వీళ్ళింతే - అచ్చంగా తెలుగు
వీళ్ళింతే  
వై.యస్.ఆర్.లక్ష్మి.
 

 

నేను స్టాఫ్ రూమ్ లో కూర్చుని టెన్త్ క్లాసు వాళ్ళకు పెట్టిన సైన్సు పేపర్లు దిద్దుకుంటున్నాను.పక్క టేబుల్ దగ్గర నీరజ హిందీ టీచరు,శారద సోషల్ టీచరు వారికి కూడ ఖాళీ అనుకుంటా కూర్చుని గట్టిగా కబుర్లుచెప్పుకుంటున్నారు.వారు గట్టిగా మాట్లాడుతుండటంతో వద్దనుకున్నా నా చెవిలో పడుతున్నాయి.
 నగలు,చీరలు,సినిమాలు,సీరియల్స్ అన్ని విషయాలు వారి కబుర్లలో చోటు చేసుకుంటున్నాయి.
  “మొన్న మీరు కట్టిన మెరూన్ కలర్ చీర చాలా బాగుంది.”అందిశారద.
   “అదీ నేను కళాంజలి లో కొన్నాను.అక్కడ లేకపోతే బొటిక్ లో మాత్రమే కొంటాను.బయట ఎక్కడా కొనను”అంది అతిశయంగా నీరజ.
   “అందుకే మీ చీరలు ప్రత్యేకంగా వుంటాయి.”అని మరింత పొగిడిందిశారద.
   నీరజ వాళ్ళాయన బిజినెస్ మాన్.ఒక్కడే కొడుకు కార్పొరేట్ స్కూల్ లో పెట్టి చదివిస్తోంది.జాబ్ చేయాల్సిన అవసరం లేకపోయినా కేవలం తన చీరలు నగలు ఎగ్జిబిట్ చేయడానికే స్కూలుకు వస్తుందేమో అనిపిస్తుంది నాకు.చీరలు నుంచి టాపిక్ నగల మీదకు మళ్ళింది.
   “మొన్న శుక్రవారం ప్రమోద వేసుకొచ్చిన గాజులు చూసారా?కొత్త మోడల్ గా వున్నాయి కదా!”అందిశారద.
  “ఆ చూసాను ఏం బాగున్నాయి?అవి నేను సంవత్సరం క్రితమే చేయించాను.బాగోలేదని వెంటనే చెడ గొట్టేశాను.”అంది నిరసనగా నీరజ.ఆమెకు తన చీరలు నగలు తప్ప ఎవరివి బాగున్నాయన్నా నచ్చదు.అందరిలోకి తానే మిన్నగా వుండాలన్న అహంకార స్వభావం ఆమెది.శారద ఏమనుకున్నదో మరల రెట్టించ లేదు.
టి.వి సీరియల్స్ గురించి ముచ్చట్లు ప్రారంభమయ్యాయి.
 “రబ్బరు గాజులు సీరియల్ లో సునీతను ఆమె అత్త రాచిరంపాన పెడుతోంది.పాపం సునీత ఎంత ఓర్పు గలదో పల్లెత్తి ఒక్కమాట మాట్లాడదు.ఆమెను చూస్తే జాలే
   స్తుంది.”అంది శారద అదేదో తమ పక్కింటమ్మాయి కి అన్యాయం జరిగి పోతున్న ట్లు.
  “మరీ పాతకాలంలో లాగా అలా చూపించడమేమిటి?ఇప్పుడు ఏ కోడలు అత్తగారి దాష్టీకాన్ని భరిస్తోంది.ఆడవాళ్ళను మరీ విలన్లు లా చూపిస్తున్నారు.ఈ మధ్య
   సీరియల్స్ మరీ దారుణంగా వుంటున్నాయి.అందుకే నేను చూడటం తగ్గించేసాను.”అంది నీరజ.కొంచెం గొంతు తగ్గించి “ఆ కీర్తిని చూసారా?జుట్టు లేని వాళ్ళు
   లేదని ఏడుస్తుంటే అంత పెద్దజడ తను మాత్రం కట్ చేసి పారేసింది.ప్రాణం ఎలా ఒప్పిందో.ఇంట్లో వాళ్ళు ఎలా వూరుకున్నారో?అయినా ఇలాంటి వారు ఎవరినీ
   ఖాతరు చెయ్యరులే.మాఆయనైతే అసలు వూరుకోరు.”ఎంత నిదానంగా మాట్లాడినా స్టాఫ్  రూమ్ నిశ్శబ్దం గా వుండటంతో ఆ మాటలున చెవిన పడుతున్నాయి
   ఈ లోపు క్లాసు పూర్తి చేసుకుని వస్తున్న కీర్తిని చూసి “రా కీర్తి టెన్త్ క్లాసు నుంచి వస్తున్నావా ఏంటి అలా చెమటలు కారుతున్నాయి.కాసేపు ఇలాఫాన్ కింద కూర్చో”
   అంటూ కుర్చీ జరిపింది శారద.
         అబ్బ వీళ్ళు ఎలాంటి వారు.ఇప్పటిదాకా తనను గురించిఆడిపోసుకున్నారు.తను రాగానే ఆప్యాయత వలకబోస్తూ నటన.ఔను పని వత్తిడిలో నేనూ గమనించ లేదు.టెన్త్ వాళ్ళకి పరీక్షలు దగ్గర కొచ్చాయని సిలబసు కంప్లీట్ చేయడం ఎసైన్ మెంట్  లు పెట్టడంతో సరిపోతోంది.ఎవరి బిజీ లో వారున్నాము.రెండు రోజు లైంది తనని సరిగా గమనించి.నిజమే వాళ్ళన్నట్లు జుట్టు భుజాల దాకా కత్తిరించింది.కాని వీరంటున్నట్లుగ సోకులు కోసం మాత్రం కాదు.తన గురించి నాకు బాగా తెలుసు.. ఏదో బలమైన కారణమే వుండి వుంటుంది.ఇద్దరు పిల్లలు అత్తమామ లతో  ఇంటికి వెళ్ళిన దగ్గర్నించీ పనితోనే సరిపోతుంది.స్కూలుకు వచ్చిన దగ్గర్నించీ కూడ క్షణం తీరికలేకుండ ఖాళీ లేకుండ క్లాసులు తీసుకుంటుంది.ఎవరికి ఏదవసరమైన సహాయపడుతుంది.వివాదాస్పదమైన మాటలలో తలదూర్చదు.ఎంత క్లిష్టమైన పరిస్థితులలో కూడ ముఖం మీద చిరునవ్వు చెరగనివ్వదు.నాకు కొంచెం కోపమెక్కువ.చిన్న విషయాలకే ఇరిటేట్ అవుతాను. అందుకే నాకు ఆమె రోల్ మోడల్.తన లాగ నేను కూడ కూల్ గా వుండాలనుకుంటాను కాని ఆ సమయానికి ఏమీ గుర్తురావు.ఎప్పుడూ బిజీ గా వుండేతను అలంకరణ గురించి గాని వేషధారణ గురించి గాని అసలు పట్టించుకోదు.చీర ఒకటి బ్లౌజు మరొకటి సంబంధం లేకుండా వేసుకుంటుంది.ఎవరైనా అడిగితే ఏదో ఒకటి వేసుకున్నాను గా అని నవ్వేసేది.అలాంటిది ఆమె గురించి వీళ్ళు అలా మాట్లాడడం నాకు కష్టంగా అనిపించింది.ఏమైనా కీర్తిని అడిగి అసలు విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను.
                                మర్నాడు నా క్లాసు సిలబసు అవలేదని మాథ్స్ టీచరు తీసుకోవడంతో ఆమెకిచ్చి నేను వస్తుండ గా అప్పుడే క్లాసు ముగించుకొని కీర్తి పక్క క్లాసు నుండి బయటకు వచ్చింది. తన్ని చూసి “ఏమిటి లీజరేనా?”అని అడిగా.
  “ఈ ఒక్క పిరియడే లీజర్.తరువాత వరుసగ క్లాసులున్నాయి.కరక్షన్ చేయాల్సిన ఎసైన్ మెంట్లు వున్నాయి.స్టాఫ్ రూమ్ కి వెళుతున్నా.నీ క్లాసు మాథ్స్ టీచరు తీసు
  కున్నట్లున్నదిగా పద వెళుతూ మాట్లాడుకుందాము.ఒకే చోట పని చేస్తున్నా మాట్లాడటానికి సమయమే వుండటం లేదు.”అంటూ ముందుకు నడిచింది. నేను అనుసరించాను.
   “కీర్తీ నిన్నోవిషయం అడుగుతాను ఏమనుకోవు కదా!”
   “ఏమిటి ఇవ్వాళేదో కొత్త గా మాట్లాడుతున్నావు.నా సంగతి నీకు తెలియదా! నాకు తెలిసిన విషయమైతే తప్పకుండ చెబుతాను.అడుగు.”
   “నిన్ను గురించే.నా ప్రశ్న కు నువ్వేమన్నా హర్ట్ అవుతావేమోనని”అన్నాను సందేహంగా.
   ఒక్క క్షణం ప్రశ్నార్థకం గ నా ముఖం వంక చూసి” నా గురించంటున్నావు గా నిస్సందేహంగ అడుగు. అంత కాని ప్రశ్నలు నువ్వడగవని నాకు తెలుసు.ఎలాంటి ప్రశ్నయినా ఏమనుకోను.”
      “నువ్వు జుట్టు ఎందుకు కత్తిరించావు.”
   “ఓహ్ అదా!ఈ ప్రశ్న అడగడానికింత సందేహమా?కాన్సర్ పేషెంటుకి డొనేట్ చేసాను.”
    “కాన్సర్ పేషెంటుకి డొనేషన్ నిజమా!నేనెప్పుడూ వినలేదు.”అని ఆశ్చర్యపోయా.
   “నాకూ తెలియదు.యథాలాపంగ ఏదో మాగజైన్ లో చదివాను.మనం ఎందుకు చేయకూడదనిపించి యిచ్చేసాను.”
   “డబ్బు,బట్టలు,వస్తువులు దానం గురించి విన్నాను కాని ఇలాంటిదెప్పుడూ విన లేదు.మీ బంధువులెవరన్నానా?ఎలా యిచ్చావు?ఎక్కడిచ్చావు?”
    “ఆగాగు.అన్ని ప్రశ్నలు ఒక్కసారే అడిగితే ఎలా?కాన్సర్ పేషెంట్ల కోసం హెయిర్ కలెక్ట్ చేసే ఆర్గనైజేషన్లున్నాయి.వారు మన దగ్గర తీసుకుని విగ్గులు తయారుచేసి
   కావాలనుకున్న వారు అప్లికేషన్ పెట్టకుంటే వుచితంగ యిస్తారు.వారు మందుల వల్ల కీమోథెరపీ వలన హెయిర్ లాసవుతారు.కొంతమందికి గుండవుతుంది.
   అలాంటి వారు నలుగురి లోకి రావాలంటే ఫీలవుతారు.అసలే అనారోగ్యం తో డిప్రెషన్ కి లోనవుతారు.ఈ హెయిర్ లాస్ వలన మరింత కుంగుబాటుకు గురవుతారు. మందుల వలన సెన్సిటివ్ గా మారతారు.ఆర్టిఫిషియల్ హెయిర్ తో ఎలర్జీలు వస్తాయి.అందుకని నేచురల్ హెయిర్ కి ప్రాథాన్యత యిస్తారు.అది కూడ అందరిదీ తీసుకోరు.తలకట్టు వెనక ఫొటో తీసి పంపితే 12 అంగుళాల పైన పొడవు వుంటేనే తీసుకోడానికి అంగీకరిస్తారు.సంవత్సరం సంవత్సరంన్నర అయినాక మరల వారి దగ్గర తీసుకుని దానిని ప్రాసెస్ చేసి వేరొకరికి వినియోగిస్తారు.నిరాశా నిస్పృహలకు గురైన అలాంటి వారి ముఖాలలో చిరునవ్వులు విరబూయాలన్న ఆశ తో నాచిరు ప్రయత్నం.అంతకు మించిమరేం కాదు.నువ్వెందుకు ప్రత్యేకించి నా జుట్టు గురించి అడిగావు.”
   “వూరికినే.తెలుసుకుందామని.”
   “ఏదో జరిగుంటుంది. లేకపోతే పనిమాలా నువ్వడగవు.ఎప్పుడూ ఎదుటివాళ్ల గురించి వెనకాల ఏదోఒకటి మాట్లాడుతానే వుంటారు.మంచి చేసినా చెడుచేసినా విమర్శిస్తారు.మనం అలాంటి వారి గురించి పట్టించుకోనవసరం లేదు.మన మనస్సాక్షికి సమాధానం చెప్పుకుంటే చాలు.పద మన నెక్స్ట్ క్లాసుకి టైమవుతోంది.
   కబుర్లలో పడి గమనించలేదు.అనవసరంగా ఆలోచించి బి పి పెంచుకోకు.బి హేపీ “అంటూ గబగబా వెళ్ళిపోయింది.నేను నడుస్తున్న ఆ మానవతా మూర్తివంక చూస్తూ వుండిపోయాను.
          మర్నాడు స్టాఫ్ రూములో నీరజ శారద కూర్చుని వుండగా వారి దగ్గరకు వెళ్ళి “మీకిది తెలుసా”అన్నాను వుపోద్ఘాతంగా.
    “ఏంటది”అన్నారు ఆసక్తిగా
    “కీర్తి ఫాషన్ కోసం జుట్టు కత్తిరించుకోలేదు.కాన్సర్ పేషెంటుకి డొనేట్ చేసింది.అలాంటి మంచి మనసు ఎంతమంది కి వుంటుంది చెప్పండి.మనం నిజంగా తన్ని 
  అభినందించాలి.”అన్నాను.
    “నీ కెవరు చెప్పారు?”అంది నీరజ.
    “తననే అడిగాను.అలాంటి ఆర్గనైజేషన్స్ గురించి వాటి వుద్దేశాన్ని వివరించింది.మనమేమో ఫాషన్ కోసం జుట్టు కట్ చేసుకుందనుకున్నాము. తెలియని ఎన్నో విషయాలున్నాయి. తెలియని వాటి గురించి తప్పుగా మాట్లాడకూడదు.”అని చెప్పి గుమ్మం దాటుతున్నాను.ఈ లోపు వెనక నుంచి మాటలు వినిపించాయి.
       “అలాంటివి ఎక్కడ వుంటాయి?వుంటే మాత్రం మనం అలా చేయలేం బాబో.ఎవరికోసమో మొగుడు చచ్చిన వారి లాగ గుండు చేయించుకోలేము కదా!
   ఆవిడకి బెష్ట్ ఫ్రెండు గా అందుకే వెనకేసు కొస్తోంది.అదెంత వరకు నిజమో”అని దీర్ఘం తీస్తోంది.
          ఛీ! వీళ్ళింతే మారరు.మంచిని పాజిటివ్ గా అంగీకరించలేరు.అబద్దంలోనే బ్రతికేస్తుంటారు.

 ***

No comments:

Post a Comment

Pages