ఉద్దండరాయ శతకము - దిట్టకవి రామచంద్రకవి - అచ్చంగా తెలుగు

ఉద్దండరాయ శతకము - దిట్టకవి రామచంద్రకవి

Share This

ఉద్దండరాయ శతకము - దిట్టకవి రామచంద్రకవి

పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 




కవి పరిచయం:

దిట్టకవి రామచంద్రకవి గురించి మనము గతంలో మహిషాసురమర్ధని శతక పరిచయంలోను, రఘుకులతిలక శతక పరిచయంలోను మనము తెలుసుకున్నాము. ఉభయభాష పండితుడైన ఈకవి చిరకాలము వాసిరెడ్డి వారి సంస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు.

నూజీవీడు ప్రభువుల సంస్థానములో గల మద్దాలి లో వెలసిన ఉద్దండరాయ స్వామిని గూర్చి ఈశతకము రచించెను.

శతక పరిచయం: "మద్దాలి యుద్దండరాయ! జయశ్రీసువిధేయ! భక్తజనగేయా! నిత్యభాగ్యోదయా!"అనే మకుటంతో భక్తిరస ప్రధానంగా రచించిన ఈశతకంలో మత్తేభ వృత్తంలో రచించిన 102 పద్యాలున్నాయి. శతకమంతయు జకారము ప్రాస స్థానమున కవి ఉపయోగించినాడు. ఈశతకములోని పద్యభావములు మనోహరముగా ఉండి చదినవారికి అత్యంత ఆహ్లాదము కలిగించును.

కవి శతకాన్ని పూర్వకవిత్వ ధోరణిలో భగవత్ప్రార్థనతో ప్రారంభించాడు.

మ. అజకాంతన్ భజియించి భాగవతులం బ్రార్థించి దెందంబునన్
గజవక్త్రుం బ్రణుతించి తొంటికవులం గైవారముల్ చేసి ప్రే
మ జోహార్జోహా రటంచు సాగిలియెదన్ మద్దాలి యుద్దండరా
య! జయ శ్రీసువిధేయ! భక్తజనగేయా! నిత్యభాగ్యోదయా!


మ. వ్రజకాంతాహృదయేశ సన్మునిజనవ్రాతాత్మసంవేశ నీ
డజరాజధ్వజపోషితేంద్రజనిరూఢప్రాభవోపేత ధ
ర్మజరాజ్యప్రతిపాదనాత్మయుత శ్రీ మద్దాలి యుద్దండరా
య! జయ శ్రీసువిధేయ! భక్తజనగేయా! నిత్యభాగ్యోదయా!

మ. గజరాడ్రక్షక నాకుఁగపడవె నేగన్గొందు నీపాదపం
కజముల్ నీవదనారవిందమును నీకన్దమ్ములుం గామసో
మజయంతాదుల గేరు చక్కదనమున్ మద్దాలి యుద్దండరా
య! జయ శ్రీసువిధేయ! భక్తజనగేయా! నిత్యభాగ్యోదయా!

మ.గజపుష్పాంచితదివ్యదామములతోఁ గల్యాణచేలంబుతో
భుజకీర్తుల్ మొదలైనసొమ్ముగమితోఁ బొల్పారునీలంపుబొ
మ్మజిగిన్ గన్పడవయ్య మ్రొక్కులిడెదన్ మద్దాలి యుద్దండరా
య! జయ శ్రీసువిధేయ! భక్తజనగేయా! నిత్యభాగ్యోదయా!

ఊద్దండరాయ స్వామిని ఈకవి సర్వదేవతా స్వరూపంగా భావించి కీర్తించాడు. కొన్నిచోట్ల రామునిగా కృష్ణునిగా పరమేశ్వరునిగా కీర్తిస్తే మరికొన్ని చోట్ల హయగ్రీవావతారంగా  నుతించాడు.

మ, భజనీయైకనిగాఢాహుంకృతులు సంభావించి వందారువా
గ్మిజనశ్రేణికి విద్యలిత్తువు హయగ్రీవాకృతిన్ నీవు సా
మజచర్మాంబరపూజితాంఘ్రియుగళా మద్దాలి యుద్దండరా
య! జయ శ్రీసువిధేయ! భక్తజనగేయా! నిత్యభాగ్యోదయా!

రామాయణ, భారత, భాగవతాలలోని కొన్ని వృత్తాంతాలను ఈకవి ఈశతకంలో పొందుపరిచాడు.

మ. విజయున్ భీమునివెంటదోడ్కొని రణోర్విన్ భీముచేతన్ గిరి
వ్రజనాథుం బొలియించి చేసితివి నిర్వ్యాజార్థసంసిద్ధి ధ
ర్మజునింగూర్చిటు యుక్ష్యమాణునిగ శ్రీమద్దాలి యుద్దండరా
య! జయ శ్రీసువిధేయ! భక్తజనగేయా! నిత్యభాగ్యోదయా!

మ. భజియింపన్ నవనీతమై యమృతమై పూదేనెయై నారికే
రజలంబై గుడమై రుచించు మృదుసారంబైన నీరామనా
మజపం బెంతటియోగ్యభోగ్యఫలమో మద్దాలి యుద్దండరా
య! జయ శ్రీసువిధేయ! భక్తజనగేయా! నిత్యభాగ్యోదయా!

మ. రజనీచారుఁడు సీతఁ గొంచు జన తద్రక్షఃపతిన్ దాఁకి వీఁక
జటాయుఃఖగమీల్గె నీకొఱకుఁ దత్కాయంబు సంగ్రామక
ర్మజితంబౌటకు నెంతపుణ్యఫలమో మద్దాలి యుద్దండరా
య! జయ శ్రీసువిధేయ! భక్తజనగేయా! నిత్యభాగ్యోదయా!

దశావతారవర్ణనము ఈకవి ఒకే పద్యంలో నిర్వహించిన తీరు చూడండి

మ. త్రిజగంబుల్ భరియించి ప్రోతు వెపుడున్ దేవావళుల్ మెచ్చ నం
డజనుః కూర్మ వరాహ సింహ వటురా త్సంతానజిద్రామ రా
మజిన శ్రీకలికి స్వరూపములచే మద్దాలి యుద్దండరా
య! జయ శ్రీసువిధేయ! భక్తజనగేయా! నిత్యభాగ్యోదయా!

శతకాంతమున ఈకవి తనగురించి తాను చెప్పికొనినాడు

మ. ద్విజరాడ్వాహన నేను దిట్టకవిసూతిన్ గశ్యపర్షీంద్రగో
త్రజుఁదన్ నామము రామచంద్రుఁడు భద్దాసుండ నాయందుఁబ్రే
మజిగుర్పన్ శతకంబు గైకొనుము శ్రీమద్దాలి యుద్దండరా
య! జయ శ్రీసువిధేయ! భక్తజనగేయా! నిత్యభాగ్యోదయా!

భక్తిరసప్రధానమై, చక్కని భావాత్మకమైన పద్యములతో అలరారే ఈశతకం అందరు తప్పక చదవ వలసినది.

మీరుకూడా చదవండి !!! మీ మిత్రులచే చదివించండి.

***

No comments:

Post a Comment

Pages