శ్రీ వల్లభ శతకము - పీసపాటి సోమనాథము - అచ్చంగా తెలుగు

శ్రీ వల్లభ శతకము - పీసపాటి సోమనాథము

Share This

 శ్రీ వల్లభ శతకము - పీసపాటి సోమనాథము

పరిచయము: దేవరకొండ సుబ్రహ్మణ్యం 
కవి పరిచయము:

పీసపాటిసోమనాథ కవి గంజం జిల్లాలోని రోణంకి గ్రామ నివాసి. తల్లి అన్నాంబ, తండ్రి ఆప్పన.శతకారంభంలో ఈకవి తన గురించి ఈవిధంగ చెప్పికొన్నాడు.

శా. శ్రీరోణంకినివాసుఁడన్ బ్రధితమౌ శ్రీపీసపాటాఖ్యమౌ
సారబ్రాహ్మణ వంశజన్ముఁడను, సంజ్ఞన్ సోమనాథుండ, శ్రీ
భారద్వాజసగోత్రుఁడన్, ఘనతరాపస్తంబసూత్రుండ, నన్
గారుణ్యామృతవృష్టిఁ దన్పఁగదవే కంజాక్ష! శ్రీవల్లభా!

క్రీ.శ.1932 వ సంవత్సరమున ప్రచూరించబడిన ఈశతకము వలన కవి 20 శతాబ్ధి ప్రథమ కాలము వాడుగా తోచుచున్నది. ఈకవి గురించి ఇతరవివరాలు కానీ వీరి ఇతర రచనల గురించికానీ ఎటువంటి వివరాలు దొరకలేదు

శతక పరిచయం:

"శ్రీవల్లభా" అనే మకుటంతో శార్ధూల, మత్తేభ వృత్తాలలో రచింపబడిన ఈశతకము నైరా గ్రామములో వెలసిన శ్రీవల్లభ నారాయణస్వామి కంకితముగా చెప్పబడినది. భక్తిరస ప్రధానమైన శతకము కవికి ప్రథమ ప్రయత్నము.  కొన్ని పద్యాలను చూద్దాము.

మ. కరివక్త్రుందొలుతన్ భజించి పిదపన్, గంజాక్షివాగ్దేవతన్
గరమున్ భక్తినమస్కరించి, మదిలోఁగౌతూహలంబొప్పఁగా
హరి! నేనీశతకంబు జెప్పెదను నీయంఘ్రుల్ మదిన్నిల్పి, స
ద్వరదా! మ్రొక్కెదఁ గావవే కరుణ దేవా! నైర శ్రీవల్లభా!

శా. శ్రీరమ్యంబగు జీవనాంచితలసచ్చ్రీ వంశధారానదీ
తీరప్రాంతము, భక్తపాళికారతంత్రీ వాద్యసన్నాదితం
బారామాది విభాసితంబు, విభుధావాసానుసంధానమౌ
నైరగ్రామము నీనివాసము జగన్నాధుండ శ్రీవల్లభా!
కేశవాది నామావళులను ఒక్కొక్క నామమును ఒక్కొక్క పద్యమునందు ఇమిడ్చి చెప్పినాడు.

కొన్ని కేశవాది నామావళి పద్యాలను చూద్దాము

మ. గిరిభాగంబునువీడి నీరమునకై క్రీడాపర్తంబునన్
సరసిన్ నక్రముచేతఁ జిక్కువడినిన్ సద్భక్తిఁబ్రార్ధిపఁగాఁ
గరిరాజున్ మొఱయాలకించి కరుణన్ గాపాడవే, కేశవా
వరదా! మ్రొక్కెదఁగావవే కరుణ దేవా! నైరశ్రీవల్లభా!

మ ధరణిరేణుసమూహ సంక్యయు, లసత్తారావళీసంఖ్యయున్
గురువారాశితతరంగ సంఖ్యయును సంకోచింప లెక్కింపఁగా
హరి నీ దివ్యగుణంబులన్నుడువనాహా! శక్యమా! వామనా!
వరదా! మ్రొక్కెదఁగావవే కరుణ దేవా! నైరశ్రీవల్లభా!

శా. సోమార్కోజ్జ్వలదివ్యనేత్రయుగళా! క్షోణీసుతాదీశ్వరా!
కామార్యాది సురేంద్రవందితపదా! కారుణ్యవారాంనిధీ!
భీమోద్దామపరాక్రమా! యభవ! గోపీనాథ! దామోదరా!
రామా! తారకనామ! దుష్టజనదూరా! నైర శ్రీవల్లభా!

మ. హరకోదండ విఖండనాద్భుతబలా! హర్యాక్షమధ్యా! శుభం
కర! పాపౌఘభయంకరా!మునిమనఃకంజావళీ భాస్కరా!
పరశిక్షా! శ్రితరక్ష! పక్షిగమనా! ప్రద్యుమ్న!నారాయణా!
వరదా! మ్రొక్కెదఁగావవే కరుణ దేవా! నైరశ్రీవల్లభా!

కేశవనామాది పద్యముల తరువాత దశావతార వర్ణనను కావించినాడు.కొన్ని పద్యములను చూద్దాము.

మ. ధరణిన్ సోమకనామదానవుఁడూబల్ దర్పమునన్ వేదముల్
సరసీజీద్భవునొద్ద దొంగిలి వెసన్ సంద్రంబులోడాగినన్
వరమీనాకృతి వానిఁద్రుంచి నిగమవ్రాతంబజుంజేర్పవే
వరదా! మ్రొక్కెదఁగావవేకరుణ దేవా! నైర శ్రీవల్లభా!

మ దశకంఠుండు పురందరాది సురలందర్పోగ్రుఁడై గాఢ దు
ర్దశలంబెట్ట నజుండుఁ గుయ్యిడఁగ దద్రక్షోవిభున్ బోర ది
వ్యశరాళిందునుమాడవే, యలఁతిగా వారాశిబంధింపవే
యశమున్ నింపవె రాఘవాకృతిన్ మాయాతీత! శ్రీవల్లభా!

శా. సద్ధర్మంబు నెఱుంగజాలకజనుల్ జాత్యాదిభేదంబులన్
శుద్ధబ్రహ్మముఁ జెందకుండుటను సంశోధించి తద్భోధనా
బుద్ధిందత్త్వవిచారముల్ సలుపవే బుద్ధాకృతిన్ జ్ఞానివై
యిద్ధానందమయస్వరూప! వరదాయి! నైరశ్రీవల్లభా!

ఇందులోని కొన్నిపద్యములు ఇతర రచనలకు అనుకరణలుగా కనిపిస్తున్నవి

శా. నీతో నవ్వుల నర్మగర్భితములన్, నీతోడిసయ్యాటలన్
నీతో ముచ్చటలాడుటన్ గలయుటన్ నీమూర్తి దర్శించుటన్
జేతో మోదము నొందజేయుగదవే సీతేశ సంసేవక
వ్రాతత్రాత! శుభప్రదాత!  రఘువీర! నైరశ్రీవల్లభా!

మ. ధరసింహాసనమౌ నభంబుగొడుగౌ దల్పంబు శేషహియౌ
గురువారాశి నివాసమౌ, నిగమవాక్పూరంబు నీస్తోత్రమౌ
నరసింహా శ్రితభద్రదాయకము నీనామంబు సంభావ్యమౌ
వరదా! మ్రొక్కెదఁగావవేకరుణ దేవా నైరశ్రీవల్లభా!

చక్కని సులభ శైలిలో అందరకు అర్థమయ్యె రీతిలో భక్తిరస బోధనాత్మకమైన ఈశతకము అందరూ చదువ తగినది.
మీరూచదవండి. మీ మిత్రులచే చదివించండి.

***

No comments:

Post a Comment

Pages