అనసూయ ఆరాటం - 7 - అచ్చంగా తెలుగు

 అనసూయ ఆరాటం - 7 

చెన్నూరి సుదర్శన్ 


(శాలోల్ల దుకాణం కిరాయికి తీసుకుంటారు సమ్మయ్య, బుచ్చయ్య. లింగారెడ్డి కి టి.బి. వస్తుంది. అతనికి పెళ్లి సంబంధాలు చూస్తుంటారు)

    చాయె దుకాణం చిన్న గుడిసె.. కట్టెల పొయ్యి.. పొగ తోటి గుడిసె కమ్ముక పోయింది. చాయె గిలాసలు పండ్లు గార పట్టినట్టు కనబడబట్టినై. వాటిని సూడంగనే ముక్కిర్సిండు  రవీందర్. 

“తమ్మీ పల్లెటూల్లల్ల గిట్లనే ఉంటై.. జరంత దంపట్టాలె..” అని గోలెం కాడికి పోతాంటే.. అందరూ వెంకటయ్య ఎన్కాలనే పోయిండ్లు. 

మొకం, కాళ్ళు. రెక్కలు కడుక్కున్నరు. సల్లని నీళ్ళు ఒంటి మీద పడే టాల్లకు .. పానం హాయి మన్నట్టు తుర్తి పడ్డరు.

“ఐదు చాయెలు” అని ఎడం చెయ్యి ఐదేల్లు సూయించుడు వెంకటయ్య. కుడి చేత్త కండువతోటి ముకం తుడ్సుకుంట.

“సార్లూ.. చెక్కర కంట్రోలై దొరక్కచ్చింది. చెక్కర నిండుకున్నది. ఉప్పెయ్యమంటరా..” అడిగిండు చాయె దుకాణం ఆసామి.

“ఉప్పా..” అని ఒక్కసారే బీర్పోయిండ్లు రవీందర్, సురేందర్‌లు. మా జిందగిల చాయెల ఉప్పేత్తరని ఇనలేదన్నట్టు మొకం పెట్టిండ్లు.

“ఉప్పు చాయె బాగనే ఉంటది తమ్మీ.. ఒక సారి తాగి సూడుండ్లి. సైకిలు మీద బట్టల మూటేసుకొని తిరిగే నాఅసోంటల్లకు ఉప్పు చాయే గతి. ఇయ్యాల రేపు ఊళ్ళల్ల చెక్కెరేడ దొరుకుతాంది..” అని వెంకటయ్య నువ్వు కానియ్యి అన్నట్టు చాయె దుకాణమాయనకు సైగ జేసుకుంట వత్తాసు పలికిండు. 

అందరు ఒకల పక్కకొకలు శాబాదు బండల తోటి చేసిన బెంచి మీద కూకున్నరు.

చాయె తాక్కుంట పిల్ల తండ్రి రామిరెడ్డి ఇల్లు.. వాల్ల ఔసత్  ఈగిరంగ లాగిండు వెంకటయ్య. ఒక పక్క ఇనుకుంట.. ఇంకో పక్క ఆముదం తాగుతున్నట్టు ముకం పెట్టుకుంట.. అట్లిట్ల చాయె ఖతం చేసిండ్లు సేట్లు.  కాని రవీందర్ , సురేందర్ చాయె సుక్క నాలికెకు అంటంగనే కింద ఊంచి పారబోసిండ్లు. కక్కుకున్నంత పనైంది. ‘తమ్ముల్లకు ఉప్పెక్కువైందనుకుంట’ అని మన్సుల నవ్వుకున్నడు వెంకటయ్య. 

“అయినా బాగ సదువుకున్న పొలగాంద్ల తోటి ఇదే గోస”  అన్కుంట లేచి సైకిలందుకున్నడు. 

రామిరెడ్డి ఇంటికి పోయేటాల్లకు తొమ్మిదైంది. ఇల్లు పూరి గుడిసె. సాన్పు సల్లి ముద్దుగ ముగ్గులు పెట్టిన వాకిలి నిండా యాప చెట్టు నీడ పడ్తాంది. ఇంటి పక్కకు పశువుల కొట్టమున్నది.  

వీల్లను సూడంగనే ఎదురుంగ ఉర్కుంటచ్చిరెండు చేతులు జోడిచ్చి దండం బెట్టిండు రామిరెడ్డి. కాల్లకు నీళ్ళు అందిచ్చి కండువ చేతికిచ్చిండు. అందరు కాళ్ళు కడుక్కొని ఇంట్లకు పోయిండ్లు. వాల్చిన రెండు నులుక మంచాలల్ల దుప్పట్లు పర్సి కూకోమన్నడు. ఒక చిన్న పొల్ల వచ్చి అందరికి మంచినీల్లిచ్చింది. సేట్లు, వెంకటయ్య ఇల్లంత కలియ సూత్తాండ్లు. రవీందర్, సురేందర్ పెండ్లి పిల్లను సూడాలని ఇంట్లకు ఎవ్వలకేర్పడకుంట తొంగి. తొంగి సూత్తాండ్లు. రామిరెడ్డి చేతులు కట్టుకొని కాసింత దూరంగ నిలబడ్డడు. 

“రామిరెడ్డి నువ్వు సుత కూకో..” అన్నడు బుచ్చయ్య. 

రామిరెడ్డి పెద్దటూలు ఉగులాడుతున్న కాలు సవరిచ్చుకుంట అందరికి అందుబాటుల పెట్టిండు. 

ఇంతల ఇంట్లకెల్లి పిలుపచ్చి ఇంట్లకు పోయిండు. రెండు చేతులల్ల ఉప్పుడు పిండి పేట్లు తీస్కచ్చి టూలు మీద పెట్టిండు. ఇయ్యల్లాక నీళ్ళు తెచ్చిన పొల్ల మల్ల పెద్ద చెంబుల నీళ్ళు .. గిలాస తీస్కచ్చి టూలు పక్కకు పెట్టింది. రామిరెడ్డి ఇంట్లకు పోయి మామిడి కాయ తొక్కు తీస్కచ్చి పేట్లల్ల వడ్డిచ్చుకుంట.. “శాన పొద్దు పోయింది. జరంత కడ్పుల సల్లపడుండ్లి. చాయె తయారైతాంది. తాగినంక పిల్లను సూత్తురు గాని” అని తొక్కు జాడి కింద పెట్టిండు. 

“ఉప్పు చాయనా..” ఠక్కున అడిగిండు సురేందర్.

“కాదు సారూ.. చెక్కర చాయెనే” అన్నడు రామిరెడ్డి.

“రామిరెడ్డీ.. ఏమీ అనుకోకు. తొవ్వల వత్తాంటే చెక్కర లేదని ఉప్పు చాయె చేసిచ్చిండు. ఇక్కడ అంతా అదే చాయె తాగుతరేమోనని మా సురేందర్ అడుగుతాండు.. తప్పు పట్టుకోకు..” అన్కుంట సురేంద్రను గట్ల అడుగద్దన్నట్టు సూసిండు సమ్మయ్య. “పోలీసాయన కొడుకాయె.. అన్నీ అనుమానాలే” అని ముస్కురాయించిండు. సురేందర్‌ను, రవీందర్‌ను, వెంకటయ్యను ఫలానా.. ఫలానా అని పరిచయం చేసిండు. 

“ఆవు పెండ తోటి అలికి ముగ్గులు పెట్టిన ఇల్లు సూడ సక్కంగ ఉన్నది” అని మాట మార్చిండు. వెంకటయ్య. 

“మా అనసూయ అక్కనే అలికి ముగ్గులు పెట్టిందని” నీళ్ళు తెచ్చిన పొల్ల కండ్లు బండి గీరల్లెక్క తిప్పుకుంట చెప్పింది.

“అనసూయ అంటే నా చిన్న బిడ్డ.. నాకు ఇద్దరు బిడ్డలు. పెద్ద దానికి పెండ్లయ్యింది. రెడ్డోల్ల ఇండ్లల్ల కట్నాల సోకులెక్కువ. ఏదో గంతకు దగ్గ బొంతను దొరింపు చేసి ఆయింత ఈబిడ్డ లగ్గం సుత చేసి సాగనంపా లను కుంటాన” అని రామిరెడ్డి రెండు చేతులు జోడిచ్చి పబ్బతి పట్టిండు. 

“ఈ పొల్ల మా పక్కింటి సంటిది. అనసూయను సూడత్తాండ్లంటే పనికాసరకచ్చింది” అని పొల్లను సూసుకుంట “అక్కను తీసుకొని రా..” అన్నడు. 

రామిరెడ్డి టూలు మీదున్న టిఫిన్ పేట్లను అందరికి అందిచ్చిండు. తినెటాల్లకు చాయె వచ్చింది. 

నీల్ల పొల్ల చాయె తాగిన  సీస గిలాసలు తీస్కోని పోయి ఇంట్ల పెట్టి.. ఈత సాప తీస్కచ్చి గోడకు పర్సింది.  అనసూయను తోలుకచ్చి కూకో పెట్టింది.  అనసూయ తల్లి సీతమ్మ.. మరో ముసలవ్వ సుత అనసూయ ఎంబడచ్చి దాపున కూకున్నరు.

అనసూయను సూడంగనే.. రవీందర్‌కు రమణారెడ్డి, సూర్యకాంతం జంట యాదికచ్చింది. తల్కాయె దించుకొని ఆలోసనల పడ్డడు.

“మాఊల్లె బడిలేక  అనసూయ సదువుకోలేదు. కాని ఇంటి సార్గమంతవత్తది. ఏదైనా సహి చెప్పాలె.. గప్పాలకు పోవద్దు” అన్నడు రామిరెడ్డి.

“రామిరెడ్డీ.. వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెండ్లి చెయ్యాలన్నరు కాని నేను నీకు ఒక నిజం చెపుతా..” అన్కుంట సమ్మయ్య దిక్కు సూసిండు బుచ్చయ్య. సమ్మయ్య చెప్పుమన్నట్టే మొకం పెట్టిండు. 

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages