శ్రీ విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రం - అచ్చంగా తెలుగు

శ్రీ విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రం

Share This
విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రం
ఆది శంకరాచార్యులు
తెలుగు వివరణ: భావరాజు పద్మిని భుజంగ ప్రయాత ఛందస్సులో ఆది శంకరాచార్యుల వారు రాసిన అనేక స్తోత్రాల లలో ఇది ఒకటి.

ఈ స్తోత్రాన్ని గురించిన ఆసక్తికరమైన కథ ఉంది. తన తల్లి చనిపోయేముందు ఆది శంకరాచార్యులవారు ఆమె వద్దకు చేరుకున్నారు. ఆమెకు ముక్తి దొరికేందుకు సహకరించాలని ఆయన కోరిక. అందుకే ఆయన ఈ ఛందస్సులో మొదట 'శివ భుజంగ ప్రయాత స్తోత్రాన్ని' శివుని కొనియాడుతూ రచించారు. అది పూర్తవగానే శివ కింకరులు శంకరాచార్యుల తల్లిని స్వర్గానికి తీసుకువెళ్లేందుకు వచ్చారు. కానీ ఆమె ఆటవిక దుస్తులను, పులితోలును, నడుముకు పాములను కట్టుకున్న వారి భీకరాకారాన్ని చూసి భయపడింది. ఆమె సమస్యను అర్థం చేసుకున్న శంకరులవారు వినమ్రంగా శివ కింకరులను వెనక్కి వెళ్లమని అభ్యర్థించి, భుజంగ ప్రయాత ఛందస్సులో విష్ణు భగవానుని కొనియాడుతూ ఈ స్థుతిని రచించారు. ఆయన దీన్ని పఠించాకా, దేవతల వంటి వస్త్ర ధారణతో ఉన్న విష్ణు కింకరులు, శంకరుల తల్లిని స్వర్గానికి తీసుకువెళ్లేందుకు వచ్చారు. ఆమె వారితో ఆనందంగా వెళ్ళింది. ఇంతటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని మనము చదువుదాం.
 
చిదంశం విభుం నిర్మలం నిర్వికల్పం – 
నిరీహం నిరాకారమోంకారగమ్యం |
గుణాతీతమవ్యక్తమేకం తురీయం – 
పరం బ్రహ్మ యం వేద తస్మై నమస్తే || 1 ||
 
భావం: వేదాలచే బ్రహ్మమని కొనియాడబడిన వాడు, అన్ని జీవులకు నాయకుడు, స్పష్టమైన వాడు, శాశ్వతుడు, కోరికలు లేనివాడు, ఆకారం లేనివాడు, ఓంకారంగా తెలియబడినవాడు, త్రిగుణాలకు అతీతుడైన వాడు, వ్యక్తపరిచేందుకు వీలుకానివాడు, నిరంతరం బ్రహ్మ స్ధితి(ధ్యానసమాధి స్ధితి) లో ఉండేవాడు
అయిన భగవానుడికి నమస్కారము.
 
విశుద్ధం శివం శాంతమాద్యంతశూన్యం – జగజ్జీవనం జ్యోతిరానందరూపం |
అదిగ్దేశకాలవ్యవచ్ఛేదనీయం – 
త్రయీ వక్తి యం వేద తస్మై నమస్తే || 2 ||

భావము: వేదాలచే త్రిమూర్తులుగా కొనియాడబడిన వాడు, స్వచ్ఛమైన వాడు, శాంతమైన వాడు, ఓర్పును కలిగినవాడు, మొదలు తుది లేని వాడు, జగత్తుకు హేతువైన వాడు, ఆనంద జ్యోతి స్వరూపుడు, దేశకాలమాన పరిస్థితులనే పరిమితులకు లోబడనివాడు అయిన పరమాత్మకు నమస్కారం.
 
మహాయోగపీఠే పరిభ్రాజమానే – ధరణ్యాదితత్త్వాత్మకే శక్తియుక్తే |
గుణాహస్కరే వహ్నిబింబార్ధమధ్యే సమాసీనమోంకర్ణికేzష్టాక్షరాబ్జే || ౩ ||

భావం: యోగముద్రలో ప్రకాశించే వాడు, భూమి వంటి పంచభూతాల తత్వాలతో శక్తివంతమైన వాడు, అనేక గుణ సంపన్నుడు, ఓంకారమనే  అగ్ని స్వరూపమైన గోళంమధ్యలో అష్టదళ పద్మం పై ఆసీనుడై ఉన్నవాడు అయిన పరమాత్మకు నమస్కారం.

సమానోదితానేకసూర్యేందుకోటి
ప్రభాపూరతుల్యద్యుతిం దుర్నిరీక్షం |
న శీతం న చోష్ణం సువర్ణావదాత
ప్రసన్నం సదానందసంవిత్స్వరూపమ్ || 4 ||

భావం: కోటి సూర్యులు, కోటిచంద్రులు ఒకేసారి ఉదయించినంత ప్రకాశవంతమైన రూపంతో మానవ నేత్రంతో చూడనలవి కానివాడు,‌ చలి వేడి లేనివాడు బంగారంలా ప్రకాశించే వాడు ఎల్లప్పుడూ పరమానందంతో ప్రసన్నంగా ఉండేవాడు అయిన పరమాత్మకు నమస్కారము.
 
సునాసాపుటం సుందరభ్రూలలాటం కిరీటోచితాకుంచితస్నిగ్ధకేశం |
స్ఫురత్పుండరీకాభిరామాయతాక్షం – సముత్ఫుల్లరత్నప్రసూనావతంసమ్ || 5 ||

భావం: చక్కగా మొనదేరిన నాసిక‌ కలవాడు, విశాలమైన‌నుదురు, అందమైన కనుబొమలు కలవాడు, కుదురుగా దువ్విన కేశాలపై అందమైన కిరీటాన్ని ధరించినవాడు, బాగా వికసించిన పద్మాల వంటి కన్నులు కలవాడు, మనుషులతో ప్రకాశించే కర్ణాభరణాలు ధరించిన వాడు అయిన పరమాత్మకు నమస్కారం.

లసత్కుండలామృష్టగండస్థలాంతం – జపారాగచోరాధరం చారుహాసమ్ |
అలివ్యాకులామోదిమందారమాలం – మహోరస్ఫురత్కౌస్తుభోదారహారమ్ || 6 ||

భావం: కుండలముల కాంతిచే ప్రకాశించే చెంపలు కలవాడు, మందారాలను తలదన్నేటువంటి ఎర్రని పెదవులు కలవాడు, వెన్నెల లాంటి చిరునవ్వు కలిగినవాడు, భ్రమరాలను ఆకర్షించే చక్కటి వికసించిన మందారమాలను ధరించినవాడు,  మెడలో ధరించిన కౌస్తుభముచే శోభితమైన విశాల బాహువులు కలవాడు అయిన పరమాత్మకు నమస్కారం.

సురత్నాంగదైరన్వితం బాహుదండైః
చతుర్భిశ్చలత్కంకణాలంకృతాగ్రైః |
ఉదారోదరాలంకృతం పీతవస్త్రం – పదద్వంద్వనిర్ధూతపద్మాభిరామమ్ || 7 ||

భావం: మేలిమి రత్నాలతో ప్రకాశించే భుజకీర్తులు కలిగినవాడు, నాలుగు చేతులకు మెరిసే కంకణాలను ధరించిన వాడు, పసుపు రంగు పట్టు వస్త్రాన్ని మొలను ధరించినవాడు, కోమలమైన పద్మాల వంటి పాదాలను కలిగినవాడు అయిన పరమాత్మకు నమస్కారము.

స్వభక్తేషు సందర్శితాకారమేవం – 
సదా భావయన్సంనిరుద్ధేంద్రియాశ్వః |
దురాపం నరో యాతి సంసారపారం – 
పరస్మై పరేభ్యోzపి తస్మై నమస్తే || 8 ||

భావం: కేవలం తన భక్తులకి మాత్రమే కనిపించే ఇటువంటి స్వరూపం గల పరమాత్మను నిరంతరం ధ్యానిస్తే, గుర్రాల్లా పరిగెట్టే ఇంద్రియాలు అధీనంలోకి వస్తాయి. దుస్సహ మైన ఈ సంసారమనే సాగరాన్ని దాటడం నరులకు సాధ్యమౌతుంది. అటువంటి అజ్ఞానమనే చీకటిని తొలగించే పరమాత్మకు నమస్కారము.

శ్రియా శాతకుంభద్యుతిస్నిగ్ధకాంత్యా – 
ధరణ్యా చ దూర్వాదలశ్యామలాంగ్యా |
కలత్రద్వయేనామునా తోషితాయ – త్రిలోకీగృహస్థాయ విష్ణో నమస్తే || 9 ||

భావం: సన్నని నడుముతో బంగారు వర్ణంతో వెలిగే లక్ష్మీదేవిని, దూర్వాయుగ్మం అనే గడ్డి తనపై సమృద్ధిగా పెరగడం వల్ల నల్లని అందమైన స్వరూపంతో ఒప్పే భూదేవిని; ఇరువురిని తన దేవేరులుగా కలిగియుండి, ప్రసన్నుడై, ముల్లోకాలలోనూ గృహస్థుగా అలరారే పరమాత్మకు నమస్కారము.

శరీరం కలత్రం సుతం బంధువర్గం – 
వయస్యం ధనం సద్మ భృత్యం భువం చ |
సమస్తం పరిత్యజ్య హా కష్టమేకో – 
గమిష్యామి దుఃఖేన దూరం కిలాహమ్ || 10 ||

భావం: అయ్యో! నేను ఈ దేహాన్ని విడచిన తరువాత, భార్యను, బిడ్డలను, బంధు వర్గాలను, మిత్రులను, ఇంటిని, ధనాన్ని, సేవకులను, ఆస్తులను వదిలి చాలా దూరం ఒంటరిగా దుఃఖిస్తూ, దుర్లభమైన ప్రయాణం చేయాలి.

జరేయం పిశాచీవ హా జీవతో మే – 
వసామక్తి రక్తం చ మాంసం బలం చ |
అహో దేవ సీదామి దీనానుకంపిన్
కిమద్యాపి హంత త్వయోదాసితవ్యమ్ || 11 ||

భావం: ఓ దేవా! దీనత్వముతో వణికిపోతున్న నన్ను ఆదుకోవడానికి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? వృద్ధాప్యం అనే భూతం నా ఊపిరిని, రక్తాన్ని, మాంసాన్ని, బలాన్ని, కబళించబోతోంది.

కఫవ్యాహతోష్ణోల్బణశ్వాసవేగ – వ్యథావిస్ఫురత్సర్వమర్మాస్థిబంధామ్ |
విచింత్యాహమంత్యామసంఖ్యామవస్థాం – బిభేమి ప్రభో కిం కరోమి ప్రసీద || 12 ||

భావం: వృద్ధాప్యంలో శ్లేష్మం అడ్డుపడడం చేత ఊపిరాడక, ఎముకల కణుపులన్నీ బిగబట్టి, అనుభవించే మరణ వేదనచే నేను కలత చెంది ఉన్నాను. నేనేమి చేసేది? భగవానుడా నాపై దయ చూపించు.

లపన్నచ్యుతానంత గోవింద విష్ణో – 
మురారే హరే నాథ నారాయణేతి |
యథానుస్మరిష్యామి భక్త్యా భవంతం – 
తథా మే దయాశీల దేవ ప్రసీద || 13 ||

భావం: ఓ భగవానుడా! నేను అచ్యుతా(స్ధిరమైనవాడు), అనంత(అంతము లేనివాడు), గోవింద( వేదాలని రక్షించిన వాడు), విష్ణో( అంతటా వ్యాపించిన వాడు), మురారే( మురుడు అనే రాక్షసుని సంహరించినవాడు), హరి( ఆకర్షవంతుడు), నాథ( అందరికీ ప్రభువు), నారాయణ( అందరి హృదయాల్లో నివసించేవాడు), అంటూ భక్తితో నీ నామాలను స్మరిస్తున్నప్పుడు, నాపట్ల ప్రసన్నుడివి కమ్ము.

భుజంగప్రయాతంపఠేద్యస్తు భక్త్యా – సమాధాయ చిత్తే భవంతం మురారే |
స మోహం విహాయాశు యుష్మత్ప్రసాదాత్ సమాశ్రిత్య యోగం వ్రజత్యచ్యుతం త్వామ్ || 14 ||

భావం: ఈ భుజంగ ప్రయాత స్తోత్రం భక్తితో చదువుతూ, మనసులో నిన్ను స్మరించిన వాడు, తేలికగా ఈ ప్రాపంచిక మాయను అధిగమించి, నీ దయతో మోక్షాన్ని పొందుతాడు.

ఇతి శ్రీ విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రం సంపూర్ణం

***

No comments:

Post a Comment

Pages