తరాలు అంతరాలు - అచ్చంగా తెలుగు

తరాలు అంతరాలు

Share This
తరాల అంతరాలు 
వడలి అనసూయచేతి కర్రతో చిన్న గా అడుగులు వేసుకుంటూ ఇరు పక్కలా ఉన్న పచ్చటి పొలాలను చూసుకుంటూ తృప్తిగా చల్లని గాలి పీలుస్తూ  హాయిగా నడుస్తున్నాడు దివాకర్. వయస్సు 70 పై మాటే. ఇద్దరు మనుషులు ఎదురుగా వస్తున్నారు చేతిలో గడ్డిమోపు తో. మోపు కిందకి దింపి ఇద్దరు దణ్ణం పెట్టారు. వద్దు అన్నట్టుగా చేయి ఊపి వారిని చిరునవ్వుతో పలకరించి ముందుకు సాగాడు. ఉతికి ఇస్త్రీ చేయని పంచ పైన లాల్చీ వేసుకుని ఉన్నాడు. వెనుక నుండి మాటలు వినబడుతున్నాయి. 

“ఏమిటో అంత కలిగిన మారాజు ఇక్కడ ,ఎందుకో పట్నం లో వందమందిక సరిపడే భవంతిని వదిలి పెంకుటింట్లో ఏమిటో అన్న మాటలు వినబడ్డాయి. అవి విని తనలో తాను నవ్వుకున్నాడు దివాకర్

ఒక్కసారి చిన్నతనం గుర్తుకు వచ్చి నిట్టూర్చాడు. ఎక్కడ దక్షారామము ? ఎక్కడ హైదరాబాద్ ? తండ్రి భూస్వామి. 200 ఎకరాలు ఉండేవి. పూర్వీకులు యజ్ఞాలు చేసిన ఆహితాగ్నులు. తాను ఎనమిది మందిలో ఆఖరి వాడు. తండ్రి అచ్చిరాదని ఎవరో చెప్పడము వలన డాబా ఇంట్లో కాక ముందు తాటాకుల ఇంట్లో తరువాత పెంకుటింటికి మారాడు. పెద్ద స్థలం , మధ్య లో పెంకుటిల్లు చుట్టు చెట్లు వేప చెట్లు తుమ్మ చెట్లు లాంటి పెద్ద పెద్ద వృక్షాలు జామ సీతాఫలాలు మామిడి చెట్లు. పూలమొక్కలకు లెక్క లేదు. పాలేళ్లు అన్ని చూసుకునేవారు. నీళ్లు తీసుకురావడం దగ్గర నుండి. కొనడం అంటే ఏమిటో తెలియదు. ఇల్లు ఒక దివాణం లా ఉండేది. ‘అమ్మ’ని తలచుకున్నప్పుడు ఇప్పటికి కళ్లనీళ్లు వస్తాయి. పేరుకు తగ్గట్టు అన్నపూర్ణ తల్లి. వచ్చిన వాళ్లని ఉత్త చేతులతో పంపడము ఉండేది కాదు. ఊళ్ళో అందరికి సహాయం చేసేది. పాలు పెరుగు దేనికి తడుముకోనక్కరలేకుండా ఉండేది. వారాలబ్బాయిలు ఒక అయిదారుగురు అందరిని సమానం గా చూసేది. అందరికి చద్ది అన్నమే పొద్దున. ఎండావకాయ చిక్కని గడ్డ పెరుగు-

ఆ రోజులే వేరు. కళ్లు తుడుచుకున్నాడు...

***
దాక్షారామం దగ్గర చిన్న కుగ్రామం అవడం వలన వాన వస్తే శలవు ఎండ వస్తే శలవు స్కూలు మిడిల్ స్కూలు పెద్దవాళ్లు నలుగురు ఆడ పిల్లలు అవడం వలన ముందు వాళ్లకి పెళ్లళ్లు అయిపోయాయి. పెళ్లళ్లకే సగం పొలం హారతి కర్పూరంఅయింది . వాళ్ల రాక పోకలు పురుళ్లు పుణ్యాలు ఇంక ఖర్చులు పెరిగాయి కాని ఇంట్లో కార్యక్రమాలు యధావిధిగా జరిగేవి. అక్కల రాక పోకలు పిల్లలు ఇల్లు పెళ్లివారిల్లులా ఎప్పుడు సందడిగా ఉండేది. పెద్దక్క పెళ్లికి తనకు 5 ఏళ్లు. ఏడాదికే రాజేశ్వరి పుట్టింది. అందరు నీకు పెళ్లాం పుట్టిందిరోయి అని హాస్యలాడేవారు. అప్పట్లో అలాటి మట్లాడటం తప్పుగా ఉండేది కాదు. అందరితో తోటలంటా దొడ్లోనూ  ఆడుకుంటున్నప్పడు రాజేశ్వరి మీదే దృష్టి ఉండేది. రాజేశ్వరి కూడా అలాగే ఉండేది. ఎప్పుడు తన వెంటే. అందుకే ఇప్పటికి మామయ్య అనే పిలుస్తుంది. చిన్నప్పటి నుండి  కలిసి తిరగడం వలన తన కష్టసుఖాలు అర్ధం చేసుకుని ప్రవర్తిస్తుంది. ఇప్పటికి అంతే.

అన్నల చదువులు అయి తన దగ్గరకు వచ్చేటప్పటికి 5 ఎకరాలు మిగిలింది. అన్నలు మంచి మంచి చదువుల తో మంచి ఉద్యోగాలలో స్థిర పడ్డారు. తాను మటుకు పరిస్ధితులను గమనించి అగ్రికల్చరల్ బీ ఎస్ సీ తో సరి పెట్టుకున్నాడు తండ్రికి సహాయం చేయడానికి.  తండ్రి అందరిని పిలిచి అదే చెప్పాడు “ మీ అందరికి నేను ఇవ్వగలిగిన ఆస్తి చదువు మాత్రమే ఇంకేమీ ఇవ్వలేక పోయాను “ అని కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. అందరూ అన్నది ఒక్కటే.  “నాన్నగారు మీరు మాకు విలువైన విద్య ఇచ్చారు, మీరిద్దరు మా దగ్గరకు వచ్చేయండి. ఆ రెండెకరాల పొలం తమ్ముడు చూసుకుంటాడు” అని. కాని తండ్రి “నన్ను కన్నతల్లి ఈ ఊరే., చంటాడి దగ్గరే ఉంటాము” అని దృఢంగా అన్నాడు.  అలా తాను ఆ రెండెకరాలు చూసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. చిన్న ఊరే కాబట్టి అందరు చేదోడు వాదోడు గా ఉండే వారు. 

రెండెకరాలలోనే బంగారం పండించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

పెళ్లి విషయంలో రాజేశ్వరి తనను తప్ప ఎవరిని చేసుకోనని మండికేసింది. ఆస్తి లేదని అక్క బావ తగ్గినా రాజేశ్వరి తగ్గలేదు. రాజేశ్వరి తో పెళ్లి అయ్యాక జీవితం కొత్త మలుపు తిరిగింది. రాజేశ్వరి తను కూడ పెళ్లి అయిన దగ్గర నుండి కష్టపడవలసి వచ్చింది. అన్నపూర్ణ లాంటి అమ్మ దిగులు పడి ఒంటికి తెచ్చుకుంది. అక్కల రాక పోకలు తగ్గి పోయాయి .అన్నయ్యల నిరాదరణ ఆమె ని బాగా కలచివేసాయి. ఫలితం మనోవేదన అనారోగ్యం ఇంటి భారం, వంట రాజేశ్వరి మీద పడ్డాయి. అయినా కూడ అలవాటైన చోటు మనుషుల పద్దతులు తెలుసు కాబట్టి అన్ని ఓపికగా చేసేది. 

కాని అమ్మ ఎక్కువ రోజులు ఉండలేదు. తన పెళ్లైన ఏడాది కే వెళ్లి పోయింది .అమ్మని వదలలేక కాబోలు నాన్నగారు మూడు నెలల కే నెళ్లిపోయారు. ఊరు ఊరంతా అండగా నిలబడింది. కాని అండగా నిలబడవలసినవాళ్లు చుట్టపుచూపుగా వచ్చి ఎవరు దారిన వారు వెళ్లారు. ఖర్చు అంతా తానే పెట్టాడు. ఇంకొక్క ఎకరం మిగిలింది. రాజేశ్వరి తో ఆలోచించాడు. హైదరాబాదు వెళ్లి ఏమైనా చేసుకుందామంది. తన నగలు అమ్మడానికి కూడ వెనుకాడలేదు. తనకి గత్యంతరం లేక పోయింది. హైదరాబాద్ లో తన ఫ్రండు ఉన్నాడు . వాడిని అడిగి ఏదైనా చెయవచ్చు. అనుకున్నాడు.  ఇంకో ప్రస్థానం మొదయింది 

హైదరాబాద్ చేరుకుని ఫ్రెండు ఇంటి కెళ్ళాడు. చిక్కడపల్లి లో ఉంది వాడిల్లు. అప్పటికి ఇంకా ఫ్లాట్ కల్చర్ లేదు. వాడిది డాబా ఇల్లు.  ముందు ఇల్లు చూసుకుని అప్పుడు ఆలోచించమన్నాడు స్నేహితుడు . ఇద్దరు రెండు రోజులు ఆలోచించి వాళ్లింటి డాబా మీద రెండు గదుల షెడ్ వేయించి అందులో ఉండవచ్చన్నాడు. అంతే అన్ని పనులు చకచక జరిగాయి. భారమైన మనస్సు తో కన్నతల్లి లాంటి ఊరిని విడిచి భార్యతో హైదరాబాద్ చేరాడు. ఒక వంటగది ఇంకొక గదిని బెడ్రూమ్ లా చేసుకుని ఆ ఇరుకింటిలో కాపురం మొదలు పెట్టాడు. స్నేహితుడు మొహమాటపడకుండా చెప్పాడు అద్దె 150 అని. 

విశాలమైన పెంకుటిల్లు అలవాటు అయి ఆ ఇరుకింట్లో సర్దుకోవడం కష్టమే అయింది

అలా నెల రోజులు గడిచాక స్నేహితుడు పైకి వచ్చి “ఏమోయ్ మొన్న మీ ఆవిడ చేసిన పిండివంటలు, స్వీట్ల రుచి  మీ చెల్లాయి తెగ పొగిడింది” అన్నాడు. అతను వెళ్లగానే  రాజేశ్వరి “మామయ్యా ! మనము స్వీటు షాప్ పెడదాము నేను అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను కదా ! మొన్న నువ్వు తెచ్చినవన్నీ కల్తీ నెయ్యి తో చేసినవి” అంది. అనుకున్నది కార్యరూపం లోకి రావడానికి ఏడాది పట్టింది. ఒక చిన్నగదిలాంటిది తీసుకొని స్నేహితుని దగ్గర అప్పు తీసుకుని  ‘రాజేశ్వరి మిఠాయి భండార్’ మొదలు పెట్టాడు. స్వచ్చమైన నెయ్యి కోసం నానా తంటాలు పడ్డారు.

రాజేశ్వరి చేతి మహిమ వలన మూడేళ్లలో ఒక మాదిరి లాభాలు రావడం మొదలు పెట్టాయి.

ఫ్రండు అప్పు తీర్చి నిలదొక్కుకోగలిగాడు. ఇంక అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేక పోయింది.

పాపం రాజేశ్వరే తెగ నలిగిపోయింది. లడ్డూలకు, బర్ఫీ, మైసూర్ పాక్ ఇలాంటివాటికీ  తెగ డిమాండ్ పెరిగింది. షాప్ పెద్దది అయింది. హెల్పర్లని  పెట్టు కోవలసి వచ్చింది.

రాజేశ్వరి స్వయంగా అన్నీ చూసుకునేది  దేనికి రాజీపడేదికాదు నాణ్యత రుచి మొ॥విషయాలలో.

10 ఏళ్లలో జీవితం మారి పోయింది. హైదరాబాద్ లో 10 బ్రాంచీలు ఓపెన్ చేసాడు. పుల్లారెడ్డి స్వీట్స్ తరువాత తన స్వీట్ల కే అంత పేరు వచ్చింది. ముఖ్యంగా కాజా, బందరు తొక్కుడు లడ్డు, బూందీ లడ్డు కి చాలా పేరు వచ్చింది. కోస్తాలలో నుండి హైదరాబాద్ వచ్చిన వాళ్లు అందరు తప్పకుండా తన స్వీట్ లు కొని పట్టుకుని వెళ్లేవారు. తరువాత మెల్లగా ఆంధ్ర, చెన్నై బొంబాయి ఢిల్లీ అన్ని చోట్లా పాకిపోయింది .పట్టినదల్లా బంగారమయింది. 

ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆలనా పాలన అంతా రాజేశ్వరిదే  అయింది. భోగ భాగ్యాలతో పెరగడము పిల్లలకి ఆలవాటయింది. పేరున్న స్కూళ్లలో,  కాలేజిల లో చదివినా అత్తసరు మార్కులతో పాసవడం - ఫలితం చదువును ‘కొనడం” అయి పోయింది తరువాత పెద్దవాడు అమెరికా, అమ్మాయి ఆస్ట్రేలియా, ఆఖరివాడు ఇంగ్లాండు వెళ్లి అక్కడ చదువుకున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ సరిగా చదవని వారు అక్కడ బాగానే చదివి ఉద్యోగాలలో స్థిర పడ్డారు . పెళ్లిళ్లు మాత్రం తాము చూచి ఎంపిక చేసినవాళ్లనే చేసుకున్నారు. పిల్లా పాపలతో బాగానే ఉన్నారు. బహుశా అక్కడకి వెళ్లాక అక్కడ పరిస్థితులకు కష్టనష్టాల కు అలవాటు పడి ఉంటారు. 

తను, రాజేశ్వరి కూడ ఆ మూడు దేశాలు వెళ్లారు. ఆ మోజు కూడ తీరిపోయింది. దానా దీనా రెస్టారెంట్ వ్యాపారం మాల్సు  ఆ వ్యాపారం కూడ తోడయింది. అన్ని పుణ్యక్షేత్రాల దర్శనం రాజేశ్వరి బలవంతం మీద అయిపోయింది. మెల్లగా వృద్దాప్యం మొదలయింది. రెండు భుజకీర్తులు వచ్చేసాయి. బీపీ, సుగరునూ!

ఒకసారి ఏదో బిజీ గా ఉన్నపుడు ఫోను వచ్చింది రాజేశ్వరి దగ్గర నుండి, అర్జంటుగా రమ్మని టైమ్ చూస్తే 7.30 అయింది. రాజేశ్వరి ఈ టైమ్ లో ఎప్పుడూ  ఫోను చెయ్యదు. ఆదుర్దా గా వెళ్లాడు ఇంటికి. రెండు కిలో మీటర్ల దూరం 200 km లా అనిపించింది అరగంట పట్టింది ఇంటికి వెళ్డానికి. గేటు దగ్గరకు వెడుతున్నప్పుడు అశ్చర్యపోయాడు .ఇల్లు గార్డెన్ మొత్తం లైట్ల కాంతి తో వెలుగుతోంది. అందరు తెలిసినవాళ్లే. ఒకవంద మంది అందరు శుభాకాంక్షలు చెప్పి బొకేలు ఇస్తున్నారు. అయోమయంగా ఇంట్లోకి అడుగు పెట్టాడు. 

ఎదురు గుండా రాజేశ్వరి వెంకటగిరి చీర కట్టుకుని సింపుల్ గా మెడలో పెళ్లి నాటి నెక్లేస్ చేతులకు చీరకు మాచ్ అయ్యే గాజు గాజులు వేసుకుంది. చాలా సాదా సీదాగా ఉంది. “మామయ్య వచ్చావా స్నానం చేసి తొందరగా రా ! నీ బట్టలు అక్కడ పెట్టాను” అంది.

అయోమయం గానే అన్ని చేసి బట్టలు చూసాడు. ఒక పంచె ఒక కాటన్ లాల్చీ ఉంది. పాతరోజులు గుర్తు కు వచ్చాయి. పొలానికి వెళ్లేటప్పుడు ఓ లుంగి ఏదో కాటన్ చొక్కా వేసుకుని వెళ్లేవాడు. అవి వేసుకుని అద్దం లో చూసుకున్నాడు దివాకర్. అప్పటి దివాకర్ వేరు . ఇంక ఎక్కువ ఆలోచించకుండా వెళ్లాడు. రాజేశ్వరి అన్ని దగ్గర ఉండి సూపర్ వైజ్ చేస్తోంది

పదార్ధాలన్ని సాంప్రదాయ వంటకాలే . అందరికి టేబులు మీద అరిటాకులు వడ్డన. బఫే లేదు. అందరు తృప్తిగా తిని మరో సారి శుభాకాంక్ష లు చెప్పి వెళ్లిపోయారు.

అందరు వెళ్లిపోయాక నౌకర్లు చకచక క్లీను చేసారు. అంతా అయ్యాక అడిగాడు ఎందుకు పార్టీ అని అడిగాడు. తీరుబడిగా సోఫా లో కూర్చుని. అలసిపోయిన రాజేశ్వరి అతని పక్కనే కూలబడింది. చెవులు రిక్కించి వినడానికి సిద్ధ పడ్డాడు దివాకర్-

రాజేశ్వరి “మామయ్యా !  ఇవాళ నాకు 60 నిండి 61 వచ్చాయి. నీకు గుర్తు లేదు. నిన్ను నేను విమర్శించను.  ఎందుకంటే నువ్వు పగలనక రాత్రనక ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. కాని ఇంకా ఎందుకు మనము ఆరోగ్యము పాడు చేసుకుని ఎవరి కోసమో ఎందుకు కష్టపడాలి ? పిల్లలు వాళ్ల దోవన వాళ్లు ఉన్నారు . వాళ్లకి మన డబ్బు అవసరము లేదు ఇంకా గట్టిగా చెప్పాలంటే మన అవసరము లేదు. పూర్వము రాజులు వాళ్లు రాజ్యాన్ని పిల్లలకి అప్పగించి వానప్రస్థానికి అడవులకు వెళ్లేవారట. మనము అడవులకు అక్కరలేదు కాని మన పల్లెటూరు వెళ్లి పోదాము. సంపాదించినది చాలు. ఇక నైనా నువ్వు నా కోసము నేను నీ కోసము బతకాలి. మనము ఉంటే మహా ఇంకో పదేళ్లు ఉంటాము. ఈ పదేళ్లు అయినా హాపీగా గడుపుదాము. ఆలోచించు. నాకు నిద్ర వస్తోంది” అని లేచి వెళ్లింది పడుకోవడానికి.

అలాగే దివాకర్ ఆ సోఫా లో కూర్చుండి దీర్ఘాలోచవలో పడిపోయాడు. రాజేశ్వరి చెప్పింది అక్షరాలా  నిజము. అలాగే కూర్చుని టివి చానెల్సు తిప్పుతుంటే సినిమా మొదయింది. సినిమా .ఆపేద్దాము అనుకున్నవాడే చివరవరకు చూశాడు .పచారు చెయ్యడం మొదలు పెట్టాడు. 

తనకు 67 ఏళ్లు రాజేశ్వరి కి 61. ఇంక చాలు అనిపించింది. హాలంతా చక్కని పూల పరిమళం రావడం అప్పుడు గమనించాడు. హాలు కి ఆనుకొని ఉన్న రూమ్ లో పూల బొకేలు అన్నీ పెట్టారు. వెళ్లి చూశాడు. ఏముంది రేపు పొద్దున వాటిని అవతల పారేస్తారు అని అనుకున్నాడు. సినిమా, ,రాజేశ్వరి చెప్పిన మాటలు అతనిమీద బాగా పని చేశాయి రాత్రంతా ఆలోచించాడు. పొద్దునే లేచి తను అనుకున్న ప్లాన్ అమలు చెయ్యడం మొదలు పెట్టాడు. అంతా పూర్తిగా  అమలు చేసేటప్పటికి ఆరు నెలలు పట్టింది. భార్య సహకారం పూర్తిగా ఇచ్చింది. 

ఆస్తి లో 1/2భాగం పిల్లలకు ఒక్కొక్కళ్లకి 300 కోట్లు పోగా 100 కోట్లు మిగలింది 50 కోట్లు తనను నమ్ముకున్నవారికి oldage homes. 25 కోట్లు తిరుపతి వెంకన్నకి అర్పించగా 25 కోట్లు ఉంచాడు. తమ తదనంతరం జీర్ణ దేవాలయాల ఉద్ధరణకి సమర్పించాలని అనుకున్నాడు. పిల్లలు “It’s Ok dad” అన్నారు అంతే గాని డాడీ మీరు ఎలా ఉంటారు మా హెల్పు కావాలా అని కూడ అడగ లేదు. విరక్తిగా నవ్వుకున్నాడు. వీళ్ల గురించా తాను ఇన్ని రోజులు తాపత్రయపడ్డానని అనుకున్నాడు. ఇంక శేషజీవితం మారుమూల వానప్రస్థం లో గడపాలని ఎవ్వరితో సంబంధం లేకుండా! పిల్లలతో సహా అని అనుకున్నాడు. ఎక్కడా అని ఆలోచన మొదలుపెట్టాడు భార్యను సంప్రదించాడు.

ఊరికి వచ్చాక వాళ్ల దినచర్య మారింది. ఒక వంట మనిషిని పెట్టుకున్నారు. వాళ్లింట్లోనే ఉండేలా పెట్టుకున్నారు. చిన్న out house కట్టించారు. ఆవిడ 4.30 కి వచ్చి కాఫీ కలిపి ఇస్తుంది . 6 వరకు ధ్యానము చేసుకుని ఇద్దరు అరుగు మీద కుర్చీలలో కూర్చుని ఉషస్సు, సూర్యోదయం, తోటలో పువ్వుల వాసనలతో,  కమ్మగా కాఫీ తాగి ఏడు వరకు కూర్చుంటారు. ఎదురు గుండా పచ్చటి పొలాలు కొండలు కనిపిస్తూ ఉంటాయి. ఎనిమిది కి స్నానం, తొమ్మిది వరకు పూజ, తరువాత టిఫిన్. అప్పడు దివాకర్ ఇంటికి దగ్గరలోనే ఉన్న పొలం ఇంకొచం దూరంలోనే ఉన్న దక్షారామ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని కాసేపు ప్రశాంతంగా కూర్చుంటారు . ఇంటికి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకుని 1 గంటకి భోజనం ఇద్దరు కలసి 3 వరకు నిద్రపోయి మూడునుండి 5 వరకు రామాయణాదులు రాజేశ్వరికి వినిపించడము. సాయంత్రము 5 నుండి 6 వరకు వెనుక తోటలో వాకింగ్ రాజేశ్వరి తో కలసి. 

ఏదైనా కొత్తగా కాయ కాయ కాని పండు కాని పువ్వు కాని వచ్చేటప్పడికి ఆమె ఆనందానికి హద్దు ఉండేది కాదు. మామయ్య అని చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్లి చూపించేది. రోజు అనేది అమ్మమ్మ తాతయ్య ఉంటే ఎంత సంతోషించేవారో అని. పక్షుల కిలకిలు పొద్దున సాయంత్రము వినడం అలవాటయిపోయింది. ఏడుకి వంటావిడ చేసిన చపాతీలు అరుగు మీద కూర్చుని పౌర్ణమి రోజులయితే వెన్నెలను చూస్తు నిశబ్దదాన్ని అనభవిస్తూ తినేవారు. తొమ్మిది వరకు పుస్తక పఠనము లేక పాత పాటలు వింటూ కూర్చునేవారు. అలా దినచర్య సాగిపోయింది రెండేళ్లు బయట ప్రపంచం తో సంబంధం లేకుండా.! ఒకరోజు కాఫీ తాగుతుంటే పొద్దున మూడు కార్లు వచ్చి ఆగాయి ఇంటి ముందు.

కాఫీ తాగుతున్న ఇద్దరు ఆశ్చర్యపడ్డారు ఎవరా అని. కార్లలో నుండి దిగుతున్నవాళ్లని చూసి ఆశ్చర్యపోయారు ఆనంద పడ్డారు. కొడుకులు కోడళ్లు కూతురు అల్లుడు మనుమళ్లు మవవరాళ్లు. కూతురు రాధిక వాళ్లమ్మను చుట్టుకుని బావురుమంది. “ఎందుకమ్మా మేము బానే ఉన్నాము కదా” అంది రాజేశ్వరి. 40 దాటిన రాధిక వెక్కుతు “మీరు ఎక్కడున్నారో తెలియక ఎన్ని రోజులయిందో సరిగా నిద్రపట్టక. మనవాళ్లని ఎవరిని అడిగినా సమాధానం సరిగా చెప్పలేదు. ఆఖరికి అన్నయ్య నాన్న క్లోజ్ ఫ్రండుని పట్టుకుంటే మొదట ఏమి తెలియదన్నాడు. తరువాత కాకినాడ ఏదో పల్లెటూరులో సెటిల్ అయ్యారని చెప్పారు అన్నయ్యకు చాలారోజులకి గుర్తు వచ్చిందట వాడి చిన్నప్పుడు దక్షారామం గురించి చెప్పడము నాన్న చెప్పడము.ఇక్కడ ఉంటారని మేము అనుకున్నాము. మెల్లగా పిల్లల శలవులు అన్ని చూసుకుని అందరం కూడబలక్కుని మొత్తానికి బయలుదేరి వచ్చాము” అంది. 

మొత్తానికి అందరు సెటిల్ అయ్యేటప్పటికి ఒకవారం పట్టింది. అందరు ఇల్లు చూసి . ఆశ్చర్యపోయారు మండువా ఇల్లు అయినా అన్ని సౌకర్యాలు ఉన్నాయి మధ్యలో ఖాళీ స్థలము దానికి ఇటువైపు మూడు గదులు అటువైపు మూడుగదులు . ముందు పెద్దహాలు ఉయ్యాల సింపుల్ సోఫా సెట్లు రెండు ఉన్నాయి. గదులు దాటి వెళ్లాక వంటగది డైనింగ్ హాలు వంటగది దాటాక విశాలమైన పెరడు పళ్లచెట్లు కూరగాయల తోట. హాలు కి ముందు ఇటు అటు రెండు పెద్ద పెద్ద అరుగులు ఇంకా ముందుకు వెడితే పెద్ద పూలతోట తరువాత పెద్ద గేటు. రాజేశ్వరి ఇబ్బంది పడకూడదని కొన్ని అధునాతన సౌకర్యాలు పెట్టించాడు దివాకర్. పిల్లలకోసం అప్పటికప్పుడు మంచాలు దగ్గరుండి అన్ని అమర్చాడు. ఒక్కొక్కళ్లకి ఇద్దరేసి పిల్లలు. పెద్దవాడికి ఇద్దరు మొగపిల్లలు కూతురుకు ఒక మగ, ఆడ. రెండో వాడికి అంతే మగ ఆడ పిల్లలు. వాళ్ళందరూ కలుసుకున్నది ఇక్కడే .అందరు హాయ్ అంటే హాయ్ అనుకున్నారు అందరు కలిపి రెండు నెలలు ఉన్నారు. దివాకర్ రాజేశ్వరి మనమల మనవరాళ్ల ఆట పాటలు కొడుకులతో కోడళ్లతో కూతురు అల్లుడితో మంచి చెడు మాట్లాడుకోవడం వాళ్ల తో కలిపి మొత్తం ర్యాలి దగ్గర నుండి సింహాచలం వరకు అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగారు. అందరు కలిసిమెలిసి మాట్లాడుకున్నారు.

కూతురు అయితే రాజేశ్వరి చుట్టు తిరుగుతూ చిన్ననాటి విశేషాలు లండన్ ముచ్చటలు చెప్పేది.  కోడళ్ళు మొదట కొంత బిడియపడినా తరువాత అత్తగారికి సాయం చెయ్యడము అమెరికా ఆస్ట్రేలియా  గురించి చెప్పడము. అన్ని చిరునవ్వుతో వినేది రాజేశ్వరి.

రాజేశ్వరి స్వీట్లు చెయ్యడంలో కొట్టిన పిండి కదా ! . కొడుకులు వయస్సులో పెద్ద అయినా అమ్మ దగ్గర గారాలు పోయేవారు. అందరు కోటయ్యకాజాలు, తాపేశ్వరంకాజాలు పూత రేకులు రకరకాలు అవకాయల రుచి చూశారు. రోజుుకోరెండో మూడో స్పెషల్సు ఉండేవి. మనుమలు దొడ్డిన పడి ఆడటము. పొద్దున తాతగారి తో కలసి కోటిపల్లి దగ్గర ఉన్న సప్త గోదావరిలో ఈత కొట్టడం స్వామిని చూడటం వెనక్కి వస్తు దక్షరామ స్వామిని చూడటం పొలాలు చూడటం అన్ని చేశారు. ఒకరోజు కారులో కాకుండా ఎడ్లబండిలో ప్రయాణం చేసారు. ఇంక అత్తాకోడళ్లు టిఫిన్లు భోజనాలు తయారు చెయ్యడం హడావుడిలో ఉండేవారు. మధ్యాహ్నాలు తాటిమంజెలు తేగలు మామిడిపళ్లు ఈతపళ్లు కొబ్బరి బొండాలు సీతాఫలాలు జామకాయలు. రాత్రికి అందరు అరుగు మీదే కూర్చుని చపాతీలు తిని అందరు పదికి పడుకునేవారు. ఎన్ని చేసినా దివాకర్, రాజేశ్వరి మధ్యాహ్నాలు గ్రంథపఠనం మానేవారు కాదు. మనమరాళ్లు ఇద్దరు పూలజళ్లు పట్టు పరికిణీ లు పెరట్లో తాతగారు మామిడి చెట్టుకు వేయించిన ఉయ్యాలలు ఊగడం. మొత్తానికి అందరికి ఆ ఊరు అందరికి తెగనచ్చింది. ఏడాదికి ఒకసారి వచ్చి ఒక నెలయినా గడపాలని నిశ్చయించుకున్నారు.

ఇంక ప్రయాణము వారంరోజులలోకి వచ్చింది అందరు కావల్సినవన్నీ సర్దుతున్నారు కూతురు కోడళ్లు స్వీట్లు హాట్లు ఉప్పాడ పట్టుచీరలు.(కొనుక్కునవి), ఊరగాయలు స్నేహితులు అడిగినవన్ని అన్ని చూస్తన్నాడు వంశీ ! పెద్దకొడుకు కొడుకు. వాడికి 14 ఏళ్లు , దివాకర్ రాజేశ్వరి వాడిని 4 ఏళ్ల కిందట చూశారు. Internet లో చూస్తున్నారు కాని వాడు ఒకసారి కనిపించి హాయ్ తాత గ్రానీ అని పలకరించి వెళ్లిపోయేవాడంతే. ఇప్పుడు వాడిలో అన్నీ తండ్రి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దివాకర్ కి. రోజు దివాకర్తో పొలానికి వెళ్లేవాడు. అక్కడ నుండి గుడికి. వెళ్లేవారు. ఇవన్నీ ఎవరికి అని అడిగాడు పళ్లు పూలు బొండాలు తులసీ మారేడు దళాలు పంపడము చూసి. గుడిలో వాటితో అర్చన చెయ్యడము చూశాడు. తాతగారి రొటీన్ చూశాడు కొన్ని అడిగి తెలుసుకున్నాడు.

ఆ రెండు నెలలు దివాకర్ ని అంటిపెట్టుకు తిరిగాడు. మధ్యాహ్నం తాతగారు చదివే వి అన్ని విన్నాడు. అర్ధం కాకపోతే అడిగేవాడు. అలా ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు. 

ఇంకో రెండు రోజులలో ప్రయాణము ఉందనగా అందరు కూర్చుని మాట్లాడుతున్నప్పుడు “డాడ్! నా టికెట్ కాన్సిల్ చెయ్యండి” అన్నాడు. 

అందరు తెల్లబోయారు , కోడలు మాధవి ఏదో చెప్పబోయింది , కాని వంశి స్పష్టంగా ఇంగ్లీషులో చెప్పాడు “తాతగారు , నాన్నమ్మ ఇద్దరు ఓల్డేజు కి వచ్చారు. ఈ రిమోట్ ప్లేసులో ఇద్దరే ఉంటున్నారు. నాకు ఇక్కడ నచ్చింది. ఇక్కడే ఉంటాను వాళ్లకి తోడుగా ఇక్కడ చదువుకుంటాను .వ్యవసాయం చేస్తాను తాతగారి సలహాతో పొలం కొని. ఇక్కడ సెటిల్ అవుతాను. నాకు ఇక్కడ ఈ పొలాలు గుళ్లు గోదావరి అన్ని నచ్చాయి.దట్  ఈస్ అల్”.  అన్నాడు. ఎవరు ఏమి మాట్లాడలేక పోయారు.


తరువాత రెండు రోజులు తల్లితండ్రి ఎంతో నచ్చచెప్పారు అయినా దృఢంగా “నో” చెప్పాడు. 

వెళ్లేరోజు వచ్చింది . అందరు భారమైన మనస్సుతో తల్లిని తండ్రిని కావలించుకుని కళ్లనీళ్లు పెట్టుకున్నారు. తాత చెయ్య్యి ని నానమ్మ చెయ్యిని పట్టుకుని హుందాగా వంశీ అందరికి బై చెప్పాడు. 

“నేను ఎక్కడికి రానురా ! చంటాడి దగ్గర ఉంటాను “ అన్న తండ్రి గుర్తుకు వచ్చాడు దివాకర్ కి. 

తాను చెయ్యలేని పని కొడుకు చేస్తున్నందుకు మనస్సులో దివాకర్ పెద్దకొడుకు సంతోషించాడు. చూస్తుండగానే ఊరు దాటాయి కార్లు.

***

No comments:

Post a Comment

Pages