జలం పదిలం - అచ్చంగా తెలుగు

 జలం పదిలం 

 పెమ్మరాజు అశ్విని 


      "అమ్మ ఈ వారం మా స్కూల్ వాళ్ళు వాటర్ వరల్డ్ కి తీసుకెళ్తున్నారు ,టీచర్ టు థౌసండ్ ఇవ్వమన్నారు" అంటూ గారాలు పోయింది  మీరా ,"మీ నాన్నగారు ఆఫీస్ నుండి వచ్చాక అడిగి చెప్తా నువ్వు వెళ్లి హోమ్ వర్క్ చేసుకో, అవును ఇందాక నీ స్కూల్ బాగ్ లో వున్న వాటర్ బాటిల్ లో వున్న నీళ్లు మొక్కలకి పొయ్యమని చెప్పాను కదా వెళ్లి  ఆ పని చెయ్యి ముందు " అంటూ గుర్తుచేసింది రాధ .


        ఇంతలో ఆఫీస్ నుండి వచ్చాడు గోపాలం "వచ్చారా ,త్వరగా తెమలండి భోజనాలు చేసి సద్దుకుంటే , ఇంకా చాలా పని వుంది , మీరా కి  ఇంకా ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, రేపు నీళ్లు తెల్లవారే వస్తాయి కదా " అంది రాధ . "హ నిజమే రాధ త్వరగా అన్నం పెట్టు తినేసి కాసేపు మీరా చదువు సంగతి నేను చూస్తా ,నువ్వు ఈ లోపు వంట గది  సంగతి చూసుకో " అంటూ తయారయ్యి భోజనాలు చేసారూ ముగ్గురు.


          భోజనాల తర్వాత మీరా హోమ్ వర్క్ గురించి చూస్తున్నాడు గోపాలం "మీరా నీకు ఎల్లుండి లెక్కల  పరీక్ష కదా అన్ని చదివేసావా " అని అడిగాడు " హా నాన్న అన్ని చదివేసా , మరీ నాన్న మా స్కూల్ లో ఈ శుక్రవారం వాటర్ వరల్డ్ కి తీసుకువెళ్తారట  టీచర్ తూ థౌసండ్ తెమ్మన్నారు బుధవారం లోపు ,ఇవ్వవు " అంది మీరా ," ముందు ఎగ్జామ్స్ అవ్వని అప్పుడు చూద్దాం " అన్నాడు గోపాలం . ఆ మాటకి ముఖం గంటు పెట్టుకుంది మీరా , కానీ ఆ నిముషం ఏమి మాట్లాడలేదు .


           తన గదిలోకి వచ్చి కూర్చుని ఆలోచిస్తున్నాడు, "ఏమైందండీ ఆఫీస్ లో ఏమైనా సమస్య ఉందా " అని అడిగింది రాధ. "అదేం లేదు రాధ , మన చిన్నప్పుడు నీటికి డబ్బుకి కూడా విలువ ఉండేది , ఇంట్లో పది  రూపాయిలు  ఇస్తే దానిలో రెండు రూపాయిలు ఖర్చు పెట్టి కొన్నుకున్న ఉసిరికాయలు, జీళ్ళు కొన్నుకున్న నలుగురితో పంచుకుని తినేవాళ్ళం, ఒక బిందె నీళ్ల కోసం అమ్మ అక్క ఒక ఫర్ లాంగ్ దూరం నడిచి తెచ్చే వారు ,ఇంట్లో అవసరాలకి పెరట్లో వున్న ఊట బావి లో నుండి చేద నీటికి ఎదురు చూసి తొడుక్కున్న రోజుల్లో నీటికి ఎంత విలువో మనకి తెలుసు, కానీ ఇప్పటి తరానికి ఆ విలువ తెలియదు , వాటర్ వరల్డ్ పేరు చెప్పి అందరు ఆటాడే నీళ్ల  లో ఆడడానికి రెండువేల రూపాయిలుట .కాదంటే పిల్ల నొచ్చుకుంటుంది , అదే ఆలోచిస్తున్నా ." అన్నాడు గోపాలం "నిజమే అండి , రోజు తప్పించి రోజు మంచి నీళ్లు పట్టడం కోసం పొద్దున్నే లేచినప్పుడు , వీధిలో ఆడవాళ్ళూ పాపం బిందెలతో తీసుకు వెళ్తుంటే జాలి వేస్తుంది ,మనకి కాస్త తాహతు వుంది గనుక ప్రైవేట్ కనెక్షన్ పెట్టించుకోన్నాం, ఇప్పటి తరానికి నీళ్ల  విలువ చెప్పకపోతే ,ముందు తరానికి నీళ్లు మిగలవు ",అంది రాధ . ఇలా మాట్లాడుతూ నిద్ర లోకి జారుకున్నారు ఇద్దరు.



           మర్నాడు సాయంత్రం రాధ కి ఆఫీస్ నుండి ఫోన్ చేసాడు గోపాలం " రాధ ,రామం అన్నయ్య ఫోన్ చేసాడు , వాళ్ళ 25 వ పెళ్లిరోజు  అట అందుకు సత్యనారాయణ పూజ ,కళ్యాణం పెట్టుకున్నారట శనివారం మనం శుక్రవారం బయల్దేరి వెల్దాము , మీరా స్కూల్ కి సెలవు చెప్పు ,వాటర్ వరల్డ్ కి  వెళ్లట్లేదని చెప్పి  నచ్చ చెప్పు. " అన్నాడు , విషయం విని మీరా నొచ్చుకున్న అంత లోనే రామం  గారి పిల్లల్ని కలవొచ్చు అని సంతోష పడింది .


       శుక్రవారం నాడు రాధాగోపాళం మీరా కలిసి రామాపురం కి కార్ లో బయల్దేరి వెళ్లారు, వెళ్తూనే రామం అతని భార్య వాసంతి పిల్లలు వాసు,సుమ ,రామం తండ్రి రాఘవరావు గారు ఎదురొచ్చి లోనికి  తీసుకెళ్లారు . కాళ్ళు కడుక్కోడానికి ఒక చెంబు తో నీళ్లు ఇచ్చారు ,కాళ్ళు చేతులు కడుక్కుని చక్కగా వెళ్లారు,అక్కడ ఎక్కడ నీళ్ళకి టాప్లు లేవు ఒక్కదగ్గర కుండీలో నీళ్లు పెట్టి వున్నాయి ,పదేళ్ల మీరా కి ఇది అంత వింతగా వుంది అమ్మ టాప్ లేదేంటి అంది ,నీకు నీళ్లు కావాలా టాప్ కావల అన్నాడు వాసు అన్న . "అది కాదు అన్న టాప్ లేకుండా వాటర్ ఎలా " అని అడిగింది, మెల్లిగా మీరాను తీసుకు వెళ్లి ఇంటి వెనక బావి చూపించాడు,అందులో నుండి పని వాళ్ళు నీళ్లు తోడుతున్నారు, మెల్లిగా అందరు స్నానాలు చేసి భోజనం చేసాక ,మీరా ని గోపాలాన్ని తీసుకుని పొలం దగ్గరికి వెళ్లారు రామం ,వాసు ఇద్దరు ,పొలం నది కాలువ పక్కన వుంది ఆ కాలువ లో పారే నీరు చూసి "పెదనాన్న ఇంత వాటర్ ఎక్కడికి వెళ్తోంది " , అని అడిగింది " .

              "చిన్న తల్లి ఈ నీరు నది నుండి వచ్చే పాయ అంటే నది కి పిల్ల కాలువ అన్నమాట ,ఈ నీళ్లు ఈ చుట్టూ వున్నపన్నెండు ఊళ్ళకి , పొలాలకు  నీరు ఇస్తుంది ఇందులో గేదెలు, ఆవులు అన్ని నీళ్లు తాగుతాయి ". "పెదనాన్న పొలాలు అంటే ఏంటి పెదనాన్న "అంటూ అమాయకంగా అడిగింది మీరా ," అది అన్నయ్య పాపాయి ఎప్పుడు పల్లె చూడలేదు, కాన్వెంట్ లో చదువులు కదా అందుకని తెలుగు కూడా కాస్త తక్కువ ,అక్కడికి నేను రాధ నేర్పిస్తున్నాము కూడా " అంటూ కాస్త అపరాధ భావం తో చూసాడు గోపాలం రామం కేసి.


      "ఏడ్చినట్టు వుంది నా పిల్లలు కూడా ఇంగ్లిష్ మీడియం లో నే చదివారు కానీ తెలుగు చక్కగా చదువుతారు మాట్లాడతారు , సర్లే నువ్వు వుండు , చిట్టి తల్లి ఇలా రా " అని దగ్గరికి పిలిచి చెయ్యి పట్టుకుని "నువ్వు అన్నం తింటావు కదా అది ఎక్కడి నుండి వస్తుందో తెలుసా ,ఇలా చూడు" అని పొలం గట్టు మీద నుండి కిందకి దించి వరి కంకులు , ఆ పక్కనే వున్న కూరగాయల మొక్కలు చూపించాడు, "ఇవి మొక్కలు వీటినే పొలాలు అంటాము ,మరి ఇవి పెరగడానికి భోజనం తయారు చేసుకుంటాయి ఫోటోసైన్తేసిస్ ని వాడి , అని చదువుకున్నావు కదా, మరి దానికి నీరు, సూర్యరశ్మి కావలి కదా , అందుకు ఈ కాలవ లో నీరు వాడతాము, ఈ నీళ్ల మీద ఆధారపడి మేము పంటలు పండిస్తేనే మీరు తినడానికి అన్నం వస్తుంది తెలిసిందా తల్లి”.


   "కానీ పెదనాన్న ఈ నీరు ఇలా పారి అలా వెళ్లిపోతుంటే ,ఇంటి దగ్గర ట్యాంక్ లు పెట్టినట్టు ఇక్కడ దాచి పెట్టె వీలుందా, లేకపోతే మొత్తం నీళ్లు ఆలా వెళ్లిపోతాయి కదా ." అని అడిగింది మీరా ,"మీరా మనం ఇంట్లో లేదా ఊరిలో  ట్యాంక్ లు కుండీలు ఎలా కడతామో అలాగే మన ప్రభుత్వం పెద్ద పెద్ద డ్యాములు కడతారు, కానీ మనం మొక్కలు పెంచితే ఇదిగో ఇతి చూడు పెద్ద పెద్ద కొబ్బరి చెట్ల లాంటివి పెంచితే ఇవి నీటిని సహజంగా నేల లో దాస్తాయి .అందుకే నువ్వు కూడా అవకాశం ఉన్నంత వరకు మొక్కలు పెంచాలి. అప్పుడు బోలెడు నీళ్లు పొట్టలో దాచుకుంటాయి. మరి చేస్తావా చెప్పు". 


    మరి పెదనాన్న వాళ్ళు ఎందుకు ఇందులో స్నానం చేస్తున్నారు" అని అడిగింది మీరా దూరం గా వున్న పిల్లలు కొంతమంది కాలువ లో ఈతలు కొట్టడం చూసి అని అడిగింది ,వెంటనే పక్కనే వున్న గోపాలం " నువ్వు మొన్న వాటర్ వరల్డ్ కి వెళ్ళాలి అన్నావు కదా, అక్కడ వాడేది మంచి నీరు కాదు,ఇది మంచి నీరు ఇందులో నువ్వు ఆటలాడిన, ఈతలు కొట్టిన ఏమి అవ్వద్దు, ఇలా ఫ్రీ గా దొరికే సంతోషం డబ్బులు ఇచ్చి కొన్నుకోవాలా " అని అడిగాడు .

      "నిజమే నాన్న మనం ఇంట్లో టాప్ లో వస్తున్నాయి కదా బోలెడు నీళ్లు వాడుతాము కానీ ఇక్కడ బావి లో నీళ్లు తోడడం చూస్తుంటే మనకి ఎంత తేలిగ్గా నీళ్లు వస్తున్నాయి ,మనకి నీళ్లు అందుకే విలువ తెలియట్లేదు ఈసారి నుండి నేను జాగ్రత్తగా వాడతాను, నేను కాసేపు ఆ కాలవ లో ఆడుకోవచ్చా ." అని అడిగింది మీరా, "తప్పకుండా తల్లి ,కాకపోతే నీటిని పాడుచెయ్యకూడదు ,తెలిసిందా , వాసు మీరా ని జాగ్రత్త గా ఇంటికి తీసుకు రా " అని రామం గోపాలం అక్కడనుండి ఇంటికి వెళ్తూ "చాలా సంతోషం అన్నయ్య మీరా కి నీటి విలువ తెలియజేసావు "అన్నాడు గోపాలం , "అదెంత పని రా , అది పెరుగుతున్న వాతావరణం అలాంటిది ,నువ్వు ఆ రోజు ఫోన్ లో నాకు విషయం చెప్పి మంచి పని చెసావు ,ఇప్పటి తరానికి నీటి విలువ చెప్పకపోతే ముందు తరాలకి చుక్క నీరు మిగలదు "  . మర్నాడు పూజ కార్యక్రమాలు దగ్గర నుండి మీరా సాధ్యమైనంత తక్కువ నీళ్లు వాడడమే కాదు ఎవరైనా ఎక్కువ నీరు వాడితే వాళ్ళని ఆపే  ప్రయత్నం చేస్తుంది .మరి మనము చేద్దామా . 


No comments:

Post a Comment

Pages