బసవ పురాణం - 3 - అచ్చంగా తెలుగు
పురాణ కధలు
బసవ పురాణం - 3
-పి.యస్.యమ్. లక్ష్మి4.  మేక పెంటిక లింగమగుట
భక్తి అంటే మడికట్టుకుని పూజలు చెయ్యటం, అందరినీ పిలిచి ఆర్భాటం చెయ్యటం కాదని పూర్వం భక్తుల కధలనేకం నిరూపించాయి.  అలాంటి కధే ఇది.
బసవేశ్వరుని కాలంలోనే ఒక గొల్ల పిల్లవాడుండేవాడు.  అతని పేరు కోటకోటడు.  అతను రోజూ శివలింగానికి అభిషేకం చెయ్యకుండా అన్నం తినేవాడు కాదు.  గొల్ల పిల్లాడు కదా.  పాలకి కొరత వుండేది కాదు మరి.  అతని దిన చర్య రోజూ వాళ్ళ మేకలనన్నింటినీ తీసుకెళ్ళి మేపుకురావటం.  ఒక సారి సమయం మించి పోవటంతో శివుడికి అభిషేకం చెయ్యకుండానే మేకలని మేపటానికి తోలుకెళ్ళాడు.  
మధ్యాహ్నం కోటకోటడి తండ్రి అతనికి భోజనం తీసుకొచ్చి, తాను మందని కాస్తూ, కోటడిని అన్నం తినమన్నాడు.  కోటడి నియమం ప్రకారం అతను శివునికి అభిషేకం చేస్తేగానీ అన్నం తినడు.  శివలింగం కోసం అతను చుట్టూ చూశాడు.  కానీ ఎక్కడా కనబడలేదు.  చివరికి ఒక రావి చెట్టుకింద వున్న మేక పెంటిక అతనికి లింగాకారంలో కనబడింది.  అతను వెంటనే ఒక మేకను తీసుకెళ్ళి ఆ పెంటిక మీద నుంచోబెట్టి పాలు పితకగా, పాలు కోటడు శివ లింగంగా భావించిన మేక పెంటికమీద కురిశాయి.  

దూరంనుంచీ దానిని చూసిన కోటడి తండ్రి  కొడుకు చేసిన పిచ్చిపనికి కోపగించి అక్కడికి వెళ్ళి ఆ పెంటికని కోపంగా తన్నాడు.  కోటడి దృష్టిలో అది శివ లింగము.  శివలింగాన్ని కాలితో తన్నిన తండ్రిమీద కోపించి కోటడు తన చేతిలోని కర్రతో తండ్రినదిలించబోగా అది తండ్రి మెడకు తగిలి అతని మెడ తెగి మరణించాడు.  సమీపంలో వున్న రక్షక భటులు అది చూసి, ఆ పిల్లాడు తండ్రినే చంపాడని రాజు ఆస్ధానానికి తీసుకుపోయి విషయమంతా చెప్పారు.

రాజు ఆ ప్రదేశానికి వెళ్ళి చూడగా, ఆ మేక పెంటిక శివ లింగముగా కనుపించింది.   అంతకు ముందు మేకే ఆ శివలింగంమీద నుంచుని తనకు తాను పాలాభిషేకం చేస్తున్నది.  కోటడి తండ్రి సజీవుడై వున్నాడు.  రాజు, రాజుతో వచ్చినవారు, కోటడి తండ్రి అంతా ఆశ్చర్యపోయారు.  ఆ గొల్ల పిల్లాడి భక్తికి మెచ్చుకుని వారంతా ఆనాటినుంచీ లింగధారణ చేసి శివ భక్తులయ్యారు.  వాళ్ళని చూసి  ఆ రాజు ఏలుబడిలోని వారంతా శైవ మతానికి మారారు.

ఇవ్వన్నీ పూర్వం రాష్ట్రంలో ఆచార వ్యవహారాలు అడుగంటి, అరాచకాలు పెరుగుతున్న సమయంలో భగవంతుడు కొన్ని స్వయంగా తాను, కొన్ని బసవేశ్వరుని ద్వారా చూపించిన లీలలు. 


5. జొన్నలరాశి ముత్యాలగుట
ఒకసారి బసవేశ్వరులవారు అభ్యంగన స్నానం (శరీరమంతా నూనెతో మర్దన చేసుకుని సున్నిపిండితో నలుగు పెట్టుకుని చేసే స్నానం...సమయం పడుతుంది) చేస్తూండగా ఒక జంగము వచ్చి  తన లింగ (శివ) పూజకు ప్రతిరోజూ మూడు కుంచాల మంచి ముత్యాలు కావాలని, తన చాతుర్మాస దీక్ష బసవేశ్వరులవారి ఊరిలో జరుపుకోవాలని వచ్చానుగనుక పదిపుట్ల మంచి ముత్యాలు కావాలి, వాటిని నువ్వు ఇవ్వగలవని వచ్చాను అని చెప్పాడు.  బసవేశ్వరుడు వంటినిండా నూనె పట్టించుకుని వున్నాడు.  అలాగని సహాయం కోరి వచ్చిన జంగాన్ని ఆపలేడు.  ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూండగా ఎదురుగావున్న ఒక జొన్నల రాశి ఆయనకి మంచి ముత్యాలలాగా కనబడ్డాయి.  దానిని వచ్చిన భక్తునికి చూపించి నీ ఇష్టమువచ్చినన్ని ముత్యములు తీసుకొమ్మని చెప్పారు.  అది చూసి వచ్చిన భక్తుడు బసవేశ్వరుని మహిమకి ఆశ్చర్యపడి తనకు కావలసిన ముత్యములు తీసుకువెళ్ళాడు.   తర్వాత ముత్యాల రాశి ఎప్పటిలాగా జొన్నల రాశి అయింది.

బసవేశ్వరుని దగ్గరకు వచ్చే భక్తులు బసవేశ్వరుని మహిమలు గురించి కధలు కధలుగా చెప్పుకునేవారు.

***

No comments:

Post a Comment

Pages