శ్రీరుద్రంలో విశేషాలు - 3 - అచ్చంగా తెలుగు

శ్రీరుద్రంలో విశేషాలు - 3

Share This
శ్రీరుద్రంలో విశేషాలు - 3
శ్రీరామభట్ల ఆదిత్య 
వందే దివ్యమచిన్త్యమద్వయమహం వందేఽర్కదర్పాపహం,
వందే నిర్మలమాదిమూలమనిశం వందే మఖధ్వంసినమ్ ।
వందే సత్యమనన్తమాద్యమభయం వందేఽతిశాన్తాకృతం,
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివంశంకరమ్ ॥

మూడవ అనువాకం:
'నమః సహమానాయ నివ్యా॒ధిన ఆవ్యా॒ధినీనాం పతయే నమో' అనే మంత్రంతో 3వ అనువాకం మొదలౌతుంది. మనందరిలో కొలువైవున్న పరమేశ్వరుడి గురించి ఈ అనువాకం చెప్తుంది. ఇందులో పరమేశ్వరుడిని గుణాతీతుడిగా నిర్గుణుడిగా, ద్వంద్వాతీతుడిగా చెప్తారు. ఈ అనువాకంలో మొత్తం 17 మంత్రాలున్నాయి. 

ఇచ్చేవాడు - తీసుకునేవాడు, పుష్కలంగా ఇచ్చేవాడు - కొరతనూ సృష్టించేవాడు ఇలా అనేకానేక గుణాలనూ కీర్తించారు. పరమేశ్వరుడే సృష్టి సంచాలనానికి కారణమనికూడా చెప్తుంది ఈ అనువాకం. ఈ అనువాకంలోని రెండుసూక్తాలలో పరమేశ్వరుడిని హరుడిగా ( దొంగ ) చెప్పారు, అంటే మనలోని అజ్ఞానాన్ని హరించేవాడని అర్థం. సర్వరోగనివారణార్థం ఈ అనువాకాన్ని పఠించవచ్చు.

ఈ అనువాకంలో పరమేశ్వరుణ్ణి దొంగగా, దొంగలనాయకుడిగా, మోసగాడిగా అలాగే పేదవాడిగా, పేదలనాయకుడిగా, తలపాగాధరించేవాడిగా, వనాలలోతిరిగేవాడిగా, బాణముగా, బాణముధరించేవాడిగా, కూర్చనేవాడిగా, నిల్చునేవాడిగా, నిదురించేవాడిగా, పరిగెత్తేవాడిగా, ప్రేక్షకుడిగా, ప్రేక్షకులను రంజింపజేయువాడిగా, అశ్వముగా, అశ్వాధిపతిగా చెప్పారు.

నాలుగవ అనువాకం:
'నమ ఆవ్యాధినీభ్యో వివిధ్యన్తీభ్యశ్చ వో నమో' అనే మంత్రంతో ఈ అనువాకం ప్రారంభం అవుతుంది. ఇందులో కూడా మొత్తం 17 మంత్రాలున్నాయి. మూడవ అనువాకంలో చెప్పిన విషయాలను ఈ అనువాకం మరింత స్పష్టమైనరూపంలో ప్రకటనం చేస్తుంది. సృష్టికి కారణమూ - కర్త పరమేశ్వరుడే అని, కార్య - కారణాలు కూడా పరమేశ్వరుడే ఆని చెప్తుంది ఈ అనువాకం. మూడవ అనువాకానికి కొనసాగింపుగా ఉన్న ఈ అనువాకంలో కూడా రెండు సూక్తాలున్నాయి. అలాగే కుష్టు వ్యాధిలాంటి తీవ్రరోగాల నివారణ కోసం ఈ అనువాకం పఠిస్తారు.

ఈ అనువాకంలో పరమేశ్వరుణ్ణి భూతాధిపతిగా, భూతానిగా, నాయకుడిగా, అందగాడిగా, ఘోరరూపుడిగా, రథము లేనివాడిగా, రథము ఉన్నవాడిగా,  వడ్రంగిగా, కుమ్మరివాడిగా, వేటగాడిగా, సైనికుడిగా, సేనానాయకుడిగా, శునకముగా, శునకాధిపతిగా, కంసాలిగా, చేపలుపట్టేవాడిగా చెప్పారు.

ఇంకా వుంది...

No comments:

Post a Comment

Pages