సమయం విలువ
 పి.యస్.యమ్. లక్ష్మి
అనగా
అనగా ఒక చిట్టడవి.  అందులో అనేక రకాల
పక్షులు, జంతువులు వుండేవి.     వాటిలో ఒక
అందమైన బుజ్జి పిట్ట కూడా వుంది. ఆ బుజ్జి పిట్ట చాలా చలాకీగా వుంటుంది.  ఎప్పుడు చూసినా పాడుకుంటూ హాయిగా ఎగురుతూ
సరదాగా వుండేది.  ఒక రోజు ఒక వేటగాడు ఆ
అడవికి వచ్చాడు.  ఈ బుజ్జి పిట్టను చూసి
చాలా బాగుంది. చక్కగా పాడుతోంది అని వల వేసి దాన్ని పట్టుకున్నాడు.  పాపం వలలో పడ్డ బుజ్జి పిట్టకి పాటలు రావటం
లేదు.  వేటగాడి చేతికి చిక్కానే, ఎలాగా? అని
బాధ పడింది.  ఇంకెప్పుడూ పగలు పాడ
కూడదు.  పగలు పాడుతూ, ఇలా హాయిగా తిరగటం
వల్లనే కదా ఈ వేటగాడికి చిక్కాను. ఎలాగైనా ఈ గండం గడిచి బయట పడితే చాలని అటూ ఇటూ
చూస్తుంటే ఆ దారిన పోతున్న ఎలుక కనిపించింది. 
“ఎలుకన్నా, ఎలకన్నా, నేను బుజ్జి పిట్టను .. నా పాటను నువ్వు
మెచ్చుకుంటావు కదా.  ఇటు చూడు.  ఈ వేటగాడి వలలో చిక్కుకున్నాను. నన్ను
రక్షించవా?” అని  ఎలుకను పెద్దగా పిలుస్తూ
అడిగింది.
ఎలుక
కూడా బుజ్జిపిట్ట వలలో పడటం చూసి బాధ పడింది. 
చక్కగా పాటలు పాడుతూ చలాకీగా తిరిగే బుజ్జి పిట్ట వలలో పడింది.  వేటగాడు దీన్ని చంపేస్తాడు. ఎలాగైనా దీన్ని
రక్షించాలి .. ఇది నాకు బాగా చేతయిన విద్యేకదా. 
ఎన్ని జంతువులను రక్షించలేదు అనుకుని ఆ పిట్ట వున్న చోట వలను కొరికేసింది.
దాంతో ఆ పిట్ట హాయిగా ఎగిరిపోయింది.
కానీ
బుజ్జి పిట్టకి వలలో పడటంవల్ల కలిగిన భయం తగ్గలేదు.  అది కొన్నాళ్ళు పాడటం మానేసింది.  తన పాట విని మళ్ళీ వేటగాడు వచ్చి వల
వేస్తాడేమోననే భయంతో.  కానీ పాట పాడటం
దానికి సహజంగా వున్న గుణం. ఎన్నాళ్ళని మానుకోగలదు.  అందుకని అదేం చేసింది!? 
పాట పాడకుండా వుండలేదు గనుక రాత్రిళ్ళు పాడటం మొదలు పెట్టింది.   
రాత్రంతా
అదలా పాడటంతో మిగతా పక్షులకి విశ్రాంతి వుండేది కాదు.  అసలే రాత్రిళ్ళు చెట్లమీద తిరిగే అడవి
పిల్లులూ, ఇంకా మిగతా జంతువులనుంచి వాటిని కాపాడుకుంటూ వుండాలి అవి.  ఈ పాట మూలంగా అవ్వన్నీ వెతుక్కోనవసరం లేకుండానే
ఇక్కడ పిట్టలున్నాయని ఇక్కడికి వచ్చి తమని చంపుతాయి.  అందుకని అవన్నీ కలసి బుజ్జి పిట్టకి బుధ్ధులు
చెప్పాయి.  “మనం ఎప్పుడే పని చెయ్యాలో అదే
చెయ్యాలి. పగలు ఆహారం సంపాదించుకోవాలి. రాత్రిళ్ళు విశ్రాంతి తీసుకోవాలి.  నువ్వు చూడు! వేటగాడి భయంతో పగలు బయటకి
వెళ్ళకుండా, ఆహారం లేకుండా ఎలా చిక్కి పోయావో! 
ఎన్నాళ్ళని ఇలా సరిగ్గా తినకుండా వుంటావు? 
రాత్రిళ్ళు నీకు ఆహారం ఎలా కనబడుతుంది? 
చీకట్లో నువ్వు ఎంత దూరం ఎగర గలవు? 
అది ఎంత ప్రమాదం? 
ప్రమాదాలు
వేటగాడి వల్లనే కాదు ఇంకా అనేక విధాల వస్తాయి. తెలివిగా తప్పించుకోవాలిగానీ, ఇలా
ముడుచుకుని కూర్చుంటే వచ్చే ప్రమాదాలు ఆగిపోవు. 
ఇప్పుడు చూడు.  నువ్వు రాత్రిళ్ళు
పాడటం వల్ల అడవి జంతువులకి మనమిక్కడ వున్నామని తేలిగ్గా తెలుస్తుంది.  అవి ఏ ఇబ్బంది లేకుండా వచ్చి మనల్ని
గుటుక్కుమనిపిస్తాయి.  సమయంగాని సమయంలో
నువ్వు పాడే ఈ పాటల వల్ల నీకే కాదు, మా అందరికీ కూడా ప్రమాదం తెచ్చి పెడుతున్నావు.  మనం ఎప్పుడే పని చెయ్యాలో అప్పుడే
చెయ్యాలి.  కొంచెం ఆలోచించు ..” అని బుధ్ధి చెప్పాయి.
బుజ్జిపిట్ట
కూడా ఆలోచించింది.  పెద్ద పిట్టలు చెప్పిన
మాటలు నిజమేకదా.  ఏ సమయంలో ఏ పని చెయ్యాలో
అదే చెయ్యాలి.   వేటగాడు వల వేసి
పట్టుకున్నాడు కదాని రాత్రిళ్ళు పాడితే తన పాట విని వచ్చిన జంతువులు తనెక్కడ వుందో
తేలిగ్గా కనిపెట్టెయ్యటమేగాక, తనతోపాటు మిగతా పిట్టలనికూడా చక్కగా తినేసి
వెళ్తాయి.  నేనిదంతా ఆలోచించలేదు.  అపాయాలు ఎక్కడైనా వున్నాయి.  సరైన జాగ్రత్త తీసుకుంటూ తనని తను
కాపాడుకోవాలిగానీ, సమయం కాని సమయంలో  ఏ పని
పడితే అది చేస్తే తనకే కాదు, తనవాళ్ళకి కూడా చెడు చేస్తాననే ఆలోచన వచ్చింది.  అప్పటినుంచి సరైన సమయంలో సరైన పని చేస్తూ, తన
జాగ్రత్తలో తను వుంటూ తనని కాపాడుకుంటోంది.
 

 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment