పల్లె బాట - అచ్చంగా తెలుగు
 పల్లె బాట     
 డాక్టర్ బి.యన్.వి.పార్ధసారధి 



రమేష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు. అతని తల్లిదండ్రులు రాయలసీమ లో ఒక మారుమూల పల్లెటూరులో వుంటారు. రమేష్ తండ్రి గ్రామీణ బ్యాంకు లో మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఉద్యోగ రీత్యా అతను దాదాపు  నాలుగు దశాబ్దాలు ఉభయ  గోదావరి జిల్లాలలో విస్తృతంగా తిరిగాడు. వాళ్లకి రమేష్ ఒక్కగానొక్క కొడుకు. రమేష్ చిన్నప్పటినుంచి చదువులో బాగా శ్రద్ధ కనబరిచేవాడు.  కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ కోర్స్ చేసి క్యాంపస్ ప్లేసెమెంట్ లో ప్రముఖ ఐ . టీ . కంపెనీ లో ఉద్యోగం రాగా హైదరాబాద్ తరలి వచ్చాడు. అతనికి ఇటీవలే పెళ్లి అయ్యింది. భార్య  జానకి కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఆమెకూడా హైదరాబాద్ లోనే పని చేస్తుంది.

రమేష్ తండ్రి బ్యాంకు నుంచి రిటైర్ అయ్యాక రాయలసీమలోని  వాళ్ళ స్వగ్రామానికి వెళ్లి  వ్యవసాయం మొదలుపెట్టాడు. తాత  ముత్తాతల కాలం నుంచి వున్న ఇరవై ఎకరాల  బీట భూమి ని ఆయన తన స్వయంకృషితో పంట భూములుగా మార్చాడు. కాలువలు తవ్వించి, చెరువుల  పూడిక తీయించి ఆయన తమ పొలాలకు చుట్టుపక్కల వున్న గ్రామాలలోని చాలామంది రైతులకి సాగు నీరు, తాగునీరు అందుబాటులోకి వచ్చేలాగా ఎంతో కృషి చేసాడు. చుట్టు పక్క గ్రామాలలోని ప్రజలకి తలలో నాలుకలా వుంటూ, వారికి బ్యాంకు ఋణాలకి హామీ ఇచ్చి ఆర్ధిక సహాయం లభించటానికి తనవంతు ప్రయత్నం చేస్తూ ఉంటాడు.  

అనతి కాలం లోనే రమేష్ తండ్రి ఇరవై ఎకరాల పొలాన్ని యాభై ఎకరాలు చేసాడు. ఆయన తన కొడుకు రమేష్ మీద ఎంతమాత్రం ఆర్ధికంగా ఆధారపడడు . పైగా ప్రతీ ఏడూ పండగలకి , పుట్టినరోజులకి, రమేష్ పెళ్లి రోజుకి బహుమతి రూపంగా ఆయన బాగానే డబ్బు పంపుతూ ఉంటాడు.
ఇది ఇలా ఉండగా అనుకోకుండా కరోనా మహమ్మారి వచ్చి పడింది. దానితో మొదట్లో వర్క్ ఫ్రమ్  హోమ్ అన్నారు. క్రమేపీ ఐ . టీ . కంపెనీలలో ఉద్యోగస్తులకి బోనసులు, ప్రమోషన్స్ నిలిపి వేశారు. రమేష్ భార్య జానకి కొంత కాలానికి తన ఉద్యోగం కోల్పోయింది. రమేష్ ప్రముఖ ఐ . టీ . కంపెనీ లో ఉద్యోగం చేస్తూవుండటం వల్ల బోనసులు, ప్రమోషన్స్ లేకపోయినా జీతం మాత్రం ఇబ్బంది లేకుండా ప్రతీ నెలా గట్టెక్కిస్తున్నాడు.

ఇదిలా ఉండగా రమేష్ , జానకిల మ్యారేజ్ డే సందర్భంగా రమేష్ వాళ్ళ నాన్న రమేష్ బ్యాంకు అకౌంట్ కి  డబ్బులు పంపాడు. ప్రతీసారి తన నాన్న పంపే డబ్బు కన్నా ఈ సారి బాగా అధికమొత్తం రావటంతో  తమ లాక్ డౌన్ కష్టాల దృష్ట్యా ఈ సారి  నాన్న ఎక్కువ డబ్బులు పంపించారని రమేష్ వెంటనే గహించాడు.

కొన్నాళ్ల తరువాత రమేష్ పుట్టినరోజు వచ్చింది. అప్పుడుకూడా రమేష్ వాళ్ళ నాన్న కాస్త భారీగానే మళ్ళీ డబ్బులు పంపించాడు. 
కోవిడ్ మహమ్మారి ఇంతటితో ముగిసేది కాదని దీని తరువాత సెకండ్ వేవ్, థర్డ్  వేవ్ వరుసగా వచ్చే సూచనలున్నాయని రమేష్ మీడియాలో, వార్తా పత్రికలలో వస్తున్న సమాచారాన్ని బట్టి తెలుసుకున్నాడు. ముందు ముందు పరిస్థితులు ఇంకా ఇబ్బందికరంగా ఉండవచ్చని రమేష్ అంచనా వేసాడు. మరో రెండు వారాలకి రమేష్, జానకి హైదరాబాద్ లో మూటా ముల్లె సర్దుకుని రమేష్ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటున్న రాయలసీమ లోని మారుమూల గ్రామానికి వెళ్లారు. అది మారుమూల గ్రామమైనప్పటికీ జాతీయ రహదారి కి దగ్గరలో ఉండటం వల్ల అరగంట లోపు ప్రయాణం చేస్తే  ముప్పై కిలోమీటర్ల దూరం లో పెద్ద ఊరు వుంది. అక్కడ హాస్పిటల్స్, మాల్స్, అన్ని అందుబాటులో ఉంటాయి. 

రమేష్ వాళ్ళ గ్రామం లో సుమారు నలభై గడపలు ఉంటాయి. చుట్టుపక్కల పది కిలోమీటర్ల దూరం లో పన్నెండు గ్రామాలు వున్నాయి. మొత్తం ఈ పదమూడు గ్రామాలలో దాదాపు అయిదు వందల ఇళ్ళు ఉంటాయి. ఈ పదమూడు గ్రామాలలో రమేష్ వాళ్ళ నాన్న మాట వేదవాక్కు. ఆయన చలవ వల్లనే సాగు నీరు, త్రాగునీరు వచ్చి తమ ఆదాయాలు పెరిగాయని రైతులందరూ ఆయన మాటకి ఎన్నడూ ఎదురు చెప్పరు. కోవిడ్ వల్ల రవాణా వ్యవస్థ లో ఇబ్బందులు ఏర్పడటంతో  దళారీలు ఈ ఇబ్బందులని తమకి అనుకూలంగా మలచుకుని పంటల్ని అతి తక్కువ ధరలకు బేరం చేయటం వల్ల రైతులు తమ కష్టానికి సరిపడ ఆదాయం లభించక అసంతృప్తికి గురయ్యారు. రమేష్ వాళ్ళ నాన్న ఎంతగా ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం చేకూరలేదు. 

రమేష్ ఈ పరిణామాలన్నిటినీ సునిశితంగా పరిశీలించసాగాడు. పదమూడు గ్రామాల రైతులందరికీ రెండు వాట్సాప్ గ్రూప్ లు ప్రారంభించాడు. దరిదాపుల్లో వున్న పట్టణాలలోని తన తండ్రి పరిచయస్థులందరికీ   విస్తృతంగా  ప్రచారం చేసి వాళ్లకి  కావలసిన ఆహార ధాన్యాలు, కూరలు, పళ్ళు  తమ రైతులు ఇంటికే సరఫరా చేస్తారని చాటింపు చేసాడు. దరిదాపున వున్న పట్టణాలనుంచి రవాణాకి వాహనాల్ని కూడా సిద్ధం చేసాడు. ఆన్ లైన్ ద్వారా రైతులకి వారి అమ్మకాలకి డబ్బు ముట్టేట్టు రమేష్ సదుపాయాలూ కల్పించాడు.  ఈ వార్త ఆనోటా, ఆనోటా పాకి చుట్టుపక్కల పట్టణాలనుంచి జనం వాట్స్ అప్ ద్వారా రైతుల వద్ద తిన్నగా కొనుగోలు చేయసాగారు. దళారీల బెడద తప్పి తిన్నగా కొనుగోలుదారులకు సరుకులు అమ్మగలగటంతో  రైతులు బాగా లాభపడ్డారు.

లావాదేవీలు బాగా పెరగటంతో రమేష్, అతని తండ్రి ప్రణాళికాబద్దంగా ప్రతీ గ్రామం నుంచి ఒక రిద్దరు వ్యక్తులకి తరిఫీదు ఇచ్చి ఆ గ్రామానికి సంబంధించిన పంటల అమ్మకాలకి సంబంధించిన వ్యవహారాలన్నీ వాళ్ళే చేసుకునేలా చర్యలు చేబట్టారు. 

కోవిడ్ తదనంతరం తమ గ్రామాల్లో జరిగిన ఈ మార్పులని తెలుసుకున్న కొంతమంది యువకులు రమేష్ లాగా నగరాలు వీడి పల్లెబాట  పట్టారు. పల్లెబాట పట్టిన ఈ  యువకుల సహకారంతో ఇప్పుడు రమేష్, అతని తండ్రి ఇద్దరు కొన్ని రోజులలో చుట్టుపక్కల పట్నాలలో " రైతు దుకాణాలు" ప్రారంభించటానికి వ్యూహం పన్నుతున్నారు.

ఇంతలో కోవిడ్ రెండో దశ రానే వచ్చింది. మరో పది మంది యువకులు నగరాలనుంచి తమ గ్రామాలకి తిరిగి వచ్చారు. ఈ యువకుల అందరి సహకారంతో భవిష్యత్తులో తమ పదమూడు గ్రామాల రైతులకి ప్రత్యేక వెబ్ సైట్ తో పాటు ఒక లోగో తయారుచేసి తమ వ్యవసాయ ఉత్పత్తులని, అమ్మకాలని ఇంకా విస్తృతంగా అభివృద్ధి చెయ్యడానికి , కొన్ని వాహనాలను కొనుగోలు చేసి తమ గ్రామాలనుంచి చుట్టు పక్కల పట్టణాలకు సొంతంగా సరుకుల బట్వాడా చెయ్యడానికి రమేష్, అతని మిత్రులు ఇప్పుడు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు.  ఇప్పుడు అక్కడి గ్రామాలలోని చాలా మంది రైతులకి మోటారు బైకులు వున్నాయి. చాలామంది యువకులు ఇప్పటికే పట్టణాలనుంచి తమ గ్రామాలకి తిరిగి వచ్చారు. ఇంకా పట్టణాలలోనే వున్న కొంతమంది యువకులకు, వారి కుటుంబాలకి కోవిడ్  సహాయ నిధి కింద ప్రతీ నెలా వారి తల్లి దండ్రులు గ్రామాలనుంచి డబ్బు పంపిస్తున్నారు. 

***

No comments:

Post a Comment

Pages