వరసిద్ధి వినాయక శతకము - తిప్పాభట్ల రామయ్య - అచ్చంగా తెలుగు

వరసిద్ధి వినాయక శతకము - తిప్పాభట్ల రామయ్య

Share This

వరసిద్ధి వినాయక శతకము - తిప్పాభట్ల రామయ్య

పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం కవి పరిచయం

వరసిద్ధి వినాయక శతకము అను శమంతకోపాఖ్యానను ను రచించిన కవి తిప్పాభట్ల రామయ్య. వీరు పెద వేఁగీపుర వాసుడు. ఈతని తల్లితండ్రుల గురించి కానీ ఈకవి గురించి కానీ మరి ఏ ఇతర వివరాలు తెలియలేదు.

ఈశతకమే కాక ఈ కవి మరికొన్ని రచనలు కావించినట్లు తెలుస్తున్నది అవి 1. శ్రీరామగీతావళి (గీతపద్య శతకము), 2. వేశ్యాకర్ణకఠోరము (దురాచారఖండన), 3. రుక్మిణి (భక్తిరస ప్రధానమగు 5 అంకముల నాటకము), 4. విజయకాళి (చారిత్రాత్మక 5 అంకముల నాటకము), 5. మాయామధుసూదన (భక్తజనరంజక మగు 5 అంకముల నాటకము), 6. సద్భక్తపుండరీక (నవరసభరితమైన 5 అంకముల నాటకము), 7. గ్రహచారము, 8. పార్వతీశ్వర శతకము (భక్తిరస శతకము) 9. యోగలింగేశ్వర శతకము (ముక్తిరస ప్రధానము) 10. కుమతీ శతకము (నీతిబోధ).


శతక పరిచయము:


"వరసిద్ధివినాయక భక్తపాలకా" అనేమకుటంతో రచింపబడిన ఈశతకంలో చంపకోత్పలమాల వృత్తాలలో రచింపబడిన 113 పద్యాలు ఉన్నాయి. భక్తిరస ప్రధానమైన శతకము. ఇందు మొదటి 28 పద్యాలు వినాయక నక్షత్రమాలగా మిగిలిన 85 పద్యములు శమతకోపాఖ్యన కథ ప్రధానముగా రచింపబడినవి. ఈశతకము వినాయక వ్రతకల్ప పూజావిధానములతో చేర్చబడి వ్రతసమయమున చదువుకొనుటకు వీలుగా రచింపబడినది. కొన్ని పద్యాలను చూద్దాము.


ఉ. దంతము, శూర్పకర్ణములు దాసజనాభయదత్తహస్తమున్

సంతత భక్తరక్షణ విశాలకృపామయ హృత్సరోజమున్

దంతిముఖాంబుజంబు కనుదమ్ములొకింతఁదలచినంత దు

శ్చింతలణఁగుఁగాదె? వరసిద్ధివినాయక భక్తపాలకా!


చ. చదువులకెల్లనొజ్జవఁత సాధుజనాళిభయంబుఁ దీర్చు స

త్సదయుఁడవట, లేగరిక దాసులొసంగిన మెత్తువంట ని

స్సదమల వృత్తిఁగొల్చుటది నాదుతపః ఫలసిద్ధికాదె! యో

చిదమలదివ్య కాయ! వరసిద్ధివినాయక భక్తపాలకా!


ఉ. కూరిమి స్వాతిచింకులను గోరెడిముత్తియ చిప్పరీతి, సం

సారభయాగ్నినిం దవిలి సాంతముతప్తమునైన చిత్తమీ

సారిభవత్క్రుపామృతరసంబున కై తపియించుచుండెనో

శ్రీరమణీయరూప వరసిద్ధివినాయక భక్తపాలకా!


చ. ఘనులు పురాణదంపతుల గాదిలిపుత్రుఁడవీవు దివ్యశో

భనమయ ధీవిశాలుఁడవు భవ్యచరిత్రుఁడ నష్టసిద్ధులం

గనిన మహానుభావుఁడ వఖండుడ వక్ష్యయమూర్తి వైన నిం

జెనటు లెఱుంగలేరు వరసిద్ధివినాయక భక్తపాలకా!


చ. కుడుములు గారె లుండ్రములు కోరిన బూరెలు లడ్డు లావడల్

ఫలములు నారికేళములు పాయసముం గడుపారమెక్కి భ

క్తుల కతి భోగభాగ్యములఁ గూర్చెద వింతటిదాతలేరి గా

సిలి వెదుకంగనెందు వరసిద్ధివినాయక భక్తపాలకా!


పైన ఉదాహరించిన పద్యములు వినాయక నక్షత్రమాల అను భాగమునుండి తీసుకొనబడినవి. మొదటి 28 పద్యముల తరువాత శమంతకోపాఖ్యాన కథను శతకరూపమున కవి చెప్పినాడు. కొన్ని పద్యాలను చూద్దాము.


ఉ. శ్రీశశిశేఖరుండు సురసేవితుఁడై మునికోటిఁగూడి భ

క్తాశయమూర్తి భాద్రపదమందున శుద్ధచతుర్ధినాడు కై

లాస మహగిరిం దగ విలాసముగా సభఁదీర్చియుండెనో

శ్రీశ శుభప్రదాంగ వరసిద్ధివినాయక భక్తపాలకా!


ఉ. ఆసుదినంబున మహాఫలరాసులు బూరెలుండ్రముల్

దాసులొసంగమెక్కి కడుతల్లడిల్లంగ జగంబులెల్ల ను

ల్లాసముతోడ నీవటకు లంబశరీర విభూతిఁగల్గి వేం

చేసితివయ్య దేవ వరసిద్ధివినాయక భక్తపాలకా!


ఈవధముగా వినాయకుని చూచి చంద్రుని నవ్వు చంద్రుడు శాపము పొందుట తరువాత శాపవిమోచనం సంఘటనలు ఒకదాని తరువాత ఒకటి చెప్పిన తరువాత శ్రీకృష్ణుడు ఉగ్రసేనుని శమంతకమణి గూరించి అడుగుట  మొదలైన శమంతకోపాఖ్యానములోని అన్ని సంఘటలను చక్కని పద్యాలలో చెప్పినాడు.


భక్తిరస ప్రధానమైనదే కాక వినాయకచతుర్థి సమయంలో కూడా కథ చెప్పుకునేవిధంగా రచించబడిన ఈశతకం అందరూ చదవతగినది.

మీరూ చదవండి. మీ మిత్రులచే చదివించండి.

***

No comments:

Post a Comment

Pages