాళ్ళు కానీ ఈ మాటను శ్వజన అంటే అర్ధము కుక్కలు, అలాగే సకలము అంటే సర్వస్వము కానీ శకలం అంటే ముక్కలు అని అర్ధము. అలాగే సకృత్ అంటే ఒకసారి, కానీ దానిని శకృత్ అని ఉపయోగిస్తే మలము అని అర్ధము. తెలుగులో శ అనే అక్షరము ఉంది కానీ ఆ అక్షరము వాడవలసిన సందర్భాలలో ఫ్యాషన్ గా ష వాడుతున్నారు. 

ఇలాంటివి మన నిత్య జీవితములో వాడేవి చాల ఉన్నాయి. మచ్చుకు కొన్ని: తెలంఘాన, మౌళిక (సాక్షాత్తూ ప్రభుత్వం వేసిన ప్రకటన బోర్డు లో చదివాను ఈ పదం) మధ్యపానం, కల్లు (కళ్ళు), భుద్ద బగవానుడు, ఘ్రందాలయం, భ్రమ్మానందం. ఇంకా చాలా ఉన్నాయి, గుర్తు రావట్లేదు సమయానికి. మీకు తోచినవి మీరూ రాయండి) ఇవన్నీ మాటల్లోనే కాదు బోర్డుల మీద ఇలాగే వ్రాస్తున్నారు.

తెలుగులో ఉండే అరసున్నా, బండి ర ల వాడకం దాదాపు కనుమరుగయింది. ఇవి తెలుగు భాషకు ప్రత్యేకమైనవి. కావ్య భాషలో లక్ష్మణ శాస్త్రములో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. వీటిని వాడక పోవటం వల్ల కొన్ని తెలుగు పదాల అర్ధాలే మారిపోతున్నాయి. మనము వాటిని పట్టించుకోకుండా వాడవలసిన చోట వాటిని వాడకుండా తప్పుడు అర్ధాలతో మాటలను వాడుతున్నాము. ఉదాహరణకు కరి అనే మాటకు అర్ధము ఏనుగు అని, అక్కడ ర కు బదులుగా బండి ర వాడితే అర్ధము నల్లని అని. ఇలాంటి పదాలను మనము అర్ధము తెలుసుకోకుండా బండి ర, అర సున్నలను వాడకుండా ఉపయోగించటం వలన అర్ధాలే మారిపోతున్నాయి. అలాగే పదాలను అక్కరలేని చోట వత్తులతో, కావలసిన చోట వత్తులు వాడకపోవటం నిత్యకృత్యము, ఫ్యాషన్ అయిపోయింది. ఇలా వ్రాసే, చదివే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జనానికి తెలుగు భాషా తరుఫున శత కోటి వందనాలు. వీళ్ళు మారతారని, నేర్చుకుంటారని అసలు అనుకోవటం లేదు. కానీ, సామాన్య జనం తప్పులు మాట్లాడటానికి, (వ్రాయటానికి) వీళ్ళు వాడటానికి తేడా ఉందని గ్రహిస్తే చాలు తెలుగు భాష బాగుపడుతుంది. మాతృ భాష మాధుర్యాన్ని అందరిలో నింపండి, ఆస్వాదించండి.

***

No comments:

Post a Comment

Pages