జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 36 - అచ్చంగా తెలుగు

                                                   జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 36    

                                                                       చెన్నూరి సుదర్శన్


 

(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్  తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతాడు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.) 

“ఎంత అన్యాయం సార్.. ఇలాంటి వార్తలు రాయడానికి చేతులెలా వచ్చాయ్.. నాకు తెలుసు సార్. ఈ పత్రిక విలేకరి పేరు నరహరి. తీసుకొస్తా..” అనుకుంటూ సూర్యప్రకాష్ మాటకైనా ఎదురి చూడకుండా బయటికి పరుగు తీసాడు ఆగమయ్య.. సైకిలు తీసుకొని వాయువేగంతో మాయమయ్యాడు. 

ఇంతలో స్టాఫ్ మెంబర్స్ వచ్చారు. వారికి పేపరందజేసాడు సూర్యప్రకాష్. ఒక్కొక్కరు చదువుతుంటే.. వారి, వారి ముఖకవళికలను చదువసాగాడు. 

“ఈ విలేకర్లు పొద్దస్తమానం ఎవరి మీద రాద్దామా.. ఎవరిని  బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులెలా పట్టిద్దామా అని  ఆలోచనలు తప్ప వేరే  ఏ పనీ పాట ఉండదు సార్. పేపరుకు ఫీడింగ్ ఇవ్వకపోతే తమ లైసెన్స్ ఎక్కడ రద్దవుతుందేమోననే మరొక భయం.. దాంతో లేనిది.. పోనిది కల్పించి ఏవేవో రాస్తుంటారు.. అయినా మనకేం భయం సార్.. మన కాలేజీ సక్రమంగానే నడుస్తుంది కదా..” అంటూ కిందిపెదవిని మూడు వంకర్లు తిప్పుతూ అన్నాడు జోగయ్య. 

“నాకు పేపర్లో వచ్చిందని కాదు  సార్.. కాని ఇలా వచ్చేలా చేసిందెవరా? అని ఆలోచిస్తున్నాను” అన్నాడు సూర్యప్రకాష్.

“ఇంకెవరు..పేపర్ విలేకర్లే. వారిని మనమే చెయ్యలేం” ఆన్నాడు జోగయ్య మరింత వ్యంగ్యంగా.. 

కాలేజీ ప్రార్థన గంట మోగింది. 

అంతా కలిసి ప్రార్థనాస్థలానికి వెళ్తుంటే.. 

ఆగమయ్య, నరహరి బజాజ్ చేతక్ మీద వచ్చారు.

సూర్యప్రకాష్ నరహరిని ప్రార్థనకు రమ్మంటూ ఆహ్వానించాడు. 

ప్రార్థన.. ప్రతిజ్ఞలు  ముగిసాయి. వార్తల ముఖ్యాంశాలు చదివే విద్యార్థిని సుశీలకు జిల్లా ఆడిషన్ అందజేసి అండర్ లైన్ చేసిన వార్త చదువుమని చూపించాడు సూర్యప్రకాష్.

“ప్రభుత్వ జూనియర్ కళాశాల, గుమ్మడిదలలో సమయపాలనకు తిలోదకాలు” అని చదివే సరికి పిల్లలంతా ఆందోళన చెందారు. కలవరం మొదలయ్యింది. 

“ఇలాంటి  తప్పుడు వార్తలు నేను చదువను  సార్..” అంటూ సుశీల కంట తడిబెట్టింది. 

సూర్యప్రకాష్ నరహరి వంక చూసాడు సూటిగా..

నరహరి తల దించుకున్నాడు.

ఈనాటి సూక్తి “ఆరోపణ చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకో..!” అంటూ తెలుగు లెక్చరర్ వినిపించి వివరించాడు. 

విద్యార్థులంతా తమ, తమ తరగతి గదుల్లోకి వెళ్ళిపోయారు. 

నరహరిని తన చాంబరు లోకి తీసుకెళ్తుంటే.. ‘నువ్వేం భయపడకు’ అన్నట్లుగా జోగయ్య చేతి సంజ్ఞలు గమనించకపోలేదు  సూర్యప్రకాష్.   

ఆగమయ్యను పిలిచి టీ కోసం పంపించాడు. 

           “నరహరి.. కదూ..! మీ పేరు. ఆగమయ్య చెప్పాడు” అంటూ నరహరిని కూర్చోమన్నట్లుగా కుర్చీ చూపించాడు. 

            నరహరి గుండెల్లో దిగులు తాను తప్పు చేసినట్లుగా వెక్కిరిస్తోంది.

“నరహరీ.. ఎంత వరకు చదువుకున్నావ్..” 

“ఇంటర్మీడియట్ ఇదే కాలేజీలో పాసయ్యాను సార్. ఇప్పుడు  డిగ్రీలో జర్నలిజం  చేస్తున్నాను..”

“ఇదే కాలేజీలో చదివావ్ కదా.. అప్పటికీ, ఇప్పటికీ.. కాలేజీ వాతావరణంలో ఏమైనా మార్పు కనిపించిందా?”

“చాలా మార్పు వచ్చింది సార్”

“ఎలాంటి మార్పు..? చెడిపోయిందా?”

“నో.. సార్. చాలా ఇంప్రూవ్ అయింది”

“మరి ఇలాంటి వార్తలు రాసేముందు నిర్థారించుకోవాలి నరహరీ.. మా కాలేజీ వార్త ఎలా సేకరించావో.. నాకు తెలుసు. నిన్ను ఉపయోగించుకొని కాలేజీ ప్రతిష్ఠను దెబ్బతీయాలని తద్వారా నాకు చెడ్డపేరు తేవాలని కంకణంకట్టుకున్న పెద్ద మనిషి ఎవరో.. నాకు తెలుసు. నీకు తెలుసు.  

కాని ఇది మంచి పధ్ధతి కాదు. . వాస్తవమేమిటో నువ్వు చూడాలనే  నిన్ను పిలిపించాను. 

           ఇది మీ ఊరి కాలేజీ.. శాశ్వతం. కాని  నేను శాశ్వతం కాదు. నేను గాని నా స్థానంలో మరెవ్వరున్నా కాలేజీకి అభివృద్ధి కోసం పాటుపడేలా పని చేయించుకోవాల్సింది మీరు.. కాలేజీ బాగు కోసం పని చేసే వారితో మీరే ఇలా వ్యవహరించడం న్యాయమేనా నరహరీ..” అంటూ చిన్నపాటి ఉపన్యాసమిచ్చాడు సూర్య ప్రకాష్.   

 ఇంతలో ఆగమయ్య వచ్చి టీ అందజేశాడు ఇరువురికి. 

టీ కప్పు టేబుల్ పై పెడ్తున్న  నరహరి కళ్ళు చెమ్మగిల్లడం చూసి కంగారు పడుతూ “సారీ నరహరి.. నా మాటలు నిన్ను బాధించాయనుకుంటాను” అన్నాడు సూర్యప్రకాష్.

“ప్రిన్సిపాల్ సార్.. నన్ను మన్నించండి.  మీకు క్షమాపణలు చెప్పుకుందామని వస్తుంటే నాకెదురయ్యాడు ఆగమయ్య.

చాలా తప్పు జరిగింది సార్.. నన్ను తప్పుదోవ పట్టించాడు జోగయ్య.

 నేను చాలా  తొందరపడ్డాను. నిజా నిజాలు తెలుసుకోకుండా పేపరుకు వార్త పంపించడం నా పొరబాటే సార్..  ఈరోజు ఉదయం పేపర్ చూడగానే మా అన్నయ్య సుధాకర్ ఫోన్ చేసాడు”

“సుధాకర్ అంటే..!” నరహరి మాటలు పూర్తికాకుండానే అడిగాడు సూర్యప్రకాష్.

“మునిపల్లిలో మీ స్టూడెంట్ సార్.. ఇప్పుడు దౌలతాబాదులో టీచరుగా పనిచేస్తున్నాడు”

ఆశ్చర్యపోయాడు సూర్యప్రకాష్.

“అన్నయ్య అంటున్నావ్.. సుధాకర్‍కు అన్నదమ్ములెవరూ లేరుకదా” అడిగాడు.

           “నిజమే సార్.. సుధాకర్ మాపెద్దనాన్న కొడుకు. పొద్దున్నే నన్ను తిట్టాడు. మీ గురించి అంతా చెప్పాడు. మీరు మా అన్నయ్య ఆలోచనలు తుడిచేసి సన్మార్గంలో నడిపించిన మహాను భావులని నాకీరోజే తెలిసింది. మీ లాంటి వారు పరిచయమైతే మా జనన్నకు మాకు దక్కేవాడు” అంటూ హృదయాన్ని తన్నుకు  వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక పోయాడు నరహరి. కళ్ళు కన్నీటి జలపాతాలయ్యాయి.

ఆగమయ్య పరుగెత్తుకుంటూ వచ్చి నిర్ఘాంతపోయి చూడసాగాడు.

సూర్యప్రకాష్ కలవరపడ్డాడు. 

“నరహరీ.. జనన్న ఎవరు?” అంటూ ప్రశ్నించాడు.

కొద్ది సేపటికి నరహరి తేరుకొని చేతి రుమాలుతో కళ్ళు.. ముక్కు తుడ్చుకున్నాడు.           

(సశేషం)

No comments:

Post a Comment

Pages