అసలుకి మోసం - అచ్చంగా తెలుగు
 అసలుకి మోసం 
 పి.యస్.యమ్. లక్ష్మి


పూర్వం ఒక జిత్తులమారి నక్క చిన్న అడవిలో వుండేది.  ఒక రోజు దానికి అక్కడ  ఆహారం సరిగా దొరకలేదు.  అందుకని  ఆహారంకోసం వెతుక్కుంటూ దగ్గరే వున్న గ్రామానికి వెళ్ళింది.  అక్కడ గ్రామ సింహాలు ఈ నక్కని చూశాయి.  గ్రామ సింహాలు అంటే తెలుసా?  అవ్వేనర్రా!  కుక్కలు!!  అవి గ్రామంలోకి కొత్త వాళ్ళెవరన్నా వస్తే అరుస్తూ గ్రామస్తులకి తెలియజేసి, వాళ్ళని ఎప్పుడూ కాపాడుతుంటాయి.  అందుకే వాటిని గ్రామ సింహాలు అంటారు.  అవి చూశాయి.  కొత్త జంతువు గ్రామంలోకి వస్తే చూస్తూ వూరుకుంటాయా!?  అరవటం మొదలు పెట్టాయి.

ఐదారు కుక్కలు ఒక్కసారి అరవటం మొదలు పెట్టేసరికి నక్క పాపం గాబరా పడింది.  అటూ ఇటూ పరిగెత్తింది.  ఎటు పోవాలో తెలియలేదు.  ఏమి చెయ్యాలో తోచలేదు.  అటూ ఇటూ పరిగెత్తీ పరిగెత్తీ గబుక్కున ఒక ఇంట్లో దూరింది. అది బట్టలకి రంగులద్దేవాళ్ళ ఇల్లు.  వాళ్ళకి ఆ రోజు బట్టలకి నీలం రంగు వేసే పని వుండటంతో ఒక తొట్టె నిండా నీలం రంగు కలిపి పెట్టి బట్టలు తేవటానికి వెళ్ళారు.  మన నక్క కంగారులో పరిగెత్తింది కదా.  తెలియని ఇల్లు.  ఎక్కడ ఏముంటుందో తెలియదు.  కుక్కలు తరుముకు వస్తున్నాయనే కంగారులో వెళ్ళి ఆ నీలం రంగు తొట్టెలో పడింది.  మొత్తం శరీరమంతా మునిగిపోయింది.  శరీరమంతా నీలం రంగు పట్టింది.  నెమ్మదిగా పైకి లేచింది.  

శరీరానికి పట్టిన నీలం రంగుతో అదేదో భయంకరమైన కొత్త జంతువుగా కనబడింది.  కుక్కలు దాన్ని చూసి భయపడి అరుపులు తగ్గించి వెనక్కి తిరిగాయి.  అది గమనించింది నక్క.  నక్కకి తెలివి తేటలు ఎక్కువ అంటారు.  తనని చూసి కుక్కలు వెనక్కి తగ్గుతున్నాయంటే తన ఆకారంలో ఏదో మార్పొచ్చింది.  దాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలనుకుంది.   దర్జాగా ఇంటినుంచి బయటకొచ్చి అటూ ఇటూ చూసింది.  కుక్కలు భయపడి దూరంగా వుండి చూస్తూ కుయ్యి కుయ్యి మంటున్నాయి.  దానికింకా ధైర్యం వచ్చింది.  తన కొత్త రూపుతో అడవిలోని తన వారిని కూడా ఆట పట్టిద్దామని అడవికి వెళ్ళింది.  

అడవిలో దాని తోటి నక్కలు, ఇతర చిన్న జంతువులే కాకుండా సింహాలు, పులులు కూడా పూర్తిగా నీలం రంగుతో వచ్చిన ఆ నక్కని చూసి కొత్త జంతువేదో వచ్చిందని గాబరా పడ్డాయి.  దాని వాలకం చూస్తే అది వాటికన్నా ఎక్కువ బలం కలదానిలా కనిపించింది.  కొత్తవాళ్ళ బలము, గుణ గణాలు తెలుసుకోకుండా ఆ జంతువు ఎలాంటిదో నిర్ణయించటం కష్టమనుకున్నాయి.  అందుకని దాన్ని మంచి చేసుకుని దాని విషయాలన్నీ తెలుసుకోవటం మంచిదని అన్నీ కలసి తీర్మానించుకున్నాయి. 

మన రంగు నక్క కూడా చాలా తెలివి కలది కదా.  మిగతా జంతువుల తడబాటు గ్రహించింది.  అందరినీ పిలిచి, “నన్ను బ్రహ్మ దేవుడు సృష్టించాడు.  అడవిలో మీ అందరికీ సరైన నాయకుడు లేడని మీ అందరినీ కాపాడటానికి నన్ను ఇక్కడికి మీ అందరికీ నాయకుడుగా పంపాడు.  ఇవాళ్టినుంచీ నేనే మీ నాయకుణ్ణి.  మీరంతా నేను చెప్పినట్లు వినాలి” అన్నది.  పాపం మిగతా జంతువులు నిజమే కాబోలు అని నమ్మి అంగీకరించాయి.  

నక్క పరిపాలన సాగించాలి కదా.  అందుకే అందరికీ తలో పనీ అప్పజెప్పి, తను అజమాయిషీ చేస్తూ అడవికి తానే రాజన్నట్లు బతకసాగింది.  అంతేకాదు.  తన తోటి నక్కలను దూరంగా తరిమేసింది. తనతో వుంటే అవి తననెక్కడ గుర్తు పడతాయోనని.

జంతువులన్నీ వేటాడి మాంసం తెచ్చి నక్క ముందు పెట్టేవి.  అది అందరికీ పంచి, తనూ తినేది.  ఇలా కొంతకాలం హాయిగా గడిచింది.  ఒక రోజు జంతువులన్నీ సభ జరుపుకుంటున్నాయి.  మారు వేషంలో వున్న నక్క రాజుగారు మిగతా వాటికి ఏవో ఆనతులిస్తున్నారు.  ఇంతలో దూరంగా వున్న నక్కల గుంపులోంచి ఊళలు (నక్క అరుపులు) వినిపించాయి.  చాలా రోజుల తర్వాత తమ జాతి అరుపులు విన్న నక్క తనని తాను మరచి సంతోషంగా తనూ పెద్దగా అరిచింది.  

ఇంకేముంది!?  అదెవరో మిగతా జంతువులకన్నింటికీ తెలిసిపోయింది!  అవి వూరుకుంటాయా?  అందులోనూ బ్రహ్మ ప్రత్యేకంగా వాళ్ళకోసం తనని సృష్టించాడని అందరినీ మోసం చేసిందికదా.  అవీ వాటి కఛ్ఛ తీర్చుకున్నాయి.  అది పారిపోదామని చూసినా పారిపోనీయకుండా అన్నీ కలసి మీదపడి నక్కని చంపేశాయి.  

అందుకే పిల్లలూ, ఏదో వేషం వేసుకున్నామని మన అసలు స్వరూపాన్ని మర్చిపోకూడదు.  మనవాళ్ళనెప్పుడూ విడిచి పెట్ట కూడదు.  ఈ రెండింటి వల్లనే కదా నక్కకి అసలుకే మోసం వచ్చింది.  ప్రాణమే పోయింది.

***

No comments:

Post a Comment

Pages