పునరావృతం - అచ్చంగా తెలుగు
పునరావృతం
మాచవోలు శ్రీధర రావు 


 రైలు వచ్చి ఆగగానే ప్లాట్ఫాం మీది ప్రయాణీకుల హడావిడి, వారిని సాగనంపడానికి వచ్చిన వారి ఆదరాభిమానాల కోలాహలం నడుమ ఎలాగోలా రైలెక్కి బెర్త్ మీదికి చేరుకున్నాను.

 అలసిన ముఖంతో చెమటలు క్రక్కుకొంటూ వచ్చి నా ఎదురు బెర్త్ పై కూర్చుంది ఆ అమ్మాయి. అమ్మాయేమి కాదులెండి, మూడు రోజుల క్రితం నా ఆప్త మిత్రుడు ప్రసాద్ తమ్ముడి కొడుకు పెళ్ళిలో ఆమెను చూచినప్పటి నుండి ఆమెలో ఒక  అమ్మాయి మాత్రమే నాకు కనిపించ సాగింది. బాగా చదువుకొని చక్కటి సంస్కృతి, సంస్కారము కలిగి యున్న ఆధునిక మహిళలా కనిపించే ఆమెకు ఐదారు తక్కువ అరవై ఏళ్లుంటాయి. నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్నఆవిడ పెళ్ళిలో ముందుండి అన్నీ నడిపించడంతో బహుశః అందరిని కూడా ఆకట్టుకునే ఉంటుంది. పెళ్ళిలో కలసిన నన్ను మళ్ళీ రైల్లో చూడగానే పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ చిరునవ్వొకటి కురిపించింది.

నేనూ నవ్వాను.

"పెళ్ళికే అని వచ్చినా సొంతవూరే కాబట్టి కొందరు బంధువులను, మిత్రులను కలసి వెళదామని ఇవాల్టికి రిజర్వ్ చేయించుకున్నాను "అలాగా" అన్నట్లు తలాడించింది. సంభాషణ కొనసాగిస్తూ " పెళ్ళిలో బాగా అలసిపోయినట్లున్నారు. అంతా భారాన్ని మీరే తీసుకున్నట్లుంది. పెళ్లి బాగా చేశారని అందరూ మెచ్చుకున్నారు," అన్నాను.  "

సొంత చెల్లి కూతురి పెళ్లికి అంత మాత్రమైనా చేయక పొతే ఎలాగండి? అయినా ఇవాళే తిరుగు ప్రయాణమవుతున్నాను కదా!" అన్నది ఆమె. తనతో మాట్లాడుతుంటే చాలా దగ్గరి వ్యక్తితో మాట్లాడినట్లే అనిపించ సాగింది.

"మాది కూడా ఈ వూరే అయినా నేను పెరిగిందంతా చెన్నైలోనే. కేవలం నా పెళ్లి సందర్భంగా కొద్ది రోజులు మాత్రమే ఇక్కడ గడిపే అవకాశం కలిగింది." దగ్గరి వాళ్ళతో లాగే చనువుగా మాట్లాడింది. స్వతహాగా నేను తక్కువగా మాట్లాడే వాడినే అయినా ఈ అమ్మాయితో ఎందుకో మాట్లాడాలనే అనిపించింది. "నేనూ అంతేనండీ, చదువు కాగానే ఉద్యోగరీత్యా పాతికేళ్ళు దేశమంతా తిరిగిన తర్వాత హైదరాబాద్ చేరుకున్నాను. పెళ్లికి కొద్దిరోజులు అటుఇటు మాత్రమే ఇక్కడ గడపగలిగాను, శ్రీమతి ఊరు కూడా ఇదే కాబట్టి." అంటూనే "అయినా ఈ కాలపు పిల్లల్లాగా పెళ్లి విషయంలో మన ఇష్టమొచ్చినట్లుగా ఎంపికకు వీలయ్యేది కాదు. చాలాకష్టాల నెదుర్కోవలసి వచ్చేది. ఫలానా అమ్మాయిని చేసుకో, ఫలానా వాళ్ల సంబంధం మనకొద్దు అంటూ తల్లిదండ్రులు, బంధువులు, మిత్రుల నుండి విపరీతంగా ఒత్తిళ్ల నెదుర్కొనే వాణ్ణి. ఇక ప్రేమ పెళ్లిళ్లంటారా, వాటికీ ముందు వెనక సమస్యలనేవి ఉండనే వుంటాయని భావించే వాణ్ణి. " అన్నాను.

అవునండీ, ఆ రోజుల్లో అలాంటి ఒత్తిళ్లు అమ్మాయిలకైతే ఇంకాస్త ఎక్కువగానే వుండేవి. అబ్బో మా అమ్మయితే మరీను..." ఏదో గుర్తుకు తెచ్చుకుంటున్నట్లుగా తనలో తను నవ్వుకుంది. “ఇలాంటివి నాకైతే చాలానే ఎదురయ్యాయి. మొండి వాణ్ణిగాపేరు బడ్డ నేను గట్టిగానే ఎదురొడ్డి నిలవ గలిగాను. కానీ ఒక్కమ్మాయి విషయంలో మాత్రం కేవలం నా ఆలోచనల కోసం చాలా మందిని బాధ పెట్టాననే భావన నన్నెప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది." గాఢంగా నిట్టూర్చాను. "అవునా ఎందుకలా జరిగింది?" మీకిష్టమైతే మీ బాధను కొంతైనా పంచుకోవడానికి సిద్ధంగా వున్నానన్నట్లు ఆసక్తి కనబరుస్తూ అడిగింది. “ఇదిగొ చెబుతా వినండం”టూ చెప్పడం  ప్రారంభించాను. "నేనప్పుడు ఆరవ తరగతి. మా పిన్ని, బాబాయ్ వాళ్ళ దగ్గర వుండి చదువుకుంటూ వుండేవాణ్ని. పిన్ని కొడుకు భాస్కర్ నేను ఒకే వయసు వాళ్ళం, ఒకే క్లాసు చదువుతుండే వాళ్ళము. పక్కింట్లో అప్పుడే ఒకకుటుంబం అద్దెకు దిగారు. ప్రభుత్వోద్యోగులట ట్రాన్స్ఫర్ మీద ఆ ఊరికి వచ్చారట. వాళ్ళు భార్య, భర్త, ఇద్దరు పిల్లలు. అత్తయ్యకు (అంటే అప్పట్లో 'ఆంటీ' ల సంస్కృతి లేదుగా! నోరారా అత్తయ్య అని, మామయ్యా అని పిలిచే వాళ్ళం) మాపిన్నికి ఏర్పడ్డ స్నేహం మెల్లగా మామయ్యకు బాబాయికి,  తర్వాత పిల్లలమైన మాకు విస్తరించి అనతి కాలంలోనే అభివృద్ధిచెందింది. పెద్దవాళ్ళు కలసి కబుర్లు చెప్పుకోవడాలతో, కమ్మటి వంటకాలు అటునిటు మార్చుకోవడాలు, పిల్లలం అంటేనేను, భాస్కర్, వాళ్ళ ఆరేళ్ళ పాప, నాలుగేళ్ల బాబు కలసి చక్కటి ఆటపాటలతోను, అల్లర్లతోను ఉల్లాసంగా గడపడాలు నిత్య కృత్యాలుగా కొనసాగుతూండేవి. సినిమాలైనా, షికార్లయినా, గుళ్ళు, గోపురాలకైనా రెండు కుటుంబాల వాళ్ళందరము కలిసే వెళ్లే వాళ్ళం. పిల్లలందరం చేరి  చేసే అల్లరికి పెద్దవాళ్లెప్పుడూ అడ్డం చెప్పలేదు.అలా రెండేళ్లు గడియారాలు, కేలండర్లు పరుగులు తీశాయి.

బాబాయికి వేరే ఉరికి బదిలీ అయింది. మేమా ఊరు వదలాల్సి వచ్చింది. నేనైతే అమ్మ నాన్నాలున్న గ్రామానికే వచ్చేసి పక్కగ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతిలో చేరాను. కొంత కాలానికి మామయ్యా వాళ్ళక్కూడా బదిలీ అవడంతో మరో చోటికి వెళ్లి పోయారు. ఆతర్వాత కొన్నేళ్ల వరకు వాళ్లకు మాకు సంబంధాలు లేకుండా పోయాయి. ఆ కాలంలో ఇప్పట్లాగా సెల్ ఫోన్ల వంటి సౌకర్యాలు లేవు కదా! నాకేమో వాళ్ళ గురించి తెలుసుకోవాలని, కలవాలని అప్పుడప్పుడు అనిపిస్తుండేది. ...." నా వాక్ప్రవాహానికి చిన్న విరామమన్నట్లుగా ఆపాను. ఆమెలో పెల్లుబికిన ఉత్సాహాన్ని, మరికొంత ఆత్రుత కొద్దిపాటి ఆందోళనలను దాచుకోలేక పోయింది."వాళ్ళను మళ్ళీ కలవనే లేదా?" అనడిగింది. "చెబుతాను" అంటూ కొన్ని మంచినీళ్లను త్రాగి కొనసాగించాను. "అయితే  వాళ్ళ  ఆచూకీని మా అమ్మ ఎలాగో కనిపెట్టింది. ఆ తర్వాత వాళ్ళకు మరొక పాప కూడా పుట్టిందట. వాళ్ళ కబుర్లు చెబుతూండేది. కుదిరినప్పుడు అంటే రెండు మూడు నెలల కొకసారి అమ్మ, అత్తయ్య కలుసుకుంటుండే వారట. కాని అప్పటికే నేనుచదువులకని దూరం వెళ్లాల్సి వచ్చింది. అత్తయ్య నన్ను ఎక్కువగా అడుగుతుండేదట. నేను ఉరికొచ్చినప్పుడు ఒకసారైనావెళ్లి రమ్మనేది అమ్మ. ఒకట్రెండు సార్లు కలిసాను కూడా. అత్తయ్య చాలా మంచిది, చిన్నప్పుడెలా ఉండేదో, ఎంత ప్రేమచూపేదో తర్వాత కూడా అంతగానే ఇష్టపడేది.

మామయ్య ఉద్యోగాన్నిదూరంగా ఎక్కడో ఉండి ఒంటరిగా సాగిస్తున్నారట. పెద్దపాప తమిళనాడులో బంధువుల ఇంట్లో ఉందట. పెద్దబ్బాయి దగ్గరలోనే ఎక్కడో చదువుకుంటున్నాడట.

 ఇక ఇక్కడి నుంచే అసలు కథ ప్రారంభమయింది. అమ్మ, అత్తయ్య ఏమ్మాట్లాడుకునే వారో కాని నా చదువు పూర్తి కాకముందే నా పెళ్లి కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. నన్ను ఇరకాటంలో పెట్టారు.

వాళ్ళ అమ్మాయిని అంటే నా చిన్నప్పుడు నాతో ఆడుకొనిన ఆ పాపను నేను పెళ్ళి చేసుకోవాలట. ఆ పెళ్ళి నాకెందుకో ఇష్టంలేదు. అయినా అత్తయ్య మామయ్య లంటే నాకు చాలా ఇష్టం. ఈ పెళ్లి ఇష్టం లేదని సూటిగా చెప్పలేక పోయాను. ‘వాళ్ళుమంచి వాళ్ళే కదా! ఏమిటి సమస్య?' అంటూ అమ్మ కూడా కాస్త తొందర పెట్టింది. 'ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోను, ఉద్యోగం రావాలని చెప్పాను. ఉద్యోగం వచ్చాక మళ్ళీ అడగ సాగారు. 'ఇది కాదు, ఇంకా మంచి ఉద్యోగం రావాలి, స్థిరపడాలి. నాకూ  కొన్ని ఆశయాలున్నాయి. పెళ్ళికి మరింత సమయం కావాలని మళ్ళీ  చెప్పాను.'అయినా నా కోసం వేచి చూడవద్దని' పరోక్షంగానైనా వాళ్ళకు తెలియజేయమని అమ్మకు చెప్పాను. 'వాళ్లకు నువ్వంటే చాలా ఇష్టమట. అలాంటి మంచి సంబంధాన్ని కాదన కూడదని ఎంతగానో నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు, అమ్మ నాన్నలు.

 ఇలా చెబితే ఆ అమ్మాయి కూడా బాధ పడుతుందేమోరా తర్వాతైనా చేసుకుందామని ఒక మాట చెబితే బాగుంటుందేమో' అన్నది అమ్మ. 'వాళ్ళు బాధ పడినా సరే అలా చెప్పవద్దు. మనకోసం వాళ్ళను కొన్నేళ్లు ఆగమనడం తప్పు. అలాగని మాట కూడా నేనివ్వ లేను.' అని కచ్చితంగా చెప్పేసాను. కాని అత్తయ్య మామయ్యలు బాధ పడతారేమో, ఆ అమ్మాయి కూడా ఏమనుకుంటుందో ఏమో అంటూ నాలో నేను చాలా ఆవేదనకు లోనయ్యాను.

 ఇక అమ్మ, అత్తయ్యలు ఏ నిర్ణయం తీసుకున్నారో ఏమో మళ్ళీ రెండేళ్ల వరకు ఆ ప్రసక్తే రాలేదు. అప్పటికి ఆ అమ్మాయికి పెళ్లయింది. 'తనకి మంచి మొగుడొచ్చాడు. వెతుక్కుంటూ వచ్చిన సంబంధాన్ని చేజేతులా పోగొట్టుకున్నామంటూ అమ్మనాలుగు చీవాట్లు పెట్టింది.

విషయం తెలుసుకొని గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి సంబరాలు చేసుకున్నాను. అంతటితో ఊరుకోక 'ఎందుకంత త్వరగా చేశారట ఆ అమ్మాయికి పెళ్లి' అంటూ ఆరాలు తీసాను. 'తనను పెంచి పెద్ద చేసిన మేనత్త అనారోగ్యంతో మంచమెక్కడం, ఆమె ఊపిరితో ఉండగానే మేనకోడలిని పెళ్లికూతురుగా చూడాలని కోరడంతో ఇలా జరిగిందని' అమ్మ చెప్పింది. మళ్ళీ నాలో బాధ మొదలయింది. 'నా వలన కదా ఆ అమ్మాయి యిష్టం లేని ఎవరితోనో హడావిడిగా పెళ్ళికి సిద్ధపడాల్సిరావడం' అంటూ రోదించాను. అత్తయ్య మామయ్యలు ఎంతగా విలపించారో ! అసలు వాళ్లందరికీ నా మీద ఎంత కోపంవచ్చిందో' అని పరితపించి పోయాను. 'నన్ను శపించకండి, మన్నించండి' అంటూ మనసులోనే వేడుకున్నాను.

 ఆ తర్వాత కొన్నేళ్లకు మామయ్య కాలం చేశారని తెలిసింది. ఈ విషయం మళ్లీ నన్ను కలచి వేసింది. 'అత్తయ్యతో మాట్లాడాలి, కాని ఎలా?

 అసలామె ముందు ఏ ముఖంతో నిలబడాలి? ఏమి మాట్లాడాలో తెలియని పరిస్థితి నాది. మొత్తానికి విచారింపుగా అన్నట్లు ధైర్యం చేసి అమ్మతో కలసి వెళ్లి అత్తయ్య ముందు మౌనంగా నిలుచుండి పోయాను. ఆమె నన్ను పల్లెత్తు మాటైనా అనలేదు. ఎంత గొప్ప హృదయం ఆమెది అనుకుంటూ లోలోపలే ఆ ఉత్తమురాలికి నమస్కరించుకున్నాను. ఆసమయంలో పిల్లలెవ్వరు లేరక్కడ.

 ఆ అమ్మాయినైతే నా ఏడవ తరగతి రోజుల తర్వాత మళ్ళీ చూడనే లేదు. కానీ ఆమె -  నా దృష్టిలో అమ్మాయి, ఊహూ ఆపాప చుట్టూ ఇంత కథ జరిగింది. జరిగినదంతా తనకొకసారి చెప్పి క్షమాపణ అడుగుదామని నాకైతే ఎప్పట్నించో వుంది. కాని తను దొరికే అవకాశమే కనిపించ లేదు," ఒక్క నిముషం పాటు దిగులుగా మౌనం వహించాను.  ఎదురుగా కూర్చున్న ఆమెలో ఏదో క్రొత్త ఉత్సాహం పెల్లుబుకుతున్నట్లుగా నాకనిపించింది. "చూడండి, మీ మాటలకు కొనసాగింపు కొంత కూర్చి  మంచి ముక్తాయింపు నిద్దామనుకుంటున్నాను.

 మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆమె జాడను మీరు తెలుసుకోవడం కష్టం కాదేమో! ఆ అమ్మాయి మీమీద కోపంతోను ద్వేషంతోను వుంటుందని భావించి ఆమెను కలవడానికి వెనుకాడుతున్నారనిపిస్తోంది. మీరు జంకు వీడితే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నేననుకుంటున్నాను. "పరిష్కారం చెబుతానంటే విని పాటించడానికి నేను సిద్ధమే" అన్నాను. "అయితే ఈవిషయంలో మీకు సాయపడేందుకు గాను మిమ్ములను కొన్ని ప్రాథమిక వివరాలడుగుతాను. మీరు మరోలా అనుకోకపోతేనే చెప్పండి" సందేహంగా నా ముఖంలోకి చూచింది.

అలాగే అడగండి" అన్నాను. "ఆ అమ్మాయి పేరు, తల్లిదండ్రుల పేర్లు చెప్పండి" అనగానే "ఆ పాప పేరు సునీత, వాళ్ల అమ్మానాన్నలు సుభద్రమ్మ, సుబ్రహ్మణ్యం గారలు " అని నేననగానే ఆమె ముఖంలో రంగులు మారడాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నము లీలగా కనిపించింది. తమాయించుకొని మంచినీళ్లు కొన్ని త్రాగి తిరిగి అడగడం ప్రారంభించింది. "మీకభ్యంతరం లేకపోతేనే ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి చాలు" అంటూ నా జవాబు కోసం ఆగకుండా కాస్త కళ్ళల్లోకి చూస్తూ  తనే సూటిగా అడిగేసింది. "అప్పట్లో మీరా అమ్మాయిని చేసుకోక పోవడానికి గల అసలైన కారణాన్ని దాచకుండా చెప్పగలరా?" ఇక నేనూ విషయాన్ని దాచ దలచుకోలేదు. "ఈ సంగతిని నేనింత వరకు ఎవ్వరితోను పంచుకోలేదు. ఇంతకు ముందు మీతో పరిచయం లేకపోయినా ఎందుకో మీలో నాకొక ఆత్మీయ మిత్రురాలు కనిపిస్తున్నారు. అందుకే చెబుతున్నాను వినండి.   ఇది మీకు చాలా చిన్నదిగాను ప్రాముఖ్యం లేనిదిగాను అగుపించ వచ్చునేమో కానీ నేనీ కారణం వల్లనే వెనుకంజ వేసాను. చిన్నప్పుడు మేము కలసి ఆడుకొనినప్పుడు ఆ పాప నన్ను 'అన్న' అని సంబోధించడాన్ని గొప్ప అదృష్టంగా అనుకునే వాణ్ణి. ఇప్పటికి అంతే. నాకెవ్వరు రక్తం పంచుకున్న చెల్లెళ్ళు లేకపోవడంతో ఆ  'పాప'ను దేవుడిచ్చిన చెల్లిగా అనుకునే వాణ్ణి. అలాంటి అమ్మాయిని  భార్యగా స్వీకరించడానికి నా మనస్సు ఒప్పుకోలేదు. నిజానికి నేను అన్ని విషయాలలో పూర్తిగా వ్యాపారాత్మకంగా ప్రవర్తించే వాడినే అయినప్పటికీ ప్రేమ, అభిమానం అలాటి భావాలపై అంతగా నమ్మిక లేనివాడి నైనప్పటికీ ఈ ఒక్క విషయంలో విరుద్ధంగా ప్రవర్తించడం నాకే విచిత్రమనిపించింది. అందుకేనేమో,  నా మనసులోనిమాటను  మాటను పెద్దల ముందు చెప్పే సాహసం చెయ్యలేక పోయాను. ఆ అమ్మాయితో నేరుగా చెబుదామన్నా  అసలామెను కలిసే అవకాశమే చిక్కదాయె. ఇప్పటి కిప్పుడు తను  కనిపించినా ఈ  విషయాన్ని చెప్పి అప్పుడే చెప్పలేక తనను ఇబ్బందులకు గురి చేసినందులకు మన్నించమని కోరేందుకు కూడా వెనుకాడను." అని దృఢంగానే చెప్పాను. ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. ఎందుకలా అవుతున్నదో నాకర్థం కాలేదు.

 తనకు తానే సర్దుకొని వికసించిన ముఖారవిందముతో అరవాలని ప్రయత్నించి గొంతు పెగలక పోవడంతో బావిలోంచి పలుకుతున్నట్లుగా "మాధవ్ గారూ" అన్న మాటలు ఆమె గొంతులో ధ్వనించాయి. ఒక్క క్షణం పాటు నాకేమీ అర్థం  కాలేదు. వెంటనే తేరుకొని పట్టరాని ఆనందంతో " సునీత... మీరు సునీత గారా ఇది నిజమా కలా! చెప్పండి." అన్నాను. "గిల్లమంటే గిల్లుతాను. అప్పుడు తెలుస్తుంది నిజమో కాదో " "ఇక చెప్పనవసరం లేదు. తెరలు పొరలు అన్నీ తొలగిపోయాయి. నన్ను గిల్లి గిల్లి ఏడిపించింది పాప ఒక్కటే." అలా గిల్లడమంటే సునీతే.  ఇప్పుడు గిల్లితే ఇక నవ్వులే! గిల్లిఏడిపించడమంటే సునీత కొక ఆట ఆరోజుల్లో. 

 "ఎంతైనా యాభయ్యేళ్ళ తర్వాత మళ్ళీ కలిసినందుకు చాలా చాలా సంతోషంగా వుంది. మీరు కాదు చెప్పాల్సింది క్షమాపణలు, నేనే మీకు చెప్పాలి." అన్నది సునీత. "ఎందుకలా" అని అడిగాను.

 "మీరు చెప్పిందంతా విన్నాను. ఇక నేను చెప్పేది  వినండి" అంటూ మాటాడ సాగింది సునీత " అసలు జరిగిందేమిటంటే తప్పని సరిగా మిమ్ములను పెళ్ళాడమని అమ్మ  ఎప్పుడూ చెప్తుండేది. నాకు మీరంటే అయిష్టం లేదు కాని అమ్మ నా పెళ్లిగురించి మాట్లాడినప్పటికే నాకు సుభాష్ తో పరిచయం ఏర్పడడము అది స్నేహం గాను తర్వాత ప్రేమగా మారడము జరిగిపోయాయి. అమ్మ మీ గురించి ఇంత గట్టిగా చెప్పడంతో ఆమె మనస్సును అర్థం  చేసుకున్నానే కాని ఆమె మాట వినే స్థితి కాదు నాది, ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ నా ప్రేమను దూరం చేసుకోదలచుకోలేదు. అలాగని ఆమెనుధిక్కరించనూ లేను.

వెంటనే సమాధానం చెప్పి పరిస్థితి విషమించకుండా పెళ్లిని వాయిదా వేస్తూ దాదాపుగా రెండేళ్లు గడిపాను. మీరూ  ఎలాగూ వాయిదా వేస్తూ రావడంతో అమ్మ వాళ్లకు కూడా ఓపిక కొంచెం తగ్గింది. ఇంతలో మా మేనత్త ఆరోగ్యం క్షిణించడంతో నా పెళ్లి జరగాల్సిన అగత్యం ఏర్పడింది. అప్పుడు నా ప్రేమ విషయాన్ని దాచకుండా చెప్పేసాను. ముందుగా పెద్దల నుండి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ మరొక గత్యంతరం లేక మా పెళ్లి జరిపించారు. నేను ప్రేమను బయటికి చెప్పలేక పెళ్లి విషయాన్ని వాయిదా వేస్తూ మీకసౌకర్యాన్ని కలిగించి చివరకు నిరుత్సాహ పరచానేమోనని బాగా బాధ పడేదాన్ని. అలా నాకు మీరంటే గౌరవభావం పెరిగిపోయింది. మీ మనసెంత ఉన్నతమైనదో ఇప్పుడు ప్రత్యక్షంగా తెలిసింది. తప్పయిందని చెప్పి క్షమాపణ అడగాలని నేను కూడా అనుకుంటూనే వున్నాను. ఇదంతా మీకు చెప్పాక యిప్పుడు మనస్సు సంతోషంగా వుంది."

అంటూ సుదీర్ఘంగా గాలి పీల్చుకుంది సునీత. "అంటే ఇక ఎవరూ ఎవరికీ క్షమాపణలు చెప్పుకునే అవసరం లేదని తేలిపోయింది. మనల్ని ఒకటి చేయాలన్న తపనతోనే మన పెద్దవాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేశారు. మనం మాత్రం అణువంత కూడా చలింపక మేమెప్పటికీ బాల్యమిత్రులమేనని నిరూపించుకున్నాము. నాదొక చిన్న సూచన. ఇక మనం ఒకరినొకరు గారు గీరు అని పిలుచుకోకూడదు. నేను 'సునీతా' అని పిలుస్తాను. నన్ను 'మాధవ్' అని పిలిస్తే చాలు. అయితే బాగా కోపం కానీ ప్రేమ కానీ కలిగినప్పుడు మాత్రం 'పాపా' అంటాను. నన్ను అప్పుడు'అన్న' అనవచ్చు ఎప్పటిలాగా!" ఇద్దరం హాయిగా నవ్వుకున్నాము. "మొత్తానికి పెద్దవాళ్ళ ప్రేమను, జీవిత భాగస్వాముల అనురాగాన్ని, వీటన్నిటికీ మించి భ్రాతృ ప్రేమను పొందగలిగిన 'అదృష్టవంతులు' అంటే మనమేనని నాకనిపిస్తున్నది. సొంత అన్న లేని మీకు ఆ లోటు, చెల్లి లేని లోటు నాకూ ఒకే జవాబుతో పరిష్కారమయ్యాయి కదా!" అని నేనంటే "అవును అక్షరాలా ఇది నిజం. ఇదే తలచుకుంటూ నేనూ పొంగి పోతున్నాను" అన్నది సునీత.

 ఇక పండుకుందాము ఇప్పటికే చాలా సేపయింది. శుభరాత్రి" అనుకుంటూ ఇద్దరమూ నిద్రకుపకమించాము.

తెల్లవారుతూండగానే సికిందరాబాద్ స్టేషన్ లో దిగి ఇంటికెళ్లి రైల్లో జరిగిన విశేషాలన్నీ జీవిత సహచరులతో సంతోషంగా పంచుకున్నాము.

ఇది జరిగి అప్పుడే నాలుగేళ్లయింది. యాభై ఏళ్ళ క్రితం మా పిన్నివాళ్ళు, అత్తయ్యవాళ్ళు కలసి గడపిన రోజులు పునరావృతమై ఈ నాలుగేళ్ల నుండి మా రెండు కుటుంబాలు స్నేహాన్ని ఆస్వాదిస్తూ సాగుతున్నాయి. ఈ  పవిత్ర బంధమే మా బాల్యమిత్రులను మరలా కలిపిందని అనుకుంటుంటాము.

***

No comments:

Post a Comment

Pages