జీవితంలోని రంగుల్ని ప్రతిబింబించే - ఇంద్రధనుస్సు - అచ్చంగా తెలుగు

జీవితంలోని రంగుల్ని ప్రతిబింబించే - ఇంద్రధనుస్సు

Share This

జీవితంలోని రంగుల్ని ప్రతిబింబించే - ఇంద్రధనుస్సు 

కాంతి శేఖర్ 




ఇంద్ర ధనుస్సు, జీవితంలో రంగుల్ని అందంగా అల్లిన కథా కదంబం. ఎక్కువగా మహిళలకు సంబంధించిన సున్నితమైన అంశాలను చర్చించారు రచయిత్రి సత్యవతి దినవహి గారు. తమ సుదీర్ఘ సాహితీ ప్రయాణంలో వందకు పైగా కథలు, కొన్ని వందల కవితలు, పదుల సంఖ్యలో అవార్డులు అందుకున్నారు. వృత్తి రీత్యా అధ్యాపిక కావటం వలన సామాజిక బాధ్యత కలిగిన కథలని సున్నితమైన శైలి లో రాసారు సత్యవతి గారు. 


ముఖ చిత్రం మీద ఉన్న ఇంద్ర ధనుస్సు కథ పరిచయానికి వస్తే, సంప్రదాయ నృత్యం నేర్చుకున్న ఇంద్రాణి చరణ్ ప్రేమలో పడటం, తన అభివృద్ధికి కారణం అయిన ప్రణవ్ అనే స్నేహితుడు కష్టంలో ఉంటే కాబోయే భర్త హోదాలో చరణ్ వారి స్నేహాన్ని ఈసడించినట్టు ప్రవర్తిస్తే ఇంద్రాణి పడిన ఘర్షణ, చివరికి ప్రణవ్ అనుకున్న ఆశయం కోసం ఆమె చరణ్ ను కలుపుకోవడం లో సఫలం కావటం...


ఒక అమ్మాయి పడే మానసిక ఘర్షణ ని, కళాకారుల మనసు పువ్వు కన్నా కోమలంగా, వజ్రం కన్నా కఠినంగా సందర్భాన్ని బట్టి ఉంటుంది అన్న ఆర్యోక్తి ని అద్దం పట్టినట్టు చూపిన చక్కటి కథ.


నాకు అన్నిటి కన్నా ఈ పుస్తకంలో నచ్చిన కథ అస్తిత్వం. ఈ కథ చదువుతుంటే పాత కృష్ణవంశీ సిందూరం సినిమా గుర్తు వచ్చింది. అందులో ఒక పోలీస్ నా కూతురు పేరు నాంచారమ్మ అని పెడతాను, మా అమ్మ పేరు అంటే అందరూ నవ్విన సన్నివేశంలో ఆర్ద్రత కనిపించింది. మొదట్లో తన పేరును అందరూ వెక్కిరిస్తూ ఉంటే బాధ పడిన నాయిక, తన పేరు తలుపులమ్మ అని అమ్మా నాన్నలు పెడితే దాని వెనుక కారణం తెలుసుకుని తన పేరుని తను ప్రేమించుకుని తన గుర్తింపు తాను పొంది, తన పేరును ప్రియ గా మార్చిన భర్త చేత తన అసలు పేరుతో ప్రేమగా పిలిపించుకున్న చక్కటి కథ. 


పడక కుర్చీ కథ మామూలు కుటుంబ కథలా కనిపించినా కొంత సస్పెన్స్, తాత  చివరి కోరిక తీర్చటం కోసం మనవరాలు పడిన శ్రమ గురించి చక్కటి తెలుగులో మంచి కథనంలో రాసారు రచయిత్రి.


ఇతడే అతడు లో తనకు నచ్చిన సుమనోహరుడి కోసం ఒక అమ్మాయి తపన, తన మనసు గెలుచుకున్న అబ్బాయిని మనువాడిన కథ, మొత్తంగా ఫీల్ గుడ్ కథ. ఈ కథకి నాటకీయత జోడించటంలో రచయిత్రి ప్రతిభ కనిపించింది. ఎక్కడా అశ్లీలం, పగలు ప్రతీకారాలు లేకుండా  సరళమైన శైలిలో రాసిన చక్కటి ప్రేమ కథ.


ముత్యాల రాజు, రాళ్ల ఉంగరం కథలో ఈజీ మనీ కోసం ప్రయత్నం చేసినా తండ్రి  ఆరోగ్యం కోసం మంచిగా మారిన యువకుడికి దేవకన్య చేసిన సాయం కథ, పాత చందమామ కథలను తలపించింది.


ఉషోదయం కథలో పెంచిన తండ్రి మీద గౌరవంతో నన్ గా మారిన ఉష, తన మనసుకి నచ్చిన ఉదయ్ గతం తెలిసినా అతని ప్రేమ కోసం తండ్రిని ఒప్పించి, మరో ఆడపిల్ల జీవితాన్ని కూడా నిలబెట్టిన వైనం, ఎక్కడా కథని సమతుల్యత దెబ్బ తినకుండా మంచి కథనం, భాష లో పాఠకులు, సమాజం ఒప్పుకునే రీతిలో చెప్పారు సత్యవతి గారు.


లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్...రాధికా విజయం కథ. సాధారణంగా పిల్లల పెంపకంలో తల్లి పాత్ర ఎక్కువ అన్నది ఎవరూ కాదనలేని వాస్తవం అయినా త్యాగం, మాతృత్వం పేరుతో స్పెషల్ చిల్డ్రన్ ఉన్న తల్లుల్ని మరింత మానసిక వేదనకి గురి చేస్తుంది సమాజం. ఇప్పటికీ అలాంటి స్థితి చాలా చోట్ల ఉంది. Parenting అంటే తల్లి తండ్రి ఇద్దరూ బాధ్యత ఉండాలి అని ఆధునిక సమాజానికి అవసరమైన విషయాలు రాశారు ఈ కథలో. మానసిక లోపం ఉన్న బిడ్డ, బాధ్యత లేని భర్త ఇలాంటి స్థితులు ఉన్నా ఆత్మాభిమానం గల రాధిక స్నేహితురాలైన విజయ సాయంతో తన భర్త ను మార్చుకున్న తీరు, బిడ్డ జీవితాన్ని దిద్దిన తీరు ప్రతి జీవితానికి పాఠం లాంటి కథ. 


మొత్తంగా ఎవరో కవి రాసినట్టు ఇంద్రధనస్సు లో ఏడు రంగులు కలిసి తెల్లటి వెలుగు అయినట్టు, ఈ ఏడు కథల్లో కోణాలు ఆశావహ దృక్పథంతో సాగి పాఠకుడికి సంతృప్తి ఇచ్చే పుస్తకం ఈ ఇంద్ర ధనుస్సు. సాధ్యమైనంత చక్కటి తెలుగు, సులభమైన శైలి ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా నిలిపే అంశాలు.

ప్రతులకు సంప్రదించండి:

8558899478(whatsapp)

లేక దిగువ లింక్ ద్వారా నేరుగా కొనుగోలు చెయ్యండి.

https://books.acchamgatelugu.com/product/indradhanussu-%e0%b0%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a7%e0%b0%a8%e0%b1%81%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%81/


No comments:

Post a Comment

Pages