శివం - 73 - అచ్చంగా తెలుగు
శివం - 73
రాజ కార్తీక్ 



(హర సిద్దు గుడిలో జరిగే దాడికి రాజు గారి తరఫున పోరాడుతూ ఉన్నాడు)

హర సిద్ధుడు చాకచక్యంగా తిప్పుతున్న కత్తితో ఎవరిమీదా కనీసం చిన్న దెబ్బ కూడా తగలలేదు, చెప్పటం మర్చిపోయాను, హర సిద్ధుడు ఆత్మరక్షణ యుద్ధకళ లో నైపుణ్యం కలవాడు. సైన్యము బందిపోట్లు తో పోరాడుతుంది. రాజుగారు పోరాటయోధుడు అయినా సరే వయోభారం వల్ల, తొందరగా కదలలేక పోతున్నారు. హర సిద్ధుడు, ధర్మయ్య ఏవో చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా రాజుగారిని కాపాడాలి. ఆయనను ఎలాగైనా సరే జాగ్రత్తగా అంతఃపురానికి చేర్చాలని, కంకణం కట్టుకున్నారు.

హర సిద్ధుడు "దుండగులారా, మీ ముఖచిత్రాల అనుమానపు రేఖలు మా దగ్గర ఉన్నాయి. మీ కుటుంబం అంతా విచారణ నిమిత్తం బందీ అయిపోతారు. మీరు లొంగిపోతే మీకు ప్రాణభిక్ష పెడతాము. కాకపోతే, మీ అందరూ మేము వేసిన వలలో చిక్కుకున్న ఊరు. జాలి, దయ లేకుండా మీ అందరికీ శిరచ్ఛేదం చేస్తాము." అన్నాడు.
బందిపోట్ల లో కొంతమంది ఇతను ఎవరో సైన్యంలో కొత్త వాడు వలె ఉన్నాడు. అంత చాకచక్యంగా దాడి చేసిన సరే నిలువరిస్తున్నాడు. ఇతడి సైన్యానికి వెరచి పాతిపోతే మేలు, లేకపోతే మన పని అంతే నేమో అని వెనకడుగు వేస్తున్నారు..

హర సిద్ధుని మానసిక వ్యూహం ఫలించింది.
బందిపోటు నాయకుడు మాత్రం "మానసికంగా ఓడించడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతారు. కాబట్టి అవి పిల్ల చేష్టలుగా భావించండి" అని వారందరికీ హితువు జారీ చేస్తున్నాడు. "ఇక కొద్ది సమయంలో సైన్యం వస్తుంది. ఈ లోపు వీరిని నివారించాలి."

హర సిద్ధుడు మాత్రం... ఒకసారి గుడి పైకి ఎక్కి , గుడి యొక్క ప్రహరీ గోడ మీద నాలుగు వైపులా పరికిస్తూ, అక్కడ బందిపోటు సమూహాన్ని సైన్యాన్ని చూస్తూ, డాలు అడ్డం పెట్టుకొని, పరిగెడుతున్నాడు..

బందిపోట్లు మాత్రం హర సిద్ధుడు  తిరగటం చూసి, కచ్చితంగా రాజుగారిని బయటికి తీసుకురావటం కోసమే అని అనుకున్నారు.

హర సిద్ధుడు "బందిపోట్లలారా! మీకు మరొకసారి చెప్తున్నాను దేవాలయంలో ఉన్న రాజు గారి మీద దాడి చేయడం అంటే, సాక్షాత్తు రాజు గారితో పాటు ఇక్కడి ప్రజల సంస్కృతి సంప్రదాయం, అమ్మకాల మీద దాడి చేయడమే! ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు మిమ్మల్ని. మీకు లొంగిపోవటానికి మాత్రమే అవకాశం ఇస్తున్నాము, చర్చలు జరిపి మీకు న్యాయపరమైన జీవితం  కల్పిస్తాను, మరొక గడియ మాత్రమే మీకు అవకాశం అది దాటిన మీరు సంధి కి వచ్చినా ఉపయోగం లేదు, అర్థమైందిగా..."

ధర్మయ్య మాత్రం నన్ను ప్రార్థిస్తున్నాడు, ఎలాగైనా రాజుగారి క్షేమంగా ఉండాలని అని వేడుకుంటున్నాడు...

హర సిద్ధుడు, రాజు గారితో ఉన్న రక్షణ సిబ్బందితో కలిసి, వారితో పోరాడుతూనే ఉన్నారు..

ధర్మయ్య పంపిన పావురం సందేశం సైన్యానికి చేరింది... సైన్యం ఏదో ఆపద గ్రహించి బొజ్జ లింగం స్వామి గుడికి బయలుదేరారు.

హర సిద్ధుడు వారితో చేస్తున్న మానసిక యుద్ధం వల్ల వారి దాడి తగ్గింది.  కొంతమంది బందిపోట్లు హర సిద్ధు మాటకు వెనకడుగు వేస్తున్నారు. గుర్తుంచుకోండి శత్రువుని ముందర మానసికంగా జయించాలి. అప్పుడు విజయం సులభమవుతుంది, హార సిద్దు అదేపనిలో ఉన్నాడు..

బందిపోటు నాయకుడు మాత్రం  'ఏది ఏమైనా  రాజు గారిని చంపడానికే వచ్చామని' ధైర్యంగా సమాధానమిచ్చాడు.

హర సిద్ధుడు మాత్రం గుడి తలుపులు తెరవండి అని గట్టిగా చెప్పాడు...
బందిపోటుకి అర్థమైంది, గుడి తలుపులు తెరుచుకున్నాయి అంటే రాజు గారిని మరొక ప్రాంతం తీసుకెళ్తున్నారని. మరి కొన్ని నిమిషాల్లో సైనికులు ఇక్కడికి వస్తారు కాబట్టి ఈ కొద్ది సేపట్లోనే మన పని పోగొట్టాలని బందిపోటు మిగతా వాళ్ళకి ఆజ్ఞ జారీ చేశాడు...

క్రమంగా హర సిద్ధుడు వారిని మూర్ఖులుగా చేస్తున్నాడు. వారిని తన మాటలతో రెచ్చగొట్టి తప్పటడుగులు వేసే విధంగా ప్రవర్తిస్తున్నాడు.

హర సిద్ధుడు రాజుగారి ఆజ్ఞ తీసుకొని మిగిలిన సైన్యానికి 'బాణాలతో వారి తలలు వేరు చేయాలి' అని అని ఆజ్ఞ జారీ చేశాడు. మిగతా సైనికులు కూడా ప్రహరీ ఎక్కి, బందిపోటు దుండగులలో కొంతమందికి శిరచ్ఛేదం చేశారు. అది చూసి కొంతమంది పారిపోయారు.

హర సిద్ధుడు "మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు ఇప్పుడు పల్లకిలో రాజు గారిని అనంతపురం తీసుకెళ్తాం. మీ బాణాలు మా డాలు దాటి రాలేవు. కానీ మా బాణాలు నీ తలకాయ దాటి వెళ్లి పోతాయి. ఖబడ్దార్, మా పౌరుషం చూసి మీలో కొంతమంది పలాయనం చిత్తగించారు. రాజు గారి జోలికి వచ్చినా, దేవాలయాల జోలికి వచ్చినా ఏం జరగాలో అది మీ ఇద్దరికీ చూపిస్తాం ఖబడ్దార్" అన్నాడు.

హర సిద్ధుడు చేసిన ప్రతిజ్ఞ  మిగతా అందరిలో ఉత్సాహం నింపింది.

హర సిద్ధుని దగ్గరా మనుషులు, బందిపోట్లు ఇంచుమించు సమానంగా ఉన్నారు. బందిపోటు నాయకుడినీ మూర్ఖుని చేస్తున్నారు. ఇంకా కొద్ది సేపట్లో  సైన్యం వస్తుందన్న ఆలోచన మర్చిపోయాడు ఆ బందిపోటు. హర సిద్ధుని వైపు ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు. రాజు గారిని పల్లకిలో పెట్టుకొని తీసుకెళ్లడం మొదలు పెట్టారు. ఆ పల్లకి చుట్టుపక్కల రాజు రక్షణ బృందం, హర సిద్దు ఉన్నారు.

బందిపోట్లు సమాంతరంగా వస్తూ రాజు గారి పై దాడి చేస్తున్నారు. బందిపోటు కూడా మంచి గురి కలవాడు. కొన్ని బాణాలు పల్లకీ మోస్తున్న వారి కాళ్ళకి గుచ్చుకున్నాయి. రాజు బృందం వేస్తున్న బాణాలకి బందిపోటులతో ఉన్న కొంతమంది గాయాలపాలై కిందపడిపోయారు. వారు కదల లేరు.

బందిపోటు నాయకుడు మొండి తెగువతో ఇంకా ముందుకు వస్తున్నాడు...
హర సిద్ధుడు మాత్రం 'ఇదేనా నీ సత్తా, ఇంతకన్నా నీకేం చేత కాదని' వెక్కిరించి రెచ్చగొడుతున్నాడు.. చిర్రెత్తి పోతున్నాడు నాయకుడు...

బందిపోటు నాయకుడు గురిచూసి సరిగ్గా పల్లకిలో ఉన్న మనిషికి తగిలే విధంగా బాణాలు కొన్ని వదిలాడు. హర సిద్దు వాటిని తప్పిస్తున్నాడు.
బందిపోటు నాయకుడు అంతకుమించి పట్టుదలతో వేస్తూనే ఉన్నాడు. బందిపోటు వేసిన రెండు బాణాలు వెళ్లి పల్లకి లో తగిలాయి. పల్లకిలో నుండి ఎర్రగా రక్తం బయటికి వస్తుంది.

బందిపోటు "నా దెబ్బకి గుండె ఆగి చచ్చి ఉంటాడు, మహారాజు రక్తం కన్నుల పండుగగా ఉంది" అన్నాడు.

అందరూ విస్తు పోయారు. హర సిద్ధుడు తీక్షణంగా చూస్తూ ఉన్నాడు...
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages