వంగపండు శతకము - అచ్చంగా తెలుగు
వంగపండు శతకము - వంగపండు అప్పలస్వామి
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 
కవి పరిచయం:

ప్రజా గాయకుడు,కవిగా ప్రసిద్ధి చెందిన వంగపండు అప్పలస్వామి తెలుగు కవి, రచయిత.

అప్పలస్వామి జూలై 1, 1934 న విజయనగరం జిల్లా, పెదబొండపల్లిలో జన్మించాడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైన అప్పలస్వామి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసి, విరమణ పొందిన తర్వాత టి.ఎస్.ఆర్ జూనియర్ కళాశాలను స్థాపించాడు. భగవాన్ అనే మాసపత్రికకు కూడా సంపాదకత్వం వహించాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఉత్తమ స్క్రిప్టు రచయిత పురస్కారాన్ని అందుకున్నాడు.

ఈకవి బహుగ్రంథకర్త. ఈకవి రచనలు
1. ఆదిశక్తి-అమ్మోరు-పురాణం (2002), 2. శ్రీ భగవద్గీత (1974), 3. సత్యసాయి సందేశం (1976), 4. ఆచార్య చాణక్య చంద్రగుప్త (1979) - నాటకం, 5. పాంచజన్యం (1982),6. ప్రజల కథ (1984), 7. మానవుడు చిరజీవి (1988), 8. సర్దార్ గౌతు లచ్చన్న (1990) - జీవితచరిత్ర 9. ఊర్వశి ప్రణయకలహం (1991), 10. వంగపండు శతకం (1992), 11. సారా భాగోతం (1993) - అన్నీ కవితలు, తొలి అనువాదం

శతక పరిచయం:

వంగపండు శతకం సమాజిక రాజకీయ ఆర్ధిక తత్త్విక అంశాలపై ఆటవెలది వృత్తాలలో రచింపబడిన శతకము. ఈశతకంలో శైలి ఆధినికంగా ఉండీ సరళమైన భాషలో అందరికీ సులువుగా అర్థం అయ్యేట్లుగా ఉన్నది. ఈశతకం మాజీ మంత్రివర్యులైన శ్రీధర్మాన ప్రసాదరావు గారికి అంకితం చేసారు కవి.

ఈశతకం మొత్తం నాలుగు భాగాలుగా విభజించబడింది. 1. సామాజికం, 2. రాజకీయం, 3. ఆర్ధికం 4. తత్త్వం. 

ఒక్కొక్క విభాగం నుండి కొన్ని పద్యాలను మచ్చుకి చూద్దాము.

సామాజికం

ఎంత జ్ఞానియైన ఏమి బోధించిన
ఏమి యిచ్చెదరన్న ఏవగింపె!
బిచ్చ మెత్తువాని మెత్తురా ఎవరైన
వినర వంగపండు కనర నిజము

ఓటమి నందిన ఒదిగి ఉందబోకు
పట్టుదలతో గట్టి కృషిని మరవద్దు
గెలుపు ఓటమిలను జీవనమలుపులు
వినర వంగపండు కనర నిజము

పదవి నడ్డముపెట్టి ప్రక్కదారుల త్రొక్క
పదుగురు-వడిబట్టి-వందనమను
పదవి సంతకెల్ల పలకరించరెవరు
వినర వంగపండు కనర నిజము

కలిమిపరుని భార్య కాసులకేడ్చును
కూలివాని భార్య కూటికేడ్చు
ఇరువురి తెరువులు చివరికి బరువులె
వినర వంగపండు కనర నిజము

చిన్నతనము నపొందు శిక్షణొక "శిక్షర"
మధ్యవయసున పడు "బ్రతుకుశిక్ష"
పెద్దతన మొచ్చిన "పదివేలశిక్షలు"
వినర వంగపండు కనర నిజము

కుప్పిగంతులె నేడు గొప్పనాత్యమాయె
కోతిచేష్టలె మనకోర్కెలనగ
అదుపుదప్ప "మనసు" అల్లరి రూపాలె
వినర వంగపండు కనర నిజము

వెనుక గోతులు త్రవ్వు వెధవలె ఏనాడు
నీతి వంతులమని నిలచి జెప్పు
మంచితనమేనాడు మారుపలుకదు కద
వినర వంగపండు కనర నిజము

భక్తి దండమొకటి భ జనదండమొకటి
దండాలలోరెండు రకములుండు
దండమిడ పూలదండ యని భ్రమపడకు
వినర వంగపండు కనర నిజము

పశువుల కాపరి పండితుండెట్లాయె
కట్టుకున్నదాని కష్టఫలము
సతిసహకరించక పతికి సద్గతిలేదు
వినర వంగపండు కనర నిజము

రాజకీయము:

మేకవన్నె పులులు మేదిని తిరగాడ
తేనెపూసిన కత్తి తీయననకు
మొట్టికాయ తినక మోసము తొలగున
వినర వంగపండు కనర నిజము

బుద్ధి గలవారితో బద్దవైరము వద్దు
నందులవలె పతన మందగలవు
జ్ఞాన మిరువైపుల దారుగల కత్తిర
వినర వంగపండు కనర నిజము

రాజకీయాలలో రాణించదలచిన
ప్రజలపై బడి నీవు బ్రతుక వద్దు
ఆర్ధికవిహీనుని ఆదరించరు ప్రజ
వినర వంగపండు కనర నిజము

పదవి పదవన్నను పారివోవును పదవి
వద్దు వద్దన్నను వడినిజేరు
ప్రజలాత్మ పదవిర పరమాత్మ రూపము
వినర వంగపండు కనర నిజము

సహజ శత్రువుతో సంధికి దిగవద్దు
నీపదవి గల్లంతు ఇతని వలనె
శత్రువు-శత్రువు మిత్రుడేమనకుర
వినర వంగపండు కనర నిజము

పదవి నున్నవాడు ప్రతి ఒక నిముషము
ప్రజల మనిషి ననుచు బలుకు చుండు
ప్రజల కంటగించ పదవెగిరిపోవదా
వినర వంగపండు కనర నిజము

తిన తిండిలేనోడు తిన మరిగినోడు
దోపిడిరాజ్యమున కాపుకాయ
తగు విద్దరిలో రాదు అనగలర మనగలర
వినర వంగపండు కనర నిజము

ఆర్ధికం:

బానిస యజమాని బ్రహ్మసృష్టికాదు
పుడమి నర్ధము వలన పుట్టుక లివి
అజ్ఞాని బానిస! విజ్ఞాని యజమాని
వినర వంగపండు కనర నిజము

ఆత్మజ్ఞానికైన అర్ధమవ సరమిల
నిత్య దినచర్య నిలుచు టెట్లు
దివ్వెను పసలేక దీపము వెలుగున
వినర వంగపండు కనర నిజము

ఆస్తిహక్కు తెచ్చె అసమానతలు భువిని
దోపిడిపీడనలు "దొర"లనగనిలచె
కొనుగోళ్లు శక్తితో మొనగాళ్లు లేచారు
వినర వంగపండు కనర నిజము

కలిమిలేని నరుడూ కలతల నందును
తెలివితేటలున్న తేటపడవు
కలిమిలేక తెలివి వెలుగు నందదు సుమా!
వినర వంగపండు కనర నిజము

తత్త్వం:

తత్త్వమే వేదాంత జగతికి మూలము
నైతిక ప్రవర్తనకు నాందినేడు
ఏ మతము తత్త్వానికెడబాటు కాలేదు
వినర వంగపండు కనర నిజము

భర్తృహరి వేమన భాస్కరుడు సుమతి
ఆచరణనిడి నీతివచన మిడినార
ధర్మాచరణ తీరు ధర్మ వివరణ వేరు
వినర వంగపండు కనర నిజము

ఇంటిపనిలో ఆలి బయటపనిలో మగడు
పని విభజనెంతో సత్ఫలిత మిచ్చె
ఇరువురి కృషివినా ఇల్లు గడువదు నేడు
వినర వంగపండు కనర నిజము

మనసు పడని మనువు మనుగడ ఎన్నాళ్లు
నిదురబోవు వన్నె నిలుచు వరకే
ఆత్మబంధములేని అనుబంధమేలర
వినర వంగపండు కనర నిజము

ప్రకృతి సంకల్పమే ప్రాణికి మార్గము
ఆత్మసంకల్పమే అవని బ్రతుకు
దైవసంకల్పమే ధరణికి రక్షర
వినర వంగపండు కనర నిజము

కనబడినదే నీకు కఠిన సత్యము కాదు
తెరవెనుక గాధను తెలిసికోర
నింగినుండు తార నిజరూపమేమిటి
వినర వంగపండు కనర నిజము

ఇటువంటి ఎన్నో అందమైన చక్కని సందేశాత్మక పద్యాలున్న ఈశతకం అందరూ తప్పక చదవ వలసనది.
మీరూ చదవండి మీ మిత్రులచే చదివించండి

***

No comments:

Post a Comment

Pages