పురాణ కధలు - బసవ పురాణం - 6 - అచ్చంగా తెలుగు

పురాణ కధలు - బసవ పురాణం - 6

Share This

 పురాణ కధలు - బసవ పురాణం - 6

 పి.యస్.యమ్. లక్ష్మి


8. గొల్ల అవ్వని కాపాడిన బసవేశ్వరుడు 

బిజ్జలరాజు ఆస్ధానంలో బసవేశ్వరుడు మంత్రిగా వున్న రోజులు.  ఒకసారి ఆ రాజు కొలువు తీరి వున్న సమయంలో బసవేశ్వరుడు ఓయని పెద్దగా అరిచి,  భయపడకు..నేను నిన్ను పట్టుకున్నా అని పెద్దగా అరుస్తూ చేతులు చాచి ఎవరినో పట్టుకున్నట్లు చేశాడు.  అది చూసి సభలోని వారంతా పెద్దగా నవ్వసాగారు.

 రాజు కూడా నవ్వుతూ  బసవ మంత్రీ, గోరంత బూడిద వంటిమీద రాసుకుంటే కొండంత వెర్రి పడుతుంది అనే సామెత నిజమయింది.  నీ శివ భక్తి పెరిగి పెరిగి నీ తలకెక్కుతున్న కొద్దీ పిచ్చి చేష్టలు పెరుగుతున్నాయి.  ఎందుకట్లా చేతులు చాచావు  నీ చేతుల్లో ఏమీ లేదుకదా.  ఎందుకలా పట్టుకున్నానని గట్టిగా చెప్పావు  ఎవరితో మాట్లాడావు  ఏమిటి  వెర్రి తలకెక్కినట్లుందే అని అడిగాడు. 

అప్పటి దాకా తన ప్రభావము తను చెప్పుకోకూడదని నిశ్శబ్దంగా వున్న బసవేశ్వరుడు మౌనంగా వుంటే తననంతా పిచ్చివాడనుకుంటారని అలా కాకుండా వుండాలంటే తను అసలు సంగతి చెప్పాలనుకున్నాడు. 

రాజా, నేను పిచ్చివాడిని కాదు.  త్రిపురాంతకం గుడికి వెళ్ళే   దోవలో తూర్పు వైపుగా కపిలేశ్వరమనే ఒక గ్రామమున్నది.  ఆ గ్రామంలో గుళ్ళో వున్న కపిలేశ్వరస్వామికి ఒక తపస్వి కొన్ని వందల పుట్ల (అప్పుడు లీటర్లు లేవు)  పాలు మహన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం చేస్తున్నాడు. సోమ సూత్రం దాటి, ఆలయం దాటి బయటకొచ్చిన ఆ పాలు ఆ ఊరి వీధుల వెంత కాల్వలై పారుతూ అన్ని వీధులూ నిండి, వీధులన్నీ బురద బురదగా అయ్యాయి.  రాకపోకలకి చాలా ఇబ్బంది కలుగుతోంది.  నడిచేవాళ్ళ పాదాలు ఆ బురదలో కూరుకు పోతున్నాయి. 

ఆ గ్రామంలో కాలమ్మ అనే ముసలి గొల్ల అవ్వ నా భక్తురాలు, చాలా మంచిది.  ఆమె పాలు, పెరుగు ఊర్లో అమ్ముకోవటానికి వెళ్తూ, ఆ బురదలో కాలు జారి పడబోయే సమయంలో నన్ను తల్చుకుంటూ బసవా అని అరిచింది.  అది విని నేనామెను పట్టుకుని ఆ ఊపులో నేను పట్టుకున్నాను, భయపడకు అని పెద్దగా అన్నాను.  అంతే.  అన్నాడు. 

అది విన్న రాజు,  సభలోని వారంతా ఇంకా నవ్వసాగారు.  పిచ్చి పట్టినవాళ్ళే ఇలా మాట్లాడతారు.  అక్కడెక్కడో అంత దూరాన వున్న ఊళ్ళో ముసలవ్వ పడబోతూ ఈయన్ని పిలిచిందట, ఈయన ఇక్కడ కూర్చునే ఆవిడని పడి పోకుండా పట్టుకున్నాడుట అంటూ ఇంకా నవ్వసాగారు. 

రాజు ఆ తమాషా ఏమిటో చూడాలని ఒక భటుణ్ణి పిలిచి, ఆ సంఘటన వివరించి, వెంటనే వేగంగా వెళ్ళే గుఱ్ఱం మీద ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ  వున్న అవ్వని తీసుకు రమ్మని ఆజ్ఞాపించాడు.  భటుడు అలాగే ఆ అవ్వని తీసుకు వచ్చాడు. ఆ అవ్వ కాళ్ళనిండా బురద వుంది.  నెత్తి మీద గంప. 

రాజు ప్రశ్నించగా అవ్వ బసవేశ్వరుడు చెప్పిన కధే చెప్పింది.  ఆనవాలుగా తన కాళ్ళ బురద, నెత్తమీద గంప చూపించి ఈ బసవేశ్వరుని సంగతి మీకు తెలుయదు.  దీనిని మీరు వింత అనుకుంటున్నారా  ఈయన మహానుభావుడు.  భక్త జన సులభుడు.  ఈయన మహిమ మీకు తెలియదు అని బసవేశ్వరుని లీలలెన్నో వున్నాయని సభా సదులకు తెలిపింది.

పూర్వము బసవేశ్వరుడు చూపించిన ఈ లీల కొంత కాలం క్రితం షిర్డీ సాయిబాబా కూడా చూపించారని చెప్తారు కదా.  భగవంతుడెప్పడూ భక్త సులభుడే అని ఇలాంటి కధలు తెలియజేస్తాయి.

***

No comments:

Post a Comment

Pages