కాలభైరవాష్టమి - అచ్చంగా తెలుగు
కాలభైరవాష్టమి

( మార్గశిర బహుళ అష్టమి, 06-01-2021, బుధవారం)

శ్రీరామభట్ల ఆదిత్య 




శ్రీకాలభైరవస్వామి ఆవిర్భవించిన రోజే కాలభైరవాష్టమి. ఉత్తరాది సాంప్రదాయం ప్రకారం కార్తీకబహుళ అష్టమి నాడు కాలభైరవాష్టమిని జరుపుకుంటారు. దక్షిణాదిన మార్గశిరబహుళ అష్టమి నాడు కాలభైరవాష్టమిని జరుపుకుంటారు. ఏ సాంప్రదాయం ప్రకారం చూసినా నెల మారినా దాదాపు ఒకే తేదిన కాలభైరవాష్టమి వస్తుంది.

కాలభైరవస్వామి ఆవిర్భవానికి సంబంధించి శివపురాణంలో ఆసక్తికరమైన పురాణగాధ వుంది. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు మధ్యన వున్న తన ఐదవ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. దీనితో కోపోద్రిక్తుడైన శివుడు హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నతకాయముతో... మూడు నేత్రాలతో త్రిశూలము, గద, ఢమరుకము వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర రూపుడే - శ్రీకాలభైరవుడు. శివుని  ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యన వున్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది.

బ్రహ్మ శిరస్సును ఖండించిన కాలభైరవుడు తనకు చుట్టుకున్న బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడానికి కాశీ చేరుకోగా ఆయన చేతికున్న బ్రహ్మ కపాలం కాశీలో మాయమైంది. అదే బ్రహ్మకపాల తీర్థంగా ప్రసిద్ధి చెందింది. శక్తిసంపన్నుడైన కాలభైరవుడు ఉద్భవించిన రోజుని కాలభైరవ అష్టమిగా జరుపుకుంటూవుంటారు. ఈ రోజున చాలా మంది ఆయన అనుగ్రహాన్ని కోరుతూ  కాలభైరవ వ్రతం చేస్తుంటారు. దగ్గరలో గల కాలభైరవ ఆలయాల్లో స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు. లేదంటే శివాలయాల్లోనే పూజాభిషేకాలు జరుపుతారు. శ్రీకాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్నభయాలు దూరమవుతాయ. గ్రహదోషాలు తొలగిపోతాయ.

కాలభైరవుడు పరమేశ్వరుని యొక్క అంశ అందునా శివక్రోధము చేత జన్మించాడు. ఇతను కాలస్వరూపుడు, భయంకరమైన రూపం కలవాడు. సాధారణంగా కాలభైరవుడు నాలుగు చేతులతో దర్శనమిస్తాడు. నాలుగు చేతుల్లో శూలం, కపాలం, గద మరియు ఢమరుకం ఉంటాయి. రౌద్రనేత్రాలు , పదునైన దంతాలు, మండే వెంట్రుకలు ఇదే కాలభైరవ స్వరూపం. కాలభైరవుడు నాగుపాములను ఆభరణాలుగా ధరిస్తాడు. ఈయన వాహనం శునకం.

శ్రీ శివమహా పురాణం ప్రకారం ప్రధానంగా భైరవుని రూపాలు ఎనిమిది. అవి
1) కాల భైరవ
2) అసితాంగ భైరవ
3) సంహార భైరవ
4) రురు భైరవ
5) క్రోధ భైరవ
6) కపాల భైరవ
7) రుద్ర భైరవ
8 ) ఉన్మత్త భైరవ

ఇవే కాక భీష్మ భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంబర భైరవ, మహా భైరవ, చండ భైరవ అనే రూపాలు కుడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవుని పై సహస్రనామాలు కూడా ఉండడం విశేషం. ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. కాశీక్షేత్ర ప్రవేశానికి కాలభైరవుడి అనుమతి తప్పనిసరి. కాశీక్షేత్రంలోని కాలభైరవుడు, మనల్ని ఆ క్షేత్రప్రవేశానికి అనుమతించాడు కనుక కాశీయాత్ర పూర్తిచేసి ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవపూజ చేసి ఆయనకు గారెలమాల ( గారెలపేరు ) వేయడం ఆనవాయితీ. 

జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రాసిన శ్రీ 'కాలభైరవాష్టకం' కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.

శ్లో॥ కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి। తన్నో కాలభైరవ ప్రచోదయాత్॥

నమో భూతనాథం నమో ప్రేతనాథం,
నమః కాలకాలం నమః రుద్రమాలమ్‌।
నమః కాలికాప్రేమలోలం కరాళం,
నమో భైరవం కాశికాక్షేత్రపాలమ్।।

***

No comments:

Post a Comment

Pages