శివం - 70 - అచ్చంగా తెలుగు
శివం - 70

                                                                                      - రాజ కార్తీక్   


(ధర్మయ్య ఆ గుడి లో జరిగిన బొజ్జలింగం కథ, తన చిన్నప్పటి నుండి చూసింది చెప్తున్నాడు. అక్కడికి వచ్చిన ఒక జంగమ బైరాగి,మహా భోక్త కావాలి అని చెప్పి స్వయంగా తానే ఊరి కోసం వండిన వంట మొత్తం తిని... ఎక్కువ తినటం వల్ల తన పొట్ట ముందుకు కి వచ్చి, ఆ ఆలయగర్భగుడి లోకి ప్రవేశించాడు. తలుపులు మూసుకున్నాయి)


ధర్మయ్య "తలుపులు వాటంతటవే మూసుకుంటాయి ఏంటి అంతేలే ఆయన ఉండగా పిడుగు వల్ల ఏమీ కాలేదు ఈ చిన్న మాయలో ఏముంది." అని అనుకున్నాము.

'ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ' అని అందరం గట్టిగా తలచుకుంటున్నాము.

తలుపులు తెరుచుకున్నాయి లోపల ఇప్పుడు నువ్వు చూస్తున్న బొజ్జ లింగం ఉంది. మా అందరికీ ఒళ్ళు పులకరించి పోయింది. అసలేంటి ఇదంతా అని ఒక మాయలో ఒక తన్మయత్వంలో ఉన్నాం.‌ అక్కడున్న రాజు, రాజ పరివారం, ప్రజలు అందరం ఈ వింతకి విస్తుపోయాం.

హర సిద్ధుడు "తర్వాత ఏం జరిగింది ధర్మయ్య బాబాయ్.. స్వయానా జంగమదేవర వచ్చారా?" అని అడిగాడు.

ధర్మయ్య "అవును హర సిద్దు" అన్నాడు.

"దేదీప్యమానంగా, మణికాంతి మయంగా, ఇప్పుడు నువ్వు చూస్తున్న ఆ శివలింగం అక్కడ అ గర్భగుడిలోకి ఇలా వచ్చింది" అని అప్పుడే తెరిచిన ఆలయ తలుపుల నుంచి గుడిలో హర సిద్దుకి దర్శనం చేయించాడు.

"ఆ తర్వాత ఏం జరిగింది?" అడిగాడు హర సిద్ధు.

"అప్పుడు మాకు అర్థమైంది స్వయానా ఆ బొజ్జ స్వామి ఎవరో కాదు సాక్షాత్తు పరమేశ్వరుడే అని."

లోపల నుండి ఆకాశవాణి వినబడుట మొదలైంది.

"భక్తులారా మీ ప్రయాస నా దాకా చేరింది, ఎన్నిసార్లు ప్రతిష్టను చేసిన ప్రతిష్ట జరగట్లేదు అని వెనకడుగు వేయకుండా మీరు భక్తితో తో పదే పదే ప్రయత్నించారు, విధి అన్నిటికన్నా బలీయమైనది కానీ నామీద నీకున్న ప్రేమ దానికన్నా ఎంతో బలమైనది, ఇక మీద ఇక్కడ ఏ దోషాలు ఏ లోపాలు ఉండవు, మీ అందరికీ సరిపడా భోజనం నేను చేసి మీ అందరికీ ఉన్న దైవ దోషాన్ని పెకిలించి వేశాను.

ధైర్యం చేసి మా రాజు గారు మాట్లాడారు
"స్వామి మేము చేసిన తప్పు ఏమిటి, ఎందుకు మా శివలింగం నిలబడలేదు.... ఏది ఏమైనా దాని కారణంగా మీ వాణిని, మిమ్మల్ని చూసే భాగ్యం కలిగింది."

శివవాణి "తమరు ఎంతో భక్తిగా నన్ను అర్చించారు, మీ రాజ్యంలో ఉన్న ఎంతో మంది రైతులను అర్థం పర్థం లేని చట్టాలతో విసిగిస్తున్నారు. రైతు తన పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఫలానా వారికే కాదు, అత్యవసర సమయంలోమాత్రమే ధాన్యాగారం లోకి తీసుకోవాలి. అందు కారణం గానే నేను మీ ఊరిలో ఉండటానికి ఇష్టపడలేదు, మీ భక్తి నన్ను ఎంతో కదిలించింది.."

రాజు "స్వామి పాత చట్టాలను సవరిస్తారు రైతులకు మేలు చేస్తాను.. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను.. నా తప్పును మన్నించండి, ఒకరకంగా మీరు రావడానికి ఆ తప్పు కూడా ఒక కారణం.. కాబట్టి ఇకమీద రైతులకు వచ్చే ప్రతి పంటను మీ బొజ్జ లింగానికి సమర్పణ గా గావిస్తాము."

అందరం "ఇక మీద ఏమి జరగకుండా చూడండి స్వామి హర హర మహాదేవ!" అన్నాము.

నేను "ఏమి జరగదు కానీ, 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కార్తీక పౌర్ణమి నాడు, మీ ఊరి దగ్గరికి నేనే నా ఉత్తమ భక్తుడి తో బొజ్జ లింగాన్ని తీసుకు వస్తాను. దాన్ని మళ్ళీ మీరు ప్రతిష్ట చేయండి. నా ఉత్తమ భక్తుడిని అన్ని విధాలుగా సత్కరించి . అతనికి  తగినరీతిగా గౌరవం ఇవ్వండి.. అది ఖచ్చితంగా నన్నే చేరుకుంటుంది.‌ ఈ చక్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది."

ఎందుకు పెట్టాడో ఆ పరమేశ్వరుడు 60 సంవత్సరాలకు ఒకసారి పునఃప్రతిష్ట చెయ్యాలని! ఎవరు ఆ ఉత్తమ భక్తుడు? సరే 60 సంవత్సరాలకు ఒకసారి కదా అని మేము కూడా హరోం హర అని నినదించాము.

ఆ జరిగిన ఘట్టం అంతా ఆ గోడల మీద శిల్ప లాగా చెక్కారు.

హర  సిద్ధుడు కి మాత్రం కన్నీరు బొటబొటా కారుతోంది. ధర్మయ్య అవేవి పట్టించుకోకుండా అటుతరిగి కథని అయిపోగొట్ట పోతున్నాడు..

ధర్మయ్య "ఆ తర్వాత, బొజ్జ లింగం అలాగే ఉండిపోయింది, మా రాజ్య దేవుడిగా ఉంటూ. ఇప్పటిదాకా ఏ కరువూ లేకుండా సుభిక్షంగా ఉన్నాము. మరొక వింత ఏమిటంటే, మళ్లీ మా అందరికీ సరిపడా భోజనం అంతా అక్కడ సిద్ధంగా ఉంది, సాక్షాత్తు పరమేశ్వరుడు ఇచ్చిన ప్రసాదం అని ఆరోజు అందరం తిన్నాం. అంత రుచికరమైన భోజనం జీవితంలో ఎప్పుడూ చేయలేదు, అప్పుడు నా వయసు చిన్నది కావడం వల్ల గుడి అంతా తిరిగి ఇక్కడే బొజ్జ స్వామి వచ్చింది అని చెప్పి, ఆడుకునే వాళ్ళం. మా ఊరంతా అక్కడే ఉండటం వల్ల ఈ కథంతా పక్కూరు వారికి తర్వాత తెలిసింది. అలా ఆ నోటా ఈ నోటా పాకి అందరికీ తెలిసింది, 60 సంవత్సరాలు అయిపోవచ్చింది. ఇప్పుడు మరో బొజ్జ లింగం వస్తుంది కదా అని మేము ఎదురు చూస్తున్నాం , సరే సాక్షాత్తు ఆయనే చెప్పాడు కాబట్టి ఆయనే చూసుకుంటాడు అని ధీమాగా ఉన్నాము. నీకు అసలు దీని గురించి తెలీదా  హర సిద్ధు బాబు."

అప్పుడు చూశాడు ధర్మయ్య హరసిద్ధు వైపు...

హర సిద్దు "మా బామ్మ ఎప్పుడో చిన్నప్పుడు చెప్పింది బాబాయ్, ఇప్పుడు లీలగా గుర్తుకు వస్తుంది" అని కన్నీరు తుడుచుకుంటూ ఉన్నాడు.

ధర్మయ్య "హర సిద్దు బాబు! ఎందుకయ్యా కన్నీరు పెట్టుకుంటున్నావ్, సాక్షాత్తుగా మహాదేవుడే మెచ్చుకుని, ఎంచుకున్న ఉత్తమ భక్తుడు నీవు, మేమన్నా ఆయనను మా జీవితంలో కొన్ని గంటలు పాటు దూరంగా చూశాము, నీవు ఆయనతో ఆడావు పాడావు మాట్లాడావు కలిసి ఉన్నావు. ఎంత దూరంగా ఉన్నా మీ రాజ్యం నుంచి మా రాజ్యం లోకి సాక్షాత్తు ఆయనే నిన్ను తెచ్చాడు. నీవంటి ఉత్తముడు ఉండటం వల్లే ఇంకా వర్షాలు పడి నలుగురు నాలుగు ముద్దలు తింటున్నాం."

హర సిద్దు ధర్మయ్య తో పూస గుచ్చిన విధంగా, తన జీవితంలోకి కుంభన్న వచ్చిన దగ్గర నుంచి ఏమైందో క్షుణ్ణంగా చెప్తూ, మైమరచిపోయాడు. హార సిద్దు ఆనందాన్ని చూసి ధర్మయ్య కూడా, ఎంతో ఆనందపడి హర సిద్దు ఎంత నిజాయితీపరుడో, నాతో వాదించిన విధానాలు విని ఎంత ప్రతిభ కలవాడో అని ఒక నిర్ధారణకు వచ్చాడు.

హర సిద్దు "ఇక్కడ ఉండే శివుని బొజ్జలింగయ్య అంటారా?" అని అడిగాడు.

ధర్మయ్య "కొంతమంది బొజ్జ లింగ మంటారు, వాడుకలోకి ఎక్కువమంది మాత్రం కుంభయ్యా స్వామి అంటారు." అన్నాడు‌.

"కుంభన్న కుంభన్న ... అని సాక్షాత్తు తననా‌ నేను పిలిచింది?" అనుకుంటూ మరొకసారి భావ స్థితిలోకి వెళ్లిపోయాడు హర సిద్ధు.

భక్తులారా హర సిద్ధుని జీవితంలో చిన్నచిన్న మానవ తప్పిదాలు తప్ప, నిష్కళంకమైన అతని మనసు నన్ను మెప్పించింది.‌తన జీవితంలో  ఎదురైన అందరూ, దాదాపుగా తనని పతనం చేద్దామని చూశారు. కానీ అతన్ని ఎవరూ ఏమీ చేయలేకపోయారు. హర సిద్దు ఎప్పుడూ బాధపడేది తనని వెంటాడుతున్న తన దురదృష్టం గురించే! అతని జీవితం ఇంకే మలుపు తిరగబోతుందో మరి! తనకి నేను ఉన్నాను... తనకే కాదు నన్ను నమ్మిన వారందరికీ నేను ఉన్నాను.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages