నానాటి బ్రతుకు నాటకమూ - అచ్చంగా తెలుగు

నానాటి బ్రతుకు నాటకమూ

Share This

  నానాటి బ్రతుకు నాటకమూ 

 రచన:- మినీకథా చక్రవర్తి , కథానిది, కథాబ్రహ్మ, కథా విశారద -కె.బి.కృష్ణ  


జీవితం లో జరిగింది చెప్పడం చాలా సులభమని జ్యోతిష్యులను విమర్శిస్తుంటారు అందరూ అయితే జరగబోయేది చెప్పడం కష్టమని పైగా చెప్పడానికి దమ్ము ఉండాలని కూడా అంటారు.

మాకు ప్రతీ పెన్షనర్లు మీటింగ్ లో శాంతి ప్రార్ధన అయిపోగానే ఒక ముఖ్య విషయం అని తప్పకుండా చెబుతుంటారు. కానీ ప్రతీ పెన్షన్ తీసుకునే వృద్ధుడు అలాంటి` పరిస్థితి కనీసం ఊహల్లో కూడా రానియ్యలేని సందర్భం. అది ఏమంటే “ మీరు మీ ఇంట్లో ఏది ఎక్కడ పెట్టారో, డబ్బు ఎక్కడ పెడతారో  ఆస్తి పత్రాలు ఎక్కడ పెడతారో, మీకు ఎన్ని అప్పులున్నాయో, మీకు ప్రియ స్నేహితులు ఎవరు ? వారి ఫోన్ నంబర్లు, బ్యాంకు అకౌంట్స్ ఎక్కడ వున్నాయి బ్యాంకు లో డబ్బు ఎలా తీసుకోవాలి, ఎలా వెయ్యాలి ? ఇలాంటి అనేక ముఖ్య మైన విషయాలు మీ శ్రీమతి ని కూర్చోబెట్టి ప్రశాంతం గా చెప్పండి. ఆమె ఇప్పుడు ఎందుకండీ మనిద్దరమూ చక్కగా కలిసే ఉన్నాము కదా అంటుంది. కానీ నీటి బుడగ లాంటి మనిషి జీవితం ఉన్నపళం గా ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలియదు కదా “ అని మా ప్రెసిడెంట్ గారు ప్రతీ నెలా చెబుతోంటే మేము చాలా మంది తీవ్రమైన వ్యధ కు లోనవుతుంటాము ఆ దృశ్యం ఊహించుకోలేక. 

నిన్ననే పెన్షనర్లు మీటింగ్ అయింది, పైగా అమలాపురం నుండి మా బావ వచ్చి వెళ్ళాడు. నిన్ననే నీ జాతకం పరిశీలించాను. నెలా రెండు నెలల్లో నువ్వు మా చెల్లాయి ని శాశ్వతం గా వదిలి వెళ్లాల్సి వస్తుందేమో ! జాగ్రత్త గా ఉండు, ఏమైనా రాతకోతలూ అప్పగింతలు ఉంటె చెప్పేసేయ్ ఆమెకు-- అనేసి ఇంచక్కా వెళ్ళిపోయాడు.  

నేను ఈ రోజు నుండి నా అర్ధాంగి కి ఒక వేళ నేను అర్ధాంతరం గా మాయమైపోతే ఇంట్లో రహస్యాలు, బయట పనులు ఆమెకు వివరం గా చెప్పాలని అనుకున్నాను. 

కానీ సంఘం లో ఏ మగాడూ ఇంట్లో శ్రీమతి కి అన్నీ చెప్పాలి, ఆమెకు అన్ని విషయాలు తెలియాలి అనుకోడు -- పైగా ఆడాళ్ళ కెందుకు అన్ని విషయాలు అంటుంటాడు. అది తప్పు అర్ధాంగి అంటే భర్త శరీరం లో అర్ధాంగి అని కాకుండా ఆమె ఒక దేవత ఒక కుటుంబం లో అన్నివిషయాలు ఆమెకు తెలిసి తీరాలి. 

వంటిట్లో వంటపని లో హడావిడి గా ఉంది శ్రీమతి. 


“ ఏమోయ్ ! ఇవ్వాళ బ్యాంకు కు వెళ్ళాలి, పన్నెండు గంటలకల్లా వంటిట్లో పని తెముల్చుకో. ఒక గంట పని ఉంటుంది, వచ్చి భోజనం చేద్దాం “ అన్నాను. “ ఇదేమిటీ కొత్తగా ! నేనెప్పుడైనా బ్యాంకు కి వచ్చానా ఈ నలభై ఏళ్ళ మన కాపురం లో ? “ అంది శ్రీమతి. “ అది కాదులే ఇవ్వాళ వెళ్ళాలి “ అన్నాను.

మనిషి కి జీవిత కాలం లో తీరని కోరికలూ, తీరిన కోరికలూ, ఎప్పటికీ తీరని కోరికలూ ఉంటాయి. మనిషి బ్రతికుండగానే ఎదో ఒక దశ లో తీరని కోరికను తీర్చుకోడానికి ప్రయత్నించాలి. వయసు పై బడ్డాక తన మీద తనకి నమ్మకం పోయేక ఇంక ఏ కోరికా తీరదు. తీర్చుకోలేడు కూడా. కాకినాడ లో ఒక చిన్నకారు మీద డ్రైవింగ్ చేసుకుంటూ నా శ్రీమతి ని ప్రక్కన కూర్చోబెట్టుకుని తిరగాలని నా చిరకాల వాంఛ చాలా కష్టపడి బ్యాంకు లో నెల కు ఇంత అని కార్ ఫండ్ బ్యాంకు లో వేసుకుని చిన్న కారు కొనుక్కుని ఆ కోరిక తీర్చుకున్నాను. ఈ లేటు వయసు లో డ్రైవింగ్ ఏమిటండీ ? అని డ్రైవింగ్ స్కూల్ వాడు నవ్వినా దీక్ష తో నేర్చుకున్నాను. 

పన్నెండు గంటలకు ఇంటి నుండి నా శ్రీమతి ని పక్కనే కూర్చో  బెట్టుకుని మా ఇంటి నుండి, రమణయ్యపేట, సర్పవరం జంక్షన్ దగ్గర పెద్ద ఎన్ టీ యార్ బొమ్మ దాటి, నాగమల్లితోట జంక్షన్ దగ్గర వున్న బ్యాంకు కి చేరాం. బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ కి నమస్కారం చేసి, “ ఇక్కడ మన బ్యాంకు లో నాకు మూడు అకౌంట్స్ , నా శ్రీమతి కి ఒకటి వున్నాయి. మొత్తం అకౌంట్స్ అన్నీ మేమిద్దరమూ ఆపరేట్ చేసేటట్లు గా దయచేసి మార్చి పెట్టండి. “ అన్నాను. నా పక్కనే వున్న నా శ్రీమతి “ ఇన్నాళ్లూ  లేనిది ఇప్పుడు ఎందుకు ?”  అన్నట్లు గా నన్ను చూస్తోంది. మా ఇద్దరి ఫోటోలు, ఆధార్ కార్డులు పాన్ కార్డులు, ఒక ఉత్తరం, ఇమ్మంటే ఇచ్చాను. ఆయన పక్కనే ఉన్న ఒక మహిళా ఉద్యోగి “ అమ్మా -- మంచి పనే చేస్తున్నారు మీ వారు, ముందు జాగ్రత్త గా మంచిదే  “ అంది చిరునవ్వుతో. 

ఇంతలో నా చెవిలో “ ఎందుకండీ ఇదంతా ? “ అంది శ్రీమతి. “ నేను ఇప్పుడు లక్షణంగా తిరుగుతున్నాననుకో, ఒకవేళ ఏ కాళ్ళు నెప్పులో వచ్చి తిరగలేని పరిస్థితి వస్తే, నువ్వు ఆటో లో బ్యాంకు కి వచ్చేసి డబ్బు తేవచ్చును. అందుకని “ అంటోంటే “ అలా నెగిటివ్ గా ఎందుకు ఆలోచిస్తారు ? “ అంటూ ముఖం లో విచారం పులుముకోగా ఏడవలేక నవ్వినట్లు గా నవ్వింది. ఒక గంట లో పని అయిపోయింది. ఇంటికి వస్తుంటే మా కారు వెనుక నుండి పెద్ద కంటైనర్ లారీ వస్తోంటే, “ జాగ్రత్త -- పెద్ద కంటైనర్ లారీ వస్తోంది “ అని ఒక్క అరుపు అరిచింది. కారుకు ముందు వేపు నుండి ఏది ఎదురు వచ్చినా, వెనుక నుండి వస్తున్నా , డ్రైవింగ్ చేసే వారికి తెలుస్తుంది. నా శ్రీమతి కి ఎన్నో సార్లు మౌనం గా కూర్చోమని చెప్పాను. ఆమె ఎప్పుడూ ఇంతే ! బైక్ మీద వెనుక కూర్చుని కూడా నన్ను గాభరా పెట్టేస్తుంది. ఏమిటో ఆడాళ్ళ భయం చిత్రం గా ఉంటుంది.  రమణయ్యపేట “ సూపర్ బజార్ “  దగ్గర కారు పార్క్  చేసి లోపలకు దారి తీస్తుంటే “ ఎందుకూ ఇప్పుడు ఏవీ అక్కరలేదు, భోజనానికి టైం అవలేదూ “ అంది చిరుకోపం తో. 

లోపలకు ప్రవేశించగానే బిల్ సెక్షన్  లో కుర్రాడు “ నమస్తే సార్ - ఏమిటీ విశేషం అమ్మ గార్ని తీసుకొచ్చారు. “ అన్నాడు. “ ఏమీ లేదు. ఎప్పుడూ నేనే వస్తాను కదా ? ఎప్పుడైనా నేను రాలేక పోయాననుకో ఆమెకు బజార్ తెలియాలి కదా. అందుకని -- “ అన్నాను. ఆమె ముఖం లో విచార రేఖలు  అలుముకున్నాయి. పేస్టులూ, సబ్బులూ, కాఫీ టీ పోట్లాలూ, పప్పులూ, పిండిలూ, పోపు సామాన్లు, బిస్కట్స, సబ్బులూ, ఫాన్సీ సామాన్లు, బట్టల సబ్బులూ తదితరాలు ఇవన్నీ ఎక్కడ ఏమి వుంటాయో చూపించి, అవి తీసుకుని బాస్కెట్ లో వేసుకుని, బిల్ సెక్షన్ కి వెళ్లి బిల్ చేయించుకుని డబ్బులు చెల్లించడం అన్నీ వివిరం గా చెప్పాను. చాలా నిర్లక్ష్యం గా వింటోంది నేను చెప్పినవన్నీ. 

సంసారాలలో అనేక రకాల దంపతులు. భార్యాభర్తా కలిసి ప్రతి పని కి వెళ్తారు కొందరు, మరి కొందరు భర్త మాత్రమే బజారు కు వెళ్తాడు. ఇంకొంత మంది భార్యలు ” మీకేం తెలియదు నేను చూసుకుంటానులెండి ” అంటూ ఆమె మాత్రమే బయటకు వెళ్తుంది. అయితే మా ఇంట్లో మాత్రం ఆమె ఇంట్లో పనులతోనే సతమతమౌతోంటే ఇంకా బజారు పనులు కూడా ఎందుకు అని ఆమెను ఎక్కడి కి వెళ్లనివ్వను. అందువలన ఆమెకు ఇంట్లోంచి బయటకు వస్తే ఎక్కడకు ఎలా వెళ్ళాలో తెలియని పరిస్థితి. అందుకని అనేక సార్లు నేను లేక పోతే ఈమె ఎలా బ్రతుకుతుంది ? అని మనసు పాడుచేసుకుంటుంటాను. అందువలన నెలాఖరు లోపుగా సాధ్యమైనంత వరకూ కొన్ని నేర్పు దామని తాపత్రయం. 

ఎందుకు ఇవన్నీ చెబుతున్నాననే విషయం ఆమెకు తెలియకూడదు. ఎందుకంటే ఒక వార్త చదివాను, భర్త ఫలానా తేదీ నాడు చనిపోతాడని తెలిసి ఆ టెన్షన్ లో చివరకు భార్య చనిపోతుంది. భర్త నిక్షేపం గా ఉంటాడు. అస్తమాను అది గుర్తుకు వచ్చి భయం తో వణికిపోతుంటాను. 

రెండు రోజులు పోయాక “ ఇదిగో ఇలా రా -- ఒక విషయం చెప్పాలి నీకు “ అన్నాను. “ ఏమిటీ “ అంటూ విసుగ్గా వచ్చింది. “ నేను ఎప్పుడూ డబ్బు లాకర్ లో లక్ష్మీదేవి బొమ్మ అతికించిన ప్లాస్టిక్ డబ్బా లో పెడతాను, రిజర్వు గా ఉంచే డబ్బు లాకర్ లోనే ఒక క్యాష్ బాగ్ లో ఉంచుతాను. మన రెండో బెడ్ రూమ్ లాకర్ లో మన ఆస్తి పత్రాలు, కారు, బైక్ లకు సంబంధించిన పత్రాలన్నీ ఉంటాయి. గుర్తుంచుకో. ఆడాళ్ళు ఇవన్నీ తెలుసుకోవాలి. ఇన్నాళ్లూ నీకు చెప్పనే లేదు -- “ అంటోంటే “ నాకు నిజం చెప్పండి ఎందుకివన్నీ చేస్తున్నారు ? మీకేమన్నా కల వచ్చిందా లేక ఎవరైనా చెప్పారా ? “ అంది కళ్ళ నిండా నీరు చేరుతోంటే. 

వెంటనే ఆమె భుజం మీద చేయి వేసి “ అరేయ్ పిచ్చొడా -- ఈ నెల మా పెన్షనర్లు మీటింగ్ లో ఈ విషయాలన్నీ చెప్పారు. ఇంట్లో ఆడాళ్లకు అన్ని విషయాలు నేర్పండి, రహస్యం గా వుంచుకోకండి అని చెప్పారు అందుకని అంతే ! “ అన్నాను.  “ చాల్లేండి పిచ్చి మాటలు, అసలు పెన్షనర్ల మీటింగ్ కి వెళ్ళకండి. “ అంది బుంగమూతి తో --

ఏమిటీ జీవితం ? మనిషి ఒక వేళ లేకపోతే అన్న ఆలోచన దరిచేరనీయక పోతేఎలా? పిచ్చి మనుషులు -- అనుకోసాగేను. 

రెండు రోజులు పోయేక “ మనం ఇవ్వాళ బజారుకు వెళ్దాం, వంట చెయ్యొద్దు. మధ్యాహ్నం జయా  ఇంటర్నేషనల్ హోటల్ లో భోజనం చేద్దాం. బజార్లో పనులు చూసుకుని రాత్రికి ఎక్కడైనా టిఫిన్ చేసి వచ్చేద్దాం-- “ అంటూంటే విపరీతమైన కోపం తో “ ఇంకా రాచకార్యాలూ, కోరికలూ మిగిలి పోయాయా ? మీకు చెప్పడం మరిచిపోయాను. మనం ఇరవైఐదు న విజయవాడ వెళ్ళాలి ఇరవైతొమ్మిదో తారీఖు పెళ్లి మరిచిపోయారా. మార్చి ఒకటో తారీఖు ఇంటికి వచ్చేస్తాం “ అని శ్రీమతి అంటోంటే నేను మార్చి ఒకటో తారీఖు న -- ఏ రూపం లో వుంటాను ? అని నా మనసు నిలదీసింది. 

“ అలాగే --” అని కారు తీసి ఇద్దరమూ బయలు దేరాం. భానుగుడి సెంటర్ దాటి రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద నుండి టూ టౌన్ పోలీస్ స్టేషన్ మీరుగా మసీదు సెంటర్ లో కారు పార్కింగ్ చేశాను. కారు దిగి నేరుగా బొంబాయి స్వీట్ హోమ్ కి వెళ్లి సమోసాలు తిని, బాదం ఘీర్ తాగాం. “ దాదాపు ఇరవై సంవత్సరాలు గా ఈ షాపు ఇలాగే వుంది, పదార్ధాల రుచి అలాగే వుంది “ అంది నా శ్రీమతి, నేను మళ్ళీ ఈ షాప్ కి వస్తానో లేదో అని అనుకుంటున్నాను. బయటకు వచ్చి కొన్ని గజాలు నడిచేక పట్నాల చిట్టెయ్య సెంటర్ అదే గోల్డ్ మార్కెట్ వచ్చింది. ఆ ప్రాంతమంతా బంగారు నగల కోట్లే ! చివర్లో కూరగాయల కొట్లూ, హోల్సేల్ కిరాణా కొట్లూ, స్టీల్త్ ఇత్తడి సామానులు కొట్లూ ఫాన్సీ సామాన్ల హోల్ సేల్ కొట్లూ అవన్నీ చూపించాను. 

వెనక్కు తిరిగి నడుచుకుంటూ మాకు కాతా గా నగలు చేసి తాతబ్బాయి గారి దుకాణానికి చేరాం. ఆయన మమ్మల్ని చూసి “ ఏమిటి సార్ అమ్మగార్ని తీసుకొచ్చారు గాజులు వచ్చేసాయి “ అంటూ మేము కూర్చున్నాక కూల్ డ్రింక్స్ తెప్పించి మా చేతి లో ఒక అట్టపెట్టె పెట్టారు. ఆ పెట్టె తెరిచింది శ్రీమతి అందులో నాలుగు బంగారు గాజులు పింగాణీ తో రంగుల డిజైన్ వున్న కంకణాల్లాంటి గాజులు. నా శ్రీమతి కి వున్న డజను బంగారు గాజులకు రెండు చేతులకు చెరో అర డజను గాజులకు సైడ్ గాజులు ఎన్నాళ్ళనుంచో అడుగుతోంది. చేయించలేకపోయాను. వాటిని చూడగానే ఆమె ముఖం లో ఉదయించిన ఆనందం, తృప్తీ, చూసి నా హృదయం పొంగిపోయింది. అయినా ఎందుకు ఇప్పుడు ? అన్నట్లు గా నన్ను చూస్తోంది. ఆమె నా గృహలక్ష్మి ఆమెకు నా కుటుంబ బాధ్యతల వలన ఎన్నో కోరికలు తీర్చలేక పోయాను. ఇంతలో భోజనానికి టైమయింది. వెనక్కి మసీద్ సెంటర్ కి నడిచి వచ్చేసి, కారులో సినిమా రోడ్ నుండి జయా హోటల్ కి చేరి భోజనం చేసాం. 

భోజనం చేశాక కాకినాడ లో ప్రసిద్ధి చెందిన కోటయ్య కాజా షాప్ లో ప్రవేశించాం. అప్పుడే కాజాలు తయారయ్యే సమయం. పంచదార పాకం వాసన ముక్కు పుటాలకి తాకి నోట్లో లాలాజలం నిండిపోయింది. అప్పుడే తయారైన రెండు కాజాలు మాకు తినమని ఇచ్చారు. కిలో కాజాలు కట్టమని చెప్పాను, ఊరు వెళ్ళాలి గదా ! మళ్ళీ కారు ఎక్కి బాలాత్రిపురసుందరి గుడి మీదుగా నూకాలమ్మ గుడి లో అమ్మవారి దర్శనం చేసుకుని రాజా పార్కు లోకి వెళ్లి పార్కు అంతా తిరిగి బోట్ షికారు చేశాం.  ఆమె ముఖం లో సంతోషం గోచరించడం లేదు “ ఏమోయ్ టేక్ ఇట్ ఈజీ -- ఇవ్వాళ మన ఎంజాయ్ చేస్తున్నాం సరదాగా -- నువ్వు ఇంకా పెన్షనర్లు మీటింగ్ విషయాలు మరిచిపోలేదా ? “ అన్నాను. “ ఏమీ కాదు. ఇన్నాళ్లు కాకినాడ లో వున్నాం ఇవేమీ చూడలేదే ? అనుకుంటున్నాను. ఏమిటో సంసారంలో జంఝాటం -” అంటోంది. ఇప్పుడైనా చూపించకపోతే తరువాత నేను చూపించలేనేమో అని నా మనసు నిలదీస్తుంది నన్ను. ఒక్క క్షణం దిగులు తో  నా గొంతులో గుటకలు పడ్డాయి. 

ఇక ఇంటికి బయలుదేరాం, సర్పవరం జంక్షన్ కి చేరుకోగానే, కారు నెమ్మదిగా పోనిస్తూ -- తిన్నగా వెళ్తే విశాఖపట్నం, ఎడమ వేపు వెళ్తే మనం వైకుంఠఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనానికి వెళ్లే  భావన్నారాయణ స్వామి దేవాలయం, కుడి వేపు వెళ్తే మన ఇల్లు అని చెబుతున్నాను. ఇంతలో విశాఖ నుండి నాన్ స్టాప్ బస్సు వస్తోంది చూసుకోండి అని గుండెలు అదిరేట్లు అరిచింది. “  దటీజ్ మై బెటర్ హాఫ్ “  అనుకున్నాను. 

ఒక వారం రోజుల్లో విజయవాడ ప్రయాణం, ముఖ్యమైన బంధువుల ఇంట్లో వివాహం. రోజులు భారం గా గడుస్తున్నాయి. 

దేవుడు ఒక వేళ మనిషి  కి ప్రత్యక్షమై “ భక్తా నీకు ఆయుష్షు పూర్తి కావస్తోంది కానీ నీ భక్తి కి మెచ్చి మరి కొన్ని సంవత్సరాలు పొడిగించాలని అనుకుంటున్నాను మరి ఎప్పుడో చెప్పు “ అని అన్నాడే అనుకోండి. ఎదురుగా దేవుణ్ణి ఉంచుకొని, ఆఘమేఘాల మీద వాయువేగం తో ఆలోచనలలోకి వెళ్ళిపోయి, మనవడు ఇంజనీరింగ్ పూర్తి అయిపోయి ఉద్యోగం లో చేరిపోయాక అనుకుని తూ తూ అలా కాదు మనవరాలు డాక్టర్ పూర్తి అయిపోయాక మనవడి కీ మనవరాలికి ఒకే సారి పెళ్లి చేసేసేక వెళ్ళిపోతేనో, ఎలాగూ ఇన్నాళ్ళు బ్రతికేము కదా ఇద్దరికీ చెరో నలుసూ పుట్టేసేక వెళ్ళిపోతేనో -- అని ఇలా పొడిగింపులు చేసుకుంటూంటే దేవుడు విసుగెత్తిపోయి మాయమైపోతాడు. ఇదీ మనిషి మనస్తత్వం. 

విజయవాడ వచ్చేశాము పెళ్లి కోసం. అక్కడే మా అమ్మాయి ఉండడంతో వాళ్ళింట్లో దిగాం. పెళ్లి కి ఇంకా మూడు రోజులు టైం ఉంది. శ్రీమతి బాత్రూమ్ లో ఉంటే వంటిట్లో మా అమ్మాయి దగ్గరికి చేరి “ ఒరేయ్ ఒక విషయం చెప్తాను బాధపడకు. ఒక వేళ నేను మేము ఉండే ఊరి లో కాకుండా బయట ఎక్కడైనా చనిపోతే మేము ఉండే ఊళ్ళోనే అంత్యక్రియలు జరిగేట్లు చూడు, అలాగే నన్ను మాత్రం ఐస్ బాక్స్ లో పెట్టకండి నాకు ఊపిరి ఆడదు. నేను వీలునామా రాసేశాను, నా బెడ్ రూమ్ బీరువా కాష్ చెస్ట్ లో డబ్బు తో పాటు పెట్టాను. అమ్మకు చెప్పు. ఇదంతా అమ్మకు ఎందుకు చెప్పలేదంటే వెంటనే కళ్ళు తిరిగి పడిపోతుంది తట్టుకోలేదు --”  అని నేను చెబుతూనే వున్నాను. ఆడపిల్లలకు నెత్తి మీద నీళ్ల కుండ ఉంటుంది అంటారు కదా అప్పుడే అది ఏడిచేస్తోంది. “ పిచ్చి ముండా ఎప్పటికైనా జరగాల్సిందే కదా ? “ అని సముదాయించాను. 

బెంజ్ సెంటర్ లో ఏ.సి కళ్యాణ మండపం లో పెళ్లి. రాత్రి పన్నెండు గంటలకి సుముహూర్తం, కానీ రాత్రి ఎనిమిది గంటలకే రిసెప్షన్ పెట్టేశారు. వధూవరులకు కానుక ఇచ్చేసి కళ్యాణమండపం లో మాకు కేటాయించిన రూమ్ కి వచ్చేసి నిద్రపోయాం. ఆ రోజు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు. రేపు చూస్తానా ? 

తెల్లవారింది చొక్కా జేబు లో వేదమాత గాయత్రి దేవి ఫోటో కి నమస్కరించాను. అయితే నేను బ్రతికేవున్నానా? మనసంతా ఎదో తెలియని ఆనందడోలికల్లో తెలియాడుతోంది. మధ్యాహ్నమే ప్రయాణం. 

మా భావ కి ఫోన్ చేశాను. “ హలో “ -- అన్నాను -- “ బావా ఎక్కడున్నావ్ ? పెళ్ళికి వెళ్లనన్నావ్, నేను చెప్పిన విషయం గుర్తు పెట్టుకుని మానేశావేమో అనుకున్నాను. “ అన్నాడు. 

ఇంతకీ అసలు విషయం చెప్పనే లేదు కదూ అమలాపురం లో ఉండే నాకు అత్యంత ప్రీతీ పాత్రుడు అయిన మా బావ మా జాతకాలు చూస్తుంటాడు జాగ్రత్తగా అతను రెండు రోజుల క్రితం వచ్చి ఫిబ్రవరి 29 వ తారీఖు దాటితే నాకు ఏమీ సమస్య లేదనీ ఈ లోగా నా శ్రీమతి కి చేయవలసిన ఏర్పాట్లు చేయమని చెప్పి వెళ్ళాడు. ఈ విషయం ఆమె కు చెప్పలేదు. మా బావ చెప్పినవన్నీ ఇంతవరకు నిజం అయ్యాయి. అయితే నాకు ధైర్యం  ఏమిటంటే జ్యోతిష్యం పై పార్వతీ దేవి శాపం నన్ను కాపాడాలని.  

“ బావా పెళ్ళికే వచ్చాను. దేవుని దయవలన బ్రతికేఉన్నాను  బావా. నువ్వు చెప్పినట్లు గా మీ చెల్లాయి కి ఏ మాత్రం అనుమానం రాకుండా, ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లూ చేసేశాను. వీలునామా కూడా రాసేశాను -- కానీ--  అంటూ నేను బావ తో సంతోషం గా మాట్లాడు తోంటే నా ఎదురుగా నా శ్రీమతి నిలబడి వుంది. నన్ను విపరీతమైన కోపం తో చూస్తోంది ఆమె కనుగుడ్లు గ్రామ దేవత కళ్ళ లా వున్నాయి ఆమె ముక్కుపుటాలు ఎగురుతున్నాయి ఆగ్రహావేశాలతో ఆమె చూపులకు శక్తి గన్నా వుండి ఉంటే నేను మరు క్షణమే గుప్పెడు బూడిద అయి వుండే వాడినేమో ! 

“ ఇందుకా ?? గత నెల రోజుల్నించీ మీ ప్రవర్తన చిత్ర విచిత్రం గా వుంది. నన్ను మానసికంగా చిత్రవధ చేసేశారు. నాకు అనుమానం గా వుంది. కానీ ఏది అడిగినా చెప్పరు గా -- ఇంటికి పదండి  మీ పని చెబుతా -- “ అంటూ విస  విసా-- బాత్ రూమ్ లోకి దూరింది. ఇంటికి వెళ్ళాక ఎటువంటి శిక్షలు ఎదుర్కోవాలో ! అయినా బ్రతికిపోయానే అనే సంబరం లో ఆమె శిక్షల  కు భయమేమీ  లేదు. మరణ భయం కన్నా ఎక్కువ గా ఉంటుందా ?  ఇక భయం లేదు అనుకున్నాను సుమా ---!!


“ నానాటి బ్రతుకూ నాటకమూ,

పుట్టుటయు నిజము 

పోవుటయు నిజము 

నట్ట నడిమి పని నాటకము 

ఎట్ట ఎదుట గలది ప్రపంచమూ --- 


టి.వి. లో రాహుల్ వెల్లాల్ గానం చేస్తున్న అన్నమయ్య కీర్తనలు వినవస్తున్నాయి. అంతా నాటకమే !  


No comments:

Post a Comment

Pages