ఈ తరం పిల్లలు - అచ్చంగా తెలుగు
ఈ తరం పిల్లలు
పెయ్యేటి శ్రీదేవి


         

 సరళ సాయంత్రం టి.వి.లో తనకిష్టమైన సావిత్రి సినిమా ఇంటరెస్ట్ గా చూస్తోంది.  ఇంతలో ఫోన్ మోగింది.  సీరియల్ చూడటం కుదరదనుకుంటూ విసుగ్గా వెళ్ళి ఫోను తీసింది.  విజయవాడ నించి శాంతి ఫోన్ చేసింది.  శాంతి చెప్పేది ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు!  ఎందుకంటే ఆమె ఏడుపే వినిపిస్తోంది.   

          'శాంతీ!  అసలేం జరిగిందో చెప్పు.  ఎందుకేడుస్తున్నావు?' కంగారుగా అడిగింది సరళ. 

          'నువ్వే ఏదో చెయ్యాలక్కా.  ఒకసారి నువ్వూ, బావా, పెద్దక్కా, పెద్దబావా, అన్నయ్యా, వదినా మా విజయవాడ వచ్చి ఈ సమస్యని పరిష్కరించండి.' అంటూ మళ్ళీ ఏడుపు.  

          'సమస్యేమిటో చెప్పకుండా ఏం చెయ్యాలో ఏం తెలుస్తుంది?  చెప్పన్నాఏడు, ఏడ్చన్నా చెప్పు.  అసలేం జరిగింది?  అంతా కులాసాయేనా?  పిల్లలు సతీష్, మీ అమ్మాయి సునీత, మీ ఆయనా క్షేమమే కదా?  ముందరా ఏడుపాపి విషయం ఏమిటో చెప్పు.'  

           'అంతా క్షేమమే.' 

          'అమ్మయ్య!  అయితే నీకొచ్చిన కష్టం అంత బాధపడి ఏడ్చెయ్యాల్సిందేం కాదు.  ఎందుకంటే కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా వుండి, ఏ డబ్బు సమస్య లేకపోతే సమిష్టిగా అందరూ కూర్చుని ఎటువంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరించవచ్చు.  ఇప్పుడు చెప్పు, నీ బాధేమిటో?'  

          'అదేమిటక్కా, అలా అంటావు?  అందరికన్నా నువ్వేదో మంచి సలహా ఇస్తావని నీతో చెప్పాను.  నా పరిస్థితిలో నువ్వున్నా ఇలాగే ఏడుస్తావు.  నేనెంత బాధలో వున్నానో నీకేం తెలుసు?' 

          'ఎహె, బోరు కొట్టక కహానీలాపి ఏం జరిగిందో చెప్ప్పు.  నీ పరిస్థితిలో నేనుంటే నీలాగా ఏమీ ఏడవను.  నా సమస్యని నేనే పరిష్కరించుకోగలను.  సరే, ఏం జరిగిందో ఇప్పుడన్నా చెప్పు.'  

          'మా అబ్బాయి సతీష్ లేడూ.......' 

          'ఆ, పరీక్షేమయినా తప్పాడా?  బానే చదువుతున్నాడన్నావుగా?  అదివరకు టెన్తులో స్కూల్ ఫస్ట్ వచ్చాడనీ చెప్పావు?' 

          'ఇప్పుడదేం కాదు.  బి.టెక్.  అయిపోయింది.  ఏదో కాలేజిలో టెంపరరీగా లెక్చరర్ గా చేస్తున్నాడు.  ఈ మధ్య ఏదో ట్రయినింగుందంటూ నెల్లాళ్ళనించి అన్నయ్య, వదిన ఇంట్లో వుంటున్నాడు.  కానీ అన్నయ్య ఇంట్లో కూడా రోజూ వుండకుండా, ఫ్రెండింటికి వెడుతున్నానని చెప్తాడు.  భోజనం కూడా అక్కడ చెయ్యడట.  అన్నయ్య ఇంట్లో వున్నంతసేపూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడతాడట రోజల్లా.'  

          'మరి వాడేం అడగలేదా?'  

          'అడిగితే మా ఫ్రండుతో మాట్లాడుతున్నానన్నాడట.  ఒకసారి ఫోనులో మాట్లాడుతుంటే వినిపించాయి ఈ మాటలు.  "శ్రావణీ!  నన్ను నమ్ము.  నిన్ను తప్ప వేరెవర్నీ చేసుకోను.  సరేనా?  ఎవరడ్డొచ్చినా నిన్ను వదులుకోను.  వచ్చేనెల ఇరవైనాలుగున మీ వాళ్ళు ముహూర్తం పెట్టించారన్నావుగా?  ఆ ముహూర్తానికే మన పెళ్ళి.  సరేనా?  ఏడవకు.  మా అమ్మా నాన్నతో కూడా చెబుతాను.  ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోయినా మన పెళ్ళి ఆగదు."  అదీ విషయం.  పైగా వాళ్ళ కులం వేరు, మన కులం వేరు.'  

          'ఓస్!  ఈ మాత్రానికేనా అంత ఏడుస్తున్నావు?  ఇప్పుడేం కొంపలంటుకున్నాయని?  ఇంకా వివాహం జరగలేదుగా?  ఈలోగా అందరం కలిసి మాట్లాడదాం.  ఒకవేళ కాదూ, కూడదూ అంటే చేసేయడమే మంచిది.  ఇప్పుడు బోల్డుమంది ఇంటర్ కేస్ట్ మారేజెస్ చేసుకుంటున్నారు.  వాళ్ళు సుఖంగా వుండటల్లేదూ?  అదలా వుంచు.  ఇంతకీ మీ ఆయనా, నువ్వూ ఏమాలోచించారు?  అయినా వాడెలా ప్రేమలో పడ్డాడే?  నిన్న కాక మొన్న నా కళ్ళ ముందర పుట్టిన చంటిసన్నాసి.  ఎక్కడ వాళ్ళ చదువులు పాడవుతాయోనని మీరు కూడా టి.వి. కూడా కొనకుండా వాళ్ళని చదివించేవారు.  అందరిళ్ళలోలా కాకుండా మీరు అందరూ కలిసి భోంచేస్తారు.  ముందర పిల్లలు తింటేగాని నువ్వేం తినవు గదా?  మరెందుకిలా జరిగిందబ్బా?’ 

        ‘అయినా ఇంట్లో టి.వి. కొనకపోవడం మాత్రాన సరిపోతుందా?  బైట వాతావరణంలోకి వెళ్ళి,  అందులో ఇరుక్కుపోతున్నారు నేటి పిల్లలు.  మనం ఎంతబాగా పెంచినా ఇంటర్నెట్లు, సెల్ ఫోన్లలో చూడకూడనివన్నీ చూస్తున్నారు.  ఇదిగాక ఎవరెవరితోనో చాటింగులు.  వాళ్ళేం చేస్తున్నారో తలిదండ్రులకి తెలుస్తుందా?  వాళ్ళకి చెబుతారా?  ఇప్పుడందరూ తలిదండ్రులు పిల్లల్ని సరిగ్గా పెంచాలంటూ పేపర్లలో స్టేట్ మెంట్లిచ్చేస్తున్నారు.  కాని, హింసాత్మక సీరియల్సు, సినిమాలు, అసభ్యకర వస్త్రధారణ - వీటివల్ల పిల్లల భవిష్యత్తు నాశనమవుతోందని ఏ ఒక్కరూ ఆలోచించరెందుకో.  మా ఇద్దరికీ మనశ్శాంతి వుండటంలేదు.  ఉంటానక్కా.  ఆఫీసునించి ఆయనొచ్చారు.' అంటూ ఫోను పెట్టేసింది శాంతి. 

          'హు!  ఆఖరికి సిరిసంపదలు సినిమా చూడటం పడలేదు అనుకుంది.  శాంతికి ఏదో ఓదార్పుగా చెప్పిందే కాని, ఎవరి బాధ ఎవరికి తెలుస్తుంది?  పీత కష్టాలు పీతవన్నట్లు ఎవరి బాధ వాళ్ళకి ఎక్కువగానే అనిపిస్తుంది.  భరించేవాళ్ళకి తెలుస్తుంది.  కాని ఎంతటి బాధలో వున్నవాళ్ళకైనా ఓదార్చేవాళ్ళు వుండాలి.'  

          రాత్రి సరళ, ఆమె భర్త శంకరం భోంచేసి పడుకున్నారు.  శంకరం ఈ మధ్యనే ఆంధ్రాబ్యాంకు మేనేజరుగా చేసి రిటైరయ్యాడు.  రిటైరైనంత మాత్రాన ముసలితనం వచ్చేసినట్ట్లు కాదు కదా అనుకుని ఓపికున్నంత వరకు ఖాళీగా వుండడం ఎందుకని, ఇప్పుడెవరూ తెలుగు సరిగా మాట్లాడలేకపోతున్నారని ఆవేదనతో హైస్కూలు పిల్లలకి, కాన్వెంటు పిల్లలకి తెలుగు భాష ఎలా పలకాలో ఎక్కడెక్కడ ఒత్తులు పెట్టాలో నేర్పుతున్నాడు. 

          నలుగురప్ప చెల్లెళ్ళు, ఒక తమ్ముడు.  సరళ రెండవది.  పెద్దది నాగమణి.  సరళ తరవాత తమ్ముడు నాగేంద్ర.  తరవాత సరిత.  శాంతి ఆఖరిది.  అందరూ సంప్రదాయ కుటుంబంలో పధ్ధతిగా పెరిగారు.  అందరూ అప్పటి పధ్ధతులూ, కట్టుబాట్లనే పాటిస్తున్నారు.  ఐనా పిల్లల్ని ఎంత కట్టుబాట్లలో పెంచినా పిల్లలు ప్రేమలో పడ్డా, తలిదండ్రుల బాధ్యత ఎంత మాత్రం కాదు.  అది కొంతవరకే.  తలిదండ్రులు అస్తమాను వాళ్ళ వెంటే వుండరు కదా?బయటికెళ్ళాక ఎలా వుంటారో, ఏం చేస్తున్నారో కూడా తెలీదు.  టి.వి.లు, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు ప్రభావం చాలా వుంటుంది.  సమాజంలో ఏ చెడు జరిగినా ఆ ప్రభావం పిల్లల మీద పడుతోంది.  అందుకే సమాజంలో ఏం జరిగినా అందరి బాధ్యతా వుంటుంది.  ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది సరళ.  మళ్ళీ ఫోను రింగవడంతో మెలకువ వచ్చి, ఈ వేళప్పుడు ఎవరా అనుకుంటూ ఫోను తీసింది.  అర్థరాత్రి పన్నెండు గంటలయింది.  తమ్ముడు నాగేంద్ర చేసాడు.  

          'సరళక్కా, నువ్వూ, బావా కూడా రావాలి.  పెద్దక్క, పెద్దబావ, చెల్లెలు రేవతి, సరిత మొగుడు అందరం ఉదయం పదిగంటల ట్రెయినుకి విజయవాడ వెళ్తున్నాము.  మీరు స్టేషనుకి వచ్చేయండి.  శాంతి కొడుకు సతీష్ గాడు ఎవరో శ్రావణి అన్న అమ్మాయిని ప్రేమించాడు.  ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానని మంకుపట్టు పట్టాడు.  నీకు శాంతి చెప్పేవుంటుంది.' 

          'ఆ, చెప్పింది.  ఆ చెప్పిందాంట్లో ఏడుపే తప్ప అసలు విషయం సరిగ్గా తెలీదు.  ఎవరా అమ్మాయి? కుటుంబం మంచిదైతే చేసెయ్యచ్చుగా?' అంది సరళ.  

          'అలా ఎలా కుదురుతుంది?  వాళ్ళ కులం వేరు, మన కులం వేరు.'  

          'ఇప్పుడు కులాలు ఎవరు పట్టించుకుంటున్నారు?  ఇంటర్ కాస్ట్ మేరేజస్ ఎన్ని జరగటం లేదు?  చాలామంది సుఖంగా వుండటల్లేదా?  తరవాత ఏ అఘాయిత్యాలన్నా చేసుకుంటే మనకే బాధ.'  

          'ఎలా చూసినా మన అంతస్థుకి తగ్గ సంబంధం కాదు.  ఆ అమ్మాయి బి.కాం. చదివింది.  తల్లీ, తండ్రీ ఇద్దరూ టైలర్లుట.  ఏమీ లేనివాళ్ళు.  ఆ అమ్మాయికొక అన్నయ్య వున్నాడు.  వాడో పెద్ద రౌడీ అట.  అలాంటి సంబంధం ఎలా చెయ్యాలో చెప్పు?  తరవాత సతీష్ చెల్లెలికి సంబంధాలు వస్తాయా?  నువ్వెన్ని చెప్పు సరళక్కా, మాకెవరికీ ఈ సంబంధం ఇష్టం లేదు.  అందుకే మనందరం విజయవాడ వెళ్ళి ఈ పెళ్ళి జరగకుండా చెయ్యాలి.  ఆ పిల్ల తలిదండ్రులు కూడా వస్తారు.  నువ్వు చేసెయ్యచ్చుకదా అంటావు.  కులాలు వేరయితే, ఇంటి పధ్ధతులు, ఆహారపు అలవాట్ల దగ్గిర్నించీ అన్నీ వేరు వేరుగానే వుంటాయి.   తరవాత తరవాత గొడవలు కూడా వస్తాయి.  ఇక మనం వాడిని పూర్తిగా వదులుకునే పరిస్థితి వస్తుంది.  మీరు ఉదయం ఆరుగంటలకల్లా స్టేషనుకొచ్చేయండి.  వుంటా.' అంటూ ఫోను పెట్టేసాడు తమ్ముడు నాగేంద్ర. 

          'మర్నాడు అందరూ విజయవాడ చేరుకున్నారు.  శాంతి ఇల్లు బాగా దూరమని స్టేషను దగ్గరే హోటల్లో రూము తీసుకున్నారు.  భోజనాలు చేసి మధ్యాహ్నం రెండుగంటలకి అందరూ సమావేశమయ్యారు.   

          'మా అబ్బాయికి ఇప్పుడే పెళ్ళి చెయ్యడం కుదరదు. వడుగు చెయ్యాలి.  ఉద్యోగంలో స్థిరపడాలి.  అప్పటిదాకా మీరాగుతారా?' కులం ప్రసక్తి తేకుండా చాలాసేపు వాళ్ళతో చర్చలు జరిపి పెళ్ళి ఆపాలని చూసారు.   

          శ్రావణి తల్లి చాలా గొడవ చేసింది.  

          'మరివన్నీ చూసుకోకుండా మా అమ్మాయినెలా ప్రేమించాడు మీ అబ్బాయి?  ఏం సతీషూ?  ప్రేమించడమంటే తమాషా అనుకున్నావా?  పెళ్ళి దాకా తీసుకువచ్చి ఇప్పుడిలా మాట్లాడతారా?  మా అమ్మాయినే తప్ప వేరెవర్నీ చేసుకోనన్నావు కదా?  ఏం సతీషూ, మట్లాడవేం?  ఇప్పుడు మా అమ్మాయి గతేం కానూ?' అంటూ చాలా గొడవ చేసింది శ్రావణి తల్లి. 

          ఆవిడ కోపం, ఆవిడ మాట్లాడే తీరు చూసి, అందరికీ చాలా కోపమూ, బాధా కలిగాయి.  అప్పుడు సరళ, సరళ మొగుడు వేరే గదిలోకి తీసికెళ్ళి సతీష్ కి బాగా బ్రెయిన్ వాష్ చేసి, ఆ పిల్ల ధ్యాస నించి లాక్కొచ్చేసరికి తల ప్రాణం తోక్కి వచ్చినట్లయింది.    

          'మా అబ్బాయికిప్పుడే వివాహం చెయ్యడం కుదరదు లెండి.  పైగా పై చదువులకి అమెరికా వెడదామనుకుంటున్నాదు.  అక్కడ నాలుగేళ్ళన్నా వుండాలి.  ఇప్పుడే పెళ్ళి చేస్తే ఇంక వాడేం చదువుతాడు?' అంటూ....వాళ్ళకి సర్దిచెప్పి పంపేసారు. 

          సతీష్ కి నాలుగు చీవాట్లేసి అందరూ రాత్రి ట్రెయిన్ కి హైదరాబాద్ బయలుదేరారు.  

          హైదరాబాద్ చేరేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయింది.  ఇంటికొచ్చేసరికి మరో బ్రేకింగ్ న్యూస్!  ఎదర అపార్ట్ మెంట్లో సెకండ్ ఫ్లోర్ లో వుండె విజయ్, స్రవంతి గార్లకి ఒకతే కూతురు.  ఎనిమిదేళ్ళ యమున ఫ్రండింటికి ఆడుకోటానికెళ్ళి వస్తుంట్ఏ నలుగురు మృగవెధవలు అత్యాచారం చేసి చంపేసారు.  

          అక్కడందరూ గుమిగూడారు.  ఆ తలిదండ్రుల బాధ వర్ణనాతీతం.  అందరూ ఎంత ఓదార్చినా వాళ్ళ బాధ తీరేదా?  

          ఎప్పుడే ఇంట్లో ఏం దారుణాలు జరుగుతాయో తెలీదు.  ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతోంది.  ఆ రోజు పేపర్లో కనబడిన ఇంకో ఘోరం, జైపూర్ లో ఎనిమిది నెలల చంటి పిల్లపై అత్యాచారం!  బడిలో ఆడుకుంటున్న తొమ్మిదేళ్ళ బాలికపై అత్యాచారం.   

           రామ రామ!  మరీ నీచంగా తయారవుతోందీ దేశం!  మంత్రివర్యులకివేం పట్టవా?  ఆడపిల్లల జోలికొస్తే ఖబడ్దార్! అంటారు ఒక మంత్రి.  ఖబడ్దార్ అంటే ఏమిటో మరి!  ఏ కఠిన శిక్షలూ వెయ్యకుండా ఖబడ్దార్ అనగానే మానేస్తారా?  ఇక ప్రధానమంత్రిగారేమో పన్నెండేళ్ళ లోపు వాళ్లపై అత్యాచారాలు చేస్తే ఉరిశిక్ష విధించబడుతుంది అంటూ స్టేట్ మెంటిచ్చేస్తారు.  (అంటే పన్నెండేళ్ళు పైబడ్డావారి మీద అత్యాచారాలు చెయ్యచ్చా?)  ఆ మర్నాడే ఇంకా ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి.  ఏ శిక్షలూ వెయ్యరు.  అందుకే ప్రభుత్వాల లోకువ కూడా కనిపెడుతున్నారు.  గజ్జి, తామర అంటువ్యాధి లాగ ఈ అత్యాచారాల పర్వం అంటువ్యాధిలా నానాటికీ దేశం అంతా పాకుతోంది.  దేవతల్ని ఆరాధించే ఈ భారతదేశంలో స్త్రీలను, పసిపిల్లలను ఇంత దారుణంగా హింసిస్తుంటే ప్రభుత్వాలకేం పట్టినట్టుండదెందుకు?  వాళ్ళకి సంబంధం లేదా?

          ఇప్పుడు టి.వి.లు వున్నాయి, పేపర్లు వున్నాయి.  టి.వి.లో చూసినా తెలుస్తుంది.  పేపర్లు చదివినా తెలుస్తుంది.  దేశంలో పరిస్థితులు ఎంత ఘోరంగా వున్నాయో!  కాని వాళ్ళకేం పట్టనట్టు ప్రభుత్వాలుంటే ఈ దేశం ఏం బాగుపడుతుంది?   పూర్వం రాచరికాలున్నప్పుడు, రాజులు మారువేషాలలో తిరిగి ప్రజల బాధలు అడిగి తెలుసుకునేవారుట. 

          'సరళా!  ఏమిటీ, దిగులుగా వున్నావు?  ఛ, ఏడుస్తున్నావా?  ఏమిటే, మళ్ళీ పేపర్లో నేరాలూ, ఘోరాలు ఏమన్నా చదివావా?   నువు ప్రతిదానికీ ఇలా ఏడుస్తూ కూచుంటే ఎలా?  ఏవో జరుగుతుంటాయి. పట్టించుకోకు.  ఆ పేపర్లు చదవకు.  టి.వి. చూడకు.  ఊర్నించి వచ్చిన మూలాన్నేమో, బాగా అలసటగా వున్నావు.'  

          'అలసటగా కాదండి.  ఈ దేశంలో స్త్రీల పరిస్థితి చూస్తుంటే బాధగా వుంది.' అంటూ ఏడుపుని ఆపుకోలేకపోయింది.   

         'ఊరుకో సరళా!  అవును, దేశంలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి.  మనమేం చెయ్యగలం చెప్పు?  మన చేతుల్లో ఏం వుంది?  దేశంలో ఏం జరిగినా అందరి బాధ్యతా వుంటుంది.  నేరాలకి కఠిన శిక్షలు వెయ్యరు.  అది ప్రభుత్వ బాధ్యత.  అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు, ఇవన్నీజరగడానికి కారణం హింసాత్మక, అసభ్యకరమైన సినిమాలు, సీరియల్సు.  వీటి వల్ల ప్రజల ఆలోచనావిధానం వక్రమార్గంలో వెడుతోంది.  ఎక్కడో కాదు, ఎన్నో దారుణాలు మన పక్కిళ్ళల్లో, ఎదురిళ్ళల్లో జరుగుతున్నాయంటే ఎవరికి వారు మనకెందుకులే అనూరుకుంటే ఈ దేశం ఎలా మారుతుంది?  సినిమాలు, టి.వి.సీరియల్సు, యాంకర్లు, అందరూ మారాలి.  అసభ్య వస్త్రధారణ మానేయాలి.  హింసని ప్రేరేపించే సినిమాలు, సీరియల్సు తీయకూడదు.  నిర్భయ విషయంలో అప్పుడు యావద్భారతదేశం గోల పెట్టింది ఆ దుర్మార్గుల్ని.  ఏమన్నా చెయ్యగలిగారా?  ప్రభుత్వాల చేతకానితనం లోకువ కనిపెట్టి, అప్పట్నించీ ఇప్పటిదాకా యధేఛ్చగా అత్యాచారాలు ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి.  ఇలా జరిగినప్పుడల్లా కొవ్వొత్తుల ప్రదర్శనలు చేస్తారు.  అన్నీ ఛానెల్స్ వారు చర్చలు పెడతారు.  కానీ వీటిని ఎలా అరికట్టాలో, ఆ పరిష్కారమార్గాలు మాత్రం వెతకరు.   కొవ్వొత్తుల ప్రదర్శన వలన అత్యాచారాలు మానిపోతాయా?  ఈ సమాజ తీరుతెన్నుల వల్ల మంచివాళ్ళు కూడ చెడుదార్లు పట్టే అవకాశం వుంది.  అందుకే ఇది గజ్జి, తామరలా అంటువ్యాధిలా దేశమంతా పాకి, స్త్రీలకి బయటే కాదు, ఇంట్లోనూ రక్షణ లేకుండా పోయింది.  రా, భోంచేద్దాం.  ఈ జరుగుతున్న వాటిగురించి మనసు పాడు చేసుకుని, ఆరోగ్యం చెడగొట్టుకోకు.' 

ఇద్దరూ భోజనం చేసి త్వరగా పడుకున్నారు.  ఉదయమే కూతురు వింధ్య అమెరికా నుంచి ఫోను చేసింది.  వీసా పంపాము, త్వరలో రమ్మని.  అమెరికాలో తొమ్మిది నెలలున్నారు.  ఈలోగా సతీష్ కి వడుగు చేసారు.  

          అమెరికా నించి వచ్చాక మళ్ళీ సింగపూర్ ఇంకో అమ్మాయి దగ్గరకెళ్ళి ఆరు నెలలున్నారు.  సింగపూర్ చిన్న కంట్రీయే అయినా నీటుగా, అందంగా వుంటుంది.  నీతి, నిజాయితి విషయంలో సింగపూర్ నే చెప్పుకుంటారు.  మంత్రులు అన్ని దేశాలు తిరిగొస్తారు గాని అక్కడి పరిశుభ్రత చూసన్నా నేర్చుకుని ఈ దేశంలో కూడా పెట్టచ్చుగా?  వాళ్ళు వేసుకునే దుస్తులు మాత్రం ఇక్కడవాళ్ళు వేసుకుని, మన సంప్రదాయాల్ని నాశనం చేస్తున్నారు.  అక్కడ వాళ్ళు పొట్టి దుస్తులు వేసుకున్నా వాళ్ళకదేం తప్పు కాదు.

          సింగపూర్ నించి వచ్చేసరికి పోస్ట్ బాక్స్ లో కొన్ని కవర్లతో బాటు శుభలేఖ వుంది. 

          విప్పిచూస్తే సతీష్ పెళ్ళి శ్రావణితో.  అంటే శ్రావణినే చేసుకుంటున్నాడా సతీష్?  అంటే ఆ అమ్మాయిని వదులుకోలేక పోయాడా?  పెళ్ళింకా వారం రోజులుంది.  అమ్మయ్య!  అయితే పెళ్ళి టైముకొచ్చామనుకుంది.  వివరాలు అడుగుదామనుకుంటే శాంతి పెళ్ళి హడావిడిలో వుండి, వివరాలేం చెప్పకుండా, పెళ్ళికి తప్పకుండా రండంటూ ఫోను పెట్టేసింది.  తమ్ముడిని అడిగితే ఈ నంబరు మీద ఏ టెలిఫోనూ పని చేయటల్లేదని వస్తోంది.  అక్కకి ఫోను చేస్తే ఎంగేజ్.  ఇహ పెళ్ళికి వెళ్ళినప్పుడే తెలుస్తుందిలే అనుకుని, ఇంకెవరికీ ఫోన్లు చెయ్యలేదు సరళ. 

          పెళ్ళి నాలుగురోజులుందనగా అక్క, బావ, తమ్ముడు నాగేంద్ర, మరదలు నీలిమ, ఇంకో చెల్లెలు రేవతి, భర్త రాజేంద్ర, అందరూ కలిసి ట్రెయిన్ లో బయలుదేరారు.  అందరూ సామాన్లు అవీ సర్ది స్తిమితంగా కూచున్నారు.  రైలు బయలుదేరింది.  

          అప్పుడడిగింది సరళ.  'అప్పుడంత గొడవ జరిగి, అందరూ నచ్చజెప్పారు కదా?  సతీష్ శ్రావణినే చేసుకోవడమేమిటి?  నాకంతా అయోమయంగా వుంది.'

          అప్పుడు తమ్ముడు నాగేంద్రబాబు అంతా చెప్పుకొచ్చాడు.  శ్రావణి కాలేజిలో సతీష్ కి జూనియర్.  ఫేస్ బుక్ లో ఫ్రండ్సయ్యారు.  ఇద్దరూ చాటింగ్ చేసుకునేవారు.  వాళ్ళ స్నేహం ముదిరి పాకాన పడి, ప్రేమలోకి దిగింది.  ఇలా గాఢంగా నాలుగేళ్ళ నించి ప్రేమించుకుంటున్నారు.  ప్రేమ కూడా ముదిరింది.  పెళ్ళి దాకా వచ్చింది.'

          'మరి వాళ్ళమ్మ, నాన్నకి ఇవేం తెలియదా?' అడిగింది సరళ.

          'తెలిసినా ఏం చేస్తారు?  అసలు ఇంట్లో ముభావంగా వుంటాడు.  ఎక్కువ మాట్లాడుకోడాలు లేవు.'

          'ఊ, సరే చెప్పు.' 

          'చెప్పేదేముంది?  తరవాత నీకు తెలిసున్నదేగా?  మా ఇంట్లో వున్నాడు.  ఎప్పుడూ ఫోన్లో ఆ అమ్మాయితో మాటాడుతూ వుండేవాడు.'

          'అది కాదురా తమ్ముడూ!  ఇప్పుడు ఆ అమ్మాయితోనే వివాహం చెయ్యడమేమిటి?'

          'ఓ, అదా?  అసలు విషయం నీకు తెలియదన్నమాట?'

          'ఏమిటి" 

          'అసలు శ్రావణి వేరు, ఫేస్ బుక్ లో ఫ్రండ్ శ్రావణి వేరు.  అసలు శ్రావణి అన్న అమ్మాయి బాగానే వుంటుంది.  మనవాళ్ళే.  దూరపు చుట్టరికం కూడా వుంది.  ఆ అమ్మాయే అనుకుని వేరే శ్రావణితో స్నేహం చేసాడు.  ఫేస్ బుక్ లో ఫొటోలు పెడతారుగా?  అసలు ఫొటోలు పెట్టరు.  తరవాత ఆ శ్రావణి కూడ ఇంకో సతీష్ ని ప్రేమించింది.  అతనిదీ వేరే కులం.  అది కూడా పెళ్ళి దాకా వచ్చింది.  వాళ్ళింట్లో వాళ్ళు కూడ పెళ్ళికి ఒప్పుకోలేదు.  ఒకసారి ఎవరింట్లోనో ఫంక్షన్లో కలిసారు సతీష్, ఆ అమ్మాయి.  అప్పుడు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకున్నారు.  అప్పుడు ఎంత పొరబాటు జరిగిందో, అసలు విషయం ఇద్దరూ తెలుసుకున్నారు.  అసలు ప్రేమించాలనుకున్న శ్రావణి ఈ అమ్మాయేనని, తను ప్రేమించాలనుకున్న సతీష్ ఇతనేనని.  అప్పుడు ఆ అమ్మాయి తలిదండ్రులకి చెప్పింది.  అలాగే సతీష్ కూడా ఇంట్లో వాళ్ళ అమ్మా, నాన్నలకి చెప్పాడు.  అప్పుడు ఆ అమ్మాయి తలిదండ్రులు ఈ సతీష్ అమ్మా నాన్న మాట్లాడుకోవడం, ఇష్టపడడం, తాంబూలాలు తీసుకోవడం అన్నీ జరిగాయి.  మీరు అమెరికా, సింగపూర్ వెళ్ళారుగా?  అప్పుడు తాంబూలాలప్పుడు మేమందరం వెళ్ళాము.  

         ‘ అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మరిచాను.  సతీష్ పెళ్ళి చేసుకుందామనుకున్న ఆ శ్రావణికి, సతీష్ చేసుకోబోతున్న శ్రావణి తెలీక పొరపాటున ప్రేమించిన మన సతీష్ తో కాక, వేరే సతీష్ తో  వివాహం సెటిలయింది. వాళ్ళదెలాగూ ఒకటే కులం.  వాళ్ళ వివాహం కూడా అదేరోజు.  అన్నట్టు వివాహం కాగానే మన సతీష్, శ్రావణి అమెరికా వెళిపోతారు ' చెప్పాడు తమ్ముడు. 

.’       'బలే వుందిరా సినిమా కథ లాగా.  "ఈ తరం పిల్లలు" అని సినిమా తీస్తే బాగానే వుంటుంది.’ అంది సరళ.   

***     

No comments:

Post a Comment

Pages