మానసవీణ-15 - అచ్చంగా తెలుగు

 మానసవీణ-15

-పోడూరి శ్రీనివాసరావు 


(జరిగిన కథ: ఎవరూ లేని మానస చిన్నప్పటి నుంచి ఒక అనాథాశ్రమంలో పెరుగుతూ ఉంటుంది. సేవాభావానికి మారుపేరులా ఉండే మానస అంటే అందరికీ ఇష్టమే. ఒక బహుమతి ప్రదానోత్సవ సభలో మానసను చూసిన మంత్రి కృషీవలరావు, ఆ పాపలో తనకు తెలిసిన శ్రావణి అనే ఆవిడ పోలికలు ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఆమెతో చనువుగా మెలుగుతూ ఆమెను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రభుత్వ కాలేజిలో చేరి, చదువుతూ ఉన్న మానస అక్కడి విద్యార్ధుల మనసు గెల్చుకుని, క్లాస్సులు సజావుగా జరిగేలా చేస్తుంది. రోడ్డుపైన అనాధలుగా వదిలేసిన కొండలరావు దంపతుల దీనస్థితిని చూసి, వాళ్ళ బిడ్డలకు బుద్ధి చెప్పి, దారిలో పెడుతుంది  మానస. మనసు నలతగా ఉండడంతో గుడికి వెళ్ళిన మానసను శ్రావణి కౌగిలించుకుంటుంది. భూషణానికి ఒక ఫోన్ కాల్ ఒస్తుంది.)

మంచంపట్టి, పక్షవాతంతో బాధపడుతూ, తానూ గతంలో చేసిన దుర్మార్గాలకు పశ్చాత్తాపపడుతున్న భూషణం ఎలాగైనా తన మనవరాల్ని తానూ కన్ను మూసేలోగా ఒక్కసారైనా చూడాలనుకున్నాడు. కొడుకు రఘురాం తనలోకంలో తనుంటున్నాడు.

కోడలు శ్రావణి పూర్తిగా పిచ్చిదయిపోయింది.

వాళ్లకు తానూ చేసిన ద్రోహానికి కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు – భూషణం. మూగగారోదిస్తున్నాడు. కొడుకు తనవంక చూసే తిరస్కారచూపును తట్టుకోలేకపోతున్నాడు. తన ధోరణేదోతనదే!

పశ్చాత్తాపంతో భూషణం హృదయం దగ్ధమైపోతుంది. ఎలాగైనా తల్లీ బిడ్డల్ని కలపాలి! 

కానీ, ఓబులేసు ఆ పసిగుడ్డును చంపకుండా వదిలివేసానన్నాడు కానీ, ఆ పసిపాపను ఇపుడెక్కడుందో పట్టుకోవడం ఎలా? గుర్తించడం ఎలా? వీళ్ళిద్దర్నీ కలపడం ఎలా?

అసలీ పని ఎవరికీ అప్పచెప్పాలి? భూషణం మనసులో ఆలోచనలు పరిపరివిధాలపోతున్నాయి. ఈ పనిని సమర్ధవంతంగా, సక్రమంగా చేయగలిగిన వారెవరా! అని ఆలోచిస్తున్నాడు.

అతని మనసులో తటుక్కున కృషీవలరావు మెరిసాడు.

ఔను! నిజమే!! తండ్రికి తగ్గ కొడుకు కృషి! తప్పకుండా అతడే సమర్ధుడు. పైగా మంత్రి పదవిలో ఉన్నాడు. సౌసీల్యుడు. అతనే ఈ పనిని సమర్ధవంతంగా నిర్వర్తించగలడు.

అర్జెంట్ పని ఉంది వచ్చి కలవమని మంత్రి కృషీవలరావుకు కబురుచేశాడు, భూషణం.

*****

భూషణం తనని కలవమని, అర్జెంట్ పని ఉందని వచ్చిన వార్త విన్న కృషీవలరావు ఆలోచనలో పడ్డాడు. 

తననంత అర్జెంటుగా వచ్చి కలవమన్నాడంటే కారణమేమై ఉంటుంది. ఈ మధ్య భూషణం ఆరోగ్యం అంత బాగుండుట లేదని, పక్షవాతంతో నోరూ, కాలూ పడిపోయాయని విన్నాడు తనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో! స్వతహాగా మంచివాడూ, నలుగురికీ సేవచేయాలని తపన ఉన్నవాడూ కావడం వల్ల కృషీవలరావు – భూషణాన్ని కలిసి విషయమేమిటో తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో భూషణం ఇంటికి వెళ్ళాడు.

అక్కడ భూషణాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు కృషి. ఒకప్పుడు మహారాజులా దర్పంగా బ్రతికిన భూషణం, ఈనాడు చిక్కి శల్యమై, మంచాన్నిఅంటుకుని, అస్థిపంజరంలా ఉన్నాడు. నోరు ప్రక్కకు పోయి, కాలు చచ్చుబడిపోయి, పక్షవాతంతో కదలలేక నిస్సహాయంగా ఉన్నాడు.

ఎంతమంది దాసదాసీజనం ఉంటే ఏమి? తినడానికి వీలులేక, తన బాధ మరొకరికి చెప్పుకోలేక, మనసులోనే కుములుతూ, ఏదో గొణుక్కుంటూ, ఆ మాటలేమీ ఎవరికీ అర్ధంగాక నిస్సహాయస్థితిలో మంచానికి అంటిపెట్టుకుని ఉన్నాడు భూషణం.

భూషణం గదిలోకి అడుగు పెట్టిన కృషి, ఆ స్థితిలో ఉన్న భూషణాన్ని చూసి ఎంతో బాధపడ్డాడు. ఆతను గతంలో ఎంతోమందికి చేసిన అన్యాయాలకు, దుర్మార్గాలకు ఈ విధంగా శిక్ష అనుభవిస్తున్నాడేమో అనుకున్నాడు. ఎన్ని కుటుంబాలు ఇతని దుర్మార్గాల వల్ల చెల్లాచెదురైపోయాయి? ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు? ఎంతమంది స్త్రీలు విధవలైయ్యారు? ఎంతమంది కన్నెపిల్లలు మానభంగాలకు గురై, తమశీలాన్ని పోగొట్టుకున్నారు?

అన్నీ సినిమారీలులా కళ్ళముందు గిర్రున తిరుగాడాయి.

కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ, భూషణం మంచం ప్రక్కగా వేసున్న కుర్చీలో కూర్చున్నాడు కృషి – ఎందుకు పిలిపించారో చెప్పండంటూ!  

భూషణం నోరు విప్పి ఎదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ పక్షవాతంతో ప్రక్కకు తిరిగి, వంకర పోయిన నోటినుంచి, ఏదో అస్పష్టమైన శబ్దాలు వినపడుతున్నాయి కానీ, మాటలాడేదేమిటో మాత్రం అర్ధం కావడం లేదు.

తన ఆసక్తతకు బాధపడుతూ, తన భావాలను వ్యక్తపరచలేని నిస్సహాయతకు కృంగిపోతూ – కళ్ళమ్మట ధారాపాతంగా కన్నీళ్లు స్రవిస్తున్నాడు, భూషణం.

అలాకాదని, కాగితం, పెన్ను తెప్పించి, మంచంమీద, కాస్త వ్రాయడానికి వీలుగా, తలగడలనమర్చి, భూషణాన్ని తను చెప్పాలనుకున్న దేమిటో తెలియజేయడానికి వీలైన ఏర్పాటు చేసాడు కృషీవలరావు.

ఒకప్రక్క కళ్ళనుంచి నీరు కారుతుండగా, మసకబారిన కళ్ళను మధ్యమధ్యలో తుడుచుకుంటూ తను చెప్పాలనుకున్నది కాగితం మీద వ్రాశాడు భూషణం. ఆ వ్రాసిన కాగితాన్ని చేతిలోకి తీసుకుని, విషయం తెలుసుకుని, ఆశ్చర్యపోయాడు, కృషీవలరావు.

తను రఘురాం-శ్రావణి దంపతులకు చేసిన అన్యాయానికి పశ్చాత్తాపపడుతున్నాననీ, వారిరువురూ అనుభవిస్తున్న మానసిక క్షోభను చూడలేకున్నాననీ, పసిపాపను వాళ్లకు దూరంచేసి ఏంతో పాపం మూటకట్టుకున్నాననీ, ఏవిధంగానైనా ప్రయత్నం చేసి, దూరం చేసిన ఆ చిట్టితల్లిని, తన తల్లిదండ్రుల వద్దకు చేర్చే ఏర్పాటు చూడమని, తన పలుకుబడితో ఎలాగైనా ఈ పనిచేసి పెట్టమనీ – కృషీవలరావును వేడుకున్నాడు, భూషణం తను వ్రాసి ఇచ్చిన కాగితంలో!

భూషణం ముఖం వైపు చూసాడు కృషీవలరావు. అతని ముఖంలో పశ్చాత్తాపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి, పెదాలు కంపిస్తున్నాయి, - వెక్కివెక్కి ఏడుస్తున్నాడు.

గతంలో అతనెన్ని పాపాలు చేస్తేనేం! తన తప్పు తెలుసుకున్నాడు, తప్పిదాన్ని మన్నించమనే వేడుకోలుకు మించిన ప్రాయశ్చిత్తం లేదుగా! 

భూషణానికి సహాయం చెయ్యడం మాటెలా ఉన్నా, తనవంతు ధర్మంగా ప్రయత్నం చేసి, మానస – శ్రావణిలను కలపాలని నిర్ణయించుకున్నాడు కృషీవలరావు. ఈ విషయంలో దినేష్ సహాయం తీసుకోవాలనీ, అతని కన్నా సమర్ధవంతంగా ఈ పని ఎవరూ చేయలేరని నిశ్చయించుకున్నాడు. కానీ ఫలితమెలా ఉంటుందో! విధివ్రాత నెవరూ తప్పించలేరు కదా!!

*****

కాలేజ్ లో  ఎలక్షన్ల హడావుడి అంతా అయిపొయింది. ఎంత బలవంత పెట్టినా, పట్టు పట్టినా మానస ఎలక్షన్లలో పోటీచేయడానికి ఒప్పుకోలేదు. రాజేష్ నే నిలబడమని, అతనికి తమ అందరి సహకారం ఉంటుందనీ, కానీ ఇదివరకులా రౌడీలా ప్రవర్తించకుండా, జూనియర్లను రాగింగ్ చేయకుండా, లెక్చరర్లను భయపెట్టకుండా, అవమానించకుండా బుద్ధిగా మంచి స్టూడెంట్ గా, మంచి విద్యార్ధి నాయకుడిగా ప్రవర్తిస్తామని మాట ఇస్తేనే తమ అందరి సహకారం ఉంటుందనీ, ఆవిధంగా కాకుండా, ప్రవర్తనలో ఏమాత్రం తేడా ఉన్నా తక్షణమే దానికి వ్యతిరేకచర్యలు చేపడతామనీ, విద్యార్థినాయకుడి స్థానం నుంచి దింపేస్తామని హెచ్చరించింది, మానస. అందరు స్టూడెంట్లకూ, ఈ విషయం స్పష్టంగా చెప్పడంతో, అందరూ ఆమె సలహాను సహృదయంతో స్వీకరించి, రాజేష్ వర్గం(panel) ఎన్నికల్లో గెలుపొందేలా పాటుపడ్డారు.

కాలేజ్ ఎన్నికల్లో గెలిచాక రాజేష్ దృక్పథం మారిపోయింది. ప్రిన్సిపాల్ గారే కాదు, మిగిలిన లెక్చరర్లు, తోటి విద్యార్థులు, జూనియర్లు – అంతా మారిపోయిన రాజేష్ ను చూచి ముక్కున వేలేసుకున్నారు. ఇదివరకటి రాజేష్ – ప్రస్తుతం రాజేష్ – ఒకరేనా అని! పూర్తిగా రాజేష్ తన ప్రవర్తన మార్చుకున్నాడు.

తనలోని రాక్షసత్వాన్ని, దుర్మార్గాన్ని సమూలంగా నాశనం చేసి, తనలో పరివర్తన తీసుకుని వచ్చిన మానస అంటే, రాజేష్ మనస్సులో ఏంతో పవిత్రభావం. ఒకప్పుడు తులసివనంలో గంజాయి మొక్క తను – మరే నేడో పవిత్రమైన తులసివనంలో మొలకెత్తుతున్న చిన్న తులసిమొక్క! ఈ మార్పుకు కారణభూతురాలు మానసకదూ! 

ఆ పవిత్రమైన, మహానుభావురాలు మానస – తనలో ఇలా మంచి మార్పుకు కారణభూతురాలైన మానస మనస్సులో తనపై ఎలాంటి భావముందో! వీలైతే ఆమెతో జీవితం పంచుకోగలిగితే, తన జీవితం ధన్యమైనట్లే కదూ! తన జీవితానికి ఒక సార్ధకత ఏర్పడుతుందేమో, మానస సహకారంతో, ఆమె తనతో పెళ్ళికి అంగీకరిస్తే!

కానీ నాలాంటి వాడిని, అటువంటి పవిత్ర, ఉన్నత భావాలు గల యువతి ప్రేమించడానికి అంగీకరిస్తుందా? అయినా ఆమె మనస్సులో నా స్థానం ఎటువంటిదో! నా ప్రేమను ఆమెకు ఎలా వ్యక్తపరచాలి? అని పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు రాజేష్.

ఇలా, మానస పరిచయంతో, ప్రభావంతో, రాజులా ఉండే రాజేష్ – ఒక్కసారిగా మంచివాడిగా మారిపోవడం, అతని మిత్ర బృందానికేమాత్రం నచ్చలేదు. ఒకప్పుడు తామంటే ఈ కాలేజ్ లో హడల్! ప్రిన్సిపాల్ కాదు, లెక్చరర్లు కాదు, మిగిలిన విద్యార్థులందరికీ కూడా రాజేష్ లో వచ్చిన ఈ మంచి మార్పు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. కనీ రాజేష్ పాత మిత్రబృందం మాత్రం ఈ మార్పును జీర్ణించుకోలేకపోయారు.

అదీకాక, ఇదివరకైతే ప్రతీదానికీ రాజేష్ పై వాలిపోయారు – వాళ్ల సిగరెట్ల ఖర్చు, సినిమా ఖర్చ్, టిఫిన్ ఖర్చు, మందు ఖర్చు – ఇలా ఒకటేమిటి! అన్నిటికీ రాజేష్ డబ్బును మంచినీళ్లలా ఖర్చుపెట్టేవాడు. అతని అనుచర వర్గానికి, ఈ విధంగా రాజేష్ ఒక్కసారిగా – ‘రాముడు మంచి బాలుడు’ – అన్నట్లు మారిపోవడం అస్సలు నచ్చలేదు. ఇపుడు వాళ్ళంటే ఎవరూ భయపడడం లేదు. ఇది వాళ్లకు చాలా అవమానంగా తోచింది.

“ఏరా రాజేష్! నువ్విలా మంచి వాడిగా మారిపోయి, బుద్ధుడిలా తయారయితే, మా పరిస్థితేమిటిరా! ఎవరూ మమ్మల్ని లెక్కచేయడం లేదు. ఒక్కసారి, ఇదివరకెలా ఉండే వాళ్లమో గుర్తు తెచ్చుకో! ఆమజాయే వేరురా! ఇప్పుడిలా స్తబ్దుగా అయిపోవడం, చేతకాని వాళ్లలా ప్రవర్తించడం, మాకేం నచ్చలేదురా!” రాజేష్ కి ఎన్నో విధాల చెప్పి చూశారు, మిత్రబృందం.

అతనిలో మళ్లీ పూర్వపు రాజేష్ ని చూద్దామనుకున్న మిత్రబృందం ఏంతో నిరాశకు గురయ్యారు. అతనిలో ఏవిధమైనా మార్పూ తేలేకపోయారు.

“వద్దురా! ఇంకా ఆ పాడు జీవితం సంగతి ఎత్తకండి. నేను జీవితంలో  ఎంత మంచి సమయాన్ని కోల్పోయానో, ఎన్ని విషయాలను నిర్లక్ష్యం చేసానో, నన్ను లెక్చరర్లే కాదు, తోటి విద్యార్థులులేకాదు – అందరూ  ఎంత అసహ్యించుకునేవారో – ఒక్కసారి గతంలోకి ఆలోచిస్తే తెలుస్తోంది. నిజంగా మానస దేవతారా! ఆమె వల్లే నాలో ఇంత మార్పు వచ్చింది. నేనేమిటో, నా విలువేమిటో, నేను పోగొట్టుకున్నదేమిటో – తెలుస్తోంది. మన కాలేజీకి ఆమె ఓ వరం లాంటిది. అజ్ఞానాన్ని పారద్రోలి, మనందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి వచ్చిన జ్ఞానదీపం మానస. దయచేసి ఆ పాత విషయాలన్నీ మర్చిపోండి. వీలయితే మీరు కూడా మంచి వాళ్లుగా మారండి”.

రాజేష్ మాటలకు మిత్రబృందం ఆశ్చర్యపోయారు. వాడి జీవితంలో, గతంలో, ఎప్పుడైనా ఇలాంటి సూక్తులు చెప్పాడా! వాడు మారిపోవడమే కాకుండా, మనల్ని కూడా మంచివాళ్ళుగా మారిపొమ్మని హితబోధలు చేస్తున్నాడే! అసలు వాణ్ణి కాదురా! వీణ్ణి ఈవిధంగా మార్చిన ఆ రాక్షసిననాలి. దేవతట...దేవత. ఆ దేవతను పిశాచిగా మారిస్తేనే గాని వీళ్ల నైజం మారదు సమయం చూసి, ఆ మానస మీద ఆసిడ్ పోసేస్తేసరి. ముఖం నుండి, కళ్లుపోయి, గుడ్డిదానిగా, అసహాయంగా మార్చేస్తే – ఆ పరిస్థుతుల్లో ఏం సమాజసేవ చేస్తుందో చూద్దాం! కానీ ఎప్పుడు చూసినా చుట్టూ నలుగురుంటారు తప్పితే, ఎపుడూ ఒంటరిగా దొరికి చావదేం! చూద్దాం! సమయం కోసం  ఎదురు చూద్దాం!’ అనుకున్నారు విసిగివేసారి పోయిన రాజేష్ మిత్రబృందం. నిరాశగా వెళ్ళిపోతున్న తన స్నేహితులను చూసి, “పాపం! నేను వాళ్ల పద్ధతికి రావడం లేదని వెళ్లిపోతున్నారు. వీళ్లు కూడా మంచి వాళ్లుగా మారిపోతే ఎంతబాగుండును, మానస ఎంత సంతోషిస్తుంది.” అనుకున్నాడు రాజేష్.

అంతేగానీ! వాళ్లలో రూపొందుతున్న కుతంత్రాన్ని ఊహించలేకపోయాడు.

******

 అనిరుద్ తన గదిలో కుర్చీలో కూర్చొని, టేబిల్ మీద ఉన్న పుస్తకమొకటి  తీసుకుని తిరగేస్తున్నాడు. పుస్తకమైతే తిరగేస్తున్నాడు కానీ, అతని దృష్టి దేనిమీదా లేదు. పరధ్యానంగా ఉన్నాడు. చివరకు వేరే పుస్తకం తీసి అందులో ఉన్న ఫోటో బయటకు తీసి పదేపదే చూస్తున్నాడు. ఆ ఫోటోలో ఉన్నది...మా..న..స ,, చిరునవ్వులు చిందిస్తూ – అరవిరసిన కమలంలా ఉంది, మానసమోము. తదేకంగా, తమకంగా అదే ఫోటోని పరికించి చూస్తున్నాడు, అనిరుధ్ .

ఆ రోజు గుడి దగ్గరకు మాట్లాడడానికి రమ్మంటే, తనేం ఊహించుకున్నాడో తలుచుకుంటే ఏంటో సిగ్గేసింది. ఎంత మహోన్నతమైంది మానస ఆలోచన, ఎంత గొప్పది ఆమె వ్యక్తిత్వం. తను, ఆమెను ఏవిధంగా ఊహించుకున్నాడు? ఆమె తనను ప్రేమిస్తుందనుకున్నాడు. ఆమెకు తన ప్రేమను   వ్యక్తం చేయాలని ఆశించాడు. కానీ, అలాంటి  ఉత్తమమైన వ్యక్తి ప్రక్కన కనీసం తనకు నిలబడే స్థాయి ఉందా! ఇంత చిన్న వయసులోనే అటువంటి సేవాదృక్పధం, ఆలోచనాసరళీ, నలుగురికీ మంచి చేయాలనే ఆశయం – ఏవిధంగా చూసినా – నాకూ ఆమెకూ పోలికా! హస్తిమసకాంతరం తేడా ఉంది. నేను ధనంలో పుట్టిపెరిగినా, ఎంతమందికైనా సేవచేసే, సహాయం చేసే అవకాశం ఉన్నా, అసలు అటువంటి ఆలోచనే, తనమనసులోకి రాలేదే! అసలా వ్యక్తిత్వమేమిటి? ఆమెలో అటువంటి ఆలోచనలు, ఆశయాలు ఎలా ఉన్నాయి. తల్లిదండ్రులెవరో తెలియని అనాధగా, అనాధశ్రమంలో పెరిగానంటుందే-... ఆమెకు నా ప్రేమ ఎలా తెలియపర్చాలి? ఆమె నన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవడమెలా! అసలు ఆమెకు నేను తగినవాడినా! లేక ఇవన్నీ నా పిచ్చి ఊహలూ -.. భ్రమలేనా! ఆమెతో జీవితం పంచుకుంటే, ఆమె ఆశయాలకు ... నా సంపద తోడైతే .. ఆమె ఊహల్ని నిజం చేయొచ్చేమో! ఇంకా సమర్ధవంతంగా ... ఇంకా పదిమందికి .. సేవ చేయొచ్చేమో!

అయినా, నా ఆలోచనకు నాన్నగారేమంటారో! అయినా... ఆయనమాత్రం ఏమంటారు? ఎంతగానో సంతోషిస్తారు! ఆయనదీ .. సేవాధర్మసిద్దాంతమేగా... నలుగురికీ సహాయం చేయడం...సేవచేయడం... అనాథాశ్రమాలూ, వృద్ధాశ్రమాలు స్థాపించడం, నిర్వహించడం ... ఆయన ఎప్పటినుండో చేస్తున్న పనులే కదా! మానస ఆలోచనలూ, ఆశయాలూ... ఆయన విధానాలకు అనుగుణంగానే ఉంటాయి కదా! బహుశా నా ఆలోచనను ఆయన సమర్ధిస్తారు కానీ... కాదనరు.

కానీ ఈ విషయం ఎలా వెల్లడించాలి? ముందు నాన్నగారికి చెప్పాలా! లేక మానస విషయం తెలుసుకోకుండా. ఆమె అంగీకారం లేకుండా ఎలా నాన్నగారికి చెప్పాలి.  అందుకని ముందు మానసముందే ఈ విషయం ప్రస్తావించాలా.... ఎటూ తెగని ఆలోచనలతో... అలా ఆలోచిస్తూనే.... కుర్చీలోనే నిద్రలోకి జారుకున్నాడు అనిరుధ్.

**** 

ఇలా ఇద్దరు యువకులు, తన వ్యక్తిత్వానికి, ఆశయాలకు, దాసోహులై తనమీద విపరీతమైన ఇష్టం, ప్రేమ, కోరిక (పెళ్ళాడాలని) పెంచుకుంటున్న విషయం ఏమాత్రం  తెలియని మానస తన గదిలో, తనకిష్టమైన కృష్ణశాస్త్రి సాహిత్యం చదువుకుంటూ, ఆనందాన్ననుభవిస్తోంది.

(సశేషం)


No comments:

Post a Comment

Pages