షాహుకార్ జానకి - అచ్చంగా తెలుగు
షాహుకార్ జానకి
 - డాక్టర్ పోడూరి శ్రీనివాస్ రావు, 
హైదరాబాద్, 98494 22239. 
 


 తను నటించిన తొలి చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న జానకి గొప్ప నటి.  షాహుకార్ జానకిగా ప్రసిద్ధిగాంచిన శంకరమంచి జానకి అలనాటి రంగస్థల, సినీ కథానాయిక. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ  భాషల్లో సుమారు 400 సినిమాల్లో నటించింది. ఇందులో సుమారు 200 కి పైగా కథానాయికగా నటించింది. ఈమె రేడియో నాటికలద్వారా తన నటప్రస్థానం ప్రారంభించింది.  తెలుగు, తమిళ భాషల్లో ఎన్. టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు,  ఎం. జి. ఆర్., శివాజీగణేశన్ లాంటి ప్రముఖ కథానాయకుల సరసన కథానాయికగా నటించింది.
                         జానకి 1931 వ సంవత్సరం  డిసెంబర్ 12వ తేదీన రాజమండ్రిలో జన్మించి, అక్కడే పెరిగింది. తండ్రి టి. వెంకోజిరావు పేపర్ పరిశ్రమలో నిపుణులు. ఈయన ఇంగ్లాండ్ లో మూడేళ్లపాటు పేపర్ మ్యానుఫాక్చరింగ్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ చదివారు.  జానకి తల్లిగారి పేరు శచీదేవి. జానకి అస్సాం లోని గౌహతిలో మెట్రిక్యులేషన్ వరకు చదివారు. అనంతరం ఆరిజోనా విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసారు. ఆమెకు 15 సంవత్సరాలకే, 1947 వ సంవత్సరము లో శ్రీ శంకరమంచి శ్రీనివాసరావు గారితో వివాహం జరిగింది.
                        జానకి బాల్యం నుంచీ అనేక రంగస్థల  నాటకాలలో కూడా నటించింది. తన 11 వ ఏటనే రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొంది. తను నటించిన మొట్టమొదటి చిత్రం షావుకారుతో ఆమె ఇంటిపేరు కాస్తా షావుకారు గా మారిపోయింది. 1950 లో  విజయా ప్రొడక్షన్ వారు నిర్మించిన చిత్రం షాహుకారు. అప్పటి ప్రముఖనాయకులందరి సరసన నటించింది. జానకి 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ, 3 హిందీ చిత్రాల్లోనూ, 1 మలయాళం సినిమాలోనూ నటించింది. ఈమె అనేక పురస్కారాలను పొందింది.
                కథానాయకి కృష్ణకుమారి ఈమెకు స్వయానా చెల్లెలు. జానకి సత్యసాయిబాబా భక్తురాలు.జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరి సభ్యురాలిగా పనిచేసింది.
                ఈ దిగువ తెలిపిన సినిమాలు, జానకి నటించిన చిత్రాల్లో కొన్ని ప్రముఖమైనవి, ఆమెకు పేరు తెచ్చిపెట్టినవి.
                 షాహుకారు, పిచ్చి పుల్లయ్య, కన్యాదానం, వద్దంటే డబ్బు, రోజులుమారాయి, కన్యాశుల్కం, నాగుల చవితి, జయం మనదే, ఏది నిజం, చరణదాసి, పాండురంగమహత్యం, భలేబావ, భాగ్యరేఖ, ఆలుమగలు, ముందడుగు, రేచుక్క పగటిచుక్క, శ్రీ వేంకటేశ్వర మహత్యం, బాటసారి, మంచిమనసులు, పెంచినప్రేమ, పెంపుడు కూతురు, సవతికొడుకు, డాక్టర్ చక్రవర్తి, మంచి కుటుంబం, భామా విజయం, అక్కాచెల్లెలు, రామరాజ్యంలో రక్తపాతం, సమాజానికి సవాల్, రంగూన్ రౌడీ, తాయారమ్మ బంగారయ్య, గోపాలరావుగారి అమ్మాయి, కృష్ణ గారడీ, సంసారం ఒక చదరంగం, మురళీకృష్ణుడు, స్వరకల్పన, గీతాంజలి, మేడమ్, శుభాకాంక్షలు, దేవి, హే రాం, సౌఖ్యం, బాబు బంగారం..... మొదలైనవి.  

                       వీటిలో, షాహుకారు, వద్దంటే డబ్బు,  రోజులు మారాయి, కన్యాశుల్కం, ఏదినిజం, మంచిమనసులు, డాక్టర్ చక్రవర్తి, మంచి కుటుంబం, అక్కాచెల్లెలు, తాయారమ్మ బంగారయ్య, సంసారం ఒక చదరంగం  మొదలైన సినిమాలలో జానకికి మంచి పాత్రలు లభించాయి, జానకికి మంచిపేరు సంపాదించిపెట్టాయి.
                      తమిళనాడు ప్రభుత్వం వారిచే కలైమామణి బిరుదు పొందింది. ఉత్తమ సహాయనటిగా నంది బహుమతులు పొందింది. 89 సంవత్సరాల వయసులో ప్రస్తుతం జానకి బెంగళూరు లో నివాసము ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగు చలనచిత్రసీమకు లభించిన ఒక మంచి నటి జానకి.

                                  ***                                    
 

No comments:

Post a Comment

Pages