ఈ దారి మనసైనది - 34 - అచ్చంగా తెలుగు

 ఈ దారి మనసైనది - 34

                                                                         అంగులూరి అంజనీదేవి


(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది.  జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా టూర్ వెళ్లి, ముగించుకుని తిరిగి వస్తారు. మెడికల్ కాలేజీ ఎక్సిబిషన్ కి వచ్చిన అనురాగ్ తల్లిదండ్రులకు అంతా తిప్పి చూపిస్తుంది దీక్షిత. ఆత్మహత్య చేసుకోబోయిన మన్వితను పరమర్శిస్తాడు ధీరజ్.)

ఏదో పని వుండి బయట కెల్లి, అప్పడేలోపలికి వచ్చిన సంజన.. మన్వితతో మాట్లాడి వెళ్తున్న ధీరజ్ని చూసి షాకయినదానిలానిలబడింది. వెళ్తున్న అతని అడుగుల చప్పడు నిశ్శబ్దంగా వున్న ఆ వార్డులో మృదువుగా, హుందాగా విన్పిస్తున్నాయి.

“నరాలు కోసుకుంటేనేగాని .ఇతగానికి ప్రియురాలి విలువతెలియలేదు కాబోలు. నిన్నంతాఎక్కడికెళ్లాడో...." ? అనుకుంటూ మన్వితదగ్గరకి వెళ్లింది సంజన. నిన్నటి నుండి మన్వితకి తోడుగా హాస్పిటల్లోనే వుంది సంజన.

మన్విత ఇలా చేసుకోటానికి కారణం "లవ్ ఫెయిల్" అనికొందరు “ఇంటి పరిస్థితులు” అని కొందరు అనుకుంటున్నారు. నిజంగా ఆమె ఎవర్ని ప్రేమించిందో అనురాగ్ కి, అతని తల్లికి తప్ప ఎవరికి తెలియదు. అంతో ఇంతో సౌమ్యకి తెలుసు. సౌమ్యకి పెళ్లి అయ్యివెల్లి పోయింది. సంజన మాత్రం మన్విత ప్రేమించింది ధీరజ్ నే అనిఅనుకుంటుంది.

" ఏంటంత డల్గా వున్నావ్ మన్వి? లవ్వన్నాక ఇలాంటివి కామన్ మన్విత సీరియస్గా తీసుకొని మనసు పాడు చేసుకోకు. అతనొచ్చాడు కదా ! ఇంకా ఎందుకింత ఆలోచన ? ఇప్పటికైనా అతనేమంటున్నాడో చెప్ప ?" అంది సంజన మన్విత బెడ్ పై కూర్చొంటూ....

ఒకసారి ... తన చేతి వైపు చూసుకొని భారంగా శ్వాస తీసుకొంది మన్విత.చెప్పు? చెప్పు ? అంటే ఏం చెప్పను సంజనా ? అయినా ... అతనెక్కడ దొరికాడే నీ కల ?" అంది నీరసంగా చూస్తూ మన్విత,

“నీ కన్నాముందు నాకు దొరికి వుంటేనీదాకా రానిచ్చే దాన్ని కాదులే ...నేనే ట్రై చేసుకునేదాన్ని.. ఇంతకీ ఏమన్నారో చెప్పు. నిన్నటి నుండిటెన్షన్ తో  చచ్చిపోతున్నా.. " అంది సంజన.

“ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్1931 సంవత్సరానికి "మాన్ ఆఫ్ ద ఇయర్” అవార్డు మహాత్మాగాంధీని ఎంపిక చేసిందని చెప్పాడు చిన్నతనంలో "మిల్టన్ చర్చి పాదర్కావాలనుకున్నాడట. అలా జరిగివుంటే ఈ భూమండలం ఒక అద్భుతమైన కవిని కోల్పోయి వుండేదని చెప్పాడు. ఇంకా ఐన్ స్టీన్ నోబెల్ బహుమతి కింద తనకి వచ్చిన సొమ్ములో చాలావరకు తెలిసీ తెలియని పద్దతుల్లో ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకున్నాడట... అది కూడా చెప్పాడు." అంది మన్విత

" అవునా ! అలాగా ! ప్రొటోజోవా వెర్టిబ్రేటా వరకు ఏ జాతితో పోల్చుకున్నా మనిషి అధముడేనట. అయినా ఈ సకల చరాచర జగత్తును ఏలుతున్నాడు అంటే అతని మెదడే కారణం. ఇది చెప్పలేదా?" అంది సంజన.

నీతో మాట్లాడి గెలిచే ఓపిక నాకు లేదు అన్నట్లుగా కళ్లు మూసుకొంది మన్విత

"పెళ్లెప్పుడట. నీ మెడిసిన్ పూర్తయి, హౌస్ సర్జన్ కూడా అయ్యాకనా? లేక." అంటూ ఆమెకు కాస్త దగ్గరగా జరిగింది సంజన.

"ఇంకోసారి... ఆ ధీరజ్ గురించి నా ముందు ఎత్తావంటే నిజంగానే నిన్ను చంపేస్తాను". అంది కోపంగా మన్విత,

" ఆ ... చంపావ్లే . ఏదో టైం బాగుండి అనురాగ్ వచ్చి నిన్ను హాస్పిటల్లో చేర్పించాడు. లేకుంటే ఈ పాటికినీడెడ్ బాడీ ముందు కూర్చుని మేమంతా ఏడుస్తుండే వాళ్లం . ఎందుకైనా మంచిది మళ్లీ ఇలాంటి సీన్ రిపీట్ కాకుండా అతన్ని నీ గ్రిప్లో పెట్టుకో...." అంది సంజన.

పక్కనేదైనా చేతికి దొరికితే కొడదామన్నట్లుగా మన్విత అటూ, ఇటూ చూస్తుంటే ...

“చూడండి! ఆంటీ! మనవీ!” అంటూ అదే వార్డులో పేషంటును పరామర్శిస్తు కూర్చుని వున్న కృష్ణవేణమ్మ దగ్గరికి వెళ్లింది సంజన .

ఆమె కంగారుపడ్తూ " మళ్లీ ఏమైనా జరిగిందా? " అన్నట్లుగా ఆత్రుతగా చూసింది.

కంగారు పడకండి ఆంటీ! దానికేం కాదు. ఇప్పడేఅతనొచ్చి మాట్లాడి వెళ్ళాడు." అంది సంజన.

ఆ .... నా బిడ్డనంత క్షోభ పెట్టిన వాడు మళ్లీ వచ్చాడా ? " అంటూ ఆమెలోని తల్లి పేగు కదిలినట్లే, వాడు కన్పిస్తే కొడతానన్నట్లుగా లేచింది కృష్ణవేణి. ఎంతయినా తల్లి కదా!

"అయ్యో ! అతన్ని మీరేం అనకండి అంటీ ! మన్విత మనకి బ్రతకాలి అంటే ! అతనిప్పుడు మనకెంతో అవసరం..." అంది సంజన.

"చక్కని సలహా చెప్పావు సంజనా ! లేకుంటే వాడ్ని నానోటిమాటల్లోనే చంపేసేదాన్ని .." అంది కృష్ణవేణమ్మ.

(సశేషం)

No comments:

Post a Comment

Pages