'మోదక తృతియ' విశిష్టత! - అచ్చంగా తెలుగు

 'మోదక తృతియ' విశిష్టత!

-సుజాత.పి.వి.ఎల్.
సైనిక్ పురి, సికిందరాబాద్.

భారతీయ స్త్రీలు పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం, ఆయురారోగ్య ఐశ్వర్య, సంతాన వృద్ధి కోసం ఎన్నో నోములు వ్రతాలు చేస్తుంటారు. వాటిలో ఉండ్రాళ్ల తద్ది ఒకటి. పౌర్ణమినాటికి చంద్రుడు పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రానికి సమీపంలో ఉంటాడు కాబట్టి ఈ మాసాన్ని భాద్రపద మాసం అంటారు. ఇక భాద్రపద శుద్ధ చవితి. అనగా అందరికీ తెలిసిన పర్వదినమే. విద్యల ఒజ్జ వినాయకుడు పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు.  భాద్రపద బహుళ తదియ రోజును ఉండ్రాళ్ళ తదియ అంటాము. స్త్రీలు సద్గతులు పొందడానికి ఈ ఉండ్రాళ్ళ నోమును ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ నోముకు మోదక తృతీయ అని కూడా పెరు. ఉండ్రాళ్ళ నివేదన కలిగిన నోము కావడంతో ఉండ్రాళ్ళ తద్దెగా పిలవబడుతుంది. ఇది రెండ్రోజుల పండుగ. ఈ నోము గురించి సాక్షాత్తు పరమ శివుడు పార్వతి దేవికి వివరించాడు అని పురాణాలు చెబుతున్నాయి. ముందు రోజు ఐదుగురు ముత్తైదువులకి గోరంటాకు, పసుపు కుంకుమలు, కుంకుడు కాయలు, నలుగు పిండి, నువ్వులనూనె ఇచ్చి,రేపు ఉదయం  మాయింటికి తాంబూలము తీసుకోవటానికి రమ్మని ఆహ్వానించాలి. ముత్తైదువులు, నోము ఆచరించే వారు గోరింటాకు పెట్టుకొనవలెను. రెండవ రోజు : భాద్రపద తృతీయ నాడు ఉదయాన్నే 4 గంటలకు లేచి గోంగూర పచ్చడి, గడ్డ పెరుగుతో భోజనము చేయవలెను. 

 తెల్లవారినాక అభ్యంగన స్నానమాచరించి  వచ్చిన ముత్తైదువులతో కలసి మూడు ఇళ్ళలో ఉయ్యాల ఊగవలెను. సాయంత్రం వరకు ఎటువంటి పదార్థాలు తినకుండా ఉపవాసం చేయాలి. బియ్యపు పిండితో చేసిన ఉండ్రాళ్ళను చేసి వాటిని వండి గౌరీ దేవికి, మరో ఐదు ఉండ్రాళ్ళను ఐదుగురు ముతైదువులకు వాయనమివ్వాలి. 

సమస్త శుభాలను చేకూరాలని కోరుతూ మధ్యాహ్నం గౌరీ పూజను చేయాలి. ఐదు దారపు పోగులు పోసి, ఐదు ముడులు వేసి, ఏడు తోరాలను అమ్మవారి పక్కనే వుంచి పూజించాలి. ఒక తోరం గౌరీదేవికి, ఒకటి వ్రతం చేసుకుంటున్న మహిళకి, మిగితా ఐదు, ఐదుగురు ముత్తైదువులకు కట్టాలి. బియ్యపు పిండిలో బెల్లము కలిపి, పచ్చి చలిమిడి చేసి, ఐదు ఉండ్రాలను చేసి వ్రతకథ చదువుకున్నాక ఆ అయిదు ఉండ్రాళ్ళు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. కథ అక్షంతలు నెత్తిన వేసుకుని..ఐదుగురు ముత్తయిదువులకు ఉండ్రాళ్ళ వాయనం ఇచ్చి.."ఇస్తినమ్మా వాయనం..పుచ్చుకుంటినమ్మా వాయనం..నా వాయనం పుచ్చుకుందెవరు?..నేను సాక్షాత్తు గౌరీదేవిని"..అని మూడుసార్లు అనుకున్నాక..

ముత్తయిదువుల కాళ్ళకు నమస్కరించి..వారి ఆశీస్సులు పొంది, అక్షతలను శిరస్సుపై వేయించుకోవాలి. ఈ ఉండ్రాళ్ళ తద్ది నోమును ముఖ్యంగా పెళ్ళికాని కన్యలు ఆచరించడం వలన విశేషమైన ఫలితాలను పొందుతారని, మంచి భర్త లభిస్తాడని, పెళ్ళైన మహిళలు చేస్తే సకల సౌభాగ్యం, ఐదవతనం సంప్రాప్తిస్తుందని పురాణాల్లో తెలుపబడింది. 

****

No comments:

Post a Comment

Pages